కంబైండ్‌గా కరంట్‌ అఫైర్స్‌


Wed,October 16, 2019 01:25 AM

గ్రూప్‌-1, సివిల్స్‌ లాంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో అభ్యర్థులు, ఆబెక్టివ్‌ తరహా పరీక్షల్లా చదివితే సరిపోదు. విషయ పరిజ్ఞానంతో పాటు, విశ్లేషణ సామర్ధ్యాలను పెంచుకోవాలి. ఈ పరీక్షల్లో సిలబస్‌కు అనుగుణంగా కరెంట్‌ ఎఫైర్స్‌ సిద్దం కావాలి. తాజా సంఘటన ఎస్సేలో, జనరల్‌ స్టడీస్‌లో ఎలా ఉపయోగపడుతుందో అంచనాకు వచ్చి, తదనుగుణంగా సమాచార సేకరణ, విశ్లేషణ ఉండాలి. తాజా సంఘటనలతో ప్రిపరేషన్‌ విధానాన్ని పరిశీలిద్దాం...


అంశం 1: పోషకాహారం, ఊబకాయం

- నేపథ్యం: ఇటీవలే కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి త్వ శాఖ యూనిసెఫ్‌తో కలిసి ఒక నివేదికను రూపొందించింది. ఈ అంశానికి సంబంధించి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో ప్రశ్నలు ఎలా వస్తాయో అంచనాకు రావాలి. ప్రిలిమ్స్‌కు సంబంధించి సర్వేలో తేలిన వివిధ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి, ఉదాహరణకు...
ఎ. 5 నుంచి 9 ఏండ్ల చిన్నారుల్లో ఎంత శాతం మంది డయాబెటిక్‌గా (మధు మేహం) ఉన్నారు (10%)
బి. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నారు (తమిళనాడు, గోవా)
సి. యూనిసెఫ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది (న్యూయార్క్‌లో)

- (ఈ నివేదికను యూనిసెఫ్‌ సహాయంతో రూపొందించారు కాబట్టి అది ఏర్పాటైన ఏడాది, ప్రధాన కార్యాలయం, ప్రస్తుతం ఆ సంస్థలో అత్యున్నత హోదాలో పని చేస్తున్న వారు... ఇలాంటి సమాచారం సేకరించాలి, ఈ సమాచారం అన్ని ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షలకు ఉపయోగపడుతుంది)

ఈ అంశానికి సంబంధించి మెయిన్స్‌లో రాదగ్గ ప్రశ్న

- ‘భారత్‌లో ఒక వైపు పోషకాహారలోపం ఉన్న వారి సంఖ్య పెరుగుతూ ఉండగా, మరో వైపు ఊబకాయం సమస్య కూడా తీవ్రం అవుతుంది, ఈ నేపథ్యంలో భారత్‌ పోషక విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందా? చర్చించండి’
- మరో ప్రశ్న- పోషకాహారలోపానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించండి?(పోషణ అభియాన్‌, జాతీయ ఆహార మిషన్‌, మధ్యాహ్న భోజన పథకం, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన తదితర పథకాలను వివరించాలి)

అంశం 2: పాఠశాల విద్య నాణ్యత సూచీ

- నేపథ్యం: ప్రణాళికసంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్‌, పాఠశాలవిద్య నాణ్యత సూచీని విడుదల చేసింది.

ప్రిలిమ్స్‌లో ప్రశ్నల సరళి

ఎ. సూచిలోని ప్రధాన అంశాలు (సూచీలో భాగంగా దేశంలోని రాష్ర్టాలను పెద్ద, చిన్న, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు)
బి. పెద్ద రాష్ర్టాల్లో సూచీలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం (కేరళ)
సి. పెద్ద రాష్ర్టాల్లో చివరన ఉన్న రాష్ట్రం-ఉత్తరప్రదేశ్‌
- మెయిన్స్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 సిలబస్‌లో ఎస్సేలో ఆరు అంశాలను పేర్కొన్నారు. ఇందులో విద్య, మానవ వనరుల అభివృద్ధి కూడా ఒక అంశం. అభ్యర్థి, ఆ వ్యాసం రాసేప్పుడు, ఈ దత్తాంశాన్ని వినియోగించుకోవచ్చు.

ప్రశ్న: భారతదేశంలో విద్య నాణ్యతకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ?
- ఇటీవల కస్తూరి రంగన్‌ కమిటీ కూడా విద్యకు సంబంధించి పలు కీలక అంశాలను అధ్యయనం చేసి, పరిస్థితి మెరుగుకు పలు సిఫారసులు చేసింది. వాటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి సొంతంగా నోట్స్‌ రూపొందించుకోవాలి

అంశం 3: ఉల్లి ఎగుమతుల నిషేధం

- నేపథ్యం: ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఉత్పత్తి ఎగుమతులను ప్రభుత్వం నిలిపి వేసింది. అలాగే ఉల్లి నిల్వలపై కూడా పరిమితులను ప్రభుత్వం విధించింది.
- ప్రిలిమ్స్‌లో ఈ అంశానికి సంబంధించి- ధరల పెరుగుదలకు కారణాలు అడగవచ్చు.
- రిటైల్‌ వ్యాపారస్తుడు ఎంతమేర నిల్వ ఉంచొచ్చు (కేవలం 100 క్వింటాళ్లు)
- హోల్‌సేల్‌ (టోకు) వ్యాపారస్తుడు ఎంతమేర ఉల్లి నిల్వ ఉంచొచ్చు-(500 క్వింటాళ్లు)
(గమనిక: ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. పరీక్ష రాసే సమయానికి ఈ సమస్య పరిష్కారం కావొచ్చు. ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ, అవి ఎలా సత్ఫలితాలు ఇచ్చాయో పరిశీలించాలి. లేదా విఫలమైతే అందుకు కారణాలను కూడా అధ్యయనం చేయాలి)
- మెయిన్స్‌లో రాదగ్గ ప్రశ్న: ఎగుమతుల నిలిపివేత ధర అదుపునకు ఉపయోగపడుతుందా? (టీఎస్‌పీఎస్‌సీ, గ్రూప్‌-1 సిలబస్‌లో మెయిన్స్‌లో నాలుగో పేపర్‌లో ఒకటో సెక్షన్‌లో ఇది ఉపయోగపడుతుంది)
- ఇలా ఆబ్జెక్టివ్‌, మెయిన్స్‌ తరహాలో సిద్ధం కావడం అయితే ప్రిపరేషన్‌లో సమగ్రత వస్తుంది. అలాగే కరెంట్‌ ఎఫైర్స్‌కు సిద్ధం అయ్యేప్పుడు అభ్యర్థులు ఆయా అంశాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లను చదివితే మంచిది. ఉదాహరణకు పైన పేర్కొన్న పోషణకు సంబంధించిన ప్రశ్నలో, జీవశాస్త్రంలో ‘పోషణ’ అనే పాఠాన్ని చదవాలి, సూక్ష్మ, స్థూల పోషకాలు, లోపించడం వల్ల వచ్చే వ్యాధులు...)
- అలాగే రెండో అంశం-పాఠశాల విద్యకు సంబంధించి, భారత దేశంలో 1966లో ఆ తర్వాత 86లో వచ్చిన విద్యా విధానాలు, సంస్కరణల తర్వాత విద్యవిధానంలో వచ్చిన మార్పులు.. ఇలా ఆర్థిక అంశాలకు సంబంధించిన వాటిని చదవాలి.
- మూడో అంశానికి సంబంధించి- ఎగుమతులు, దిగుమతుల విధానం, భారత దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల స్టోరేజీ (నిల్వ) సౌకర్యాలు, శాంతా కుమార్‌ కమిటీ సూచనలను చదవాలి.

Rajendra

570
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles