ఎస్‌బీఐ క్లర్క్-2019


Mon,April 22, 2019 01:36 AM

sbi-clerk

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8653 క్లర్క్ కొలువులు

-దేశంలోనే ప్రధాన బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఖాళీలను భర్తీచేయడానికి పీవో, క్లర్క్ నోటిఫికేషన్ జారీచేసింది. సొంత రాష్ట్రంలో జాబ్ చేయాలని ఆశించేవారికి బ్యాంక్ క్లర్క్ ఉద్యోగం ఓ అద్భుత అవకాశం. ఇక భారతదేశంలోనే ప్రథమ, ప్రధాన బ్యాంక్ అయిన ఎస్‌బీఐలో నౌకరీ అంటే ఇష్టపడనివారుండరు. సాధారణ డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రస్తుతం ఎస్‌బీఐ రెండు ఉత్తర్వులు ఇచ్చింది. అవే పీవో, 8653 క్లర్క్ పోస్టులు. రెండు పోస్టులకు పరీక్ష స్వరూపం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అభ్యర్థులు కూడా పీవో, క్లర్క్‌లకు వేర్వేరుగా అప్లయ్ చేసుకోవచ్చు. కానీ పరీక్షకు సన్నద్ధం మాత్రం ఒకేలా ప్రణాళిక చేసుకోవాలి.
-2019లో 2,00,000 బ్యాంక్ కొలువులు ఉండవచ్చని ఒక అంచనా. ప్రస్తుతం ఎస్‌బీఐతో పీవో, క్లర్క్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇంకా నాబార్డు, ఆర్‌బీఐ, ఐబీపీఎస్, గ్రామీణ బ్యాంకులు, మణిపాల్ ద్వారా కూడా నోటిఫికేషన్లు రానున్నాయి. ఇవి వచ్చే జూన్, జూలై నుంచి భర్తీ ప్రక్రియ ప్రారంభించనున్నాయి. కాబట్టి బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునేవారు వెంటనే ఎస్‌బీఐకి అప్లయ్ చేసి తమ ప్రిపరేషన్ కొనసాగిస్తే వచ్చే ఆరు నెలల్లోపే బ్యాంకు ఉద్యోగిగా మారవచ్చు.
-కెరీర్‌లో అత్యున్నత స్థానం చేరుకోవడం, మంచి జీతభత్యాలు, సమాజంలో గౌరవం బ్యాంకు ఉద్యోగి సొంతం.

sbi-clerk4

పరీక్ష స్వరూపం

-బ్యాంక్ పరీక్షల్లో ఎస్‌బీఐ పరీక్ష కాస్త కఠినంగా ఉంటుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ లెవల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. కాబట్టి విద్యార్థులు కూడా అదే తరహా ప్రశ్నలు ప్రిపేర్ కావడం మంచిది. మనం సాధారణంగా బ్యాంకు పరీక్ష నాలుగు విభాగాలు అంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలే అడుగుతారు. అన్ని బ్యాంకు పరీక్షలు దాదాపు ఒకేలా ఉంటాయనుకుంటాం. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. బ్యాంకు కార్యకలాపాలను బట్టి ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ఎస్‌బీఐ వాణిజ్య బ్యాంకు కాబట్టి ఆర్థిక, వాణిజ్యం, ఖాతాదారుల నియమాలు వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. అదే ఆర్‌బీఐ, నాబార్డ్‌లు రెగ్యులేటరీ బ్యాంకులు కాబట్టి ఆర్థిక వనరులు, కేంద్ర ప్రభుత్వ విధివిధానాలపై ప్రశ్నలు వస్తాయి.
-ఇక ఎస్‌బీఐ వంటి ప్రధాన బ్యాంకు పరీక్ష స్వరూపం విషయానికి వస్తే ఇవి కాస్త క్లిష్టంగా, కఠినంగా ఉండి భిన్న విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు సమయం ఎక్కువ పట్టే ప్రశ్నల జోలికి పోకుండా తక్కువ సమయంలో ఎక్కువ స్కోరు చేసే చాప్టర్లు, ప్రశ్నలపై దృష్టిపెట్టాలి.
-ప్రస్తుతం ఎస్‌బీఐ విడుదల చేసిన పీవో, క్లర్క్ పరీక్షలో రాతపరీక్ష రెండంచెలుగా ఉంటుంది.
-పీవో ఆఫీసర్ లెవల్ పోస్టులు కాబట్టి మూడంచెల పరీక్ష అంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

sbi-clerk2

పరీక్ష విధానం

-ప్రిలిమినరీ (ఆన్‌లైన్‌లో అబ్జెక్టివ్ తరహా): ఇది మొదటి దశ. ఇందులో మూడు విభాగాల నుంచి మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-మెయిన్స్ (ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ తరహా): ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్‌లో 190 ప్రశ్నలకు 200 మార్కులతో పరీక్ష ఉంటుంది.
-లోకల్ లాంగ్వేజీ టెస్ట్: అభ్యర్థి ఎంచుకున్న రాష్ట్ర భాష (మాట్లాడటం, రాయడం, చదవడం) కచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ టెన్త్, ఇంటర్‌లో ఆ రాష్ట్ర భాషలో ఒక లాంగ్వేజీ పేపర్ ఎంచుకున్న అభ్యర్థికి ఈ మూడో అంచె పరీక్ష ఉండదు.
-ప్రిలిమినరీ పరీక్ష: ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఇందులో మూడు విభాగాలు చాలా కీలకం. ఎందుకంటే ఇవి మళ్లీ మెయిన్స్‌లో కూడా వస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఉమ్మడిగానే ప్రిపేర్ కావాలి.
-ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కుల కోత విధిస్తారు. కాబట్టి సమయస్ఫూర్తితో ప్రతి విభాగాన్ని సాల్వ్ చేయాలి. అంటే మూడు విభాగాల్లో ప్రశ్నలు కచ్చితంగా బ్యాలెన్స్‌డ్‌తో/మినిమం ప్రశ్నలు పూర్తిచేయాలి. అయితే ప్రతి విభాగంలో కనీస మార్కులు రావాలనే నిబంధనేమీ లేదు.
-మెయిన్స్: ఇది ప్రధాన పరీక్ష. ఇందులో సాధించిన మార్కులను తుది జాబితా ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థులు మొదటి దశ నుంచే అన్ని విభాగాలపై పట్టు సాధించాలి. ఇందులో కూడా సబ్జెక్టులవారీ కనీస అర్హత మార్కులు లేవు. కానీ అన్ని విభాగాల్లో కచ్చితంగా ఉత్తీర్ణ సాధించాలి.
-ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. ఇక్కడ సమయపాలన చాలా కీలకం. ప్రతి విభాగం నిర్ణీత సమయంతోకూడిన విండో ఓపెన్ అవుతుంది. కేటాయించిన సమయం అయిపోగానే అది క్లోజ్ అయి ఇంకో విభాగం ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ విద్యార్థులకు తాము విభాగాన్ని ఎంచుకునే అవకాశం లేదు. కేవలం సమయానుసారంగా పరీక్ష హాలులో మెలగడం, తాము బాగా ప్రాక్టీస్ చేసిన అంశాలను మాత్రమే సాల్వ్ చేయడం ఉత్తమం.
-మెయిన్స్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఎస్‌బీఐ క్లర్క్ ఉద్యోగం సాధించినట్లే. కాబట్టి మెయిన్స్ మార్కులే కీలకం, కొలమానం అన్న భావనతో చక్కటి ప్రణాళిక వేసుకుని సాధన కొనసాగించండి.

sbi-clerk3

ప్రిపరేషన్ ప్లాన్

-క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: న్యూమరికల్ ఎబిలిటీ/అర్థమెటికల్ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది రెండు దశల్లో ఉపయోగపడే విభాగం. కాబట్టి అభ్యర్థులు ప్రతిరోజూ చాప్టర్లవారీగా ప్రాక్టీసు చేయాలి. ఇందులో క్యాలిక్యులేషన్ పార్ట్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. క్లర్క్ పరీక్షలో అర్థమెటిక్ నుంచి సింప్లిఫికేషన్స్, నంబర్ సిస్టమ్స్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్స్‌లదే కీలకపాత్ర. వీటిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. 60 శాతం ప్రశ్నలు ఈ చాప్టర్ల నుంచే వస్తాయి. శాతాలు, నిష్పత్తులు, బాడ్‌మాస్, సరాసరి, లాభనష్టాలు వంటి బేసిక్ టాపిక్స్‌తో పాటు సింపుల్ ఇంట్రస్ట్-కాంపౌండ్ ఇంట్రస్ట్, టైం అండ్ వర్క్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వంటి చాప్టర్లపై కూడా పట్టు సాధించాలి.
-ఈ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని స్కోరింగ్ సబ్జెక్టుగా ఎంచుకోవాలి. అర్థమెటిక్ టాపిక్ ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయాలి. మోడల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. కేటాయించిన సమయంలో మనం చేయగలిగిన ప్రశ్నలు/చాప్టర్లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలను గ్రహించి ముందు వాటిని పూర్తిచేయగలగాలి. నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు క్యాలిక్యులేషన్ పార్ట్ వంటివి నిరుత్సాహపడకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. పెన్ పేపర్ ప్రాక్టీస్‌తో పాటు ఆన్‌లైన్‌లో రెగ్యులర్‌గా చాప్టర్‌వైజ్, గ్రాండ్ టెస్ట్‌లు రాస్తూ ఉండాలి.
-రీజనింగ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం కూడా రెండు దశల్లోనూ ఉంటుంది. అభ్యర్థులు దీన్ని స్కోరింగ్ సబ్జెక్టుగా పరిగణిస్తుంటారు. ఎస్‌బీఐ క్లరికల్ రీజనింగ్ కూడా హెచ్చుస్థాయిలో ఉంటుంది. అయితే సమయస్ఫూర్తితో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలను గుర్తించి వాటిని ముందుగా సాల్వ్ చేయడంవల్ల మంచి స్కోరు చేసే అవకాశం ఉంది. రీజనింగ్ విభాగం నుంచి పజిల్ టెస్ట్, సీటింగ్ అరెంజ్‌మెంట్స్, కోడింగ్-డికోడింగ్, సిలాజిసం వంటి చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే స్టేట్‌మెంట్స్, ఎలిజిబిలిటీ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, లెటర్ సిరీస్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి.
-ఎస్‌బీఐ పరీక్షలో రీజనింగ్ విభాగంతో కలిపి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు అడుగుతాటారు. 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
-కంప్యూటర్ నాలెడ్జ్: కంప్యూటర్ నాలెడ్జ్‌లో బేసిక్స్ ఆన్ కంప్యూటర్స్‌తోపాటు అడ్వాన్స్‌డ్ యూసెజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ పాలసీ బిల్డింగ్, ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్, బ్యాంకింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ పోర్టల్, టచ్ స్క్రీన్, నూతన ఆవిష్కృతాలు, రోబోటిక్ పరిజ్ఞానం తప్పనిసరి. ఇందులో బిట్టు పోకుండా మంచి స్కోరు సాధించవచ్చు.
-ఇంగ్లిష్ లాంగేజ్: బ్యాంక్ పరీక్షలో ఇంగ్లిష్ విభాగానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది రెండు దశల్లో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ప్రిలిమినరీ, మెయిన్స్‌లకు ఉమ్మడిగానే ప్రిపరేషన్ కొనసాగించాలి. 60 శాతం విద్యార్థులు విఫలమయ్యే విభాగం కూడా ఇదే కాబట్టి ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఇందుకు వార్తాపత్రికలు, మ్యాగజీన్లు, నవలలపై దృష్టిపెట్టాలి. ఫాస్ట్‌గా చదవడం, అర్థంచేసుకోవడం అలవర్చుకోవాలి. ఇక గ్రామర్ పార్ట్‌లో 30 నుంచి 40 శాతం ప్రశ్నలు వస్తాయి. కాబట్టి గ్రామర్‌పై పట్టులేనివారు ఇతర అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. అవి రీడింగ్ కాంప్రహెన్షన్స్, వొకాబులరీ, ఇడియమ్స్, ఫ్రేజెస్, మీనింగ్, సినానిమ్స్-ఆంటోనిమ్స్, సెంటెన్స్ అరెంజ్‌మెంట్స్ వంటివి.
-రెగ్యులర్‌గా ఆన్‌లైన్ టెస్టులు రాస్తూ ఉంటే ఈ విభాగంపై పూర్తి అవగాహన ఏర్పడి మంచి మార్కులు పొందవచ్చు.
-జనరల్ అవేర్‌నెస్: ఇది కేవలం మెయిన్స్‌లో మాత్రమే వచ్చే విభాగం. బ్యాంకింగ్ అంశాలు, ఎకానమీ టెర్మినాలజీ, ఆర్థిక సంస్థలు వంటివి తాజా పరిణామాలతో పోల్చి చదవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే అంత ఎక్కువ మార్కులు పొందవచ్చు.
-జనరల్ అవేర్‌నెస్ నుంచి జాతీయ-అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక స్థితిగతులు, బ్యాంకింగ్ టర్మ్స్-వాణిజ్య కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర బడ్జెట్, 15వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్, రిపోర్టులు, ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానం, ఆర్‌బీఐ ఇంట్రస్ట్ రేట్లు, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్ వంటి తాజా సమాచారాన్ని సేకరించాలి.
-ఇక కరెంట్ అఫైర్స్‌లో ముఖ్యంగా వార్తల్లో వ్యక్తులు, 17వ లోక్‌సభ ఎన్నికలు, భారత్-ఇతర దేశాల సంబంధాలు, వాటి మధ్య వాణిజ్య ఒప్పందాలు, ప్రధాని పర్యటనలు, అంతర్జాతీయ సంస్థలు వాటి వార్షిక మీటింగులు, ముఖ్యమైన తేదీలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు మొదలైనవి చదవాలి.
-అభ్యర్థులు ఈ అంశాలపై ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, రివిజన్ చేయడం, నెలవారీ కరెంట్ అఫైర్స్‌పై ఆన్‌లైన్‌లో ప్రశ్నలు-జవాబులు ప్రాక్టీస్ చేయడంవల్ల కూడా ఎక్కువ మార్కులు పొందవచ్చు.

sbi-clerk5

నోటిఫికేషన్ వివరాలు

-తాజాగా ఎస్‌బీఐ నుంచి వెలువడిన నోటిఫికేషన్స్‌లో పీవోలు 2000, క్లరికల్ 8653 పోస్టులు ఉన్నాయి.
-చివరితేదీలు పీవో- ఏప్రిల్ 22, క్లరికల్- మే 3
-అర్హతలు: ఏదైనా డిగ్రీ (డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు).
-వయస్సు: పీవోకు 21-30 ఏండ్లు, క్లరికల్‌కు 21-28 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఫీజు: రూ.125 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ), ఇతరులకు రూ.750
-వెబ్‌సైట్: www.sbi.co.in
-పరీక్ష తేదీలు: పీవో ప్రిలిమ్స్- జూన్ 8, 9, 15, 16, మెయిన్స్ జూలై 20, క్లరికల్ ప్రిలిమ్స్- జూన్ మొదటివారంలో, మెయిన్స్ ఆగస్టు 10
-పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లా కేంద్రాల్లో.

ఇలా చేయండి

-డిసిప్లీన్, హార్డ్‌వర్క్, పొటెన్షియాలిటీ, స్ట్రాటజీ అభివృద్ధికి ఉండాల్సిన లక్షణాలు. ప్రిపరేషన్ స్ట్రాటజీ లేకుండా మనం బ్యాంక్ ఉద్యోగం సాధించడం చాలా కష్టం. బ్యాంక్ పరీక్షలో రెండంచెలు రాతపరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. కాబట్టి కొన్ని నియమాలు పాటించాలి.
1) సిలబస్‌పై పూర్తి పట్టు సాధించాలి.
2) ప్రతి చాప్టర్/అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా సమయపాలనపై. అప్పుడే నెగెటివ్ మార్కింగ్ నుంచి బయటపడాలి.
3) పరీక్షలో అన్ని సబ్జెక్టులకు న్యాయం చేయాలి. కనీస అర్హత మార్కులు లేకపోయినా ప్రతి విభాగం నుంచి మినిమం మార్కులు పొందాలి.
4) మోడల్, ప్రీవియస్ పేపర్లను బాగా ప్రాక్టీస్ చేయడంవల్ల పరీక్షపై నమ్మకం ఏర్పడుతుంది.
5) ప్రతి రోజూ 8 నుంచి 10 గంట వ్యవధి కేటాయించి చదువుకోవాలి. ఎన్ని గంటలు చదివాం అన్నదానికంటే ఎంత నేర్చుకున్నాం, కచ్చితత్వం ఎంతవరకు ఉందో సొంతంగా పరిశీలించుకోవాలి.
6) నేర్చుకున్న టాపిక్స్‌ను వీలైనన్నిసార్లు రివిజన్ చేయాలి.
7) అర్థమెటిక్, రీజనింగ్‌తోపాటు జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌లకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
8) ప్రిలిమ్స్-మెయిన్స్‌కు ఉమ్మడిగా ప్రిపేర్ కావాలి. అప్పుడే మెయిన్స్‌లో అధికంగా స్కోర్ చేయవచ్చు.
9) ప్రతి రోజూ ఆన్‌లైన్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడంవల్ల సమయంపై పట్టు వస్తుంది.
madhu-kiran

380
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles