తెలుగులో పదికి 10!


Mon,November 25, 2019 01:10 AM

పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమవడానికి సమయం తక్కువగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా చదివితే పదికి 10 పాయింట్లు సాధించవచ్చు. సాధారణ విద్యార్థులు కూడా అత్యధిక గ్రేడ్‌ పాయింట్లు పొందవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వాటిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. సుమారు మూడు నెలల సమయం ఉన్నందున పాఠ్యాంశాలను విభజించుకుని చదువుకోవాలి.


NemmaniSridevi

-మొత్తం 12 పాఠ్యాంశాలు, ఉపవాచకంలో రామాయణం ఉన్నాయి. నెలకు నాలుగు పాఠాలు చదువుకుంటే సరిపోతుంది. రామాయణాన్ని నెలకు 1, 2 కాండలు చదవచ్చు. మనం చదవగలిగే స్థాయిని, పాఠం నిడివిని బట్టి నాలుగు, ఐదు రోజులు కేటాయించుకోవచ్చు.
-మనకున్న 12 పాఠాల్లో 1 నుంచి 6 పాఠాల్లో ఎఫ్‌ఏ-1, 2, ఎస్‌ఏఐలో ప్రశ్నలు అడిగారు. కాబట్టి ఎంతోకొంత చదివే ఉంటారు.
-డిసెంబర్‌లో 7 నుంచి 10 పాఠాలు, రామాయణంలో అరణ్య, కిష్కింద కాండలు చదవచ్చు. దీనివల్ల సమయం కలిసివస్తుంది. ఎఫ్‌ఏ-3కి ఉపయోగపడుతుంది.
-జనవరి నెలలో మొదటి రెండు వారాలు 11, 12 పాఠాలు, రామాయణంలోని సుందర, యుద్ధ కాండలు చదవచ్చు.
-మూడు, నాలుగు వారాల్లో దానశీలం, ఎవరి భాష వారికి వినసొంపు పాఠాలు చదవాలి.
-ఫిబ్రవరిలో 3 నుంచి 6 పాఠాలు, రామాయణంలో బాల, అయోధ్య కాండలు చదవాలి. 1 నుంచి 6 పాఠాలను గతంలో ఎస్‌ఏకు చదివారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోదు.
-ఇలా విభజించుకుంటే ఎఫ్‌ఏ-3, 4, ప్రీ ఫైనల్‌, వార్షిక పరీక్షలు అన్నింటికి పనికివస్తుంది.
-పాఠం పేరు, చదవండి, ఆలోచించండి దగ్గరి నుంచి చదవాలి.
-పాఠంలో బాక్స్‌లో ఉండే ప్రశ్నలకు కూడా సమాధానాలు నేర్చుకోవాలి.
-పాఠం చదివాక ‘ఇవి చేయండి’ ఒక్కొక్కటి చదవాలి. వాటిలో I అవగాహన-ప్రతిస్పందనలో ఉన్న ప్రశ్నల్లాంటివి పేపర్‌-1లో అడగవచ్చు. పాఠం చదివాక వాటికి సమాధానాలు చేయగలుగుతున్నామా లేదా అనేవి చూసుకోవాలి.
-దీనిలో ఒక పేరాగ్రాఫ్‌ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. దాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి.
-ఇవి పేపర్‌-2లో వస్తాయి. వీటిని ఉన్నవి ఉన్నట్లు పరీక్షలో ఇవ్వరు కానీ ఇవి చదివితే పరీక్షలో సులువవుతుంది.
-పద్యం పూరించడం, ప్రతిపదార్థం పేపర్‌-2లో వస్తాయి. కాబట్టి పువ్వు గుర్తు ఉన్న పద్యాలన్నీ చదవాలి.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

-ప్రతి పాఠంలోనూ ఈ ప్రశ్నలు ఉంటాయి. ఐదేసి వాక్యాల్లో రాయండి అన్నవి 3 మార్కులకు, 10 వాక్యాల్లో రాయండి అన్నవి 6 మార్కులకు వస్తాయి.
-వ్యక్తీకరణ, సృజనాత్మకతలోని ప్రశ్నలు అన్నికోణాల్లోంచి చదవాలి. ప్రశ్నపత్రంలో పేపర్‌-1లో 3 మార్కుల ప్రశ్నలు 4 ఇస్తారు. అన్నిటికి సమాధానాలు రాయాలి.
-కవి లేదా రచయిత పరిచయం నుంచి ఒక ప్రశ్న తప్పక ఉంటుంది. అందువల్ల అన్ని పరిచయాలు చదవాలి.
-కవి ఉద్దేశం ఏమిటి మొదలైన ప్రశ్నలు ఉంటాయి. పాఠం చదివితే ఇవి చాలా సులువుగా ఉంటాయి.
-పాఠంలో బాక్స్‌లో ఉన్న ప్రశ్నల నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి అవి కూడా చదవాలి.
-శతక మధురిమలోని పద్యభావాల ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-వ్యక్తీకరణ సృజనాత్మకతలోనే సృజనాత్మకంగా రాయండి లేదా ప్రశంసాత్మకంగా రాయండి అనే ప్రశ్నలు ఉంటాయి. ఇవి పేపర్‌-2లో 5 మార్కులకు ఇస్తారు.
-పాఠం చదివేటప్పుడు 1, 2 పేపర్లకు ప్రిపేరవ్వాలి. దానివల్ల సమయం కలిసి వస్తుంది.
-మొదటి పేపర్‌లో పద్యభాగంలోని ప్రశ్నలకు సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి లాంటివి అడుగుతారు.
-వ్యక్తీకరణ సృజనాత్మకతలోనే సృజనాత్మకంగా రాయండి లేదా ప్రశంసాత్మకంగా రాయండి అనేవి పేపర్‌-2లో వస్తాయి. పాఠం చదివేటప్పుడు పేపర్‌-1, 2లకు ప్రిపేరవ్వాలి.

III భాషాంశాలు

-పదజాలం-I పేపర్‌లో వస్తాయి.వ్యాకరణాంశాలు-II పేపర్‌లో వస్తాయి.

పదజాలం

-ప్రతి పాదం వెనుక ఉన్న పదజాలం అభ్యసనం చేయాలి.
-పేపర్‌-I పార్ట్‌-బిలో రెండు సొంతవాక్యాలు వస్తాయి. ఒక్కోదానికి ఒక్కో మార్క్‌.
-మిగిలినవి బహుళైచ్చిక ప్రశ్నలు 1/2 మార్కు ఉంటుంది.
-పదజాలం మీ ఫెయిర్‌నోట్స్‌లోనివి చదువుకుని చూడకుండా పాఠ్యపుస్తకంలో పెన్సిల్‌తో రాసుకుని సరిచూసుకోవాలి.
-సొంతవాక్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతులు, వ్యుత్పత్తర్థాలు ప్రతి పాఠం చివర ఉన్నవి చదివి అభ్యాసం చేయాలి.
-అన్ని పాఠ్యాలు చదివాక పుస్తకం చివర ‘పదవిజ్ఞానం’ అని ఉంటుంది. 166-171 పేజీ వరకు చదువుకుంటే 8/8 మార్కులు సాధించవచ్చు.

వ్యాకరణాంశాలు

-ఒక్కో పాఠానికి ఒక్కో వ్యాకరణాంశం అభ్యాసంగా ఇచ్చారు. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది.
-వీటిని సంపూర్ణంగా నేర్చుకోవాలి. ఏదైనా సందేహం వస్తే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి.

సంధులు

-సవర్ణ, గుణ, యుణాదేశ, వృద్ధి, త్రిక, రుగాగమ, అత్వ, ఇత్వ, ఉత్వ సంధుల సూత్రాలను తెలుసుకుని అభ్యాసం చేయాలి.
-ఒక్కో పాఠానికి 2, 3 సంధులు వ్యాకరణాంశంలో ఇచ్చారు. ఇవి ఇంతకుముందే భిన్న తరగతుల్లో నేర్చుకుని ఉన్నారు. కాబట్టి పెద్ద కష్టమేమీ కాదు.

సమాసాలు

-తత్పురుష సమాసాలు రావాలంటే విభక్తి ప్రత్యయాలు రావాలి. విభక్తి ప్రత్యయాలు ఒకసారి చదవుకుని సమాసాలు అభ్యసనం చేయాలి.
-ప్రతి పాఠం చివర ఇచ్చిన 2, 3 సమాసాలు చదివితే చాలు.
-మొత్తం రివిజన్‌ అయిపోయేసరికి తత్పురుష సమాసాలు, విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, రూపక, సంభావనా పూర్వపద, బహువ్రీహి, ద్వంద్వ, ద్విగు సమాసాలు వచ్చి ఉండాలి.
-సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, కర్తరీ, కర్మణీ, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు, వ్యవహారిక భాషలోకి మార్చడం వంటివి పాఠం చివర పరిచయం చేశారు. అవి తప్పక నేర్చుకోవాలి.
-అలంకారాలు కూడా కింది తరగతుల్లో నేర్చుకున్నారు. ఒకవేళ నేర్చుకోకపోయినా ఆందోళన పడకుండా పాఠం చివర ఇచ్చిన అలంకారాలు చదువుకుని సందేహాలు ఉంటే ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి.
-అలంకారాలు సరిగా అర్థం కాకపోతే అన్ని ఒకే విధంగా అనిపించి పరీక్షలో ఏదో ఒక సమాచారం పెడతారు.
-రెండో పేపర్‌లోనే అత్యధిక మార్కులు సాధించవచ్చు.
-రెండో పేపర్‌లో మిగిలిన విషయాలకు వస్తే..
-మొదట పరిచిత గద్యం-రామాయణం నుంచి ఇచ్చి ఐదు ప్రశ్నలు ఇస్తారు (1-5 ప్రశ్నలు) వీటికి అందులోనే సమాధానాలు ఉంటాయి. జాగ్రత్తగా చదివి రాయాలి.
-రెండోది అపరిచిత గద్యాలు పాఠ్యపుస్తకంలో అవగాహన ప్రతిస్పందన చేస్తే ఇవి సులువు. (6-10 ప్రశ్నలు)
-ఒక పేరా ఇస్తే చదివి 5 ప్రశ్నలు తయారు చేయాలి లేదా పట్టిక ఇస్తే చదివి 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి లేదా కీలక పదాలు గుర్తించడం, ఖాళీలను పూరించడం లాంటివి ఇస్తారు. 5 మార్కులకు 5 మార్కులు సాధించవచ్చు.
-11వ ప్రశ్న పద్యాన్ని పూరించి భావాన్ని రాయడం లేదా పద్యం ఇస్తే ప్రతిపదార్థం రాయడం. దాదాపు వాటికి చాయిస్‌ ఉండదు. పువ్వు గుర్తు ఉన్న పద్యాల్లోంచి మాత్రమే ఇస్తారు.
-ఒక అపరిచిత పద్యం ఇచ్చి 5 ప్రశ్నలు ఇస్తారు. (12-16 ప్రశ్నలు). అర్థాలు, మకుటం, శతకకర్త, ఏ శతకంలోనిది, శీర్షిక పెట్టండి వంటివి అడుగుతారు. పద్యం భావంపై కూడా ప్రశ్నలు ఉంటాయి.
-చివరగా 3 ప్రశ్నలు ఇచ్చి రెండింటికి జవాబులు రాయమంటారు. వాటికి ఒక్కదానికి 5 మార్కులు.
-ఇవి కూడా పాఠ్యపుస్తకంలో చదివిన సృజనాత్మకత, ప్రశంస ఆధారంగానే ఉంటాయి.
-బిట్‌ పేపర్‌లో ఏ, బీ, సీ, డీలు స్పష్టంగా గుర్తించాలి. ఒకవేళ తప్పనిపిస్తే కొట్టివేసి రాయాలే తప్ప దాన్నే దిద్దకూడదు.
-ఏదో ఒక సమాధానాన్నే గుర్తించాలి. కానీ రెండు గుర్తించకూడదు. ముందుగా ప్రశ్నను బాగా చదవాలి.

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles