నోబెల్ అవార్డ్స్


Mon,October 21, 2019 12:40 AM

ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం నోబెల్. విశ్వ మానవాళికి ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణలు, వివిధ రంగాల్లో విశేష కృషిచేసినవారికి ఈ బహుమతిని ప్రతి యేటా ప్రకటిస్తారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం 1901లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రదానం ఇప్పటికీ కొనసాగుతున్నది. తొలినాళ్లలో ఐదు రంగాల్లోనే నోబెల్‌ను అందించేవారు. సరిగ్గా 58 ఏండ్ల అనంతరం నోబెల్ గౌరవార్థం ఆర్థికరంగంలో కృషిచేసినవారికి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందించడం స్విస్ బ్యాంకు ప్రారంభించింది. ఈ ఏడాది ప్రకటించిన విజేతలు, ఆయా రంగాల్లో వారి సేవల వివరాలు నిపుణ పాఠకుల కోసం...
nobel-prize
-భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్యం, వైద్య, ఆర్థిక రంగాల్లో, ప్రపంచ శాంతికి విశేష కృషి చేసినవారికి, తమ పరిశోధనల ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి మానవ సమాజానికి ఉపయోగపడిన శాస్త్రవేత్తలు, వ్యక్తులకు ప్రతి యేటా నోబెల్ బహుమతులు అందిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన ఐదేండ్ల తర్వాత అంటే 1901లో ఈ అవార్డుల బహూకరణ ప్రారంభమైంది. 1969 వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, మెడిసిన్, శాంతి రంగాల్లో మాత్రమే స్వీడిష్ అకాడమీ అవార్డులు ప్రకటించేది. అయితే నోబెల్ గౌరవార్థం 1969 నుంచి అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినవారికి బ్యాంక్ స్వీడన్ నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నది. నోబెల్ బహుమతి స్థాపకుడు, ప్రఖ్యాత సైంటిస్ట్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. నోబెల్ ఫౌండేషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ల తుది జాబితాలో ఎవరెవరున్నారనే వివరాలను 50 ఏండ్ల వరకు వెల్లడించకూడదు.
-ప్రతి ఏడాది నోబెల్ బహుమతులు అక్టోబర్ మొదటి సోమవారం నుంచి మళ్లీ సోమవారం వరకు (శని, ఆదివారాలు మినహా) రోజుకు ఒకటి చొప్పున ఆరు రంగాల్లో ఎంపికైన వారిని అవార్డు విజేతలుగా ప్రకటిస్తారు. అంటే సోమవారం వైద్యం (2019, అక్టోబర్ 7), మంగళవారం ఫిజిక్స్ (అక్టోబర్ 8), బుధవారం కెమిస్ట్రీ (అక్టోబర్ 9), గురువారం సాహిత్యం (అక్టోబర్ 10), శుక్రవారం శాంతి బహుమతి (అక్టోబర్ 11), సోమవారం అర్థశాస్త్రం (అక్టోబర్ 14)లలో నోబెల్‌కు ఎంపికైన వారిని ప్రకటించారు.


వైద్యరంగంలో..

-జీవకణాలు ఆక్సిజన్‌ను ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయనే అంశం (హైపోక్సియా)పై పరిశోధన చేసిన విలియమ్ జీ కెలిన్ జూనియర్, సర్ పీటర్ జే రాట్‌క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెన్జాలకు నోబెల్ పురస్కారం లభించింది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయనే విషయంపై వీరు పరిశోధనలు చేశారు. ఇవి రక్తహీనత, క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి.
-విలియమ్ కెలిన్ హార్వర్డ్ హ్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో, గ్రెగ్ సెమెన్జా జాన్ హాప్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెల్ ఇంజినీరింగ్‌లో పరిశోధకులుగా, పీటర్ రాట్‌క్లిఫ్ ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు. వీరికి సంయుక్తగా 9.18 లక్షల అమెరికన్ డాలర్ల (రూ. 6.51 కోట్లు) నగదు బహుమతిని అందిస్తారు.
-గతేడాది వైద్యరంగంలో జేమ్స్ పీ అలిసన్ (అమెరికా), తసుకు హోంజో (జపాన్)లు నోబెల్ అందుకున్నారు.

ఫిజిక్స్

-విశ్వ పరిణామక్రమంపై పరిశోధనలు చేసిన జేమ్స్ పీబుల్స్, సుదూరంగా ఉన్న సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని కనిపెట్టిన మిచెల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది.
-కెనడాలో జన్మించిన అమెరికన్ పీబుల్స్ మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఎలా రూపాంతరం చెందింది, విశ్వంలో భూమి స్థానం గురించి పరిశోధనలు చేశారు. బిగ్‌బ్యాంగ్ తర్వాత వెలువడిన ఉష్ణమైన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్ (సీఎంబీ) రేడియేషన్ ఉనికి నిజమేనని తేల్చారు. సీఎంబీని అధ్యయనం చేయడంద్వారా విశ్వం వయస్సు, ఆకృతి, విశ్వంలోని వస్తువులను శాస్త్రవేత్తలు అంచనావేయగలుగుతున్నారు.
-84 ఏండ్ల పీబుల్స్ ప్రస్తుతం న్యూజెర్సీ (అమెరికా)లోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో సేవలందిస్తున్నారు.
- రేడియల్ వెలాసిటీ టెక్నిక్‌తో భూమికి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం చుట్టూ 51 పెగాసి బి అనే గ్రహం తిరుగుతున్నదని స్విట్జర్లాండ్‌కు చెందిన మిచెల్ మేయర్, క్యులోజ్‌లు 1995లో కనుగొన్నారు. ప్రస్తుతం వీరిద్దరు స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
-2018లో లేజర్ ఫిజిక్స్ రంగంలో ఆవిష్కరణలకు ఆర్థర్ అస్కిన్ (అమెరికా), గెరార్డ్ మౌరౌ (ఫ్రాన్స్), డోనా స్ట్రిక్ లాండ్ (కెనడా)లు నోబెల్ అందుకున్నారు.

కెమిస్ట్రీ

-మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాహనాల్లో విరివిగా ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీల అభివృద్ధికి కృషిచేసిన జాన్ బీ గుడ్‌ఎనఫ్, ఎం స్టాన్లీ విటింగ్‌హామ్, అకీరా యోషినోలకు రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది.
-బ్రిటన్‌కు చెందిన 77 ఏండ్ల స్టాన్లీ విటింగ్‌హామ్ అధిక శక్తినిచ్చే టైటానియం డైసల్ఫైడ్ అనే మెటీరియల్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని బింగాంప్టన్ వర్సిటీలో పనిచేస్తున్నారు.
-జర్మనీలో పుట్టిన అమెరికన్ జాన్ బీ గుడ్‌ఎనఫ్‌కు ప్రస్తుతం 97 ఏండ్లు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నోబెల్ పురస్కార చరిత్రలో అత్యధిక వయస్సులో ఈ అవార్డుకు ఎంపికైన వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. ఆయన రూపొందించిన క్యాథోడ్‌ను ప్రాతిపదికగా చేసుకుని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త అకీరా యోషినో వాణిజ్యపరంగా అనువైన తొలి లిథియం-అయాన్ బ్యాటరీని రూపొందించారు. అకీరా ప్రస్తుతం మీజో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.
-గతేడాది రసాయన శాస్త్రంలో ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ పీ స్మిత్ (అమెరికా), గ్రెగరీ వింటర్ (బ్రిటన్)లకు నోబెల్ లభించింది.

సాహిత్యం

-సాహిత్యంలో 2018, 19కి సంబంధించిన పురస్కారాలను నోబెల్ కమిటీ ప్రకటించింది. 2018కి గాను పోలెండ్ రచయిత్రి ఓల్గా టోకార్కుజుక్, 2019కిగాను ఆస్ట్రియాకు చెందిన నవల, నాటక రచయిత పీటర్ హండ్కేకి లభించింది.
-సరిహద్దులు దాటడం జీవితంలో ఒక భాగం అని చెబుతూ ప్రముఖ పర్యావరణవేత్త, స్త్రీవాది, నవలా రచయిత్రి ఓల్గా టోకార్కుజుక్ రాసిన ఒక కల్పిత కథనమైన ద బుక్స్ ఆఫ్ జాకోబ్ అనే నవల ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యింది. పోలిష్ భాషలో రాసే ఓల్గా 1962, జనవరి 29 పోలెండ్‌లోని వెస్ట్రన్ టౌన్‌లో జన్మించారు. ఆమె మొదటి నవల ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్ కాగా, ైఫ్లెట్స్, ద బుక్స్ ఆఫ్ జాకోబ్ వంటి పుస్తకాలు రాశారు.
-ఇప్పటివరకు 14 మంది మహిళలు మాత్రమే నోబెల్ అందుకున్నారు. ఓల్గా 15వ మహిళ కావడం విశేషం.
-నాటక రచయిత, నవలాకారుడు అయిన పీటర్ హండ్కే పూర్తి స్వచ్ఛమైన జర్మన్ భాషా రచయితల్లో ఒకరు. ఆయన 1942, డిసెంబర్ 6న ఆస్ట్రియాలో జన్మించారు. 1966లో ద హార్నెట్ అనే నవలతో ఆయన సంచలనం సృష్టించారు. తన తల్లి ఆత్మహత్యపై ఆయన రాసిన ఏ సారో బియాండ్ డ్రీమ్స్ అనే రచన అత్యంత ప్రజాదరణ పొందింది. దీన్ని 1971లో రాయగా, 1975లో వెలువడింది. ఆయన రాసిన సంభాషణలు లేని నాటకం ద అవర్ వియ్ న్యూ నథింగ్ ఆఫ్ ఈచ్ అదర్ ప్రసిద్ధి చెందగా, కవితా సంకలనం అయిన షార్ట్ లెటర్, లాంగ్ ఫేర్‌వెల్, ద ఇన్నర్‌వరల్డ్ ఆఫ్ ద ఔటర్ వరల్డ్ ఆయన ప్రముఖ రచనలు.
-లైంగిక దాడి ఆరోపణలతో గతేడాది సాహిత్యంలో నోబెల్ ప్రకటించలేదు. ప్రపంచ యుద్ధాల సమయంలో ఆరేండ్లు మినహాయించి ఈ పురస్కారాన్ని 1901 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు (1935, 2018లో) మాత్రమే ప్రకటించలేదు.

శాంతి

-శాంతిస్థాపనకు, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు కృషిచేసిన ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఇథియోపియా, ఎరిత్రియా దేశాల మధ్య 20 ఏండ్లుగా నలుగుతున్న సరిహద్దు సమస్యకు 2018లో ఆయన ముగింపు పలికారు. ఇరు దేశాల మధ్య సమస్యగా మారిన బాడ్మే పట్టణం కోసం ఇరు దేశాలు 1998 నుంచి రెండేండ్లపాటు యుద్ధానికి దిగాయి. అయితే 2018, ఏప్రిల్‌లో ఇథియోపియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అబే అహ్మద్ ఎలాంటి షరతులు లేకుండా ఎరిత్రియాతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం 43 ఏండ్ల వయస్సులో ఉన్న ఆయన 1976, ఆగస్టు 15న అగరోలో జన్మించారు. ఆఫ్రికాలో అత్యంత పిన్నయస్సు ఉన్న దేశాధినేతగా రికార్డుల్లోకెక్కారు.
-టెక్నాలజీపై మక్కువతో టీనేజ్‌లోనే మిలిటరీలో రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించిన ఆయన లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు.
-ఈ పురస్కారం కింద ఆయనకు నోబెల్ మెడల్‌తోపాటు నోబెల్ డిప్లొమా, 90 లక్షల క్రోనార్ల (సుమారు రూ. 6.48 కోట్లు) నగదు బహుమతి లభిస్తాయి. ఈ ఏడాది శాంతి పురస్కారానికి 223 మందితోపాటు 78 సంస్థలు ఎంపికయ్యాయి.
-గతేడాది డెనిస్ ముక్వేజ్ (డెమొక్రటిక్ కాంగో), నదియా మురాద్ (ఇరాన్)లు శాంతి బహుమతి అందుకున్నారు.
-1901 నుంచి ఇప్పటివరకు 100 నోబెల్ శాంతి పురస్కారాలను ప్రకటించారు. ఇందులో 24 సంస్థలు పురస్కారానికి ఎంపికయ్యాయి. ఒక్కరు మాత్రమే దీన్ని తిరస్కరించారు.
-ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతి అందుకున్నవారిలో మదర్ థెరిస్సాతోపాటు 17 మంది మహిళలు ఉన్నారు. 1973లో ఈ అవార్డుకు ఎంపికైన వియాత్నాంకు చెందిన లె డ్యుక్ థో తిరస్కరించారు.
-మొత్తంగా నోబెల్ శాంతి అవార్డులను ఆరుగురు నిరాకరించగా, 54 మంది మహిళలకు ఈ అత్యున్న పురస్కారం లభించింది.

నోబెల్‌తో కోల్‌కతాకు అనుబంధం!

-నోబెల్ అందుకున్న భారతీయులు, భారత సంతతికి చెందినవారిలో ఆరుగురు కోల్‌కతాతో ఏదో విధంగా సంబంధం ఉన్నవారే.
-తొలి నోబెల్ అందుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ సాహిత్యానికి పునర్‌నిర్వచనం చేశారు. కోల్‌కతాలో శాంతినికేతన్‌ను స్థాపించారు.
-భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న సీవీ రామన్ మద్రాస్‌లో జన్మించినప్పటకీ కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
-1979లో శాంతి బహుమతి అందుకున్న మదర్ థెరిసా కోల్‌కతాలో చారిటీ మిషనరీలను నెలకొల్పారు.
-సంక్షేమ అర్థశాస్త్రంతో నోబెల్ అందుకున్న ఆర్థికవేత్త అమర్త్యసేన్ శాంతినికేతన్‌లో జన్మించారు. ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యనభ్యసించారు.
-ఈ ఏడాది నోబెల్ పొందిన అభిజిత్ బెనర్జీ కూడా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చదడంతోపాటు కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడుస్తున్న బంధన్ బ్యాంక్‌తో కలిసి పనిచేశారు.
-భారతీయుడు కానప్పటికీ మలేరియాపై జరిపిన పరిశోధనలకుగాను రోనాల్డ్ రాస్ 1902లో మెడిసిన్‌లో నోబెల్ అందుకున్నారు. ఆయన కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జనరల్ దవాఖానలో పనిచేశారు.

nobel-prize3

భారతీయులకు నోబెల్

-నోబెల్ ప్రారంభమైన 12 ఏండ్ల తర్వాత ఈ అత్యున్నత పురస్కారం భారతీయులకు దక్కింది. 1913లో సాహిత్యంలో నోబెల్ అందుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్.. ఈ అవార్డు లభించిన మొదటి భారతీయుడిగా నిలిచారు. తర్వాత రసాయన శాస్త్రంలో సీవీ రామన్ (1930), వైద్యశాస్త్రంలో హరగోవింద్ ఖొరానా (1968), శాంతి బహుమతికి మదర్ థెరిసా (1979), భౌతికశాస్త్రంలో సుబ్రమణ్య చంద్రశేఖర్ (1983), అర్థశాస్త్రంలో అమర్త్యసేన్ (1998), రసాయన శాస్త్రంలో వెంకట్రామన్ రామకృష్ణన్ (2009), 2014లో కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.

nobel-prize5

అర్థశాస్త్రం

-ఈ ఏడాది ఆర్థిక నోబెల్ ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీ, ఫ్రెంచ్ అమెరికన్ ఎస్తర్ డఫ్లో, అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లకు సంయుక్తంగా లభించింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి పరిశోధనలు చేసి ఆర్థికరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినందుకుగాను వారు నోబెల్‌కు ఎంపికయ్యారు. క్షేత్రస్థాయిలో పేదల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారికి కనీస జీవన ప్రమాణాలు ఎందుకు అందడంలేదనే ప్రశ్నలు వేసుకుని, వాటికి పరిష్కారమార్గాలు అన్వేషించాలనే సిద్ధాంతం ఆధారంగా వీరు తమ పరిశోధనలు కొనసాగించారు. భార్యాభర్తలైన బెనర్జీ, ఎస్తర్ డఫ్లోలు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో, క్రెమెర్ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు.
-అర్థశాస్త్రంలో ఇప్పటివరకు నోబెల్ అందుకున్న వారిలో డఫ్లో అత్యంత పిన్నవయస్కురాలు, రెండో మహిళగా రికార్డుల్లోకెక్కారు. మొదటిసారిగా నోబెల్ బహుమతిని ఎలినార్ ఓస్ట్రమ్ 2009లో అందుకున్నారు.
-గతేడాది విలియమ్ డీ నోర్డాస్, పౌల్ ఎం రోమర్ (అమెరికా)లు అందుకున్నారు.
-ఈ ఏడాదితో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతికి 50 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ పురస్కారాన్ని మొదటి సారిగా రగ్నార్ ఫ్రిష్, జాన్ టిన్‌బర్జెన్ 1969లో అందుకున్నారు.
-అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతలకు పురస్కారంతోపాటు 9 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల (రూ.65,38,914) నగదు బహుమతి అందిస్తారు.

అభిజిత్ బెనర్జీ

-1961, ఫిబ్రవరి 21న ముంబైలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీ దంపతులకు జన్మించారు. ఆయన పూర్తిపేరు అభిజిత్ వినాయక్ బెనర్జీ. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో బీఎస్సీ చేసిన ఆయన ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎంఏ పూర్తిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 1988లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం ఆయన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికశాస్త్రం విభాగంలో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
-తన భార్య ఎస్తర్ డుఫ్లో, సెంధిల్ ములియనాథన్‌తో కలిసి ఎంఐటీలో అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే-పాల్)ను నెలకొల్పారు. ప్రస్తుతం ఒక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన ఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లోని రిసెర్చ్ బ్యూరోకి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
-2015 తర్వాత అభివృద్ధి ఎజెండా అనే అంశంలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన హైలెవల్ ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్‌లో అభిజిత్ పనిచేశారు.
-వివిధ పత్రికలకు ఆర్టికల్స్ రాయడంతోపాటు, రెండు డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించిన బెనర్జీ.. వలాటిలిటీ అండ్ గ్రోత్, అండర్‌స్టాండింగ్ పావర్టీ, మేకింగ్ ఎయిడ్ వర్క్ (2007), వాట్ ద ఎకానమీ నీడ్స్ నౌ (2019) అనే పుస్తకాలు, తన భార్య డఫ్లోతో కలిసి పూర్ ఎకనామిక్స్ (2011), గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్-బెటర్ ఆన్సర్స్ టు అవర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అనే పుస్తకాలు రాశారు.
-విశేష ఆధారణ పొందిన పూర్ ఎకనామిక్స్ పుస్తకం 17 భాషల్లోకి అనువాదం అయ్యింది. 2011లో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్, ఫైనాన్షియల్ టైమ్స్ అవార్డులను గెలుచుకుంది.
-2009లో సోషల్ సైన్సెస్ విభాగంలో అర్థశాస్త్రంలో ఇన్ఫోసిస్ బహుమతి, 2014లో కైల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద వరల్డ్ ఎకానమీ నుంచి బెర్నార్డ్ హార్మ్స్ ప్రైజ్ అందుకున్నారు.

nobel-prize4

దంపతులకు నోబెల్

-ఇప్పటి వరకు ఆరుగురు దంపతులకు నోబెల్ బహుమతి లభించింది. మొదటిసారిగా 1903లో పియర్ క్యూరీ, మేరీ క్యూరీ దంపతులకు నోబెల్ లభించింది. వీరు రేడియో ధార్మిక శక్తిని కనుగొనడంతోపాటు యురేనియం, థోరియం మూలకాలపై పరిశోధన చేశారు.
-రేడియో ధార్మిక మూలతత్వాల కృత్రిమ నిర్మాణం గురించి కనుగొన్నందుకు ఫ్రెడరిక్ జోలియట్, ఇరీన్ జోలియట్ క్యూరీ దంపతులకు 1935లో ఈ పురస్కారం లభించింది.
-ైగ్లెకోజెన్, గ్లూకోజ్ మెటబాలిజమ్‌లతోపాటు కెటాలిక్ కన్వర్షన్ ఆఫ్ ైగ్లెకోజిన్‌పై పరిశోధనలకు 1947లో వైద్యశాస్త్రంలో గెర్టీ, కార్ల్ కోరి దంపతులు నోబెల్ అందుకున్నారు.
-మెదడులో కణాలకు ఒక స్థానవ్యవస్థ ఉంటుందని కనుగొన్న ఎడ్వర్డ్ ఐ మోసర్, మే బ్రిట్ దంపతులకు 2014లో నోబెల్ లభించింది.
-ప్రపంచ పేదరికంపై చేసిన పరిశోదనలకు గాను అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో 2019లో నోబెల్ అందుకున్నారు.
-దంపతులైన గుర్నార్ మిర్డాల్, అల్వా మిర్డాల్‌కు వేర్వేరు రంగాల్లో నోబెల్ లభించింది. 1974లో గుర్నార్ మిర్డాల్ (ఆర్థికం), 1984లో అల్వా మిర్డాల్ (శాంతి) ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నారు.

మహిళలకు నోబెల్

-ఇప్పటివరకు మొత్తం 54 మంది మహిళలకు నోబెల్ అవార్డులు లభించాయి. ఇందులో శాంతి బహుమతి అత్యధికంగా 17 మంది అందుకోగా, సాహిత్యంలో 15 మందికి లభించింది. భౌతిక, రసాయన శాస్త్రం విభాగాల్లో మేడం క్యూరీ రెండుసార్లు ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. 2009లో నాలుగు విభాగాల్లో అత్యధికంగా ఐదుగురు మహిళలు నోబెల్ అవార్డు అందుకున్నారు.

వైద్యం

-మొత్తం 12 మంది మహిళలకు ఈ పురస్కారం లభించింది. గెర్టీ థెరిసా కోరి (1947), రోసాలిన్ యాలో (1977), బార్బరా మెక్‌క్లింటాక్ (1983), రీటా లెవి మోంటాల్కిని (1986), జెర్ట్రూడ్ బీ ఇలియన్ (1988), క్రిస్టియానే నుస్లీన్‌వోల్హార్డ్ (1995), లిండా బక్ (2004), ఫ్రాంకోయిస్ సినౌస్సీ (2008), ఎలిజబెత్ బ్లాక్‌బర్న్, కరోల్ గ్రైడర్ (2009), మే బ్రిట్ మోసర్ (2014), టు యూయూ (2015).

భౌతిక శాస్త్రం

-ఈ అవార్డును మొత్తం ముగ్గురు అందుకున్నారు. 1903లో మేరీ క్యూరీ, 1963లో మరియా మేయర్, 2018లో డోనా స్ట్రిక్ లాండ్.

రసాయన శాస్త్రం

-ఇప్పటివరకు మొత్తం ఐదుగురు మహిళలు ఈ అవార్డును అందుకున్నారు. వారు.. మేరీ క్యూరీ (1911), ఇరీన్ జోలియట్ క్యూరీ (1935), డొరోథి క్రౌఫుట్ హాడ్కిన్ (1964), అదా యోనత్ (2009), ఫ్రాన్సిస్ హెచ్ ఆర్నాల్డ్ (2018).

సాహిత్యం

-ఇప్పటి వరకు మొత్తం 15 మంది ఈ అవార్డును అందుకున్నారు. సెల్మా లాగర్‌ల్రోఫ్ (1909), గ్రాజియా దెలెద్దా (1926), సిగ్రిడ్ అండ్సెట్ (1928), పెర్ల్ బక్ (1938), గాబ్రియేలా మిస్ట్రల్ (1945), నెల్లి సాచ్స్ (1966), నడిన్ గోర్డిమెర్ (1991), టోనీ మోరిసన్ (1993), విస్లవా జింబోర్‌స్కా (1996), ఎల్ఫ్రిడే జెలినెక్ (2004), డోరిస్ లెస్సింగ్ (2007), హెర్టా ముల్లర్ (2009), అలైన్ మన్రో (2013), స్వెథ్లానా అలెక్సివిచ్ (2015), ఓల్గా టొకర్జుక్ (2018).

శాంతి

-మొత్తం 17 మంది ఈ అవార్డు అందుకున్నారు. బెర్తా వాన్ సట్నెర్ (1905), జాన్ ఆడమ్స్ (1931), ఎమిలీ గ్రీని బాల్చ్ (1946), బెట్టి విలియమ్స్, మైరిడ్ మగ్వైర్ (1976), మదర్ థెరిసా (1979), ఆల్వా మిర్దల్ (1982), ఆంగ్‌సాన్ సూకీ (1991), రిగోబెర్టా మెంచూ (1992), జోడి విలియమ్స్ (1997), షిరిన్ ఎబాది (2003), వాంగారి మథాయ్ (2004), ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్, లిమా బొవీ, తవక్కెల్ కార్మన్ (2011), మలాలా యూసఫ్‌జాయ్ (2014), నదియా మురాద్(2018).

ఆర్థికం

-ఇప్పటివరకు ఈ అవార్డును ఇద్దరు మహిళలు.. ఎలినార్ ఓస్ట్రమ్ (2009), ఎస్తార్ డఫ్లో (2019) మాత్రమే అందుకున్నారు.

జే-పాల్

-శాస్త్రీయ పద్ధతుల ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి అవసరమైన పాలసీలను రూపొందించడం ఎలా అనే అంశాలపై అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యక్షన్ ల్యాబ్ (జే-పాల్) పనిచేస్తుంది. 2003లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ప్రారంభమైన ఈ పావర్టీ యాక్షన్ ల్యాబ్‌కు 2005లో అబ్దుల్ లతీఫ్ జెమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ అని పేరు పెట్టారు. ఇది పేదరిక నిర్మూలనలో భాగంగా ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడంతోపాటు, ఇందులో ప్రభుత్వాల భాగస్వామ్యం పెంపొందించడం, ఎన్‌జీవోలను ఇందులో భాగం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతుంది. జే-పాల్‌కు చెందిన 170 మంది ప్రొఫెసర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 81 కేంద్రాల్లో 948కిపైగా విశ్లేషణలు అందించారు. 1500 మందికి శిక్షణ ఇచ్చారు.
-ఇది ఓపెన్ ఎన్‌రోల్‌మెంట్ కోర్సులు (ఎవాల్యుంగ్ సోషల్ ప్రోగ్రామ్స్, మెజర్‌మెంట్ అండ్ సర్వే డిజైన్), కస్టమ్స్ కోర్సులు (ఎవాల్యుయేటింగ్ సోషల్ ప్రోగ్రామ్స్, మెజర్‌మెంట్ అండ్ సర్వే డిజైన్, అడ్వన్డ్ ఇంపాక్ట్ ఎవాల్యుయేషన్), ఆన్‌లైన్ కోర్సులు (ఎవాల్యుయేటింగ్ సోషల్ ప్రోగ్రామ్స్, మెజరింగ్ హెల్త్ ఔట్‌కమ్స్ ఇన్ ఫీల్డ్ సర్వేస్, అడ్రసింగ్ హెల్త్ చాలెంజెస్ ఇన్ ఆఫ్రికా, డాటా, ఎకనామిక్స్ అండ్ డెవలప్‌మెంట్ పాలసీ) అందిస్తున్నది. ఇవి ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయి.

-గణేష్ సుంకరి

706
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles