సివిల్స్ ప్రిలిమ్స్-2018


Mon,May 14, 2018 12:31 AM

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జూన్ 3న జరుగనున్నది. మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సమయం చాలా కీలకమైంది. ఈ సమయంలో ఏం చదవాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదనే విషయాలను తెలుసుకుందాం.
Stu
ఈసారి 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. గత దశాబ్దకాలంలో ఈ నోటిఫికేషనే అత్యంత తక్కువ ఖాళీలతో వెలువడింది. ఈసారి కటాఫ్ నిర్ణయించే స్కోర్ పెరగవచ్చు. అయినా ఎవరైతే సరైన సన్నద్ధతతో పరీక్షకు హాజరవుతారో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-పరీక్ష సమయం దగ్గరపడుతున్నకొద్దీ సాధారణంగానే చాలామంది అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతుంది. ఇంకా చదవాల్సిన అంశాలు మిగిలిపోవడమో, చదివినవి ఎంతవరకు గుర్తుంటాయనే సందేహమో వారిని వెంటాడుతుంటుంది. ఈ సమయంలో చదవడంతోపాటు మానసిక సన్నద్ధత కూడా చాలా ముఖ్యం.
-ఈ సమయంలో కొత్త పుస్తకాలు తీసుకుని కుస్తీ పట్టడం మానేయాలి. ఇంతవరకు చదివిన పుస్తకాలు, రాసుకున్న షార్ట్‌నోట్స్‌ని రివిజన్ చేస్తే సరిపోతుంది. అనవసరంగా కొత్తవాటి జోలికి వెళ్తే కంగారులో చదివిన అంశాలను కూడా మరిచిపోయే ప్రమాదం ఉంటుంది.
-పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయో, చదివిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో లేదో, ఎన్ని మార్కులు వస్తాయో అనే ఆలోచనలను మైండ్‌లో నుంచి పూర్తిగా తొలిగించండి. చదివిన విషయాలను పునశ్చరణ చేయడం, ప్రాక్టీస్ కోసం మాదిరి ప్రశ్నపత్రాలను తీసుకుని రాయడం ద్వారా మిమ్మల్ని మీరు మరింతగా మెరుగుపర్చుకోవచ్చు. టైం మేనేజ్‌మెంట్ కూడా అలవడుతుంది.
-మాదిరి ప్రశ్నపత్రాలకు జవాబులు గుర్తించినప్పుడు ఏవైనా తప్పులు జరిగితే కంగారు పడకండి. ఇక్కడ ఏదైనా తప్పు జరిగి సరైన సమాధానం తెలుసుకుంటే మీకో కొత్త విషయం తెలిసినట్టే. తప్పులను తగ్గించుకోవడం, వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడమే మీ లక్ష్యమని గుర్తుంచుకోండి. అంతేగాని మీరు గుర్తించిన ఏవో ఒకటి, రెండు సమాధానాలు తప్పు అయినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు.
-పరీక్ష దగ్గర పడుతున్న తరుణంలో ఎక్కువ సమయం చదవడం సర్వసాధారణం. కానీ, ఎక్కువగా చదివేయాలనే ధోరణిలో పడి నిద్ర, ఆహారాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఎక్కువ సమయం చదివినప్పుడు మెదడు అలసిపోతుంది. మళ్లీ తిరిగి ఉత్సాహంగా పనిచేయాలంటే రోజూ కనీసం ఆరు గంటలైనా విశ్రాంతి తీసుకోవాలి. తీవ్రంగా ఆలోచిస్తూ అనవసరపు ఆందోళనకు గురైతే నిద్ర పట్టనివారు ఉంటారు. అలాంటివారు రోజూ కాసేపు మెడిటేషన్ చేయడమో, మెడిటేషన్ అలవాటు లేనివారు బాగా ఒత్తిడికి గురవుతున్నామని అనిపించిన సమయంలో కాసేపు మిత్రులతోనో, సన్నిహితులతోనో మాట్లాడి ఉపశమనం పొందే ప్రయత్నం చేయాలి. సరైన నిద్ర లేకుంటే మీ సమయాన్ని, ప్రిపరేషన్‌ను నష్టపోతారనే విషయాన్ని గుర్తుంచుకోండి.
-చాలామంది ఆహారాన్ని కూడా అశ్రద్ధ చేస్తుంటారు. సమయానికి సరైన ఆహారం తీసుకోకపోతే నీరసించడమో, లేదంటే ఏదో ఒకటి అందుబాటులో ఉందని ఏదిపడితే అది తినేసి అనారోగ్యం పాలు కావడమో జరిగితే ఆ రకంగానూ మీ విలువైన సమయాన్ని నష్టపోయిన వారవుతారు.
-పరీక్షకు వెళ్లే ముందురోజు నుంచి నిద్ర అవసరం. మంచి విశ్రాంతి తీసుకుని ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష హాల్‌కు వెళ్లాలి.
-జూన్ 3న జరిగే ప్రిలిమినరీలోనూ వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలను అనే కాన్ఫిడెన్స్‌తో వెళ్లండి. అంతేగాని తెలియని ప్రశ్నలు ఎన్ని వస్తాయో, మీ సమాధానాల్లో ఎన్ని తప్పులు దొర్లుతాయోనని ముందునుంచే కంగారుపడటం మానేయండి. పరీక్ష హాల్‌కు పూర్తి విశ్వాసంతో వెళ్లండి. ఆ విశ్వాసమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది.
-పరీక్ష హాల్‌కు వెళ్లిన తర్వాత పరీక్ష మొదలయ్యే వరకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా నేను సాధించగలననే నమ్మకంతో ఉండండి. పరీక్ష మొదలైన తర్వాత మొదట్లోనే కఠినమైన ప్రశ్నలు ఎదురైనా కంగారు పడకండి. మీరు సులువుగా సమాధానం గుర్తించగల ప్రశ్నలకు ముందుగా సమాధానం గుర్తిస్తూ వెళ్లండి. ఆ తర్వాత కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేయండి. మరీ ఒత్తిడికి గురైనట్టు అనిపిస్తే ఓ అర నిమిషం ఏమీ ఆలోచించకుండా ఉండండి. ఆ తర్వాత ఆలోచిస్తే మీ మెదడు వేగంగా పనిచేయలదు. కొన్ని కఠినమైన ప్రశ్నలను రెండోసారి చదివినప్పుడు కూడా స్పష్టంగా అర్థం చేసుకుని సరైన సమాధానం గుర్తించే అవకాశం ఉంటుంది.
-120 నుంచి 130 మార్కులు సాధించగల రీతిలో సమాధానాలు గుర్తించి ఉంటే మీరు దాదాపుగా సేఫ్‌జోన్‌లో ఉన్నట్టే. లేదంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీకున్న విషయం పరిజ్ఞానంతో మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. పూర్తిగా తెలియని ప్రశ్నలను మాత్రం వదిలేయడమే ఉత్తమం. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుని సమాధానాలను గుర్తించాలి.
-మధ్యాహ్నం జరిగే సీశాట్ పరీక్ష కేవలం క్వాలిఫయింగ్ ఎగ్జామ్ కాబట్టి అందుకు తగినట్టుగా సన్నద్ధమైతే సరిపోతుంది. ప్రస్తుత సమయంలో రెండు రోజులకో ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు.

M. Balalatha
Civils Faculty

1526
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles