ఉపాధి మార్గాలు వృత్తి విద్యా కోర్సులు


Sun,April 15, 2018 11:18 PM

పదోతరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌లో సంప్రదాయ కోర్సులే కాకుండా అనేకరకాల వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. సాధారణంగా వొకేషనల్ కోర్సులు అంటే ఎమ్‌ఎల్‌టీ, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సుల గురించే చాలావరకు విన్నాం. కానీ కోర్సు పూర్తవగానే కచ్చితంగా ఉపాధి కల్పించే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రెయినింగ్, టూరిజం ట్రావెల్ టెక్నిక్స్ వంటి చాలా కోర్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సుల వివరాలు నిపుణ పాఠకుల కోసం..
self-employee-course

అకౌంటెన్సీ అండ్ ట్యాక్సేషన్

-ఒక కంపెనీ లేదా సంస్థ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి పెట్టుబడి ఎంత పెడుతున్నాం, వస్తున్న ఆదాయం ఎంత, ఎంత మిగులుతుంది వంటి విషయాలు తెలుస్తాయి. ఇలా రాబడి, ఖర్చులకు సంబంధించిన విషయాలను నమోదు చేయడానికి, దీని ఆధారంగా ఎంత మొత్తంలో ట్యాక్సులు చెల్లించాలనే విషయాలను తెలుసుకోవడానికి ఆయా సంస్థలకు అకౌంటెంట్ల అవసరం ఉంటుంది. వీటన్నింటికి సంబంధించిన కోర్సే అకౌంటెన్సీ అండ్ ట్యాక్సేషన్.

ఉద్యోగ అవకాశాలు

-అకౌంటెన్సీ, ట్యాక్సేషన్ కోర్సు పూర్తిచేసిన తర్వాత సూపర్ బజార్లు, మాల్స్, హోటళ్లు, రికవరీ ఏజెన్సీలు, మ్యూచువల్ ఫండ్స్, మైక్రో ఫైనాన్షియల్ సంస్థల్లో అకౌంటెంట్లుగా ఉద్యోగం చేయవచ్చు. దీంతోపాటు పోస్టల్ సేవింగ్ ఏజెంట్లుగా, బ్యాంకు డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్, వెరిఫికేషన్, రికవరీ ఏజెంట్లుగా పనిచేయవచ్చు. అదేవిధంగా సొంతంగా మైక్రో ఫైనాన్స్, చిట్ ఫండ్స్ వంటి వ్యాపారాలు చేసుకోవచ్చు.

ఉన్నత విద్య

-అకౌంటెన్సీ చేయడం ద్వారా బీకామ్, బీకామ్‌లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లేదా సేల్స్ మేనేజ్‌మెంట్ లేదా టూరిజమ్ మేనేజ్‌మెంట్ వంటి వొకేషనల్ కోర్సులు లేదా బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు చేయవచ్చు.

ఎంఎల్‌టీ

-కోర్సులో భాగంగా డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో ఎలా పనిచేయాలి, పరికరాలను ఏ విధంగా ఉపయోగించాలి, వాటి నిర్వహణ, సేకరించిన నమూనాలకు సంబంధించిన కచ్చితమైన ఫలితాలు రాబట్టడం, డేటాను భద్రపర్చడం, నివేదికలు తయారు చేయడం వంటి విషయాలను నేర్చుకోవచ్చు.

ఉపాధి అవకాశాలు

-ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, డెంటల్, మెడికల్, ఫార్మసీ కాలేజీల్లోని వివిధ విభాగాల్లో, పెరిఫెరల్ ల్యాబొరేటరీల్లో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, మాలిక్యులార్ బయాలజీ ల్యాబ్‌లు, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లలో టెక్నీషియన్లుగా, రిసెర్చ్ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఉద్యోగం సంపాదించవచ్చు. లేదా సొంతంగా డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం, ల్యాబ్ కెమికల్స్, గ్లాస్‌వేర్, ల్యాబ్‌లలో ఉండే పరికరాలు, వాటి విడి భాగాలను అమ్మవచ్చు, సరఫరా చేయవచ్చు.

ఉన్నత విద్య

-ఇంటర్‌లో బైపీసీ బ్రిడ్జికోర్సుగా చేస్తే బీఎస్సీ (బీజెడ్‌సీ) చేయవచ్చు. అదేవిధంగా ఎంసెట్ రాయవచ్చు.
-బ్రిడ్జికోర్సు కానట్లయితే బీఎస్సీ ఎమ్‌ఎల్‌టీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ వంటి కోర్సులు చేయవచ్చు.
మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎఫ్)
-ఇది కేవలం అమ్మాయిలు చేసే కోర్సు. దీని ద్వారా నిపుణులైన ఆరోగ్య కార్యకర్తలుగా తయారుకావచ్చు.
ఉద్యోగ అవకాశాలు
-దవాఖానలు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు, గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ, స్వచ్ఛంద ఆరోగ్య సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
-ప్రభుత్వ, ప్రైవేట్ వొకేషనల్ జూనియర్ కాలేజీల్లో ల్యాబ్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు ఉంటాయి.
ఉన్నత విద్య
-ఇంటర్‌లో బైపీసీని బ్రిడ్జి కోర్సుగా చేసినట్లయితే బీఎస్సీ కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎంసెట్ లేదా జాతీయస్థాయి మెడిసిన్ ప్రవేశపరీక్షలు రాయవచ్చు.
-జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందవచ్చు.
టూరిజం ట్రావెల్ టెక్నిక్స్
-దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో టూరిజం పరిశ్రమ ఒకటి. అందువల్ల దేశంలో వివిధ పర్యాటక ప్రాంతాల గురించిన పూర్తి వివరాలను, ఆయా అంశాలను పర్యాటకులకు అర్థమయ్యేలా ఎలా వివరించాలి వంటి విషయాలను కోర్సులో భాగంగా నేర్పిస్తారు.

ఉపాధి అవకాశాలు

-ఈ కోర్సును పూర్తి చేసినవారికి టూరిజం, ట్రావెల్ అసిస్టెంట్‌గా, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌గా, డాక్యుమెంటేషన్ అసిస్టెంట్‌గా, టూరిస్ట్ గైడ్, కోఆర్డినేటింగ్ అసిస్టెంట్‌గా, పబ్లిక్ లేదా గెస్ట్ రిలేషన్ అసిస్టెంట్‌గా, రిసెప్షనిస్ట్‌గా, ఫారెన్ ఎక్సేంజ్ అసిస్టెంట్‌గా, ఈవెంట్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్‌గా, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేయవచ్చు.
-టూరిస్ట్ గైడ్, ఎక్స్‌కర్షన్ ఏజెంట్, ఇండస్ట్రియల్ క్యాటరింగ్, టూర్ కండక్టర్, క్యాటరింగ్ ఆపరేటర్ చేయవచ్చు లేదా సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు.

ఉన్నత విద్య

-టూరిజంలో బీఏ, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు టూరిజంలో అందిస్తున్న వివిధ కోర్సులు చేయవచ్చు.
ఫార్మా టెక్నాలజీ (పీహెచ్‌టీ)
-ఈ కోర్సుతోపాటు బ్రిడ్జి కోర్సుగా ఇంటర్ బైపీసీ చేయవచ్చు.

ఉద్యోగ అవకాశాలు

-ఫార్మా టెక్నాలజీ కోర్సులో ఉత్తీర్ణులైనవారు ఫార్మా పరిశ్రమలో సూపర్‌వైజర్లుగా, ఫార్మా పరిశ్రమలోని ఫార్మసీ నిపుణులకు, క్వాలిటీ కంట్రోల్ ప్రొఫెషనల్స్‌కు, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నిపుణులకు అసిస్టెంట్లుగా ఉద్యోగం పొందవచ్చు.
-రికార్డుల నిర్వహణ, డ్రాఫ్టింగ్ విభాగంలో, ఫార్మసీ కాలేజీల్లో ల్యాబ్ అసిస్టెంట్లుగా, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌తో గుర్తింపు పొందినవారి వద్ద అసిస్టెంట్లుగా జాబ్ చేయవచ్చు.

ఉన్నత విద్య

-బ్రిడ్జి కోర్సు చేసినట్లయితే బీఫార్మసీ చేయవచ్చు.
-పీహెచ్‌టీ మాత్రమే చేస్తే బీఏ, బీకామ్, డీఎమ్‌ఎల్‌టీ, డీఈసీజీ, డీఎంఐటీ, డీఎంఎస్‌టీ, డీఎంపీహెచ్‌ఏ కోర్సులు చదవచ్చు.
ప్రీ స్కూల్ టీచర్ ట్రెయినింగ్ (పీఎస్‌టీటీ)
-శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, నిర్వహించడం వంటి విషయాలను గురించి నేర్చుకోవచ్చు. చిన్న పిల్లలతో ఎలా మసులుకోవాలి, వారి జ్ఞానాన్ని ఏవిధంగా పెంపొందించాలనే అంశాలను వివరిస్తారు.
-ఇంటర్‌లో బ్రిడ్జికోర్సుగా బైపీసీ కూడా చేయవచ్చు.

ఉద్యోగ అవకాశాలు

-ప్రీ స్కూల్ టీచర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తిచేసిన తర్వాత క్రెచ్, ప్రీ స్కూల్, ప్లే స్కూల్ టీచర్‌గా, అంగన్‌వాడీ వర్కర్‌గా, క్రెచ్, ప్రీ స్కూల్ మేనేజర్ లేదా సూపర్‌వైజర్‌గా, కాలేజీల్లో ల్యాబ్ అసిస్టెంట్లుగా, వివిధ పథకాల్లో భాగంగా ప్రీ స్కూల్ కో-ఆర్డినేటర్‌గా ఉద్యోగం చేయవచ్చు.

విద్యావకాశాలు

-బ్రిడ్జి కోర్సు చేసినట్లయితే బీఎస్సీ, టీటీసీ చేయవచ్చు.
-పీఎస్‌టీటీ మాత్రమే పూర్తిచేస్తే బీఎస్సీ (హోమ్ సైన్స్), బీఏ, బీకామ్ కోర్సులు చేసే అవకాశం ఉంటుంది.

ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నీషియన్

-ఒక యంత్రం లేదా ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, అది శక్తిని ఏవిధంగా ఉత్పత్తి చేస్తుంది, ఏ విధమైన పనిముట్లు ఉంటాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి వంటి విషయాలను ఈ కోర్సులో భాగంగా తెలుసుకోవచ్చు.
-దీంతోపాటు యంత్రాలు చెడిపోయినట్లయితే వాటిని ఏవిధంగా విడదీయాలి, పనిచేయని భాగాన్ని గుర్తించడం ఎలా, దాన్ని ఎలా బాగుచేయాలి, మళ్లీ సక్రమంగా ఎలా బిగించాలి వంటి విషయాలను నేర్చుకోవచ్చు.
-పూర్తిగా మన జ్ఞానం, ఆసక్తి, పనితీరుపై ఈ కోర్సు ఆధారపడి ఉంటుంది.
-ఏఈటీని ఇంటర్‌లో బ్రిడ్జి కోర్సుగా కూడా చేయవచ్చు.
-ప్రాంతం, కాలంతో సంబంధం లేకుండా తప్పనిసరిగా పని (ఉపాధి) కల్పించే ఈ కోర్సును చేయడం వల్ల ఆటో మెకానిక్‌గా, వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్‌గా, ఆటో ఫిట్టర్‌గా, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్ లేదా యంత్రాల ఉత్పత్తిదారుల ప్రతినిధులుగా, ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా, ఆటో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఇలా ఉద్యోగం చేయడం ఇష్టం లేనట్లయితే డీజిల్ మెకానిక్‌గా సొంతంగా పనిచేయడం, వెహికిల్ ఆపరేటర్, స్పేర్ పార్ట్స్ డీలర్‌గా వ్యాపారం చేసుకోవచ్చు.

ఉన్నత విద్య

-ఒకేషనల్ కోర్సుగా చేసినట్లయితే బీఏ, బీకామ్ చేయవచ్చు.
-ఇంటర్‌లో బ్రిడ్జి కోర్సుగా చేస్తే పాలిటెక్నిక్ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ బ్రాంచీ సెకండ్ ఇయర్‌లోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు.

animal

కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్

-మనం చెప్పాలనుకున్న విషయాన్ని చిన్న చిన్న పదాలను ఉపయోగించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని ఆకర్షించేలా ఒక అడ్వర్‌టైజ్‌మెంటును కానీ, సన్నివేశాన్ని కానీ రూపొందించాలంటే కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ తప్పనిసరి. ప్రస్తుతం సినిమాల్లో భారీతనం కోసం గ్రాఫిక్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. లేని ఒక పాత్రను యానిమేషన్ ద్వారా సృష్టిస్తున్నారు. ఇలా కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు చేయవచ్చు అనే విషయాలను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.
-గ్రాఫిక్స్, యానిమేషన్లలో వివిధ రకాల సాఫ్ట్‌వేర్లను ఎలా ఉపయోగించాలి, యాడ్స్ రూపొందించేటప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను, యానిమేటెడ్ పిక్చర్లను ఎలా తయారు చేయాలి వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
-ఇంటర్ ఒకేషనల్ కోర్సుగా ఉండే ఈ సీజీఏతోపాటు బ్రిడ్జి కోర్సుగా ఎంపీసీ కూడా చేయవచ్చు.

ఉద్యోగ అవకాశాలు

-ఈ కోర్సు పూర్తయిన తర్వాత మీడియా ప్రొడక్షన్‌లో యానిమేటర్లుగా, డ్రాయింగ్ లేదా ఫిలిమ్ మేకింగ్ అసిస్టెంట్లుగా, స్టూడియోల్లో ఫొటో ఎడిటింగ్ అసిస్టెంట్లుగా, యాడ్ మేకర్స్‌గా ఉద్యోగాలు సంపాదించవచ్చు. గేమింగ్ స్టూడియోల్లో ఫ్రీలాన్సర్‌గా పనిచేయవచ్చు.

ఉన్నత విద్య

-ఈ కోర్సు పూర్తయిన తర్వాత డీఓఈఏసీసీ గుర్తింపు పొందిన ఏ లెవల్ కోర్సు చేయవచ్చు.
-బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా బీఎస్సీ, బీటెక్, పాలిటెక్నిక్ చేసే అవకాశం ఉంటుంది.
-డిగ్రీ చేయకుండానే జేఎన్‌ఏఎఫ్‌ఏయూ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా బీఎఫ్‌ఏ యానిమేషన్ కోర్సు చేయవచ్చు.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్

-కంప్యూటర్లు, వాటికి సంబంధించిన ఇతర పరికరాల్లో ఏ విధమైన హార్డ్‌వేర్‌ను, ప్రోగ్రామ్స్‌ను ఉపయోగించాలి, అవి ఎలా పనిచేస్తున్నాయి వంటి విషయాలను తెలుసుకునే నిపుణులను ఈ కోర్సు ద్వారా తయారుచేయవచ్చు.
-వివిధ కంప్యూటర్ హార్డ్ డివైజ్‌లను పనిచేసేలా చూడటం, వాటి నిర్వహణ విధానం, ఎలాంటి అవసరాలకోసం కంప్యూటర్‌ను వినియోగిస్తున్నారు, దానికి కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి, సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేయడం వంటి విషయాలను నేర్చుకోవచ్చు.

ఉద్యోగ అవకాశాలు

-జూనియర్ ప్రోగ్రామర్‌గా, కంప్యూటర్ ఆపరేటర్‌గా, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, సాఫ్ట్‌వేర్ మార్కెటింగ్ చేయడం, కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ అసిస్టెంట్‌గా, డ్రాఫ్టింగ్ అసిస్టెంట్లుగా ఉద్యోగం చేయవచ్చు.
-డీటీపీ ఆపరేటర్, ఇంటర్‌నెట్ సెంటర్, ఫొటో-వీడియో ఎడిటర్‌గా, హార్డ్‌వేర్ అండ్ ట్రబుల్ షూటింగ్ టెక్నీషియన్, వెబ్ డిజైనర్‌గా సొంతంగా పనిచేసుకోవచ్చు.

ఉన్నత విద్య

-ఎంపీసీతో బ్రిడ్జికోర్సు చేసినట్లయితే ఎంసెట్ రాయవచ్చు. దీంతోపాటు బీఎస్సీ, బీటెక్, పాలిటెక్నిక్ కోర్సులు చేయవచ్చు.
-బ్రిడ్జి కోర్సుతో సంబంధం లేకుండా బీకాం, బీసీఏ వంటి బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చేసుకోవచ్చు.
ganesh

930
Tags

More News

VIRAL NEWS

Featured Articles