సుల్తాన్ కులీ గోల్కొండ రాజ్యస్థాపన


Wed,September 13, 2017 12:32 AM

కుతుబ్‌షాహీలు (క్రీ.శ. 1518-1687)

-క్రీ.శ. 1500 ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యం ఐదు రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది. ఇందులో కుతుబ్‌షాహీ రాజ్యం ఒకటి. తొలుత కుతుబ్‌షాహీలు గోల్కొండ కేంద్రంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. 1526లో విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఇతర తెలుగు ప్రాంతాలను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కుతుబ్‌షాహీలు క్రీ.శ. 1518లో స్వతంత్రులయ్యారు. కానీ రాజ్యస్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్‌షా 1496 నుంచి 1518 వరకు తెలంగాణ సుబేదార్‌గా పరిపాలించాడు. తెలంగాణకు సంబంధించినంత వరకు 1496 నుంచే కుతుబ్‌షాహీల యుగంగా భావించవచ్చు. తెలంగాణ అనే పదం వీరి కాలం నుంచే బహుళ ప్రాచుర్యం పొందింది. క్రీ.శ. 1687లో కుతుబ్‌షాహీ రాజ్యం మొఘలుల వశమై దక్కన్ సుభాలో భాగమయ్యేంత వరకు కుతుబ్‌షాహీలు 170 ఏండ్లు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను పాలించి తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను ఆదరించి ప్రజల అభిమానాన్ని పొందారు.

ఆధారాలు

-కుతుబ్‌షాహీల చరిత్రను అధ్యయనం చేయడానికి పర్షియన్, అరబిక్, ఉర్దూ, తెలుగు, ఫ్రెంచి మొదలైన భాషల్లో ఆనాటి పండితులు, చరిత్రకారులు, కవులు, సుల్తానులు, పర్యాటకులు మొదలైనవారు రాసిన అనేక గ్రంథాలు, రచనలు ఎంతో ఉపకరిస్తున్నాయి. కుతుబ్‌షాహీ సుల్తానులు జారీ చేసిన కొన్ని ఫర్మానాలు కూడా ఎంతో విలువైన చారిత్రక సమాచారాన్ని అందిస్తున్నాయి. కొన్ని శాసనాలు కూడా అమూల్యమైన సమాచారాన్ని సమకాలీన పరిస్థితులను అధ్యయనం చేయడానికి దోహదపడుతున్నాయి. తెలంగాణలో వారు నిర్మించిన కట్టడాలు, నిర్మాణాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
Golconda-Fort

కుతుబ్‌షాహీ సుల్తానులు - విజయాలు


సుల్తాన్ కులీకుతుబ్ ఉల్ ముల్క్ (క్రీ.శ. 1518-43)
-సుల్తాన్ కులీ దక్షిణ ఇరాన్‌లోని హందం ప్రాంతానికి చెందినవాడు. సుల్తాన్‌కులీ కురుకునేల్ తెగకు చెందినవాడు. కురుకునేల్ అంటే నల్లమేక.
-హందంలోని అకునోవ్ తెగచేతిలో పరాజయంపాలై కురుకునేల్ తెగ ఇరాన్‌ను వదిలి, మొదట ఉత్తర భారతదేశం చేరుకుంది. అక్కడి నుంచి బహమనీ రాజ్యంలోకి ప్రవేశించారు.
-సుల్తాన్ కులీ బహమనీ సుల్తాన్ మూడో మహమ్మద్ కొలువులో చేరి సేనాధిపతి అయ్యాడు. దారిదోపిడీ దొంగలవల్ల, సామంతుల అవిధేయతవల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన అరాచకాన్ని అణచివేసి శాంతిని నెలకొల్పాడు.
-క్రీ.శ. 1487లో దక్కనీ, అఫాకీ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణల బారినుంచి మహమ్మద్‌షాను రక్షించాడు. అంతేకాకుండా గోవా పాలకుడైన బహదూర్ జిలాని (1493) తిరుగుబాటును కులీ పూర్తిగా అణచివేయడంతో బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా సంతోషించి కులీకి కుతుబ్ ఉల్‌ముల్క్ బిరుదునిచ్చి గోల్కొండ సుబేదార్‌గా 1496లో నియమించాడు.
-సుల్తాన్ కులీకుతుబ్‌షా క్రీ.శ. 1518లో గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. గోల్కొండను పూర్వం మంగళారం అని పిలిచేవారు. ఈ కోటను కాకతీయుల కాలంలో నిర్మించారు.
-సుల్తాన్ కులీకి విజయనగర చక్రవర్తులైన సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు సమకాలీనులు. విజయనగర, రెడ్డి, గణపతిదేవుని భూభాగాలపై సుల్తాన్ కులీ దండెత్తాడు. ఖమ్మంమెట్ యుద్ధంలో వరంగల్‌లో గజపతుల అధికారి అయిన సీతాపతి లేదా షితాబ్‌ఖాన్‌ను ఓడించాడు.
-సుల్తాన్ కులీ గోల్కొండ రాజ్యాన్ని, కోటను బలోపేతం చేయడానికి కృషిచేశాడు.
-గోల్కొండ కోటలో అనేక రాజభవనాలు, తోటలు నిర్మించాడు. ఇతను గోల్కొండపై రెండు మినార్లతో ఒక మసీదును నిర్మించాడు. ఈ మసీదు మినార్ల ఆధారంగా తర్వాత కాలంలో చార్మినార్‌ను నిర్మించారు.
-క్రీ.శ. 1518-43 మధ్యకాలంలో ఇతను సాధించిన విజయాలతో గోల్కొండ రాజ్యం తెలంగాణలోని కోహీర్, వరంగల్, నల్లగొండ నుంచి తీరాంధ్రలోని మచిలీపట్నం వరకు విస్తరించింది.
-సుల్తాన్ కులీ స్థానిక ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇతను క్రీ.శ. 1543లో అధికార పిపాసి అయిన సొంత కొడుకు జంషీద్ కులీ కుట్రలో భాగంగా గోల్కొండ కోటలోని మసీదులో హత్యకు గురయ్యాడు.

జంషీద్ కులీకుతుబ్‌షా (క్రీ.శ. 1543-50)

-గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీకి ఆరుగురు కుమారులు. వీరు హైదర్ అలీ, కుతుబుద్దీన్, జంషీద్‌కులీ, అబ్దుల్ కరీం, దౌలత్‌కులీ, ఇబ్రహీం కులీకుతుబ్‌షా.
-సుల్తాన్ కులీ చివరి రోజుల్లో కుమారుల మధ్య సింహాసనం కోసం పోరాటం ఆరంభమైంది. మూడో కుమారుడైన జంషీద్ కుట్రపన్ని తండ్రిని హత్య చేయించి ఏడేండ్లపాటు గోల్కొండ రాజ్యాన్ని పాలించాడు.
-ఇతని పరిపాలనా కాలంలో రాజ్యం, అంతఃపురంలో అంతరంగిక తగాదాలు చెలరేగాయి. ప్రజలు, సర్దారులు జంషీద్‌ను పితృహంతకుడిగా, స్వార్థపరుడిగా భావించారు.
-జంషీద్ పరిపాలించింది స్వల్ప కాలమే అయినా సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి సుల్తాన్ అధినేతగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. వీరిలో వకీల్, పీష్వా, మీర్-జుమ్లా ముఖ్యులు.
-క్రీ.శ. 1550లో జంషీద్‌కులీ క్షయ వ్యాధితో మృతిచెందాడు.

ఇబ్రహీం కులీకుతుబ్‌షా (క్రీ.శ. 1550-80)

-ఇబ్రహీం కులీకుతుబ్‌షా తన తండ్రి సుల్తాన్ కులీ హత్యానంతరం ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణభయంతో విజయనగర రాజ్యానికి పారిపోయి అలియరామరాయలు శరణు కోరాడు. అక్కడే సుమారు ఏడేండ్లపాటు గడిపాడు.
-జంషీద్‌కులీ మరణానంతరం అతని భార్య బిల్కిస్ జమాన్ తన మైనర్ కుమారుడైన సుభాన్‌ను పరిపాలకుడిగా ప్రకటించి కొందరు సర్దార్ల సహాయంతో సుమారు ఏడు నెలలపాటు పరిపాలించింది.
-గోల్కొండ రాజ్యంలో అస్థిరత నెలకొన్న ఈ సమయంలో సుల్తాన్ కులీ ఆరో కుమారుడైన ఇబ్రహీం కులీకుతుబ్‌షా విజయనగర చక్రవర్తి సదాశివరాయల ప్రధాని అలియరామరాయల మద్దతుతో గోల్కొండ చేరి బిల్కిస్ జమాన్ మద్దతుదారులను ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు.
-ప్రముఖ చరిత్రకారుడు హరున్‌ఖాన్ షేర్వాని తన ప్రసిద్ధ రచన హిస్టరీ ఆఫ్ కుతుబ్‌షాహీ డైనాస్టీలో ఇబ్రహీం పరిపాలనా కాలాన్ని ది కింగ్‌డం ఎట్ ఇట్స్‌హైట్ అని వర్ణించాడు.
-ఇబ్రహీం కులీకుతుబ్‌షా తన పరిపాలనా కాలంలో గోల్కొండ రాజ్య ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాడు.
-పొరుగు షియా సుల్తానులైన ఆదిల్‌షాహీ, నైజాం షాహీలతోపాటు విజయనగర పాలకులతో అనేక యుద్ధాలు చేశాడు.
-అలియరామరాయలు విభజించు పాలించు దౌత్యనీతికి ఇబ్రహీం కులీ ఎత్తులు విఫలమయ్యాయి. క్రీ.శ. 1550-64 మధ్యవిజయనగర సేనల చేతిలో అనేక యుద్ధాల్లో పరాజయం పాలయ్యాడు.
-చివరికి గతంలో అలియరామరాయలు చేసిన సహాయాన్ని విస్మరించి విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వైవాహిక సంబంధాల ద్వారా దక్కను సుల్తానులందరినీ ఏకం చేశాడు.
-క్రీ.శ. 1565లో దక్కన్ సుల్తానుల సేనలకు విజయనగర సేనలకు మధ్య రాక్షసి-తంగడి అనే గ్రామాల మధ్యగల మైదానంలో జరిగిన యుద్ధంలో ఇబ్రహీం కులీకుతుబ్‌షా, అతనికి మిత్రులైన బీజాపూర్, అహ్మద్‌నగర్, బీదర్, బీరార్ సైన్యాలు అఖండ విజయాన్ని సాధించాయి.
-అలియరామరాయలు ఓడిపోయి యుద్ధభూమిలోనే మృతిచెందాడు. విజయనగర సేనలు చెల్లాచెదురయ్యాయి. దీంతో దక్కన్ సుల్తానులందరిలో గోల్కొండ సుల్తాన్‌కే ఎక్కువ ఖ్యాతి దక్కింది.
పరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు
-ఇబ్రహీం కులీకుతుబ్‌షా తన పరిపాలనా కాలంలో అనేక మంది అనుభవజ్ఞులు, సమర్థులైన వారిని మంత్రులుగా, ఉన్నతాధికారులుగా నియమించాడు.
-వీరిలో యుద్ధ వ్యవహారాల మంత్రి ముస్తఫాఖాన్, ఉన్నతాధికారులైన అమీర్‌షా, మహమ్మద్ అంజూ, హుస్సేన్ బేగ్ ముఖ్యులు.
-గోల్కొండ కోటకు ఎత్తయిన గోడలు నిర్మించి శత్రు దుర్భేద్యంగా చేశాడు.
-ఇతని కాలంలో అనేక చెరువులు, సరస్సులను నిర్మించారు. వీటిలో హుస్సేన్‌సాగర్, ఇబ్రహీంపట్నం చెరువులు ముఖ్యమైనవి.
-ఇబ్రహీం అల్లుడు హుస్సేన్‌షా హుస్సేన్ సాగర్ చెరువును తవ్వించాడు.
-ఇబ్రహీం భగీరథి అనే మహిళను వివాహం చేసుకొని గోల్కొండను ఆమె పేరు మీదుగా భగీరథిపురం అని పిలిచేవాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

ప్రముఖ నిర్మాణాలు

-గోల్కొండ చుట్టూ ప్రాకారం, ఇబ్రహీంబాగ్, పూల్‌బాగ్, ఇబ్రహీంపట్నం, మూసీ నదిపై మొదటి వంతెన (పురానాపూల్) నిర్మించారు.

సాహిత్య సేవ

-ఇబ్రహీం ఏడేండ్లపాటు విజయనగర సామ్రాజ్యంలో గడిపినప్పుడు తెలుగు కవులను కలుసుకొని తెలుగు భాషపై అభిమానం పెంచుకున్నాడు.
-ఇతను గొప్ప సాహితీప్రియుడు. పర్షియన్, ఉర్దూ భాషల్లో పాండిత్యం కలవాడు.
-అనేక మంది తెలుగు కవులను, పండితులను తన ఆస్థానంలో పోషించాడు. తపతీ సంవరణోపాఖ్యానాన్ని రచించిన అద్దంకి గంగాధరుడు, నిరంకుశోపాఖ్యానాన్ని రాసిన కందుకూరు రుద్రకవి, యయాతి చరిత్రను రచించిన పొన్నగంటి తెలగనార్యుడు వీరిలో ముఖ్యులు.
-కవులు ఇతన్ని మల్కిభరాముడు అని కీర్తించారు.
-ఆషిఖానాలో కవితాగోష్టి నిర్వహించేవాడు.
-ఇతనికాలంలో ఉర్దూ భాష అభివృద్ధి చెందింది. అందువల్లనే ఇతన్ని ఉర్దూ చాజర్ (ఉర్దూ పితామహుడు) అంటారు.
-ఇతని కాలంలో దక్కనీ ఉర్దూ ప్రారంభమైంది. దేశీయ, విదేశీ వ్యాపారం పురోగతి సాధించింది. గోల్కొండ వజ్రాలు, వస్ర్తాలు ఐరోపా మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ పొందాయి. వర్తకులు అపారమైన లాభాలు గడించారు. ప్రజలు సుఖశాంతులతో మత సామరస్యంతో జీవించారు. పర్షియాను ఏలిన సఫావిద్ వంశ సుల్తానులతో స్నేహ, దౌత్య సంబంధాలను నెలకొల్పాడు. ఈ విధంగా గోల్కొండ రాజ్యాన్ని ఉచ్ఛస్థితిలోకి తీసుకెళ్లిన ఇబ్రహీం కులీకుతుబ్‌షా 1580లో మృతిచెందాడు.
Mallikarjun

773
Tags

More News

VIRAL NEWS

Featured Articles