కరెంట్ అఫైర్స్


Wed,September 25, 2019 02:01 AM

Telangana


South-Africandelegation

విదేశీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివిధ విదేశీ ప్రతినిధులతో వేర్వేరుగా సెప్టెంబర్ 19న హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. భారత్‌లో సౌతాఫ్రికా హైకమిషనర్ సిబుసిసో ఎన్డెబె, లక్సెంబర్గ్ రాయబారి జీన్ క్లాడ్ కుగెనర్, ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మార్జరీ వాన్ బేలిగమ్‌లతో కేటీఆర్ సమావేశమయ్యారు. సౌతాఫ్రికాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు, లక్సెంబర్గ్ ఫిన్‌టెక్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి చర్చించారు.

ఐసీజే సర్వీసు ప్రారంభం

కరీంనగర్ జిల్లా కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటరోపెరబుల్ క్రిమినల్ జస్టిస్ (ఐసీజే)ను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సెప్టెంబర్ 16న ప్రారంభించారు. దేశంలో ఇది రెండోది. తొలి ఐసీజే 2018, డిసెంబర్ 15న వర్తింపజేశారు. దీని ద్వారా పోలీసులు నమోదు చేసిన సమాచారాన్ని బదిలీ చేసుకుని త్వరగా తీర్పులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

ఫోర్బ్స్‌లో హైదరాబాద్ ఐఎస్‌బీ

ఫోర్బ్స్ మ్యాగజీన్ సెప్టెంబర్ 18న ప్రపంచంలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్స్-100 ర్యాంకుల్లో హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు ఏడో స్థానం లభించింది. ఎంబీఏ కేటగిరీలో ఆసియా వ్యాప్తంగా అత్యుత్తమ బి-స్కూల్‌గా హైదరాబాద్ ఐఎస్‌బీ గుర్తింపు పొందింది.

కేటీఆర్‌తో న్యూజెర్సీ గవర్నర్ భేటీ

అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ సెప్టెంబర్ 15 నుంచి నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 18న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ర్టాలు ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, ఉన్నత విద్య, టూరిజం వంటి రంగాల్లో సిస్టర్ స్టేట్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి.

బ్లడ్ ప్యూరిఫికేషన్ సదస్సు

హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో 37వ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిఫికేషన్, 22వ పెరిటోనియల్ డయాలసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా బ్లడ్ ప్యూరిఫికేషన్ సదస్సును ఏర్పాటు చేశాయి. ఈ సదస్సును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెప్టెంబర్ 18న ప్రారంభించారు.

ఇండో-చైనా హెల్త్‌కేర్ సమ్మిట్

హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో ఇండో-చైనా హెల్త్‌కేర్ సమ్మిట్-2019ను సెప్టెంబర్ 18న నిర్వహించారు. ఈ సమ్మిట్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఇర్కోడ్ గ్రామానికి స్వచ్ఛత స్వశక్తి అవార్డు

రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామానికి స్వచ్ఛత స్వశక్తి కిరణ్-2019 అవార్డు లభించింది. సాంఘిక సామాజిక అభివృద్ధి విభాగంలో ఇర్కోడ్ గ్రామం ఈ అవార్డుకు ఎంపికయిందని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజిత్‌పాత్ జోషి సెప్టెంబర్ 19న వెల్లడించారు. ఢిల్లీలో అక్టోబర్‌లో ఈ అవార్డును అందజేయనున్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ స్కోచ్ పురస్కారానికి ఎంపికైంది. స్థిర పారిశుద్ధ్య నిర్వహణ అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపికచేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ గ్రామం శానిటేషన్ అమలులో జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది.

National


venkaiah

సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు

సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురిని జడ్జీలుగా నియమిస్తున్నట్లు న్యాయశాఖ సెప్టెంబర్ 18న ప్రకటించింది. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్ రాయ్ ఉన్నారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరింది. సుప్రీంకోర్టు జడ్జీల గరిష్ఠ సంఖ్యను 31(30+1) నుంచి 34(33+1)కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూలై 31న ఆమోదం తెలిపింది.

తేజస్‌లో రక్షణ మంత్రి ప్రయాణం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 19న ప్రయాణించారు. ఆలివ్ గ్రీన్ రంగు జెసూట్‌ను ధరించిన రాజ్‌నాథ్ బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్ట్ నుంచి దాదాపు 30 నిమిషాలపాటు తేజస్‌లో ఆయన ప్రయాణించారు. దీని వేగం గంటకు 1236 కి.మీ. దీంతో తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ నిలిచారు.

హిమాలయన్ ఒడిస్సీ పుస్తకావిష్కరణ

హిమాలయన్ ఒడిస్సీ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో సెప్టెంబర్ 19న ఆవిష్కరించారు. మలయాళంలో హైమవత భువిల్ పుస్తకాన్ని హిమాలయన్ ఒడిస్సీ పేరుతో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ వీరేంద్రకుమార్ అనువదించారు.

జాతీయ ఐక్యతా అవార్డు ఏర్పాటు

పద్మ అవార్డుల మాదిరిగా సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు, దాని విధివిధానాలను కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 20న వెల్లడించింది. ఈ అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ 2018, డిసెంబర్ 23న ప్రకటించారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం చిత్తుశుద్ధితో పనిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. శుద్ధమైన బంగారం, వెండి మిశ్రమంతో అవార్డు పతకాన్ని రూపొందిస్తారు. హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక కమిటీ అవార్డుకు అర్హులైనవారిని ఎంపిక చేస్తుంది.

International


akademik-lomonosov

తేలియాడే అణువిద్యుత్ కేంద్రం

ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా రూపొందించిన నీటిలో తేలియాడే అణువిద్యుత్ కేంద్రానికి ది అకడమిక్ లొమొనోసోవ్ అని సెప్టెబర్ 16న పేరుపెట్టారు. దీన్ని రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రొసటామ్ రూపొందించింది. దీని బరువు 21 టన్నులు, ఎత్తు 470 అడుగులు, పొడవు 144 మీటర్లు. దీనిలో 35 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు అణు రియాక్టర్లు ఉన్నాయి.

మాతా శిశు మరణాలపై నివేదిక

ప్రపంచవ్యాప్తంగా మాతా, శిశు మరణాలపై రూపొందించిన నివేదికను సెప్టెంబర్ 19న ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. గతేడాదితో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఐదేండ్లలోపు వయస్సున్న చిన్నారుల మరణాలు సగానికి తగ్గిపోయి 53 లక్షలకు చేరాయి. ప్రసవ సమయంలో చనిపోయే గర్భిణుల సంఖ్య మూడోవంతు తగ్గింది. ఈ సంఖ్య 2000లో 4,51,000 ఉండగా, 2017 నాటికి 2,95,000కు పడిపోయింది. ప్రతి 11 సెకన్లకు ప్రపంచవ్యాప్తంగా ఓ బాలింత లేదా గర్భిణి లేదా నవజాత శిశువు ప్రాణాలు కోల్పోతున్నారు.

సౌదీ చమురు క్షేత్రాలపై దాడి

సౌదీ అరేబియా చమురు క్షేత్రాల్లో సెప్టెంబర్ 14న డ్రోన్ దాడులు జరిగాయి. సౌదీ తూర్పు ప్రాంతంలో ఆరామ్‌కోకు చెందిన అబ్‌ఖైక్, ఖురైస్ క్షేత్రాలపై రెండు డ్రోన్లు కూలాయి. ఈ దాడికి కారణం తామేనంటూ ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హౌతి ఉగ్రవాదులు ప్రకటించారు. దీంతో తాత్కాలికంగా ఆయిల్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకటించారు. దీనివల్ల రోజుకు సుమారు 5.7 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఉత్పత్తి నిలిచిపోతుంది.

మంగోలియాలో బుద్ధుని విగ్రహావిష్కరణ

మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో ఏర్పాటు చేసిన బుద్ధుని బంగారు విగ్రహాన్ని మంగోలియా అధ్యక్షుడు కల్ట్‌మాగిన్ బట్టూగ్లాతో కలిసి భారత ప్రధాని మోదీ ఢిల్లీలో సెప్టెంబర్ 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఉలాన్‌బాటర్‌లోని గందన్ ఆరామంలో ఈ బంగారు బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Sports


aruna

ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌కు అరుణ

ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో పోటీపడే ఆరుగురు సభ్యుల భారత జట్టుకు తెలుగు జిమ్నాస్ట్ బుడ్డా అరుణారెడ్డి సెప్టెంబర్ 16న జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో ఎంపికైంది. ప్రపంచ చాంపియన్‌షిప్ అక్టోబర్ 4 నుంచి 13 వరకు జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరుగనున్నది.

వినేశ్ ఫొగాట్‌కు కాంస్యం

ప్రపంచ రెజ్లింగ్ చాంపియనన్‌షిప్స్‌లో వినేశ్ ఫొగాట్‌కు కాంస్య పతకం లభించింది. సెప్టెంబర్ 18న కజకిస్థాన్‌లో జరిగిన కాంస్య పతక పోరులో గ్రీస్‌కు చెందిన రెజ్లర్ మరియాను ఓడించింది. దీంతో కాంస్యపతకంతోపాటు 2020 ఒలింపిక్స్ బెర్తునూ సాధించింది.

బాక్సింగ్‌లో అమిత్‌కు రజతం

ప్రపంచ బాక్సింగ్‌లో భారత బాక్సర్ అమిత్ పంగాల్ 52 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. రష్యాలో సెప్టెంబర్ 21న జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 0-5 తేడాతో అమిత్ లండన్ ఒలింపిక్స్ స్వర్ణ విజేత షఖోబిదిన్ జోరోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ పోటీలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా అమిత్ రికార్డుకెక్కాడు. ఇంతకుముందు మనీశ్ కౌశిక్ 63 కేజీల విభాగంలో కాంస్యం గెలిచాడు. దీంతో భారత్ ఈ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఒకటి కంటే ఎక్కువగా పతకాలు సాధించింది.

Persons


greta-thunberg

గ్రెటా థన్‌బర్గ్‌కు ఆమ్నెస్టీ అవార్డు

ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఉద్యమాన్ని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణకు పోరాడుతున్న 16 ఏండ్ల గ్రెటా థన్‌బర్గ్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టీ అందించే అంబాసిడర్స్ ఆఫ్ కన్‌సైన్స్ అవార్డు లభించింది. సెప్టెంబర్ 16న అమెరికాలోని వాషంగ్టన్ యూనివర్సిటీలో జరిగిన ఆమ్నెస్టీ అధికార ప్రతినిధుల నుంచి ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2018, ఆగస్టులో ఆమె ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.

తొలి మహిళా సైనిక దౌత్యాధికారిగా అంజలి

విదేశాల్లో భారత సైనిక దౌత్యాధికారిగా వింగ్ కమాండర్ అంజలి సింగ్ సెప్టెంబర్ 10న బాధ్యతలు స్వీకరించినట్లు మాస్కోలో రాయబార కార్యాలయం సెప్టెంబర్ 17న వెల్లడించింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ ఎయిర్ అటాచీగా ఆమె విధుల్లో చేరారు. దీంతో తొలి మహిళా సైనిక దౌత్యాధికారిగా అంజలి రికార్డు నెలకొల్పారు.

కాటలీనాను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్

ఏపీలోని విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అంతర్జాతీయ స్విమ్మర్ ఎం తులసీ చైతన్య అమెరికాలోని కాటలీనా చానెల్‌ను సెప్టెంబర్ 18న ఈదాడు. 35 కి.మీ. పొడవు ఉన్న కాటలీనా చానెల్‌ను చైతన్య 12 గంటల 40 నిమిషాల 24 సెకన్లలో పూర్తిచేశాడు. దీంతో ఈ చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా చైతన్య గుర్తింపు పొందారు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీస్ స్విమ్మర్‌గా కూడా రికార్డు సాధించాడు.

ఐఏఎఫ్ చీఫ్‌గా రాకేశ్

భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియాను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20న వెల్లడించింది. ప్రస్తుత చీఫ్ బీఎస్ ధనోవా సెప్టెంబర్ 30న పదవీ విమరణ చేయనున్నారు. బధౌరియా తన సర్వీసులో అతివిశిష్ట సేవ, వాయుసేన, పరమ్ విశిష్ట సేన అవార్డులను స్వీకరించారు. జనవరిలో రాష్ట్రపతి గౌరవ సహాయకుడిగా నియమితులయ్యారు. రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడిపిన మొదటి భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. రాఫెల్ జెట్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకోవడంలో భదౌరియా కీలకపాత్ర పోషించారు.
Saidhulll

647
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles