కరెంట్ అఫైర్స్


Wed,March 20, 2019 01:52 AM

Telangana
Telangana

విద్యుత్ తనిఖీ శాఖకు అవార్డు

తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్ఠాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు మార్చి 11న లభించింది. టీఎస్‌ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేసినందుకుగాను ఈ అవార్డు దక్కింది. నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లైసెన్స్‌ను పొందిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

టూరిజం ఫిల్మ్‌కు అవార్డు

జపాన్‌లోని ఒసాకా నగరంలో మార్చి 13, 14 తేదీల్లో జరిగిన వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్‌లో థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్‌కు కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు దక్కింది. మార్చి 14న ముగింపు వేడుకల్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ దూలం సత్యనారాయణ ఈ అవార్డును అందుకున్నారు.

మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్

అంతర్జాతీయ సంస్థ మెర్సర్ ప్రతి ఏడాది వివిధ అంశాలపై నిర్వహించే సర్వేలో హైదరాబాద్ ఉత్తమంగా నిలిచి వరుసగా ఐదోసారి స్థానం దక్కించుకుందని ఆ సంస్థ మార్చి 14న ప్రకటించింది. న్యూయార్క్‌కు చెందిన మెర్సర్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల్లో సర్వే నిర్వహిస్తుంది. ఈసారి మొత్తం 230 నగరాల్లో సర్వే చేయగా.. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు గుర్తింపు దక్కింది. దేశానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణ విభాగంలో చెన్నై మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే లివింగ్ ఇండెక్స్ కేటగిరీలో పుణెతో కలిసి ప్రథమ స్థానంలో నిలిచింది.

మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డ్

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో గూడ్స్ గార్డుగా ఓ మహిళ మార్చి 14న నియమితులయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.

National
National

అర్జెంటీనా ఉపాధ్యక్షురాలితో ఉపరాష్ట్రపతి భేటీ

అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు గాబ్రియెలా మిషెట్టితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్చి 12న ఢిల్లీలో భేటీ అయ్యారు. భారత్-అర్జెంటీనా మధ్య సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వెంకయ్య-గాబ్రియెలా నిర్ణయించారు.

గోవా సీఎం పారికర్ మృతి

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో మార్చి 17న మరణించారు. 1994లో గోవా అసెంబ్లీకి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000, అక్టోబర్ 24న గోవా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు. 2014-17 మధ్య కేంద్ర రక్షణ మంత్రిగా వ్యవహరించారు.

కొత్త పార్టీ

ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన జమ్మూకశ్మీర్‌కు చెందిన షా ఫైజల్ మార్చి 17న కొత్త పార్టీని స్థాపించారు. దీనికి జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ అని నామకరణం చేశారు. ఈయన 2010 ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు.

Sports
Sports

చెస్‌లో భారత్‌కు నాలుగో స్థానం

కజకిస్థాన్‌లోని ఆస్తానాలో మార్చి 14న జరిగిన ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్ షిప్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. రష్యాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్ ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా స్వర్ణం, ఇంగ్లండ్ రజతం, చైనా కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.

ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత కర్ణాటక

ముస్తాక్ అలీ టీ20 క్రికెట్ ట్రోఫీని కర్ణాటక జట్టు గెలుపొందింది. మార్చి 14న ఇండోర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు మహారాష్ట్రపై విజయం సాధించింది.

గోల్ఫ్ విజేత దీక్షా దాగర్

దక్షిణాఫ్రికాలో మార్చి 14న జరిగిన దక్షిణాఫ్రికా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ విజేతగా దీక్షా దాగర్ నిలిచారు. భారత్ తరఫున యూరోపియన్ టూర్ గోల్ఫ్ టైటిల్ గెలిచిన రెండో మహిళ ఈమె. దీక్షా కంటే ముందు అదితి అశోక్ 2016లో తొలి యూరోపియన్ టైటిల్ విజేతగా నిలిచారు.

Persons
Persons

అత్యధిక వయస్కురాలిగా కానే

ప్రపంచంలోనే అత్యధిక వయస్కురాలిగా జపాన్‌లోని ఫుకోకా ప్రాంతానికి చెందిన 116 ఏండ్ల కానే తనకా గిన్నిస్ రికార్డు సాధించింది. జపాన్ రాజధాని టోక్యోలో మార్చి 9న జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. ఆమె 1903, జనవరి 2న జన్మించింది. ఇంతకుముందు అత్యధిక వయస్కురాలిగా రికార్డు ఉన్న చియో మియాకో (117) 2018 జూలైలో మరణించింది. ఈమె కూడా జపాన్‌కు చెందినవారే.

ప్రజాపతి త్రివేదికి అవార్డు

లండన్‌లోని కామన్వెల్త్ సెక్రటేరియట్‌లో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ప్రజాపతి త్రివేదికి ప్రతిష్ఠాత్మక హ్యారీ హ్యాట్రీ డిస్టింగ్విష్డ్ పర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ అవార్డు-2019 లభించింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో మార్చి 10న జరిగిన కార్యక్రమంలో సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ పర్ఫామెన్స్ (సీఏపీ), అమెరికన్ సొసైటీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏఎస్‌పీఏ) ఈ అవార్డును ప్రజాపతికి ప్రదానం చేశాయి. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు.

16 ఏండ్లకే నోబెల్‌కు నామినేట్

స్వీడన్ దేశానికి 16 ఏండ్ల బాలిక నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించింది. నోబెల్ శాంతి బహుమతి అందుకున్నవారిలో మలాల (17 ఏండ్లు) అత్యంత పిన్నవయస్కురాలు. అంతకంటే ఏడాది తక్కువ వయస్సున్న గ్రెటా థంబెర్గ్ నోబెల్‌కు నామినేట్ అయ్యింది. ఈమె పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు.

ఎల్‌ఐసీ చైర్మన్‌గా కుమార్

ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) నూతన చైర్మన్‌గా ఎంఆర్ కుమార్ మార్చి 13న పదవీ బాధ్యతలు చేపట్టారు. అలాగే మేనేజింగ్ డైరెక్టర్‌గా దక్షిణ మధ్య జోన్ మేనేజర్ టీసీ సుశీల్ కుమార్ మార్చి 14న నియమితులయ్యారు.

మాతా మహాదేవి మృతి

కర్ణాటకలో లింగాయత్ వర్గ మహిళా పీఠాధిపతిగా పేరుపొందిన మాతా మహాదేవి బెంగళూరులో మార్చి 14న మరణించారు. పీఠాలకు నెలవైన కర్ణాటకలో ఏకైక మహిళా సాధ్విగా మహాదేవి చోటు సంపాదించారు. బాగల్‌కోట్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కూడల సంగమ కేంద్రంగా ఆమె బసవధర్మ పీఠాన్ని నిర్మించి బసవేశ్వరుని తత్వాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.

ప్రథమ లోక్‌పాల్‌గా పీసీ ఘోష్


దేశ ప్రథమ లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ మార్చి 17న నియమితులయ్యారు. 2017లో సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయిన ఆయన ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులుగా కొనసాగుతున్నారు.

International
International

స్టీఫెన్ హాకింగ్ స్మారక నాణేల విడుదల

ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరిట బ్రిటన్ మార్చి 12న స్మారక నాణేలను విడుదల చేసింది. కృష్ణబిలాలపై హాకింగ్ పరిశోధనకుగాను వీటికి బ్లాక్‌హోల్ కాయిన్స్‌గా నామకరణం చేసింది. వెండి, బంగారంతో తయారుచేసిన ఈ 50 పెన్స్ (అర పౌండ్) నాణేల ధరను 55, 795 పౌండ్లుగా నిర్ణయించారు.

వరల్డ్ వైడ్ వెబ్‌కు 30 ఏండ్లు

హైపర్ టెక్ట్స్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్ (హెచ్‌టీటీపీ) ద్వారా వరల్డ్ వైడ్ వెబ్(www) సాంకేతికతతో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించి మార్చి 12 నాటికి 30 ఏండ్లు నిండిన సందర్భంగా ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్) జెనీవాలో వేడుకలు నిర్వహించింది. 1989, మార్చి 12న టిమ్ బెర్నర్స్‌లీ వరల్డ్ వైడ్ వెబ్‌ను కనుగొన్నారు.

బోయింగ్ 737 విమానాలపై నిషేధం

బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మార్చి 12న నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

పుస్తక సమీక్ష


Book
- తెలంగాణ సర్వస్వంరాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యానికి పెద్ద పీఠ వేస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ తెలంగాణ సర్వస్వం పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకాన్ని సంకలనం చేసిన దేవపూజ శ్రీకాంతాచారి పలు ప్రామాణిక గ్రంథాల నుంచి సేకరించిన అంశాలను క్రమపద్ధతిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొందుపర్చారు.
- పేజీలు: 530, ధర రూ.399/-.
- పుస్తకాల కోసం ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్, అశోక్‌నగర్, హైదరాబాద్,
- సెల్‌నంబర్లు-9949833833/9246577890లో సంప్రదించవచ్చు.

Vemula-Saidulu

688
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles