కరెంట్ అఫైర్స్


Wed,December 6, 2017 03:15 AM

currentaffires

Telangana

జీఈఎస్ సదస్సు
నవంబర్ 28న హైదరాబాద్‌లో తొలిసారిగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన మిత్ర రోబో సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బీ ద చేంజ్.. విమెన్స్ ఎంటర్‌ప్రెన్యూరల్ లీడర్‌షిప్ అంశంపై పలువురు చర్చించారు.
ప్రకాశ్ అంబేద్కర్‌కు ఈశ్వరీబాయి అవార్డు
ఈశ్వరీబాయి స్మారక పురస్కారాన్ని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ స్వీకరించారు. ఈ అవార్డును రాష్ట్ర సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో అందజేశారు.
తెలుగులో సానియా మీర్జా ఆత్మకథ
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ఏస్ అగైనెస్ట్ ఆడ్స్ తెలుగు అనువాదం టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా పేరిట నవంబర్ 29న విడుదలైంది. సానియా కెరీర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని మహమ్మద్ అబ్దుల్ హాది తెలుగులోకి అనువదించారు.
మెట్రో రైలు ప్రారంభం
నవంబర్ 28న మెట్రోరైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మెట్రో తొలిదశలో నాగోల్ నుంచి మెట్టుగూడ, అమీర్‌పేట మీదుగా మియాపూర్ వరకు రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయి.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్
మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) హబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. వీ-హబ్‌కు కేంద్ర ప్రభుత్వం అటల్ ఆవిష్కరణ మండలి తరఫున సాయం అందించనున్నది.
హైదరాబాద్ బిర్యానీకి ఆది మహోత్సవ్ అవార్డు
ఢిల్లీలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఆది మహోత్సవ్‌లో హైదరాబాద్ బిర్యానీకి వంటకాల్లో తొలిస్థానం లభించింది. కేంద్రమంత్రి జుయెల్ ఓరమ్ చేతుల మీదుగా ప్రతినిధులు అవార్డు అందుకున్నారు.
అజైతా షాకు ఉత్తమ స్టార్టప్ అవార్డు
గ్లోబల్ ఎకనామిక్ సదస్సులో స్టార్టప్ పోటీలో భారత్‌కు చెందిన ఫ్రంటియర్స్ వ్యవస్థాపకురాలు అజైతా షా ప్రాజెక్టుకు ఉత్తమ స్టార్టప్ పరిశ్రమ అవార్డు దక్కింది. ఈ పోటీల్లో 75 ఆలోచనలు వచ్చాయి.

National

అణు జలంతర్గాముల నిర్మాణం
ఆరు అణు జలంతర్గాముల నిర్మాణానికి భారత్ శ్రీకారం చుట్టింది. స్కార్పీన్ తరగతిలోని మొదటి జలాంతర్గామి కల్వరిని డిసెంబర్‌లో ప్రవేశపెట్టనున్నారు.
నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్
హత్యలు, మహిళలపై లైంగికదాడులు వంటి వాటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. మెట్రో నగరాలపరంగా చూస్తే ఢిల్లీలో ఎక్కువగా లైంగికదాడులు జరిగినట్లు తెలిపింది. 2016లో జరిగిన నేరాలకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నవంబర్ 30న విడుదల చేశారు.
ఉత్తమ భారత విశ్వవిద్యాలయాలు
మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఎంఐఎం) కోర్సులను అందిస్తున్న అత్యుత్తమ 50 విశ్వవిద్యాలయాల జాబితాలో బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలోని ఐఐఎంలు వరుసగా 22, 23, 46 స్థానాల్లో నిలిచాయి. బ్రిటన్‌కు చెందిన క్యూఎస్ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ ఈ జాబితాను ప్రకటించింది.
15వ ఆర్థిక సంఘం
మాజీ ఎంపీ ఎన్‌కే సింగ్ నేతృత్వంలో 15వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది. ఈ సంఘంలో పూర్తికాల సభ్యులుగా ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్, వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనూప్‌సింగ్, తాత్కాలిక సభ్యులుగా బంధన్ బ్యాంక్ చైర్మన్ అశోక్ లాహిరి, నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ నియమితులయ్యారు. అరవింద్ మెహతా కార్యదర్శిగా వ్యవహరిస్తారు. 2019, అక్టోబర్ 30లోపు ఈ సంఘం నివేదిక సమర్పించాలి.
ఇన్ఫోసిస్ సీఈవోగా పరేఖ్
ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ నియమితులయ్యారు. ఆయన జనవరి 2న బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎన్‌ఎన్‌ఎం ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌష్టికాహార మిషన్ (ఎన్‌ఎన్‌ఎం)ను ఏర్పాటు చేసింది. మూడేండ్ల కాలానికి రూ. 9046 కోట్లు కేటాయించింది. తొలి ఏడాది 315 జిల్లాలు, రెండో ఏడాది 235 జిల్లాలు, మూడో ఏడాది దేశంలోని మిగతా జిల్లాల్లో అమల్లోకి తీసుకువస్తారు. మొత్తం వ్యయంలో 50 శాతం కేంద్రం, మిగతా సొమ్ము అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంక్ (ఐబీఆర్‌డీ) లేదా మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎండీబీ) ద్వారా సమకూరుస్తారు.

International

తొలి గుండె మార్పిడి ఆపరేషన్‌కు 50 ఏండ్లు
ప్రపంచంలోనే తొలి గుండె మార్పిడి (మనిషి నుంచి మనిషి) ఆపరేషన్ జరిగి డిసెంబర్ 3 నాటికి 50 ఏండ్లు పూర్తయ్యాయి. దక్షిణాఫ్రికాలో దంతవైద్యుడు లూయిస్ వాష్‌కాన్‌స్కీకి.. డెనిస్ డర్వల్ గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్ 1967 డిసెంబర్ 3న దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లోని గ్రూట్‌షూర్ దవాఖానలో జరిగింది. ఈ ఆపరేషన్‌ను క్రిస్టియన్ బెర్నార్డ్ చేశారు.
మలేరియా కేసుల్లో మూడోస్థానంలో భారత్
2016లో ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన 15 దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)- 2017 నివేదికను నవంబర్ 29న విడుదల చేసింది. 27 శాతం కేసులతో నైజీరియా మొదటి స్థానంలో ఉండగా, 10 శాతం కేసులతో కాంగో రెండో స్థానంలో ఉన్నది.
ఉత్తరకొరియా హాస్వాంగ్-15 క్షిపణి ప్రయోగం
అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణి హాస్వాంగ్-15ను విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 4,475 కి.మీ. ఎత్తుకు చేరుకుని, ప్రయోగ స్థానం నుంచి 1000 కి.మీ. దూరంలో ఉన్న జపాన్ సముద్రంలో లక్ష్యాన్ని ఛేదించింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాన్ని ఐరాస, అమెరికా, చైనా, రష్యా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియాలు ఖండించాయి.
ఐఎంఓకు భారత్ ఎన్నిక
అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎంఓ) మండలి బీ కేటగిరీలో భారత్ ఎన్నికైంది. జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్, బ్రెజిల్, స్వీడన్, నెదర్లాండ్స్, యూఏఈలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
చాబహార్ నౌకాశ్రయం ప్రారంభం
భారత్ సహాయంతో ఇరాన్‌లో నిర్మించిన చాబహార్ నౌకాశ్రయాన్ని డిసెంబర్ 3న ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ ప్రారంభించారు. ఆఫ్గనిస్థాన్, ఇరాన్‌లతో వ్యూహాత్మక వాణిజ్య రవాణాకు ఉపయోపడేలా భారత్ నిర్మించిన తొలి ఓడరేవు.
మహిళల కోసం అమెజాన్ సహేలి
మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ సహేలి అనే కార్యక్రమాన్ని నవంబర్ 28న ఆవిష్కరించింది. మహిళలు తయారు చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్స్, గృహాలంకరణ ఉత్పత్తులు విక్రయించేందుకు వీలుగా సహేలి ఆన్‌లైన్‌స్టోర్‌ను ప్రారంభించింది.

Sports

ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో చానుకు స్వర్ణం
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకున్నది. కరణం మల్లీశ్వరి 1994, 1995లో వరుసగా రెండేండ్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత స్వర్ణం నెగ్గిన భారత లిఫ్టర్ చానునే.
అమెచ్యూర్ చెస్‌లో సంధ్యకు స్వర్ణం
ఆసియా మహిళల అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌లో గోలి సంధ్య రజతం గెలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆమె రెండో స్థానంలో నిలిచింది.
సచిన్ జెర్సీ నంబర్ 10కి వీడ్కోలు
సచిన్ టెండూల్కర్ ధరించిన నంబర్ 10 జెర్సీకి బీసీసీఐ అనధికారికంగా వీడ్కోలు పలికింది. భవిష్యత్తులో భారత క్రికెటర్లు ఎవరూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో పదో నంబర్ జెర్సీని ధరించరు.
పంకజ్ అద్వానీ 18వ టైటిల్
భారత స్టార్ స్నూకర్ పంకజ్ అద్వానీ ఐఎబీఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ టైటిల్‌ను గెలిచాడు. అద్వానీకి ఇది 18వ ప్రపంచ టైటిల్. ఫైనల్‌లో ఇరాన్ క్రీడాకారుడు అమీర్ సర్కోష్‌పై విజయం సాధించాడు.
అశ్విన్ కొత్త రికార్డు
భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ 54 టెస్టుల్లోనే 300 వికెట్లు తీసి అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. అశ్విన్ కంటే ముందు ప్రపంచంలో 30 మంది బౌలర్లు మాత్రమే 300లకు పైగా వికెట్లు తీశారు.
ఆర్చరీలో అభిషేక్ వర్మకు స్వర్ణం
ఢాకాలో జరిగిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఢిల్లీకి చెందిన అభిషేక్ వర్మ స్వర్ణం సాధించారు. ఫైనల్‌లో అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కిమ్ జాంగ్‌హో (దక్షిణకొరియా)పై విజేతగా నిలిచాడు.
ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణం కైవసం చేసుకున్నది. పైనల్‌లో జ్యోతి సురేఖ, ప్రణీతి, త్రిషలతో కూడిన భారత జట్టు కొరియాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ 3 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు గెల్చుకున్నది.

Persons

ఐరాస ప్రచారకర్తగా దియామీర్జా
ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియామీర్జా నియమితులయ్యారు. భారత్‌లో పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, సముద్రాల పరిరక్షణ, అడవుల సంరక్షణ తదితర అంశాలపై పలు కార్యక్రమాల ద్వారా ఆమె అవగాహన కల్పిస్తారు.
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలత
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలతా శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఆమె. స్నేహలత 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. అనూప్‌మిశ్రా స్థానంలో ఆమె నియమితులయ్యారు.
saidulu ప్రసార భారతి చైర్మన్‌గా సూర్యప్రకాశ్
ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా ఏ సూర్యప్రకాశ్ నియమితులయ్యారు. ఆయన 2020, ఫిబ్రవరి 8 వరకు పదవిలో కొనసాగుతారు.
మాజీ సీజేఐ మృతి
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్‌సేన్ ఆనంద్ మృతిచెందారు. ఆయన 1975లో జమ్ముకశ్మీర్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1998- 2001 మధ్యకాలంలో సుప్రీంకోర్టు 29వ ప్రధాన న్యాయమూర్తిగా, 2003-06 మధ్యకాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు.

1027
Tags

More News

VIRAL NEWS

Featured Articles