కరెంట్ అఫైర్స్


Wed,December 4, 2019 01:24 AM

సతీశ్‌రెడ్డికి ఫెలోషిప్

భారత రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ గుండ్రా సతీశ్‌రెడ్డికి 2019కుగాను లండన్‌కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్‌ను సొసైటీ నవంబర్ 26న ప్రకటించింది. ఏరోనాటికల్ ఆర్ట్ సైన్స్, ఇంజినీరింగ్ రంగాల్లో ఆయన చేసిన సేవలకుగాను ఈ అవార్డు ప్రకటించారు. ఈ సొసైటీలో భారతీయుడికి ఈ ఘనత దక్కడం వందేండ్లలో ఇదే తొలిసారి. ఏరోస్పేస్‌లో నోబెల్‌కు సమానంగా పరిగణించే ఈ ఫెలోషిప్‌ను తొలిసారిగా 1917లో ప్రదానం చేశారు. విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరుల్లో ఒకరైన ఆర్విల్ రైట్‌కు ఈ తొలి ఫెలోషిప్ దక్కింది.
SatishReddy

మిస్టర్ యూనివర్స్‌గా నటేశన్

కేరళలకు చెందిన చిత్రేష్ నటేశన్ భారత్ తరఫున తొలిసారి మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. దక్షిణ కొరియాలో నవంబర్ 26న జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూబీపీఎఫ్)లో 90 కిలోల విభాగంలో నటేశన్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో 38 దేశాల నుంచి 50 మంది పోటీలో పాల్గొన్నారు. ఈయన హాకీ క్రీడాకారుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాడీ బిల్డింగ్ వైపు మారాడు.

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర 18వ సీఎంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి మహా వికాస్ అఘాడీ తరఫున శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికయ్యారు. నవంబర్ 28న ముంబైలోని శివాజీ పార్క్ గ్రౌండ్‌లో ఉద్ధవ్ ఠాక్రేతో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.

అక్కితమ్‌కు జ్ఞానపీఠ్ పురస్కారం

సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారమైన ప్రముఖ మలయాళీ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రిని వరించింది. అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభ నవంబర్ 29న ప్రకటించారు. ఆయన కేరళలోని పాలక్కడ్ జిల్లా కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు రచించారు. 55 పుస్తకాలు రాసిన ఆయనకు 2017లో పద్మశ్రీ లభించింది.

సిడ్నీలో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా సంజయ్

ఆస్ట్రేలియా సిడ్నీలోగల భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా ములక సంజయ్ కుమార్‌ను నియమిస్తూ భారత విదేశాంగ శాఖ నవంబర్ 29న ఉత్తర్వులు జారీచేసింది. ఈయన వరంగల్ జిల్లాకు చెందినవారు.

ఇరాన్ ప్రధాని అదెల్ అబ్దుల్ రాజీనామా

ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహది తన పదవికి రాజీనామా చేయనున్నట్లు నవంబర్ 29న ప్రకటించారు. ఇరాక్ ప్రధానికి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ చట్టసభ సభ్యులకు అత్యున్నత షియా మత గురువు పిలుపునివ్వడంతో రెండు నెలలుగా అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లలో 400 మంది మృతిచెందగా, 15 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని అదెల్ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

జపాన్ మాజీ ప్రధాని మృతి

జపాన్ మాజీ ప్రధాని యశుహిరో నకసోనే నవంబర్ 29న మరణించారు. ఆయన వయస్సు 101 ఏండ్లు. 1982 నుంచి 87 మధ్య జపాన్ ప్రధానిగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా చేతిలో జపాన్ ఓడిపోయినప్పటికీ తిరిగి ఆ దేశంతోనే సంబంధాలు బలోపేతమయ్యేందుకు చొరవ తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ ఉన్నప్పుడు ఆ దేశానికి రక్షణ రంగ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించడం గమనార్హం. జపాన్‌లోని రైల్వే, టెలికాం రంగాలను ప్రైవేటీకరించారు.

వలసల్లో భారత్ అగ్రస్థానం

అంతర్జాతీయ వలస సంస్థ నవంబర్ 28న విడుదల చేసిన నివేదికలో అంతర్జాతీయ వలసల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1.75 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్లారు. అంతర్జాతీయ వలసవాదుల సంఖ్య 27 కోట్లు. అమెరికాకే అధిక సంఖ్యలో వలస వెళ్లారు. వివిధ దేశాల నుంచి 5.1 కోట్ల మంది యూఎస్ వెళ్లారు. వలసల్లో భారత్ తర్వాతి స్థానంలో మెక్సికో ఉంది. ఈ దేశం నుంచి 1.18 కోట్ల మంది వలస వెళ్లారు. మూడో స్థానంలో చైనా (1.07 కోట్లు) ఉంది. ప్రవాస భారతీయుల ద్వారా భారత్‌కు రూ.1,25,000 కోట్ల సంపద చేరుతుంది.

హెచ్‌ఐవీ బాధితుల వీర్యనిధి

ప్రపంచంలో తొలిసారిగా హెచ్‌ఐవీ బాధితుల వీర్య నిధి (స్పెర్మ్ బ్యాంక్)ని న్యూజిలాండ్‌లో నవంబర్ 28న ప్రారంభించారు. హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టే ఆలోచనతో న్యూజిలాండ్ ఎయిడ్స్ ఫౌండేషన్ దీన్ని స్థాపించింది.

ప్రపంచ కుబేరుల జాబితా

ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా-2019ను నవంబర్ 29న విడుదల చేసింది. రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ (113 బిలియన్ డాలర్లు) మొదటిస్థానంలో నిలువగా.. 107.4 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 2వ స్థానంలో నిలిచారు. భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (60 బిలియన్ డాలర్లు) 9వ స్థానంలో ఉన్నారు.
Mukesh-Ambani

ఆఫ్ఘనిస్థాన్‌లో ట్రంప్ పర్యటన

థ్యాంక్స్ గివింగ్ రోజును పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 28న అఫ్ఘనిస్థాన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. అఫ్ఘన్‌లోని బగ్రామ్ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులను కలుసుకున్నారు.

లోక్‌పాల్ నినాదం, లోగో ఎంపిక

పార్లమెంట్ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన లోక్‌పాల్ లోగోను, నినాదాన్ని నవంబర్ 27న ఖరారు చేశారు. లోక్‌పాల్ లోగో డిజైన్, నినాదం కోసం ఇటీవల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 6 వేల మందికి పైగా ఈ పోటీలో పాల్గొని లోగో డిజైన్లు, నినాదాలు పంపించారు. ఇందులో నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన ప్రశాంత్ మిశ్రా రూపొందించిన డిజైన్‌ను లోక్‌పాల్ లోగోగా ఎంపికచేశారు.
లోక్‌పాల్ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తుంది, ఎలా న్యాయం చేస్తుంది అనేది ప్రతిబింబించేలా లోక్‌పాల్ లోగోను ప్రశాంత్ రూపొందించారు. ప్రజలను సూచించేలా ముగ్గురు వ్యక్తులు, అశోకచక్రం, న్యాయవ్యవస్థను సూచించేలా కాషాయ రంగులో పుస్తకం, ఆ పుస్తకాన్ని రెడు చేతుల్లో పట్టుకున్నట్లుగా లోగోను తయారుచేశారు. మువ్వన్నెల రంగుల్లో ఈ లోగో ఉంది. లోగో విజేత ప్రశాంత్‌కు రూ.25 వేల నగదు బహుమతి ప్రకటించారు.
4,705 మంది నినాదాలు పంపగా.. వీటిలో ఏ ఒక్కటి సంతృప్తికరంగా లేకపోవడంతో ఎవరిని ఎంపికచేయలేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. నినాదం విషయమై లోక్‌పాల్ కమిటీ చర్చించి సొంతంగా ఈశోపనిషత్ నుంచి వ్యాఖ్యలను తీసుకున్నారు. ఇతరుల సంపద పట్ల ఆశపడొద్దు అనేది ఈ నినాదం.
Lokpal-Logo

పీఎస్‌ఎల్వీ-సీ47 విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబర్ 27న చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. కార్టోశాట్-3తోపాటు అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. మూడోతరం హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం అయిన కార్టోశాట్-3 బరువు 1,625 కిలోలు. దీని జీవితకాలం ఐదేండ్లు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఉపగ్రహం దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతోపాటు వారి కదలికలు, స్థావరాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచరమందిస్తూ నిఘా నేత్రంలా పనిచేయనుంది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 49వ ప్రయోగం. షార్ నుంచి 74వ రాకెట్ ప్రయోగం.

అవినీతిలో రాజస్థాన్ టాప్

ఇండియా కరప్షన్-2019 పేరుతో నిర్వహించిన సర్వే వివరాలు నవంబర్ 28న విడుదల చేశారు. దీనిలో రాజస్థాన్ (78 శాతం) తొలి స్థానంలో నిచిలింది. బిహార్ (75 శాతం) 2, జార్ఖండ్ (74 శాతం) 3, ఉత్తరప్రదేశ్ (74 శాతం) 4, తెలంగాణ (67 శాతం) 5వ స్థానాల్లో ఉన్నాయి. కేరళలో అవినీతి తక్కువగా (10 శాతం) ఉంది. ఆంధ్రప్రదేశ్ (50 శాతం) 13వ స్థానంలో ఉంది. 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ మధ్య 20 రాష్ర్టాల్లోని 248 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది.

శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన

తొలి విదేశీ పర్యటన నిమిత్తం శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నవంబర్ 28న భారత్ చేరుకున్నారు. సముద్రయానంలో భద్రత, తమిళ మైనార్టీలు, మత్స్యకారుల సమస్యలపై ఆయన ప్రధాని మోదీతో నవంబర్ 29న చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,229 కోట్లు) సులభతర రుణం (లైన్ ఆఫ్ క్రెడిట్) ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇందులో తీవ్రవాద నిర్మూలనకు 50 మిలియన్ డాలర్లు (రూ.358 కోట్లు) కేటాయించారు.

ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో కేటీఆర్

ఢిల్లీలో నవంబర్ 26న జరిగిన క్రిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్-2019 సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో పౌరులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను కేటీఆర్ వివరించారు.
CRISIL

హెచ్‌సీయూకు అవార్డు

భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) నిర్వహించిన సర్వేలో నవంబర్ 27న యూనివర్సిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి లభించింది. యూనివర్సిటీ అనుసరిస్తున్న విధివిధానాలు, భావి లక్ష్యాలు, ర్యాంకింగ్స్ వంటి అంశాల్లో చూపుతున్న విధానాలకు ఈ అవార్డు దక్కింది.

వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్

మారథాన్ వీరుడు ఎల్యుద్ కిప్‌చోగె (ఇథియోపియా), హార్డిల్స్ క్రీడాకారిణి దలిలా మహ్మద్ (అమెరికా)లు వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్-2019గా నవంబర్ 24న ఎంపికయ్యారు. కిప్‌చోగె 2019 అక్టోబర్‌లో వియన్నాలో జరిగిన 42.195 కి.మీ మారథాన్‌ను గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో పూర్తిచేసి రెండు గంటల్లోపే చేరుకున్న తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో అతడు ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 2019 జూలైలో అయోవాలో జరిగిన మహిళల 400 మీ. హార్డిల్స్‌లో 52.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది దలిలా మహ్మద్. దోహాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో 52.16 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. దీంతో ఆమె ఈ పురస్కారానికి ఎంపికైంది.

ఆర్చరీలో దీపికకు స్వర్ణం

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల రికర్వ్‌లో భారత స్టార్ ఆర్చర్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ దీపిక కుమారి బంగారు పతకం సాధించింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 28న జరిగిన రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక ఆరోసీడ్ భారత్‌కే చెందిన అంకితను ఓడించింది.
Sports

272
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles