కరెంట్ అఫైర్స్


Wed,October 2, 2019 12:40 AM

Telangana
Telangana

ఐజీబీసీ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ ప్రారంభం

హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో 17వ సీఐఐ-ఐజీబీసీ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌-2019ను గవర్నర్‌ తిమిళిసై సౌందరరాజన్‌ సెప్టెంబర్‌ 26న ప్రారంభించారు. మూడురోజులపాటు జరిగిన ఈ సమావేశంలో సుమారు 100కు పైగా కంపెనీలు గ్రీన్‌ బిల్డింగ్‌ ఉత్పత్తులు, టెక్నాలజీలను ప్రదర్శించాయి.

జాతీయ పర్యాటక అవార్డులు

సెప్టెంబర్‌ 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అందజేసిన జాతీయ పర్యాటక అవార్డుల్లో రాష్ర్టానికి రెండు లభించాయి. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మొబైల్‌ యాప్‌ ‘ఐ ఎక్స్‌ప్లోర్‌ తెలంగాణ’కు వెబ్‌సైట్‌ కేటగిరీలో అవార్డు లభించింది. ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం కేటగిరీలో అపోలో ఆస్పత్రికి అవార్డు దక్కింది.

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ ఎన్నికయ్యాడు. సెప్టెంబర్‌ 27న జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌చంద్‌ జైన్‌పై అజార్‌ విజయం సాధించాడు. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా జాన్‌ మనోజ్‌ ఎన్నికయ్యాడు.

National
National

నేవీలోకి వరాహ నౌక

భారత తీర ప్రాంతంలో పహారా కాసేందుకు రూపొందించిన ‘వరాహ’ గస్తీ నౌక నేవీలోకి చేరింది. దీన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సెప్టెంబర్‌ 25న చెన్నై రేవులో జాతికి అంకితం చేశారు.

నావికాదళంలోకి ఐఎన్‌ఎస్‌ ఖండేరి

స్కార్పీన్‌ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరి, యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ నీలగిరి నావికాదళంలోకి చేరాయి. వీటిని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సెప్టెంబర్‌ 28న ముంబై రేవులో జాతికి అంకితం చేశారు. 2017 డిసెంబర్‌లో నేవీలోకి ప్రవేశపెట్టిన ఐఎన్‌ఎస్‌ కల్వరి మొదటి జలాంతర్గామి. ఐఎన్‌ఎస్‌ ఖండేరి రెండో జలాంతర్గామి. ఖండేరి డిజైన్‌ను ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ రూపొందించింది. తయారీ భారత్‌లోనే చేపట్టారు.

International
International

మోదీకి గ్లోబల్‌ గోల్‌ కీపర్‌ ప్రదానం

భారత ప్రధాని మోదీకి బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతి ఏడాది ఇచ్చే ‘గ్లోబల్‌ గోల్‌ కీపర్‌' అవార్డును న్యూయార్క్‌లో సెప్టెంబర్‌ 24న ప్రదానం చేసింది. మోదీ సర్కార్‌ చేపట్టిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ యూఎన్‌వో విధించిన లక్ష్యాలను చేరుకోవడంతో ఈ అవార్డును ఇచ్చారు.

కరికామ్‌ శిఖరాగ్ర సమావేశం

అమెరికాలోని న్యూయార్క్‌లో కరీబియన్‌ దేశాల సమాఖ్య ‘కరికామ్‌' శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్‌ 25న జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ కరీబియన్‌ దేశాల్లో అభివృద్ధి పనులకు రూ.100 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.

బీజింగ్‌ డాక్సింగ్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం

చైనా రాజధాని బీజింగ్‌లో నిర్మించిన, ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన బీజింగ్‌ డాక్సింగ్‌ ఎయిర్‌పోర్టును చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సెప్టెంబర్‌ 25న ప్రారంభించారు. స్టార్‌ఫిష్‌ ఆకారంలో ఉండే ఈ ఎయిర్‌పోర్టును 100 ఫుట్‌బాల్‌ మైదానాలంత విస్తీర్ణంలో నిర్మించారు.

యూఎన్‌వో 74వ సమావేశాలు

ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 74వ సమావేశాలు సెప్టెంబర్‌ 27న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఫోర్బ్స్‌ ఉత్తమ కంపెనీల జాబితా

బిజినెస్‌ మ్యాగజీన్‌ ఫోర్బ్స్‌ ప్రపంచ ఉత్తమ కంపెనీలు-2019 (వరల్డ్‌ బెస్ట్‌ రిగార్డెడ్‌ కంపెనీస్‌) జాబితాను సెప్టెంబర్‌ 24న విడుదల చేసింది. 250 కంపెనీలతో విడుదల చేసిన ఈ జాబితాలో మొదటి స్థానంలో వీసా (అమెరికా) నిలిచింది. ఫెరారీ (ఇటలీ) 2వ, ఇన్ఫోసిస్‌ (భారత్‌) 3వ, నెట్‌ఫ్లిక్స్‌ (అమెరికా) 4వ, పేపాల్‌ (అమెరికా) 5వ, మైక్రోసాఫ్ట్‌ (అమెరికా) 6వ, వాల్డ్‌డిస్నీ (అమెరికా) 7వ, టయోటా మోటార్‌ (జపాన్‌) 8వ, మాస్టర్‌కార్డ్‌ (అమెరికా) 9వ, కాస్ట్‌ కో హోల్‌సేల్‌ (అమెరికా) 10వ స్థానాల్లో నిలిచాయి.

ఈ జాబితాలో భారత్‌కు చెందిన కంపెనీలు టీసీఎస్‌ (22), టాటా మోటార్స్‌ (31), టాటా స్టీల్‌ (105), ఎల్‌ అండ్‌ టీ (115), మహీంద్రా అండ్‌ మహీంద్రా (117), హెచ్‌డీఎఫ్‌సీ (135), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (143), పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (149), హెచ్‌సీఎల్‌ టెక్‌ (155), హిందాల్కో (157), విప్రో (168), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (204), సన్‌ఫార్మా (217), జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (224), ఐటీసీ (231), ఏషియన్‌ పెయింట్స్‌ (248) ఉన్నాయి.

Sports
Sports

ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు

అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ, మహిళా ప్లేయర్‌ మెగన్‌ రెపినో (అమెరికా)లకు ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు లభించాయి. ఇటలీలోని మిలాన్‌లో సెప్టెంబర్‌ 25న జరిగిన కార్యక్రమంలో వారికి ఈ అవార్డులను అందజేశారు.

పంకజ్‌ జోడీకి స్నూకర్‌ చాంపియన్‌షిప్‌

అంతర్జాతీయ బిలియర్డ్స్‌ స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) నిర్వహించిన ప్రపంచ టీమ్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌ అద్వానీ-ఆదిత్య మెహ్రా జోడీకి టైటిల్‌ లభించింది. మయన్మార్‌లోని మాండలేలో సెప్టెంబర్‌ 25న జరిగిన ఫైనల్లో పంకజ్‌-ఆదిత్య జంట 5-2 ఫ్రేమ్‌ల తేడాతో పొంగ్సకార్న్‌-పొరమిన్‌ (థాయిలాండ్‌) జోడీపై గెలిచింది.

హంపికి ఫిడే గ్రాండ్‌ ప్రి టైటిల్‌

భారత మహిళ నంబర్‌ వన్‌ చెస్‌ ప్లేయర్‌, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కోనేరు హంపికి ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రి చెస్టోర్నీ-2019 విజేతగా నిలిచింది. రష్యాలోని స్కోల్‌కోవోలో సెప్టెంబర్‌ 22న 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. 7.5 పాయింట్లతో వెన్‌జున్‌ (చైనా) రెండో స్థానంలో నిలిచింది.

పీటీ ఉషకు వెటరన్‌ పిన్‌ అవార్డు

భారత దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) వెటరన్‌ పిన్‌ అవార్డు లభించింది. ఖతార్‌ రాజధాని దోహాలో సెప్టెంబర్‌ 25న జరిగిన ఐఏఏఎఫ్‌ కాంగ్రెస్‌ వేడుకలో సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో ఈ అవార్డును ఉషకు అందజేశారు.

క్రికెట్‌కు సారా వీడ్కోలు

ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ సారా టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సెప్టెంబర్‌ 27న ప్రకటించింది. 17 ఏండ్ల వయస్సులో ఆమె 2006లో క్రికెట్‌లోకి ప్రవేశించింది. తన కెరీర్‌లో 10 టెస్టులు, 126 వన్డేలు, 90 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 6,533 పరుగులు సాధించింది.

Persons
Persons

అమితాబ్‌ బచ్చన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే

భారతీయ సినీ ఆస్కార్‌గా పేర్కొనే దాదా సాహెబ్‌ ఫాల్కే-2019 అవార్డుకు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సెప్టెంబర్‌ 24న ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లో 1942, అక్టోబర్‌ 11న జన్మించిన అమితాబ్‌ నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా సినీరంగానికి బహుముఖ సేవలందిస్తున్నారు. ఈ అవార్డులను అందుకోనున్న 50వ వ్యక్తి అమితాబ్‌ బచ్చన్‌. ఇందులో హిందీ చిత్రరంగం నుంచి 32 మందిని ఈ పురస్కారం వరించింది. మిగతావారు ఇతర భాషాచిత్రాల నుంచి అందుకున్నారు.

భారత్‌లో అత్యంత సంపన్నుడు ముకేశ్‌

భారత్‌లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ ఉన్నారని సెప్టెంబర్‌ 25న విడుదలైన ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా-2019 రిచ్‌ లిస్ట్‌ వెల్లడించింది. దీంతో వరుసగా 8 ఏండ్లు ముకేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈయన సంపద రూ.3,80,700 కోట్లు. ఈ జాబితాలో ఎస్‌పీ హిందూజా అండ్‌ ఫ్యామిలీ రెండో స్థానంలో నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.1,17,100 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఆర్సెలర్‌ మిట్టల్‌ వ్యవస్థాపకుడు లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ 4వ, గౌతమ్‌ అదానీ (అదాని ఎంటర్‌ప్రైజెస్‌) 5వ, ఉదయ్‌ కోటక్‌ (కోటర్‌ మహీంద్రా బ్యాంక్‌) 6వ, సైరస్‌ ఎస్‌ పూనావాలా (సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌) 7వ, సైరస్‌ పల్లోంజీ మిస్త్రీ (షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌) 8వ, షాపూర్‌ పల్లోంజీ (షాపూర్‌ పల్లోంజీ గ్రూప్‌) 9వ, దిలీప్‌ సింఘ్వీ (సన్‌ ఫార్మా ఇండస్ట్రీస్‌) 10వ స్థానాలో నిలిచాయి.

ఐఎంఎఫ్‌ ఎండీగా క్రిస్టలినా జార్జియెవా

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బల్గేరియాకు చెందిన క్రిస్టలినా జార్జియెవా ఎంపికయ్యారని ఐఎంఎఫ్‌ సెప్టెంబర్‌ 25న తెలిపింది. ఆమె గతంలో ప్రపంచ బ్యాంక్‌ సీఈవోగా పనిచేశారు.

ఐఈసీ చైర్మన్‌గా సురేశ్‌

ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌ (ఐఈసీ) చైర్మన్‌గా శ్రీనివాస ఫామ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిట్టూరి సురేశ్‌ ఎన్నికయ్యారు. డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హెగెన్‌లో సెప్టెంబర్‌ 26న జరిగిన ఐఈసీ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సమావేశంలో సురేశ్‌ను ఐఈసీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీంతో ఐఈసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న మొదటి ఆసియా వ్యక్తిగా సురేశ్‌ గుర్తింపు పొందనున్నారు.

పాయల్‌కు చేంజ్‌మేకర్‌ అవార్డు

రాజస్థాన్‌లోని హిన్‌స్లా గ్రామానికి చెందిన పాయల్‌ జంగిడ్‌కు ‘చేంజ్‌మేకర్‌-2019’ అవార్డును బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సెప్టెంబర్‌ 24న ప్రదానం చేసింది. 17 ఏండ్ల పాయల్‌ బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, ఆడపిల్లలు చదువుకునేందుకు కృషిచేస్తుంది. 2017లో రీబాక్‌ సంస్థ నుంచి ‘యంగ్‌ అచీవర్‌' అవార్డును ఆమె అందుకుంది.

గ్రెటా థన్‌బర్గ్‌కు రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డుల

పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు ‘రైట్‌ లైవ్లీహుడ్‌' అవార్డు లభించిందని అవార్డు కమిటీ సెప్టెంబర్‌ 26న ప్రకటించింది. ఈమెతోపాటు మొరాకో నుంచి ‘వెస్ట్రన్‌ సహారా’ ప్రాంతానికి స్వాతంత్య్రం కోరుతూ అహింసాయుత పోరాటం చేస్తూ ‘గాంధీ ఆఫ్‌ వెస్ట్రన్‌'గా పిలుస్తున్న అమీనాటౌ హౌదర్‌, చైనాలో మహిళల గృహహింసపై పోరాడుతున్న న్యాయవాది గువో జియాన్మీలకు ఈ అవార్డు లభించింది. అంతేకాకుండా అమెజాన్‌ అడవిని, అక్కడి ప్రజలను రక్షించడంలో చేస్తున్న కృషికిగాను బ్రెజిల్‌ దేశీయ తెగకు చెందిన న్యాయవాది డేవి కొపెనావా, బ్రెజిల్‌కే చెందిన హుటుకారా యనోమామి అసోసియేషన్‌ సంస్థలకు సంయుక్తంగా ఈ అవార్డు దక్కింది. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో డిసెంబర్‌ 4న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. 1980లో జర్మన్‌-స్వీడిష్‌ రచయిత జాకబ్‌ వాన్‌ యుయెక్స్‌కుల్‌ ‘రైట్‌ లైవ్లీహుడ్‌' అవార్డును స్థాపించారు.
Vemula-Saidulu

712
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles