సింపుల్‌గా సీఎంఏ


Mon,November 25, 2019 01:19 AM

ఉద్యోగ అవకాశాల పరంగా సీఏ తర్వాత కార్పొరేట్‌ ప్రపంచంలో ఎక్కువగా వినిపించే పేరు సీఎంఏ కోర్సు. సీఎంఏ కోర్సుని ఇంతకుముందు ఐసీడబ్ల్యూ అని పిలిచేవారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వరంగంలో సీఎంఏలకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా పెరిగాయి. సీఏతో పాటు సీఎంఏకి కూడా ఆదరణ బాగా పెరుగుతుంది. ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులు ఈ కోర్సుని చదవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఏడాది జూన్‌, డిసెంబర్‌ నెలల్లో సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.మరికొద్ది రోజుల్లో సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఈ తరుణంలో సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఎటువంటి వ్యూహంతో పరీక్షలకు సన్నద్ధమవ్వాలి, ఏయే సబ్జెక్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరీక్షల్లో ఎలాంటి మెళకువలు పాటించాలనే అంశాల గురించి తెలుసుకుందాం.
college_students


సీఎంఏలో ఉత్తీర్ణత శాతం

-చాలా మంది విద్యార్థులు సీఎంఏలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ జూన్‌ 2019లో జరిగిన సీఎంఏ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే.. సీఎంఏ ఫౌండేషన్‌లో 75.66% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
-సీఎంఏ ఇంటర్‌ గ్రూప్‌-1లో 18.62% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
-గ్రూప్‌-2లో 40.05% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
-సీఎంఏ ఫైనల్‌ గ్రూప్‌-1లో 13.88% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
-గ్రూప్‌-2లో 27.27% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
-ఈ ఉత్తీర్ణత శాతాన్ని బట్టి సీఎంఏలో ఉత్తీర్ణత శాతం తక్కువ కాదని మనం అర్థం చేసుకోవచ్చు.

సీఎంఏ ఫౌండేషన్‌లో సబ్జెక్టులు - తీసుకోవలసిన జాగ్రత్తలు



పేపర్‌-1

-ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (100 మార్కులు)

1. ఈ పేపర్‌లో మేనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌కి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
2. ఫామ్స్‌ ఆఫ్‌ మార్కెట్‌, మనీ అండ్‌ బ్యాంకింగ్‌ వంటి అంశాలు చదవడానికి సులువుగా ఉండి ఎక్కువ మార్కులు తెచ్చే అంశాలు.
3. ఈ పేపర్‌లో టెక్నికల్‌ లాంగ్వేజీనే ఎక్కువగా వాడాలి. మిగతా విద్యార్థులతో పోలిస్తే మీ జవాబు భిన్నంగా ఉండి మంచి మార్కులు సాధించాలంటే టెక్నికల్‌ లాంగ్వేజ్‌ తప్పనిసరి వాడాలి.
4. ఈ పేపర్‌లో విద్యార్థి పరీక్ష రాసే విధానాన్ని బట్టి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి నిర్దేశిత సమయంలో సమాధానాన్ని వీలైనంత క్లుప్తంగా అంశాలవారీగా రాయాలి. పరీక్షలో తుది జవాబుకు మాత్రమే కాకుండా ప్రశ్నలోని అన్ని దశలకి మార్కులు ఉంటాయి. కాబట్టి విద్యార్థి వీలైనంత వివరంగా సమాధానం రాస్తే మంచిది.

పేపర్‌-2
-ఫండమెంటల్స్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ (100 మార్కులు)
1. ఈ పేపర్‌లో అకౌంటింగ్‌ బేసిక్స్‌ అకౌంటింగ్‌ ప్రిన్సిపుల్స్‌, కాన్సెప్ట్స్‌, డిఫరెన్స్‌ బిట్వీన్‌ రెవెన్యూ అండ్‌ క్యాపిటల్‌ ఐటమ్స్‌, డబుల్‌ ఎంట్రీ సిస్టమ్‌ వంటి అంశాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించాలి. ఈ అంశాలు మిగతా అంశాలకు పునాది లాంటివి కాబట్టి నిర్లక్ష్యం చేయరాదు.
2. కన్‌సైన్‌మెంట్‌, బిల్స్‌ ఆఫ్‌ ఎక్సేంజ్‌ వంటి అంశాలు కూడా బాగా సన్నద్ధం కావాలి.
3. ప్రిపరేషన్‌ ఆఫ్‌ ఫైనల్‌ అకౌంట్స్‌ అనే అంశం చాలా ముఖ్యమైనది. పరీక్షలో దీని నుంచి ఒక ప్రశ్న తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉన్నందున ఈ అంశంపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలి.
4. ఫండమెంటల్స్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటింగ్‌లోని కాస్ట్‌ షీట్‌ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. సీఎంఏలోని మిగతా దశల కాస్టింగ్‌కు ఇది పునాది వంటిది.
5. బోర్డ్‌ మెటీరియల్‌లోని అన్ని ప్రశ్నలు, ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్‌ చేయాలి. తర్వాత స్కానర్‌లోని ప్రశ్నలు కూడా సాధన చేయాలి.
6. ప్రతి ప్రశ్నకి వర్కింగ్‌ నోట్స్‌ తప్పనిసరిగా రాయాలి.
7. అకౌంటింగ్‌కు సంబంధించి ప్రతి ప్రశ్న కూడా పేపర్‌ మీద ప్రాక్టీస్‌ చేయాలి. ఇలా ప్రాక్టీస్‌ చేయకుండా లెక్కలను పైపైనే చూసుకొని తీరా పరీక్ష రాసేటప్పుడు తప్పటడుగు వేయకూడదు.

పేపర్‌ -3
-ఫండమెంటల్స్‌ ఆఫ్‌ లాస్‌ అండ్‌ ఎథిక్స్‌ (100 మార్కులు)
1. ఈ పేపర్‌ను రెండు సెక్షన్లుగా విభజించారు.
2. సెక్షన్‌ బి లో 30 మార్కులకు ఎథిక్స్‌ అండ్‌ బిజినెస్‌ అనే అంశాలు ఉంటాయి.
3. సెక్షన్‌ బి చాలా సులువుగా మార్కులు తెచ్చుకోగలిగిన సబ్జెక్టు. బోర్డ్‌ మెటీరియల్‌లోని కాన్సెప్ట్‌ లెంత్‌ పరంగా ఇది చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దీని మీద బాగా ఫోకస్‌ చేయాలి.
4. ఇక సెక్షన్‌ ఎ విషయానికొస్తే ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌, సేల్‌ ఆఫ్‌ గూడ్స్‌ యాక్ట్‌లోని ప్రొవిజన్స్‌ను జాగ్రత్తగా, పర్‌ఫెక్ట్‌గా చదవాలి. పరీక్షలో అడిగే ప్రతి ప్రశ్న కూడా ప్రొవిజన్స్‌తో లింకై ఉంటుంది. కాబట్టి ప్రొవిజన్స్‌ చదవడం తప్పనిసరి.
5. కేస్‌ స్టడీ ప్రశ్నలకి తగిన ప్రొవిజన్స్‌, సెక్షన్‌ నంబర్స్‌, క్లాజెస్‌ రాయటంవల్ల మిగతా విద్యార్థుల కన్నా భిన్నంగా పరీక్ష రాసి మంచి మార్కులు సాధించవచ్చు.
6. ప్రొవిజన్స్‌ గురించి రాసేటప్పుడు మీకు పూర్తి సమాచారం, కచ్చితమైన జవాబు తెలిస్తేనే రాయండి. తప్పుడు ప్రొవిజన్స్‌ రాస్తే అనవసరంగా మార్కులు కోల్పోయే అవకాశం ఉంది.

పేపర్‌-4
-ఫండమెంటల్స్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (100 మార్కులు)
1. సెక్షన్‌ ఎ సిలబస్‌కు సంబంధించి అర్థమెటిక్‌, ఆల్జీబ్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పరీక్షలో వీటి నుంచి దాదాపు 40 మార్కులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలు కూడా విద్యార్థులకు ఇంటర్‌ నుంచే సుపరిచితం కాబట్టి మార్కులు తెచ్చుకోవడం చాలా సులువు.
2. ప్రతి ప్రాబ్లమ్‌ని వీలైనన్ని ఎక్కువసార్లు సాధన చేయాలి. బోర్డు మెటీరియల్‌, స్కానర్‌లోని ప్రశ్నలు, కాంపిటీటివ్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లోని ప్రాబ్లమ్స్‌ కూడా సాధన చేస్తే మంచిది.
3. ఫండమెంటల్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్టాటిస్టిక్స్‌, మెజర్స్‌ ఆఫ్‌ డిస్‌పర్సన్‌, ప్రాబబిలిటీ, మెజర్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ టెండెన్సీ బాగా సాధన చేయాలి.

కొన్ని సాధారణమైన సూచనలు

-సిలబస్‌ పూర్తి అంశాల గురించి అవగాహన కల్పించుకోవాలి. ప్రతి చాప్టర్‌ వెయిటేజీ చూసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెటీరియల్‌లో మొదటి పేజీలో ఈ వెయిటేజీ తాలూకు వివరాలు ఉన్నాయి. సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌వారు క్వశ్చన్‌ పేపర్‌ తయారు చేసేటప్పుడు కచ్చితంగా ఈ వెయిటేజీని అనుసరిస్తారు. ప్రతి విద్యార్థి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ప్రణాళిక తయారు చేసుకునేటప్పుడు ఆ చాప్టర్‌కు గల వెయిటేజీని పరిగణనలోకి తీసుకోవాలి.
-ప్రతి విద్యార్థి గడిచిన రెండు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కూలంకషంగా విశ్లేషించుకోవాలి. ప్రతి పరీక్షలో ఏ విధమైన ప్రశ్నలను అడుగుతున్నది విశ్లేషించుకుని అలా సన్నద్ధం కావాలి. ఈ విధంగా చేయడంవల్ల పరీక్ష పత్రాల తారుమారులను ముందుగానే విశ్లేషించుకోవచ్చు.
-స్కానర్‌ (ఇంతకుముందు పరీక్షల ప్రశ్నపత్రాలు)ని విశ్లేషించుకోడానికి తగిన సమయాన్ని కేటాయించాలి.
-ఆర్‌టీపీ (రివిజన్‌ టెస్ట్‌ పేపపర్‌) 2 అటెంప్ట్స్‌, ఎంటీపీ (మోడల్‌ టెస్ట్‌ పేపర్‌) 3 అటెంప్ట్స్‌, వర్క్‌బుక్‌ తప్పకుండా పునశ్చరణ చేసుకోవాలి. కచ్చితంగా ఇలా చేస్తే కనీసం 60 శాతం మార్కులు పొందవచ్చు (వీటిని ఇన్‌స్టిట్యూట్‌ వెబ్‌సైట్‌ www.icmai.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు).
-మీ సన్నద్ధత సమయంలో తప్పక ప్రతి అంశానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. అన్ని అంశాలు పునశ్చరణ సమయంలో చేయగలిగారా లేదో చూసుకోవాలి.
-డిసెంబర్‌ 2019 పరీక్షలకు సంబంధించి సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు సీఎంఏ ఫౌండేషన్‌ సబ్జెక్టులకు సంబంధించి అదనపు స్టడీ మెటీరియల్‌ (సప్లమెంటరీ మెటీరియల్‌)ను కొత్తగా విడుదల చేశారు. విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడం కోసం ఈ స్టడీ మెటీరియల్‌ను తప్పకుండా చదవాలి.

గమనిక
-సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షలు రాయబోయే విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షకు ముందు సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌వారి మెటీరియల్‌ ప్రశ్నలు, వర్క్‌బుక్‌, గత మూడు పరీక్షల ఆర్‌టీపీ, ఎంటీపీలను కనీసం ఒక్కసారైనా చదివితే మంచిది.
-వర్క్‌బుక్‌లోని కాన్సెప్ట్స్‌ను తప్పకుండా చదవాలి.
-పరీక్షలకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉంటే [email protected]కు ఈ-మెయిల్‌ చేసి నివృత్తి చేసుకోవాలి.
Prakash

నిజాయితీగా కష్టపడాలి


గోనబోయిన సందీప్‌
-ఇంటర్‌ ఎంఈసీ, సీఏ కోర్సులకు మాస్టర్‌ మైండ్స్‌లో జాయిన్‌ అయ్యాను. ఇంటర్‌ ఎంఈసీలో 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించాను. ఇంటర్‌ ఎంఈసీతోపాటు సీఏ సీపీటీ కూడా ఏకకాలంలో పూర్తిచేశాను. ఇంటర్‌ చదువుతున్నప్పుడే మాస్టర్‌ మైండ్స్‌ వారు ఇంటర్‌తో పాటు సీఏ, సీఎంఏ కోర్సులు కూడా చదవవచ్చని చెప్పారు. దీంతో సీఎంఏకి నమోదు చేయించుకున్నాను. ఇంటర్‌తో పాటు సీఎంఏ ఫౌండేషన్‌ కూడా సమాంతరంగా చదివి సీఎంఏ ఫౌండేషన్‌లో దేశంలోనే అత్యుత్తమ మార్కులైన 364 మార్కులు సాధించాను. నేను ఈ విజయం సాధించడంపట్ల మా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.
-సీఏ, సీఎంఏ కోర్సులు చాలా కష్టంగా ఉంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే మనం కోచింగ్‌ తీసుకున్న విద్యాసంస్థ అకడమిక్‌ ప్రణాళికతోపాటుగా సీఏ, సీఎంఏ కోర్సులోని సిలబస్‌ను 100 శాతం మనం చదివితే ఇన్‌స్టిట్యూట్‌వారు నిర్వహించే ఫైనల్‌ పరీక్షలను చాలా సునాయాసంగా రాయవచ్చు. మనం నిజాయితీగా కష్టపడితే సీఎంఏ పరీక్షలు ఏమంత కష్టం కాదు. ప్రణాళిక ప్రకారం చదవకపోతే ఇన్‌స్టిట్యూట్‌వారు పరీక్షల్లో అడిగే చాలా సులువైన ప్రశ్నలకు కూడా మనం సమాధానం రాయలేం. మనం చదివేదాన్ని బేస్‌ చేసుకునే పరీక్షల్లో ఫలితం అధారపడి ఉంటుంది.
-నేను చదివినంతసేపు పూర్తి ఆసక్తితో, ఏకాగ్రతతో చదివాను. ఏ టైమ్‌లో ఏం చదవాలని ప్రణాళిక వేసుకుని దానికి పూర్తిగా కట్టుబడేవాడిని. ఏదేమైనా ఆ ప్రణాళిక నుంచి డైవర్ట్‌ అయ్యేవాడిని కాదు. నా ప్రణాళిక నా విజయానికి కారణమని నేను నమ్ముతున్నాను.
-సీఎంఏ చదవాలనుకునేవారు ముందుగా సీఏకి కోచింగ్‌ తీసుకుంటే సీఎంఏ చాలా సులభంగా పూర్తిచేయవచ్చు.
-సీఎంఏ పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఏయే టాపిక్స్‌ ఎక్కువగా కవర్‌ చేస్తున్నారనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
-సిలబస్‌ వెయిటేజీ గమనించి సన్నద్ధమవ్వాలి.
-సీఎంఏ పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు సిలబస్‌ మొత్తం చదవడం పూర్తయ్యాక పరీక్ష ముందు రోజు ఆ సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి సిలబస్‌ను రివైజ్‌ చేసుకోవాలి. పరీక్ష ముందు రోజు రివిజన్‌ చేసుకోవడంవల్ల పరీక్షను మరింత పర్‌ఫెక్టుగా రాయవచ్చు.
-పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ఏదైనా ఒక పుస్తకానికే పరిమితం కావాలి. రెండు మూడు పుస్తకాలు చదవడంవల్ల కన్‌ఫ్యూజ్‌ అవడంతోపాటు టెన్షన్‌ పడతారు. ఒక పుస్తకానికే పరిమితం కావడంవల్ల రివిజన్‌ కూడా ఈజీగా చేయవచ్చు. పరీక్షల్లో సమాధానం కూడా మనకు త్వరగా గుర్తుకు వస్తుంది.
-సన్నద్ధత సమయంలో ఎప్పుడు కూడా చాయిస్‌ బేస్డ్‌ ప్రిపరేషన్‌ చేయవద్దు. అన్ని ప్రశ్నలు చదివితేనే ఉపయుక్తంగా ఉంటుంది. మనం 50 శాతం పర్‌ఫెక్టుగా చదివి 100 శాతం మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టం. అదే 100 శాతం చదివి 50 శాతం మార్కులు తెచ్చుకోవడం చాలా తేలిక.
-పరీక్ష రాసేటప్పుడు కూడా ప్రశ్నలన్నీ చదివి ఏ ప్రశ్నకు ఎంత సమయం పడుతుందనేది బేరీజు వేసుకుని సమాధానాలు రాయడం మొదలుపెట్టాలి. ఒక్కోసారి పెద్దపెద్ద సమాధానాలు ఉంటే ప్రశ్నలకు తక్కువ మార్కులు, చిన్న సమాధానం ఉన్న ఎక్కువగా మార్కులు వచ్చే ప్రశ్నలు కూడా పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి పరీక్షల్లో మనం ఎంచుకునే ప్రశ్నను బట్టి మనం వినియోగించుకునే సమయం ఆధారపడి ఉంటుందనేది మరిచిపోకూడదు.
-సీఏ, సీఎంఏ వంటి కోర్సులు చదవాలనుకునేవారికి నాలెడ్జ్‌ బాగా లేకపోయినాకష్టపడే తత్వం, నిబద్ధత ఉంటే ఈ కోర్సుల్లో చక్కగా రాణించవచ్చు.
-ప్రణాళిక ప్రకారం చదివగలిగే ఓపిక ఉండాలి.
-ఈ కోర్సుపై ఇష్టం ఉండాలి.

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles