పది తర్వాత ‘కామర్స్’


Mon,April 22, 2019 01:39 AM

పదో తరగతి పరీక్షలు ముగిశాయి. పది తర్వాత ఏ కోర్సు చదవాలి, ఏ కోర్సు చదివితే భవిష్యత్తు బాగుంటుందని పది పూర్తయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. పది తర్వాత తీసుకునే నిర్ణయమే విద్యార్థి భవిష్యత్తును శాసిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంటర్‌లో సైన్స్ గ్రూపు చదవాలా? ఆర్ట్స్ గ్రూపు చదవాలా? ఏ గ్రూపు తీసుకుని చదివితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలుంటాయి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. చాలామంది పిల్లలకు అసలు ఇంటర్‌లో ఉండే గ్రూపుల గురించి కనీస అవగాహన కూడా ఉండటంలేదు. ఇంటర్ అంటే ఎంపీసీనే అని, తన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని తనూ అదే తీసుకుంటానని అంటుంటారు. ఇటువంటి సందర్భంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు గ్రూపు/కోర్సు ఎంపికలో సరైన దిశానిర్దేశం చేయాలి. ఇంటర్‌లో కామర్స్ గ్రూపు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు చదవవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలుంటాయనే తదితర అంశాలను తెలుసుకుందాం..
commerce
-పదో తరగతి పరీక్షలు ముగిశాయి. పది తర్వాత ఏ కోర్సు చదవాలి, ఏ కోర్సు చదివితే భవిష్యత్తు బాగుంటుందని పది పూర్తయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. పది తర్వాత తీసుకునే నిర్ణయమే విద్యార్థి భవిష్యత్తును శాసిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంటర్‌లో సైన్స్ గ్రూపు చదవాలా? ఆర్ట్స్ గ్రూపు చదవాలా? ఏ గ్రూపు తీసుకుని చదివితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలుంటాయి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. చాలామంది పిల్లలకు అసలు ఇంటర్‌లో ఉండే గ్రూపుల గురించి కనీస అవగాహన కూడా ఉండటంలేదు. ఇంటర్ అంటే ఎంపీసీనే అని, తన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని తనూ అదే తీసుకుంటానని అంటుంటారు. ఇటువంటి సందర్భంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు గ్రూపు/కోర్సు ఎంపికలో సరైన దిశానిర్దేశం చేయాలి. ఇంటర్‌లో కామర్స్ గ్రూపు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు చదవవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలుంటాయనే తదితర అంశాలను తెలుసుకుందాం..
-ఆర్థికరంగాన్ని శాసించేవి కామర్స్ కోర్సులు. కామర్స్‌లో ఏ కోర్సు తీసుకున్నా.. చదివినా.. జీవితంలో స్థిరపడవచ్చు. సామాన్య గుమస్తాల నుంచి దేశ ఆర్థికరంగాన్ని శాసించే ఆర్థిక నిపుణుల వరకు ఈ రంగంలోనే ఎన్నో రంగాలున్నాయి. దేశంలో అకౌంటెంట్ల కొరత ఏ స్థాయిలో ఉందో వ్యాపార రంగంలో ఉన్నవారికే తెలుస్తుంది.
-జీఎస్టీ అమలు, నోట్ల రద్దువల్ల కామర్స్ అవకాశాలు బాగా పెరుగుతున్నాయని నిపుణుల మాట. నగదు రహిత విధానం కారణంగా రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో చాలా ఉద్యోగావకాశాలు రానున్నాయి.
-భవిష్యత్తులో కామర్స్ నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే పదో తరగతి తర్వాతనే కామర్స్ గ్రూపులు ఎంచుకుని ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే తక్కువ సమయంలోనే మంచి నిపుణులుగా ఎదగవచ్చు.
-ఐఐటీలో సీటు సాధించాలంటే ఏడో తరగతి నుంచి ఐఐటీకి పునాది అవసరం అంటున్నారు. అలాగే భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలంటే కామర్స్ ఫౌండేషన్ కూడా అవసరమే. తెలుగు రాష్ర్టాల్లో పదో తరగతిలోపు ఆ అవకాశంలేదు కాబట్టి కనీసం ఇంటర్‌లోనైనా ఎంఈసీ లేదా సీఈసీ గ్రూపు చదివితే కామర్స్‌పై మంచి పట్టు సాధించి భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకు మార్గం సుగమం చేసుకోవచ్చు.


ఇంటర్‌లో గ్రూపులు - కామర్స్ కెరీర్

ఎంఈసీ గ్రూపు ప్రాముఖ్యం
1) ఎంఈసీ ప్రత్యేకమైన గ్రూపుగా చెప్పవచ్చు. ఎందుకంటే సహజంగా మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్నవారు ఎంపీసీ చదువుతారు. అలాగే కామర్స్ చదవాలనుకున్నవారు సీఈసీ చదువుతారు.
2) కానీ మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండి ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే భయపడేవారు, కామర్స్ అంటే ఇష్టం ఉండి లాజికల్‌గా ఉండే మ్యాథ్స్ కూడా కావాలి, భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలనుకున్నా అవకాశం ఉండాలనుకునేవారికి ఎంఈసీ బెస్ట్ చాయిస్.
3) సైన్స్ గ్రూపుల్లో ఉండే మ్యాథ్స్, కామర్స్ గ్రూపులోని ఎకనామిక్స్, కామర్స్ వంటి సబ్జెక్టుల కలయికే ఎంఈసీ గ్రూపు.
4) ఒకప్పుడు తెలుగు రాష్ర్టాంల్లో ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు చదివేవారు 4,000 నుంచి 5,000 మంది వరకే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య లక్ష పైచిలుకు వెళ్లిందంటే ఎంఈసీ గ్రూపునకు క్రేజ్ ఎంతగా పెరిగిందో అర్థంచేసుకోవచ్చు.
5) పోటీ తక్కువగా ఉండి భవిష్యత్తులో ఏ రంగంలో అయినా విశేష అవకాశాలు కావాలనుకునేవారు ఎంచుకునే మొదటి గ్రూపుగా ఎంఈసీని పేర్కొనవచ్చు.

commerce3

ఇంటర్‌లో ఎంఈసీతో కెరీర్

-ఇంటర్‌లో ఎంఈసీ చదివి భవిష్యత్తులో సీఈ/సీఎంఏ/సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవచ్చు. అలాగే సీఏ/సీఎంఏ/సీఎస్ చదవాలంటే ఇంటర్ ఎంఈసీతో మంచి పునాది ఏర్పడుతుంది. ఈ కోర్సులు సులభంగా పూర్తిచేస్తున్నవారిలో అధికంగా ఎంఈసీ చదివినవారే ఉండటం గమనార్హం.
-ఇంటర్‌లో ఎంఈసీ తీసుకుని భవిష్యత్తులో బీకాం, బీబీఎం, బీఏ, బీఎస్సీ చదివి ఆ తర్వాత ఎంకాం, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ పూర్తిచేయవచ్చు. అంతేకాకుండా గ్రూప్స్, సివిల్స్, బ్యాంక్ పరీక్షలు, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు కూడా సన్నద్ధం కావచ్చు.

సీఈసీ ప్రాముఖ్యత

-సీఈసీ అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ వంటి మూడు ప్రధాన సబ్జెక్టుల కలయిక. చాలామంది సైన్స్ గ్రూపువారికి ఉన్నన్ని ఉద్యోగావకాశాలు సీఈసీ చదివినవారికి ఉండవని భావిస్తుంటారు. కానీ అది అవాస్తవం. సీఈసీ చదివినవారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్‌లో సీఈసీ చదివి డిగ్రీ పూర్తిచేసి అనేక రంగాల్లోకి ప్రవేశించవచ్చు. లా పూర్తిచేయడానికి, సివిల్స్ తదితర కాంపిటీటివ్ పరీక్షలు రాయడానికి సీఈసీ గ్రూపులోని సబ్జెక్టే కీలకం. ఎక్కువశాతం జనరల్ నాలెడ్జ్, సమాజానికి సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అంశాలతో కామర్స్‌ను కూడా అనుసంధానం చేయడంవల్ల ఈ గ్రూపునకు ప్రాధాన్యం మరింత పెరిగింది. కామర్స్ కెరీర్ కావాలి. కానీ మ్యాథ్స్ అంటే భయపడేవారు నిశ్చింతగా సీఈసీ తీసుకోవచ్చు. సీఈసీతో సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేయవచ్చు.

సీఏ

-కామర్స్ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన రంగం చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ). సీఏ అంటే తొమ్మిది, పదేండ్లు పడుతుందని చాలామంది భయపడుతుంటారు. ఇటీవలకాలంలో ఫలితాలు చూస్తే 21-22 ఏండ్లకే చాలామంది సీఏ పూర్తిచేస్తున్నారు. గత నాలుగేండ్లుగా అమ్మాయిలు ఎక్కువగా పాసవుతున్నారు. వృత్తిరీత్యా లభించే గౌరవం, సామాజిక హోదా, ఆదాయ వనరులు బాగా ఉండటంతో ఈ కోర్సు ఆకర్షణీయంగా మారింది.

సీఏ ఎవరు చదవవచ్చు

-ఒకప్పుడు డిగ్రీ తర్వాతగాని సీఏలోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్ తర్వాతనే సీఏ చదవవచ్చు.
-సీఏ చేయాలనకునే చాలామంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపుతోపాటే సీఏ కూడా ఏకకాలంలో చదవడానికే సుముఖత చూపిస్తున్నారు.

సీఏలకు అవకాశాలు

-పన్ను గణన, అకౌంటింగ్, డేటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు లక్షకుపైగా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. జీఎస్టీ అమలువల్ల నగదు చెలామణి లాభదాయకత, పారదర్శకత మెరుగుపడి పన్ను ఎగవేతలు తగ్గిపోతాయని, ఫలితంగా సంభవించే ఆర్థిక అభివృద్ధివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే అంచనాను వ్యక్తం చేస్తున్నారు.
-విదేశాల్లో కూడా మన సీఏలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్స్ ఇంప్లిమెంటార్స్, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు. అంతేకాకుండా ట్రస్టీగా, అడ్మినిస్ట్రేటర్‌గా, వ్యాల్యూయర్‌గా, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్‌లుగా ఉద్యోగాలు లభిస్తాయి. నిరుద్యోగం మచ్చుకైనా లేని కోర్సు సీఏ.

సీఏలోని దశలు

మొదటి దశ - సీఏ ఫౌండేషన్
-ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్ష రాసినవారు ఎవరైనా సీఏ ఫౌండేషన్‌కు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న నాలుగు నెలలకు ఈ పరీక్ష రాయవచ్చు.
-సహజంగా ప్రతి ప్రవేశ పరీక్షను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. గతంలో ఇప్పటి సీఏ ఫౌండేషన్ స్థానంలో నిర్వహించిన సీపీటీ పరీక్ష కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలరూపంలోనే నిర్వహించేవారు. కానీ సీఏ ఫౌండేషన్ పరీక్షలో 50 శాతం మార్కులను డిస్క్రిప్టివ్‌గా, మరో 50 శాతం మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుగా పరీక్ష నిర్వహిస్తారు.
-మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉండటవంల్ల విద్యార్థులకు విశ్లేషణాత్మకత పెరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉండటంవల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంది.
-నేటి కాలమాన పరిస్థితులకనుగుణంగా, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా సీఏ విద్యార్థికి అన్నిరకాల నైపుణ్యాలు ఉండాలన్న ఉద్దేశంతో సిలబస్ ఇలా రూపొందిస్తారు.
-సీఏ ఫౌండేషన్ పరీక్ష నాలుగు పేపర్లుగా, ఒక్కో పేపర్ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు ఉంటుంది. పేపర్-1, 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో, పేపర్-3, 4 ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి.
-సీఏ ఫౌండేషన్ పరీక్షలు ప్రతి ఏడాది మే, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు.
-సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థి ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అలాగే నాలుగు పేపర్లు కలిపి 400 మార్కులకుగాను 50 శాతం మార్కులు అంటే 200 మార్కులు సాధించాలి.

రెండో దశ- సీఏ ఇంటర్మీడియట్

-సీఏ ఇంటర్మీడియట్ కోర్సును గతంలో సీఏ-ఐపీసీసీ అని పిలిచేవారు.
-సీఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారు సీఏ ఇంటర్మీడియట్ చదవడానికి అర్హులు.
-సీఏ ఇంటర్మీడియట్ గ్రూపు-1లో నాలుగు పేపర్లు, గ్రూపు-2లో నాలుగు పేపర్లు మొత్తం ఎనిమిది పేపర్లుగా సిలబస్‌ను రూపొందించారు.
-నూతన విధానంలో కూడా విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.
-సీఏ ఇంటర్మీడియట్ పరీక్ష ఏడాదికి రెండు సార్లు మే, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు.
-సీఏ ఇంటర్మీడియట్ పరీక్ష ఎనిమిది పేపర్లు రెండు గ్రూపులుగా (గ్రూపునకు నాలుగు పేపర్లు) ఒక్కో పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు.
-విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులను సాధించాలి.
-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు మూడేండ్ల ఆర్టికల్‌షిప్ చేయాలి.
-రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్ష రాయడానికి అర్హులు.

మూడో దశ - సీఏ ఫైపల్

-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసి రెండున్నరేండ్లు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్షకు నమోదు చేయించుకుని సీఏ ఫైనల్ పరీక్ష రాయవచ్చు.
-సీఏ ఫైనల్ పరీక్ష ఎనిమిది పేపర్ల్లు రెండు గ్రూపులుగా (గ్రూపునకు నాలుగు పేపర్లు) ఒక్కో పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు.
-సీఏ ఫైనల్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు. సీఏ ఫైనల్ పరీక్ష సీఏ పాత విధానంలాగే మొత్తం ఎనిమిది పేపర్లు, రెండు గ్రూపులుగా (గ్రూపునకు నాలుగు పేపర్లు) ఒక్కో పేపర్ 100 మార్కులకు మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థి వీలునుబట్టి ఎనిమిది పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాయవచ్చు.
-ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తం 50 శాతం మార్కులు సాధించాలి.
-గ్రూపు-2లో 6వ పేపర్‌ను ఎలక్టివ్ పేపర్‌గా నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థి ఆరు సబ్జెక్టుల్లో ఏదో ఒకటి ఎంచుకుని చదవవచ్చు. దీనివల్ల విద్యార్థి తనకిష్టమైన పేపర్‌నే ఎంచుకుని అందులో నైపుణ్యం సాధించే అవకాశం ఉంటుంది.

సీఎంఏ

-సీఎంఏ చదవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకు విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇన్‌స్టిట్యూట్‌వారు ఐడీ కార్డు పంపుతారు. ఈ ఐడీ కార్డ్ ఉన్న విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు.

సీఎంఏ దశలు

-సీఎంఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్/ఎగ్జిక్యూటివ్, ఫైనల్ అనే మూడు దశలు ఉంటాయి.
-సీఎంఏ ఫౌండేషన్: సీఎంఏలోని మొదటి దశను ఫౌండేషన్ అని అంటారు. ఇంటర్ పూర్తిచేసినవారు సీఎంఏ ఫౌండేషన్ కోర్సుకు నమో దు చేయించుకుని సీఎంఏ ఫౌండేష న్ చదవవచ్చు. అదే ఇంటర్ ఎంఈ సీ విద్యార్థులైతే దాంతోపాటు సీఎం ఏ ఫౌండేషన్ కోర్సును సమాంతరంగా పూర్తిచేయవచ్చు.
-సీఎంఏ ఫౌండేషన్‌లోని మొత్తం ఎనిమిది సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. అంటే రెండు సబ్జెక్టులు కలిసి ఒక పేపర్. ప్రతి పేపర్‌లో 100 మార్కులకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో మొత్తం 400 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థి 400 మార్కులకుగాను 200 మార్కులు అంటే 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయాలి. అలాగే ప్రతి పేపర్‌లో 40 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
-సీఎంఏ ఇంటర్: ఫౌండేషన్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు సీఎంఏ ఇంటర్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏడాది పరీక్ష రాయవచ్చు.
-ప్రతి ఏడాది జూన్, డిసెంబర్‌లలో సీఎంఏ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. సీఎంఏ ఇంటర్ రెండు గ్రూపులుగా ఉంటుంది. గ్రూపు-1లో నాలుగు పేపర్లు ఉంటాయి. ఈ పేపర్లలో పరీక్ష 400 మార్కులకు జరిగితే ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించి మొత్తంగా 50 శాతం మార్కులతో 200, ఆపై మార్కులు సాధించినవారే ఉత్తీర్ణులవుతారు.
-గ్రూపు-2లో నాలుగు పేపర్లు ఉంటాయి. కనీసం 40 శాతం మార్కులు ప్రతి సబ్జెక్టులో సాధించాలి. అలాగే గ్రూప్ మొత్తంమీద 50 శాతం మార్కులు అంటే 200 ఆపై మార్కులు సాధించాలి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. సీఎంఏ ఇంటర్‌కు నమోదు చేసుకున్నవారు ఏడాది తర్వాత పరీక్ష రాయవచ్చు.
-సీఎంఏ ఇంటర్ పూర్తిచేసినవారు సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయా లి. అంటే ఆరునెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి.
-సీఎంఏ ఫైనల్: ఆరు నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తయిన విద్యార్థి ఫైనల్ పరీక్ష రాయవచ్చు. సీఎంఏ ఫైనల్‌లో కూడా రెండు గ్రూపులు (గ్రూప్-3, గ్రూప్-4) ఉంటాయి. ఫైనల్ పరీక్షకు అర్హత సాధించాలంటే విద్యార్థి కనీసం 6 నెలల ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాలి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.
-ప్రతి సబ్జెక్టులో 40 మార్కులు గ్రూప్ మొత్తంలో 50 శాతం మార్కులు అంటే 400లకు 200 మార్కులు సాధించాలి.
-సీఎంఏలకు అవకాశాలు: మేనేజ్‌మెంట్ కోర్సులనందించే సంస్థల్లో లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్స్‌గా ఉద్యోగం అభిస్తుంది. ఇంతేకాకుండా అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్, కాస్ట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కంట్రోలర్ వంటి కీలకమైన పదవులను నిర్వర్తించవచ్చు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐటీసీ, సిప్లా, జెన్‌ప్యాక్ట్ వంటి అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఎంతోమంది సీఎంఏలు అత్యంత ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదించారు.

కంపెనీ సెక్రటరీ (సీఎస్)

-సీఎస్ ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు స్థాయిల్లో పూర్తిచేయాలి.
-సీఎస్ ఫౌండేషన్: ఇంటర్ పూర్తిచేసినవారు సీఎస్ చదవవచ్చు.
-సీఎస్ ఫౌండేషన్ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష (ఎంట్రన్స్ ఎగ్జామ్)లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష మొత్తం 200 ప్రశ్నలు కలిగి 400 మార్కులకు జరుగుతుంది. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు అన్నమాట. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్‌గా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో విద్యార్థి 50 శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు.
-సీఎస్ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్ష (రెడు మాడ్యూల్స్‌గా 8 పేపర్లు) రాయవచ్చు. మాడ్యూల్‌లోని ప్రతి పేపర్‌లోనూ 40 శాతం మార్కులు తగ్గకుండా మాడ్యూల్ మొత్తం 50 శాతం మార్కులు సాధించాలి.
-సీఎస్ పూర్తిచేసే క్రమంలో తప్పనిసరిగా అప్రెంటిస్‌షిప్ పేరుతో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేయాలి. ఈ అప్రెంటిస్‌షిప్ గరిష్ఠ వ్యవధి మూడేండ్లు. అయితే ఇది అభ్యర్థులు సీఎస్ కోర్సు ఏ దశలో చేరారో దానికనుగుణంగా ఈ వ్యవధిలో మార్పు ఉంటుంది.
-ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాసిన ఏడాది తర్వాత ఈ ప్రొఫెషనల్ పరీక్ష (మూడు మాడ్యూల్స్‌గా 9 పేపర్లు) రాయాలి. మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి 50 శాతం సగటు మార్కులను సాధిస్తే విద్యార్థి మాడ్యూల్/ప్రొఫెషనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు.
-రెండు, మూడు దశల్లో మార్పులు: 2018, మార్చి 1 నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (మాడ్యూల్ 1/4 పేపర్లు, మాడ్యూల్ 2/4 పేపర్ల)కు కొత్త సిలబస్ అమల్లోకి వచ్చింది. దీనిప్రకారం మొదటి పరీక్ష డిసెంబర్ 2018 నుంచి నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ (మూడు మాడ్యూల్స్‌లో 9 పేపర్లు)కు 2019, సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిలబస్ అమలవుతుంది. ఈ సిలబస్ ప్రకారం మొదటి పరీక్ష 2019, జూన్ నుంచి నిర్వహిస్తారు.

అవకాశాలు

-సంస్థలోపల కీలకమైన బాధ్యతలను నిర్వహించి, వ్యాపార సామ్రాజ్యాన్ని తమ భుజస్కంధాలపై మోసేవారే, నేర్పుతో, ఓర్పుతో వ్యాపారవేత్తలకు ఎప్పటికప్పుడు సమయానుగుణంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారే కంపెనీ సెక్రటరీలు.
-బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు సలహాలివ్వడం, కంపెనీ రిజిస్ట్రార్‌గా, కంపెనీ న్యాయ సలహాలను అందిస్తూ, కంపెనీ విధానాల రూపక్తగా, కంపెనీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా, కంపెనీ ప్రిన్స్‌పాల్ సెక్రటరీగా, కంపెనీ యాజమాన్యానికి, వాటాదారులకు, రుణదాతలకు అనుసంధానకర్తగా అనేక రూపాల్లో, హోదాల్లో ఉద్యోగం చేయవచ్చు. కంపెనీ సెక్రటరీలు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్లుగా, బ్యాంక్ మేనేజర్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మంచి హోదాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

commerce2

సీఎస్

-పూర్తిపేరు: కంపెనీ సెక్రటరీ
-నిర్వహణ సంస్థ: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ
-వ్యవధి: నాలుగున్నరేండ్లు (పది తర్వాత)
-దశలు: సీఎస్ ఫౌండేషన్, సీఎస్ ఎగ్జిక్యూటివ్/ఇంటర్, సీఎస్ ప్రొఫెషనల్
-వ్యవధి: సీఎస్ ఫౌండేషన్- 6 నెలలు, సీఎస్ ఇంటర్- 9 నెలలు, సీఎస్ ప్రొఫెషనల్- ఏడాది
-రిజిస్ట్రేషన్ ఫీజు: సీఎస్ ఫౌండేషన్- రూ.4,500, సీఎస్ ఎగ్జిక్యూటివ్- రూ.8,500, సీఎస్ ప్రొఫెషనల్ రూ.12,000
-పరీక్షలు ఎప్పుడు: జూన్, డిసెంబర్‌లలో
-ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు: సీఎస్ ఫౌండేషన్- ఆబ్జెక్టివ్, సీఎస్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ ఫైనల్- డిస్క్రిప్టివ్
-వెబ్‌సైట్: www.icsi.edu

సీఏ

-పూర్తిపేరు: చార్టర్డ్ అకౌంటెన్సీ
-నిర్వహణ సంస: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), న్యూఢిల్లీ
-కోర్సు వ్యవధి: ఆరున్నరేండ్లు (పది తర్వాత)
-దశలు: సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్
-వ్యవధి: సీఏ ఫౌండేషన్- 6 నెలలు, సీఏ ఇంటర్- 8 నెలలు, సీఏ ఫైనల్- 3 ఏండ్లు
-రిజిస్ట్రేషన్‌కయ్యే ఖర్చు: సీఏ ఫౌండేషన్- రూ.9,200, సీఏ ఇంటర్- రూ.18,000, సీఏ ఫైనల్ రూ.22,000
-పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు: ప్రతి ఏడాది రెండుసార్లు మే, నవంబర్‌లలో పరీక్షలు ఉంటాయి.
-ఎలాంటి ప్రశ్నలు: సీఏ ఫౌండేషన్- ఆబ్జెక్టివ్+డిస్క్రిప్టివ్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్- డిస్క్రిప్టివ్
-వెబ్‌సైట్: www.icai.org

సీఎంఏ

-పూర్తిపేరు: కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ
-నిర్వహణ సంస్థ: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, కోల్‌కతా
-వ్యవధి: నాలుగున్నరేండ్లు (పది తర్వాత)
-దశలు: సీఎంఏ ఫౌండేషన్, సీఎంఏ ఎగ్జిక్యూటివ్/ఇంటర్, సీఎంఏ ఫైనల్
-వ్యవధి: సీఎంఏ ఫౌండేషన్- 6 నెలలు, సీఎంఏ ఎగ్జిక్యూటివ్- ఏడాది, సీఎంఏ ఫైనల్- ఏడాది
-రిజిస్ట్రేషన్ ఫీజు: సీఎంఏ ఫౌండేషన్- రూ.4000, సీఎంఏ ఎగ్జిక్యూటివ్- రూ,20,000, సీఎంఏ ఫైనల్ రూ.17,000
-పరీక్షలు ఎప్పుడు: ప్రతి ఏడాది రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో పరీక్షలు ఉంటాయి.
-ఎలాంటి ప్రశ్నలు: సీఎంఏ ఫౌండేషన్- ఆబ్జెక్టివ్+డిస్క్రిప్టివ్, సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్- డిస్క్రిప్టివ్
-వెబ్‌సైట్: www.icmai.in
mattupalli-prakash

571
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles