నీట్ - 2020


Wed,November 20, 2019 12:10 AM

నీట్.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష నీట్. 2020 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల కోసం ఎన్‌టీఏ నీట్‌ను మే 3న నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రకటన విడుదలైంది. దరఖాస్తులు డిసెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ గురించి సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..
NEET2020


నీట్: దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఎంట్రెన్స్‌లో వచ్చిన ర్యాంక్‌నే ప్రాతిపదికగా తీసుకుంటారు . జాతీయస్థాయిలో 154 పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది నుంచి జిప్‌మర్, ఎయిమ్స్‌లలో ప్రవేశాలు కూడా నీట్ స్కోర్‌తోనే చేస్తారని కేంద్రం ప్రకటించింది.

ఏయే కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు?


ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీవీఎస్సీ&ఏహెచ్. విదేశాల్లో వైద్యవిద్య చదువాలన్నా నీట్‌లో అర్హత సాధించాలి.

సీట్ల వివరాలు: ఎంసీఐ ప్రకారం 529 కాలేజీల్లో 75,893 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. డీసీఐ ప్రకారం 313 దంతవైద్య కాలేజీల్లో 26,693 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎయిమ్స్‌లలో 1205, జిప్‌మర్‌లో 200 సీట్లు ఉన్నాయి. వీటి సంఖ్య ఈ ఏడాది పెరగవచ్చు/తగ్గవచ్చు.
-దీనిలో 15 శాతం ఆల్ ఇండియా కోటా, మిగిలిన 85 శాతం సీట్లు రాష్ట్రస్థాయి కోటాలో భర్తీ చేస్తారు. డీమ్డ్, సెంట్రల్, ఈఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీలలో 100 శాతం సీట్లను నీట్ స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తారు.

ఎవరు ఈ పరీక్ష రాయవచ్చు?

-ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నియమ నిబంధనల ప్రకారం 2019, డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
-ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా చదివి ఉత్తీర్ణులైనవారు లేదా 2020 మార్చిలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు కూడా పరీక్ష రాయడానికి అర్హులు. జనరల్ అభ్యర్థులు ఇంటర్ 50 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులు 40 శాతం, పీహెచ్‌సీలు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

పరీక్ష విధానం:

-పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. పరీక్ష పెన్ అండ్ పేపర్/ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
-మొత్తం 180 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు. 720 మార్కులు. వీటిలో ఫిజిక్స్-45, కెమిస్ట్రీ-45, బయాలజీ-90 ప్రశ్నలు.
-ఫిజిక్స్ 45 ప్రశ్నలకు 4 చొప్పున 180 మార్కులు.
-కెమిస్ట్రీ 45 ప్రశ్నలకు 4 చొప్పున 180 మార్కులు.
-బయాలజీ 90 ప్రశ్నలకు 4 చొప్పున 360 మార్కులు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒకమార్కు కోత విధిస్తారు.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాషల్లో కూడా ఇస్తారు.

నోట్: నీట్ పరీక్షకు డ్రెస్ కోడ్ ఉంటుంది. గతేడాది ఎన్‌టీఏ ప్రకటించిన డ్రెస్ కోడ్ ప్రకారం.. హాఫ్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్ అనుమతించరు. కస్టమరీ/కల్చరల్ డ్రెస్‌తో పరీక్ష కేంద్రానికి రావాలి. స్లిప్పర్స్, శాండల్స్, లోహీల్స్ అనుమతిస్తారు. షూతో పరీక్షకు అనుమతించరు. అదేవిధంగా నగలు, తాయెత్తులు, వాటర్ బాటిల్స్, బెల్ట్, క్యాప్, వాచీలు తదితర ఏ వస్తువును పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

గతేడాది పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు:

-దేశవ్యాప్తంగా గతేడాది నీట్‌కు 15,19,375 మంది దరఖాస్తు చేసుకుంటే 14,10,754 మంది పరీక్ష రాశారు.
-ఎయిమ్స్, జిప్‌మర్ ప్రవేశాలు సైతం నీట్ స్కోర్ ద్వారా చేస్తుడటం వల్ల ఈసారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యతేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 2 నుంచి ప్రారంభం
చివరితేదీ: 2019, డిసెంబర్ 31
అడ్మిట్ కార్డు డౌన్‌లోడింగ్: 2020,మార్చి 27 నుంచి
పరీక్ష తేదీ: 2020, మే 3
ఫలితాల వెల్లడి: 2020, జూన్ 4
వెబ్‌సైట్: https://ntaneet.nic.in


-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

447
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles