అత్యంత నివాసయోగ్య నగరాలు


Mon,September 30, 2019 12:56 AM

osakaget
-ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం వియన్నా నిలిచింది. రక్షణ, ఆరోగ్యం, విద్య, మౌలికవసతుల కల్పన, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణలో ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుండటంతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రకటించిన ప్రపంచ అత్యంత నివాసయోగ్యమైన నగరాల (జీఎల్‌ఐ) సూచీలో 99.1 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
-ఈ జాబితాలో 98.4 పాయింట్లతో ఆస్ట్రేలియా రాజధాని మెల్‌బోర్న్ రెండోస్థానంలో ఉంది. జీఎల్‌ఐలో 2011 నుంచి 2017 వరకు అగ్రస్థానంలో కొనసాగిన మెల్‌బోర్న్‌ను 2018లో వియన్నా అధిగమించింది. హెల్త్‌కేర్, విద్య, మౌలికవసతుల్లో 100 పాయింట్లు సాధించినప్పటికీ సంస్కృతి, పర్యావరణం (98.6 పాయింట్లు), స్థిరత్వంలో (95 పాయింట్లు) వియన్నా కంటే వెనుకబడిపోవడంతో మెల్‌బోర్న్ రెండో స్థానానికి పడిపోయింది. సంస్కృతి, పర్యావరణం (96.3 పాయింట్లు)లో మినహా మిగతా అన్ని విభాగాల్లో వియన్నా 100 పాయింట్లు సాధించి వరుసగా రెండో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నది.
-ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా ఉన్న సిడ్నీ 98.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న ఈ నగరంలో వాతావరణ మార్పుల ప్రభావాలను పరిష్కరించచం, సంస్కృతి, పర్యావరణంలో మెరుగైన మార్పులు తీసుకురావడంతో రెండు స్థానాలు ఎగబాకింది.


-జపాన్‌కు చెందిన ఒసాకా ఈ ఏడాది ఒక స్థానం కోల్పోయి నాలుగో ప్లేస్ (97.7 పాయింట్లు)లో నిలిచింది. టోక్యో తర్వాత అతిపెద్ద నగరమైన ఒసాకా గతేడాది మూడో స్థానంలో ఉంది. నేరాల నమోదులో తగ్గుదల లేకపోవడం, మెరుగైన రవాణా సౌకర్యాల లేమితో 2018 వరకు తొలి పది నగరాల్లో చోటు సంపాదించలేకపోయింది.
-కెనడాకు చెందిన కల్గరీ (97.5), వాంకోవర్ (97.3)లు తర్వాతి రెండు స్థానాల్లో నిలువగా, జపాన్‌కు చెందిన టోక్యో, కెనడాకి చెందిన టొరంటో 97.2 పాయింట్లతో సంయుక్తగా ఏడో స్థానం సాధించాయి. డెన్మార్క్‌కు చెందిన కొపెన్‌హెగెన్ (96.8), ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ (96.6) తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచాయి.
-ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల వల్ల ఫ్రాన్స్ రాజధాని పారిస్ గతేడాది కంటే ఆరు స్థానాలు కోల్పోయి 26 ర్యాంకులో ఉండగా, హాంకాంగ్ 38వ స్థానంలో నిలిచింది.
-అమెరికాకు చెందిన ఒక్క నగరం కూడా టాప్ 20లో స్థానం పొందలేకపోయాయి. ఆ దేశానికి హొనలులు 22వ స్థానంతో టాప్ 40లో అగ్రస్థానంలో ఉండగా అట్లాంటా, పిట్స్‌బర్గ్, సీటెల్, వాషింగ్టన్ డీసీలు దాని తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చికాగో 41వ స్థానంలో నిలిచింది.
-ఉగ్రవాద దాడులు, పెరుగుతున్న నేరాలు, స్థిరత్వం కొరవడటం వంటి ఆర్థిక, వ్యక్తిగత భద్రతా కారణాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాలైన లండన్ 48వ స్థానంలో, న్యూయార్క్ 59వ ర్యాంకులో నిలిచాయి.
-వస్తుసేవలు విస్తృతంగా లభించడం, అత్యంత మెరుగైన వ్యక్తిగత భద్రత, సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, యూరప్ దేశాలకు చెందిన నగరాలే జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.

ఎలా నిర్ణయిస్తారు..

-ఆయా నగరాల్లో జీవన ప్రమాణస్థాయి, నేరాల నమోదు, మౌలిక వసతులు, సంస్కృతి, విద్య, వైద్యంతోపాటు రాజకీయ, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాల ఆధారంగా ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 140 నగరాలను ఇది పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించింది. తొలిసారి ఈ ఏడాది పర్యావరణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్నది.
-ఈఐయూ ప్రామాణికంగా తీసుకున్న ఐదు విభాగాల్లో ఒక్కో దానికి ఒక్కో విధమైన మార్కులను కేటాయించింది. ఇందులో స్థిరత్వం (స్టెబిలిటి) 25 శాతం, ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) 20 శాతం, సంస్కృతి, పర్యావరణం 25 శాతం, విద్య 10 శాతం, మౌలికవసతులకు (ఇన్‌ఫ్రాస్ట్రక్షర్) 20 శాతం మార్కులు కేటాయిస్తారు. ఈ ఐదు విభాగాల్లో చిన్న చిన్న నేరాలు, తీవ్ర నేరాల ప్రాబల్యం, తీవ్రవాద ముప్పు, సైనిక, పౌర తిరుగుబాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఆరగ్యో సౌకర్యాల లభ్యత, వాటి నాణ్యత, ఉష్ణోగ్రత తీవ్రత, అనుకూల వాతావరణం, అవినీతి స్థాయి, మత లేదా సామాజిక పరిమితులు లేదా కట్టుబాట్లు, వినియోగ వస్తువుల లభ్యత, ఆహారం, రవాణా సౌకర్యాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, క్వాలిటీ హౌసింగ్, మెరుగైన విద్యుత్, నీటి, టెలీకమ్యూనికేషన్ వసతుల వంటి 30 అంశాలను పరిశీలిస్తారు. వీటి ఆధారంగా మార్కులు నిర్ణయిస్తారు.

-ఆయా నగరాల్లో ఉన్న ప్రమాణాలను బట్టి వాటికి ఒకటి నుంచి 100 వరకు పాయింట్లు కేటాయిస్తారు. దీని ఆధారంగా అతి తక్కువ నివాసయోగ్యమైన నగరం నుంచి అత్యంత నివాసయోగ్యమైన నగరాలకు ర్యాంకులు ఇస్తారు. ఇలా వచ్చిన స్కోర్ ఆధారంగాచేసుకుని అనుకూలమైన, సహించదగిన లేదా సాధారణమైన, అసౌకర్యమైన, అవాంఛనీయ నగరాలుగా విభజిస్తారు.
-అంటే 1 రేటింగ్ వచ్చినట్లయితే అవాంఛనీయమైన అని, 100 పాయింట్లు వస్తే అత్యంత అనుకూలమైన అని అర్థం. అదేవిధంగా 80, అంతకంటే ఎక్కువ పాయింట్లు వస్తే అతి తక్కువ సమస్యలు ఉన్నాయని, 50-60 పాయింట్లు నిర్బంధ పరిస్థితులను సూచిస్తాయని, 50 కంటే తక్కువ ఉంటే నివాసయోగ్య పరిస్థితులు తక్కువగా కలిగిన దేశాలుగా విభజించారు.
-సిరియాలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితుల వల్ల ఆ దేశ రాజధాని డెమాస్కస్ ఈ జాబితాలో చివరి స్థానం (140)లో నిలిచింది. ఇలా అంతర్గత భద్రత, వాయు కాలుష్యం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, నేరాల పెరుగుదల, వ్యక్తిగత భద్రత కొరవడటం వంటి కారణాలవల్ల నైజీరియాకు చెందిన లాగోస్ (139), ఢాకా- 138 (బంగ్లాదేశ్ ), ట్రిపోలి- 137 (లిబియా), కరాచీ- 136 (పాకిస్థాన్), పోర్ట్ మోర్స్‌బే- 135 (పపువా న్యూగినియా), హరారే- 134 (జింబాబ్వే), దౌలా- 133 (కామెరూన్), అల్జీర్స్- 132 (అల్జీరియా), కారకాస్- 131 (వెనెజులా) చివరి 10 స్థానాల్లో ఉండి నివాస యోగ్యం కాని నగరాలుగా నిలిచాయి. ఇందులో ఆసియాకు చెందిన నగరాలు ఢాకా, కరాచీ, పోర్ట్ మోర్స్‌బే ఉన్నాయి.
-2011-17 వరకు వరుసగా ఏడేండ్లు ఆస్ట్రేలియాకు చెంచిన మెల్‌బోర్న్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. 2011కు ముందు అంటే 2002-10 వరకు కెనడాకు చెందిన వాంకోవర్ నగరం ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
-బ్రిక్స్ దేశాల్లో చైనాకు చెందిన ఎక్కువ నగరాలకు జీఎల్‌ఐలో స్థానం లభించింది. ఇందులో బ్రెజిల్‌కు చెందిన రియో డి జనీరో 89వ ర్యాంకుతో అగ్ర స్థానంలో నిలిచింది. రష్యాకు చెందిన మాస్కో 68, పిట్స్‌బర్గ్ 71వ స్థానంతో తర్వాతి ర్యాంకుల్లో నిలిచాయి. చైనాకు చెందిన ఐదు నగరాలు.. సుఝౌ 75, బీజింగ్ 76, టియాంజిన్ 79, షాంగై 80, షెంజాన్ 84, దలియన్ 90, గువాన్‌జు 96, క్విండావో 97వ స్థానంలో నిలిచాయి.

ఈఐయూ

-ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ది ఈఐయూ) గ్లోబల్ బిజినెస్ ఇంటెలిజెన్స్‌లో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ఎకనమిస్ట్ గ్రూప్‌లో పరిశోధన, విశ్లేషణ విభాగమైన ఈఐయూ ప్రపంచంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి, అవి ఎలాంటి అవకాశాలను సృష్టిస్తాయి, వాటిని అందిపుచ్చుకోవడం, అందులోభాగంగా ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిచాలనే అశాలను అర్థంచేసుకోవడంలో ఆర్థిక రంగం, ప్రభుత్వాలకు సహాయం అందిస్తుంది. లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈఐయూ 1946లో ప్రారంభమైంది. ఎకనమిస్ట్ న్యూస్‌పేపర్ సోదర సంస్థ ఎకనమిస్ట్ గ్రూప్.
jpg1

పడిపోయిన ఢిల్లీ, ముంబై

-అత్యంత నివాసయోగ్య సూచీలో తొలి 100 నగరాల్లో భారత్‌కు చెందిన ఒక్క నగరానికి కూడా చోటు దక్కలేదు. అధిక జనాభా, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు, అందరికీ అందుబాటులోకి విద్య, వైద్య సదుపాయాలు, నేరాల రేటు, అంతటా ఒకే విధంగా లేని అభివృద్ధి వంటి కారణాలతో మన దేశానికి చెందిన రెండు నగరాలకు మాత్రమే ఈ అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో చోటు లభించింది. అవికూడా గతేడాది కంటే తక్కువ ర్యాంకులో నిలిచాయి. నానాటికి అధికమవుతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ 118వ స్థానంలో నిలిచింది. 2018లో 112వ స్థానంలో ఢిల్లీలో పర్యావరణ మార్పులకు నేరాలు పెరగడం, స్థిరత్వ లేమి వంటి కారణాలు తోడవడంతో గత ఏడాది కంటే ఆరు స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై రెండు స్థానాలు కోల్పోయి 119వ ర్యాంకులో నిచింది. ముంబైలో సంస్కృతికి సంబంధించిన పాయింట్లు తక్కువగా స్కోర్ రావడంతో ర్యాంకును కోల్పోయింది. ఈఐయూ ర్యాంకింగ్స్‌లో ఢిల్లీకి 56.3 స్కోర్ రాగా, ముంబైకి 56.2 పాయింట్లు లభించాయి.
india-gate-india

జీఎల్‌ఐ 2019

అత్యంత నివాసయోగ్యమైన నగరాలు
1. వియన్నా, ఆస్ట్రియా
2. మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
3. సిడ్నీ, ఆస్ట్రేలియా
4. ఒసాకా, జపాన్
5. కల్గరీ, కెనడా
6. వాంకోవర్, కెనడా
7. టోక్యో, జపాన్
8. టొరంటో, కెనడా
9. కొపెన్‌హెగెన్, డెన్మార్క్
10. అడిలైడ్, ఆస్ట్రేలియా

నివాస యోగ్యం కానివి

131. కారకాస్, వెనెజులా
132. అల్జీర్, అల్జీరియా
133. దౌలా, కామెరూన్
134. హరారే, జింబాబ్వే
135. పోర్ట్ మోర్స్‌బే, పపువా న్యూగినియా
136. కరాచీ, పాకిస్థాన్
137. ట్రిపోలి, లిబియా
138. ఢాకా, బంగ్లాదేశ్
139. లాగోస్, నైజీరియా
140. డమాస్కస్, సిరియా

- గణేష్ సుంకరి

570
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles