ఆకలి - ఆయాసం


Mon,December 2, 2019 12:54 AM

ప్రపంచంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. 70కోట్ల మంది చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు పౌష్టికాహారలోపంతో లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ రెండింటి కారణంగా వారు జీవితాంతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతారని యునిసెఫ్‌ హెచ్చరించింది. పోషకాహార లోపం కారణంగా నాలుగేండ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సున్న 14 కోట్ల మందికి పైగా చిన్నారులు ఉండాల్సిన ఎత్తుకన్నా తక్కువ ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది. ఇదే వయస్సులోని 5 కోట్ల మంది చిన్నారులు ఉండాల్సినదానికన్నా బలహీనంగా, బక్కపల్చగా ఉన్నట్లు వివరించింది. సగానికి సగం మంది చిన్నారులు అవసరమైన విటమిన్లు, ఖనిజలవణాలు పొందట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. పలు దేశాల్లో చిన్నారులు తీసుకుంటున్న ఆహారంవల్ల వారి కడుపు నిండుతున్నా అందులో కావాల్సిన పోషకాలు అందట్లేదనే కఠిన వాస్తవాలతో ఇటీవల నివేదికను విడుదల చేసింది. అందులోని కీలక అంశాలు కొన్ని నిపుణ పాఠకుల కోసం..


-మన దేశంలో 35శాతం మందికి ఎదుగుదలలోపం, యుక్తవయస్సులోని బాలికల్లో 40 శాతం మంది, బాలల్లో 18 శాతం రక్తహీనత సమస్య ఉంటోందని యునిసెఫ్‌ సర్వేలో వెల్లడైంది. ఇక ఐదేండ్లలోపు చిన్నారులు అత్యల్ప ఆహారం, అతి తిండి పరిణామంతో బాధపడుతున్నారు. పిల్లలకు అందాల్సిన ఆహారం విషయంలో విచిత్రపరిస్థితి నెలకొందని పేర్కొంది. ఎదుగుతున్న వయస్సుకు తగ్గట్లుగా సరైన తిండి లేకుండా ఉండే బలహీన చిన్నారులు, మరోవైపు వయస్సుకు మించి అతి ఎక్కువగా తిండితో స్థూలకాయులు అవుతున్నవారు ఉన్నారని తెలిపింది. దీంతో అపసవ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఆరు నెలల నుంచి రెండేండ్లలోపు ఉండే పిల్లల్లో మూడింట రెండొంతుల వరకు సరైన పోషకాహారం అందడం లేదు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాల్లో ఆరు నెలల నుంచి రెండేండ్ల వయస్సుగల 5 మంది చిన్నారుల్లో ఒకరు మాత్రమే ఆరోగ్యకరమైన పెరుగుదలకు సంబంధించిన ఆహారం తీసుకుంటున్నారు. ఇదే విషయంలో యూకే, యూఎస్‌ లాంటి సంపన్న దేశాల్లో అతి ఎక్కువ తిండితో స్థూలకాయులవుతున్న పిల్లలు సరైన ఆహారం అందక బక్కచిక్కిపోతున్న పిల్లల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
UNISEF

-బాల్యదశలోనే ఆహారపు అలవాట్లపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని యునిసెఫ్‌ పేర్కొంది. సరైన ఆహారం సరైన మోతాదులో తీసుకునే విషయం ఈ దశలోనే కీలకం. ఒకవైపు ఆహారం దొరక్క సరైన ఎదుగుదల లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలలు, మరోవైపు అతిఎక్కువ తిండి అందుబాటులో ఉండటంతో చిన్నతనంలోనే ఊబకాయులవుతున్న చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. పిల్లలు సక్రమ రీతిలో తినకపోతే వారు సవ్యంగా బతకలేరనే కీలకమైన మౌలిక అంశం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
-పిల్లలు తమ ఎత్తుకు తగ్గ బరువు ఉండట లేదు. దీంతో అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల్లో విటమిన్‌ ఏ, ఐరన్‌ వంటి అత్యవసర పోషకపదార్థాల లోపం నెలకొని ఉంది. కొన్ని దేశాల్లోని చిన్నారులు పండ్లు, కూరగాయల ఆహారం దక్కని స్థితిలో ఉన్నారు. పిల్లలు ఎదుగుతున్న కొద్ది వారిలో చిరుతిండ్లు, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు పెరుగుతూ ఉంటాయి. సరైన విధంగా పెద్దల మార్గదర్శకత్వం లేకపోవడంతో కేవలం రుచికరమైన తిండికే పిల్లలు అలవాటుపడి తర్వాత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని వెల్లడైంది.
-పదింట తొమ్మిది దేశాలు ‘బరువు’ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దేశాల్లో ఊబకాయంతో, పౌష్టికాహార లోపంతో బాధపడే ప్రజలు పక్కపక్కనే బతుకుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జంక్‌ఫుడ్‌ విస్తరించడం, రవాణాసౌకర్యాలు మెరుగవ్వడం, టీవీలు ఇలా అనేక కారణాలున్నాయి. బరువు అధికంగా ఉన్నవారిలో పోషకాహార లోపం లేదని చెప్పలేం. కొందరు వయస్సుకు తగ్గ బరువు ఉంటారు. కానీ వారిలో కొవ్వు మోతాదుకుమించి ఉంటున్నది. ప్రతి దేశమూ ఎంతో కొంత పోషకాహార లోపం సమస్యను ఎదుర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా గడిచిన 40 ఏండ్లలో ఊబకాయ బాధితుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
-పిల్లల్లో నానాటికీ పెరిగిపోతున్న పోషకాహార లోపం సమస్యను అధిగమించడం కోసం యునిసెఫ్‌ తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు ఉన్న ఆహార పదార్థాల జాబితా పుస్తకాన్ని విడుదల చేసింది. కేవలం రూ.20 ఖర్చుతో తక్కువ బరువు ఊబకాయం, ఎనిమియా సమస్యలను అధిగమించవచ్చని పేర్కొంది. ఈ మేరకు వంటకాల జాబితాతో కూడిన 28 పేజీల బుక్‌లెట్‌ను విడుదల చేసింది. తక్కువ బరువుతో బాధపడుతున్నవారికి ఊతప్పం, ఆలూపరోటా, పనీర్‌ కతిరోల్‌, సాగా కట్‌లెట్‌, ఊబకాయంతో బాధపడుతున్న వారికి దాల్‌ పరోటా, పోహా, వెజిటబుల్‌ ఉప్మా వంటి ఆహార పదార్థాలను అందించటం ద్వారా ఆ సమస్యలను అధిగమించవచ్చని యునిసెఫ్‌ పేర్కొంది.
-వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొన్ని ఆహారపదార్థాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం, వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కేవలం మూడు ధాన్యాలు (బియ్యం, మక్కజొన్న, గోధుమ) మనిషి ఆహారంలో ఎక్కువ శాతం ఇవే ఉంటున్నాయి. అయితే ప్రజలకు తగినంత శక్తి అందుతుంది. కానీ ఇంత తక్కువ ఆహారపదార్థాలపై ఆధారపడటం వల్ల ప్రజలకు కావాల్సినంతగా మినరల్స్‌, విటమిన్లు అందడం లేదు. ఆహారంలో భిన్నమైన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా వనరుల వినియోగంలోనూ సుస్థిరత రావడంతో పాటు వన్యప్రాణులకు మేలు కలుగుతుందని చెబుతున్నారు.
-మనదేశంలో లభించే పలు వంటకాల్లో మెరుగైన పోషకవిలువలు ఉన్నట్లు యునిసెఫ్‌ సూచించింది. ఊతప్పం, మొలకెత్తినగింజలతో చేసిన పరోటావంటి ఆహార పదార్థాలను సూచించింది. పిల్లల్లో తక్కువ బరువు సమస్యను అధిగమించేందుకు ఆలుపరాటా, పనీర్‌కటిరోల్‌, సగ్గుబియ్యం, కట్‌లెట్‌ వంటివి, స్థూలకాయసమస్య నివారణకు మొలకెత్తిన పప్పుగింజలతో పరాటాలు, పోహా, ఉప్మా మొదలైన ఆహారం అందించవచ్చని సూచించింది. అలాగే రాగులతో పోషకాలు, ప్రొటీన్లు, ఏ, బీ, సీ విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. జీర్ణశక్తి పెరగడంతోపాటు అధిక బరువులు తగ్గించడంలో మానసిక ప్రశాంతతను అందజేయడంలో రాగులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
-వీటితో పాటు చౌకగా దొరికే మరిన్ని పోషకాలు ఉన్న ఆహారాన్ని, పర్యావరణానికి మేలు చేసేవి వైద్యనిపుణులు సూచించారు. ఇవి మనకు అతితక్కువ ఖర్చుతో లభించేవే. మనం తీసుకునే ఆహారంలో కొంచెం మార్పులతో ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటూ, సమస్త జీవానికి ఆధారమైన భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అత్యధిక పోషకాలు కలిగిన వాటిలో 74 శాతం శాకాహార పదార్థాలే కావడం.. మాంసాహారంతో పోలిస్తే కొన్ని మొక్కలు, ఆకులు విత్తనాలు, వేర్లలో పోషకాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పదార్ధాలు-బహుమేలు

-మునగాకు: మునక్కాయలు మనం నిత్యజీవితంలో చూస్తూనే ఉంటాం. మునక్కాయలే కాకుండా మునగ ఆకుల్లోనూ పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్యవిధానంలో మునగకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మునగ ఆకుల్లో ఏ, బీ, సీ విటమిన్లు, క్యాల్షియం, ఐరన్‌, అమైనో ఆమ్లాలు ఉంటాయి.
అనపకాయ: ఎలాంటి నేలలోనైనా, వాతావరణ పరిస్థితిలోనైనా ఇది పెరుగుతుంది. లేతగా ఉన్నప్పుడు లోపల ఉండే గింజలనే కాకుండా మొత్తం కాయను తినవచ్చు. ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
బొబ్బర్లు: ఎన్నో రకాలున్న బొబ్బర్లలో మంచి పొషకవిలువలు ఉన్నాయి. ఫోలేట్‌, మెగ్నీషియం సహా ఖనిజలవణాలు, విటమిన్లు, ప్రొటీన్లు ఉంటాయి. ఇంకా ఇది నైట్రోజన్‌ను అమ్మోనియాగా మార్చి పర్యావరణానికి మేలు చేస్తాయి.
మైసూరుపప్పు: ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వండటం కూడా చాలా సులువు. 15-20 నిమిషాల్లో ఉడుకుతుంది.
పెసర్లు: విటమన్‌ బీ, ఖనిజలవణాలు, ప్రొటీన్లు ఉంటాయి. నైట్రోజన్‌ను అమ్మోనియాగా మార్చేందుకు సాయపడతాయి. పెసరపంట ఎండ, కరువు పరిస్థితులను తట్టుకుంటుంది.
సోయాచిక్కుడు: విటమిన్‌ కే, బీలతో పాటు ఐరన్‌, మెగ్నీషియం, పాస్ఫరస్‌, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, జింక్‌, సెలీనియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ప్రతి వంద గ్రాముల సోయాచిక్కుడులో దాదాపు 38 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. గుడ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ. సోయాలో ఇన్ని విలువలున్నా నాలుగింట మూడొంతులు పశువులకు మేతగానే వినియోగిస్తున్నారు.
నాగజెముడు: ఎడారి మొక్కగా పిలిచే దీనిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువపీచు పదార్థాలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తోటకూర: నీటి లభ్యత తక్కువగా ఉన్నా పెరిగే ఈ పంటలో ఆకులతోపాటు విత్తనాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు, మెగ్నీషియం, ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటాయి.
రాగులు: విటమిన్‌ బీ1, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. రాగులను జావలా, పిండిగా మార్చుకుని తినవచ్చు. ఇంకా వీటికి కీటక నిరోధక శక్తి కూడా ఎక్కువే.
గుమ్మడిపూలు: గుమ్మడి పూలు, ఆకుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. వాస్తవానికి దీనిగురించి పెద్దగా ఎవరికి తెలియకపోవడంతో వృథా అవుతున్నాయనే చెప్పవచ్చు. పూలలోని మధ్యభాగం తీసివేసి, మిగతాది ఆహారపదార్థాల్లో తీసుకోవచ్చు. విటమిన్‌ సీ ఎక్కువగా ఉంటుంది.
బీట్‌రూట్‌ ఆకులు: మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ ఆకుల్లో ఐరన్‌తో పాటు.. కంటిచూపునకు మంచిదైన లూటెన్‌ కూడా ఉంది.
పాలకూర: ఏ, బీ, సీ, ఫైటో న్యూట్రియంట్స్‌ సమృద్ధిగా ఉంటాయి.
అవిసెగింజలు: ఆల్ఫాలైనోలెనిక్‌ యాసిడ్‌ అనే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం ఉంటుంది. దీనివల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
జనపనారవిత్తనాలు: ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. 30 గ్రాముల విత్తనాలు తీసుకుంటే ఒక గ్రామ్‌ పీచు పదార్థాలు, 9 గ్రాముల ప్రొటీన్లు మానవ శరీరానికి అందుతాయి.
నువ్వులు: కాపర్‌, మెగ్నీషియం మెండుగా ఉండే వీటిని పచ్చిగా, వేయించైనా తినొచ్చు. వీటి నూనె ద్వారా కూడా పోషకాలు అందుతాయి.
మొలకెత్తిన శనగలు: కప్పు మొలకెత్తిన శనగలు తీసుకుంటే 10 గ్రాముల ప్రొటీన్లు శరీరానికి లభిస్తాయి.
తామర వేళ్లు: తామరచెట్టు వేళ్లను తినొచ్చని చాలామందికి తెలియదు. వీటిలో ఔషధగుణాలు ఉంటాయి. విటమిన్‌ సీ52 ఎక్కువగా ఉంటుంది.
చిలగడదుంప(కందగడ్డ): ఉడకబెట్టుకుని తినే చిలగడదుంపలో ఏ, సీ, ఈ విటమిన్లు, మాంగనీస్‌ ఉన్నాయి.
చిక్కుడు: ప్రొటీన్‌, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.

చిన్నారుల్లో పౌష్టికలోపంపై యునిసెఫ్‌ నివేదిక


list

-సత్యం గౌడ్‌ సూదగాని

369
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles