కరెంట్ అఫైర్స్


Wed,February 13, 2019 01:46 AM

Telangana
Telangana

దీపికారెడ్డికి సంగీత అకాడమీ అవార్డు

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డును రాష్ట్రపతి భవన్‌లో ఫిబ్రవరి 6న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. 2017కు గాను సంగీతం, నృత్యం, నాటకాలు, కళారంగానికి అందించిన సేవలు, సంప్రదాయ గిరిజన నృత్యం-తోలుబొమ్మలాట వంటి పలు విభాగాల్లో 42 మంది కళాకారులకు అవార్డులు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన దీపికారెడ్డి 47 ఏండ్లుగా కూచిపూడి నాట్య రంగంలో తన సేవలను అందిస్తున్నారు.

విజయ డెయిరీకి అవార్డు

ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో భాగంగా ఫిబ్రవరి 8న జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో రాష్ర్టానికి చెందిన విజయ డెయిరీకి జాతీయ అవార్డు లభించింది. కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేశ్ ప్రభు విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ఆహార భద్రత-ఆహార నాణ్యత విభాగంలో ఈ అవార్డు దక్కింది.

తెలంగాణలో నాణ్యమైన పట్టు ఉత్పత్తి

దేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు జాతీయ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర జౌళి శాఖ ఫిబ్రవరి 9న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందజేసింది. 2018లో దేశంలో అత్యధికంగా బైవోల్టిన్ (అత్యంత నాణ్యమైన) పట్టు గుడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 3,176 ఎకరాలుగా ఉన్న మల్బరీ సాగు తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10,645 ఎకరాలకు విస్తరించింది.

ఎర్రవల్లికి జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డు

సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి గ్రామానికి జాతీయ స్వచ్ఛత శక్తి అవార్డు లభించింది. ఫిబ్రవరి 12న ప్రధాని నరేంద్రమోదీ ఈ అవార్డును ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మికి అందజేశారు.

విజయ్‌కుమార్‌కు పురస్కారం

కవి కోడూరి విజయ్‌కుమార్ ప్రజాకవి మల్లావఝల సదాశివుడు పురస్కారాన్ని ఫిబ్రవరి 10న అందుకున్నారు.

Sports
Sports

రంజీ ట్రోఫీ విజేతగా విదర్భ జట్టు

2018-19 సీజన్ రంజీ ట్రోఫీ విజేతగా విదర్భ జట్టు నిలిచింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ సౌరాష్ట్ర జట్టుపై గెలిచింది.

ఈజీఏటీలో మీరాబాయికు స్వర్ణం

థాయిలాండ్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఈజీఏటీ కప్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు స్వర్ణ పతకం లభించింది. మహిళల 49 కేజీల విభాగంలో స్నాచ్‌లో 82 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 110 కేజీలు కలిపి మొత్తం 192 కేజీల బరువెత్తింది. ఈ కప్‌ను ద్వితీయ శ్రేణి ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీగా వ్యవహరిస్తారు.

సియాటెల్ ఓపెన్ విజేత రమిత్

సియాటెల్ ఓపెన్ ప్రొఫెషనల్ స్కాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) చాలెంజర్ టోర్నమెంట్ విజేతగా భారత స్కాష్ ప్లేయర్ రమిత్ టాండన్ నిలిచాడు. అమెరికాలో ఫిబ్రవరి 3న జరిగిన ఫైనల్లో ప్రపంచ 58వ ర్యాంకర్ రమిత్ ఈజిప్ట్‌కు చెందిన మొహమ్మద్ ఎల్ షెర్బినిపై గెలుపొందాడు.

పీవీ సింధుతో లి నింగ్ సంస్థ ఒప్పందం

బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ (పూసర్త వెంకట) సింధుతో చైనాకు చెందిన క్రీడా పరికరాల సంస్థ నాలుగేళ్లకు స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ఫిబ్రవరి 8న కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సింధుకు రూ.50 కోట్లు చెల్లించనుంది. ప్రపంచంలో ఒక షట్లర్ కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఇది ఒకటి

పంకజ్‌కు స్నూకర్ టైటిల్

ఇండోర్‌లో ఫిబ్రవరి 10న జరిగిన సీనియర్ స్నూకర్ జాతీయ చాంపియన్‌షిప్ పోటీలో పంకజ్ లక్ష్మణ్ రావత్‌పై గెలుపొందాడు. మొత్తంగా సీనియర్ స్థాయిలో అతడికిది 89వ టైటిల్. పంకజ్ స్నూకర్, బిలియర్డ్స్‌లో కలిపి మొత్తం 21 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. మహిళల్లో వర్ష టైటిల్ విజేతగా నిలిచింది.

Persons
Persons

సీబీఐ చీఫ్‌గా రిషి కుమార్

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 28వ డైరెక్టర్‌గా రిషి కుమార్ శుక్లా ఫిబ్రవరి 4న బాధ్యతలు చేపట్టారు. 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శుక్లా మధ్యప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.

దక్షిణ మధ్య రైల్వే జీఎంగా మాల్య

సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్‌కు చెందిన గజానన్ మాల్యా ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. దక్షిణ మధ్య రైల్వేతో పాటు మరో మూడు జోన్లకు కూడా కొత్త జీఎంలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఉత్తర రైల్వే జోన్ జీఎంగా టీపీ సింగ్, వాయవ్య జోన్ జీఎంగా రాజేష్ తివారీ, ఈస్ట్‌కోస్ట్ జోన్ జీఎంగా వీ భూషణ్ నియమితులయ్యారు.

భారత్‌లో నేపాల్ రాయబారిగా నీలాంబర్

భారత్‌లో నేపాల్ రాయబారిగా ఆ దేశ మాజీ న్యాయశాఖ మంత్రి నీలాంబర్ ఆచార్య నియమితులయ్యారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో ఫిబ్రవరి 3న జరిగిన కార్యక్రమంలో నీలాంబర్‌తో ఆ దేశ రాష్ట్రపతి బిద్యాదేవి భండారి ప్రమాణం చేయించారు.

స్వీడన్ ప్రధాని సలహాదారుగా నీలా

స్వీడన్ ప్రధానమంత్రి కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా భారత సంతతికి చెందిన మహిళ, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ ఫిబ్రవరి 6న నియమితులయ్యారు. స్వీడన్ ప్రధానిగా 2019, జనవరిలో ఎన్నికైన సోషల్ డెమోక్రటిక్ గ్రీన్ పార్టీ కూటమి నాయకుడు స్టీఫెన్ తనవద్ద పనిచేస్తున్న నీలా విఖే పాటిల్‌ను రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు.

International
International

ఐపీ సూచీలో భారత్‌కు 36వ స్థానం

అంతర్జాతీయ మేధో సంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్ 36వ స్థానంలో నిలిచింది. అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) ఫిబ్రవరి 7న ఈ సూచీని విడుదల చేసింది. దీనిలో అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 50 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై విశ్లేషణ ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.

ఐఎన్‌ఎఫ్ నుంచి వైదొలగిన అమెరికా

రష్యాతో కుదుర్చుకున్న ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి ఐఎన్‌ఎఫ్ (ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఫిబ్రవరి 1న తెలిపారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి రష్యా క్షిపణులను తయారు చేసుకున్నందువల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు ఆమోదం

అమెరికా నుంచి 73 వేల అధునాతన రైఫిళ్లను ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2న ఆమోదం తెలిపింది. సిగ్ సూయేర్ అని పిలిచే ఈ రైఫిళ్లను 3,600 కి.మీ. దూరంలో ఉన్న చైనా సరిహద్దు ప్రాంతంలోని భద్రతా బలగాలకు ఇవ్వనున్నారు. వీటిని ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఉపయోగించనున్నారు.

అబుధబి కోర్టుల్లో హిందీ

న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా అబుధబి ఫిబ్రవరి 10న ప్రకటించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అరబిక్, ఇంగ్లిష్ భాషలతో పాటు హిందీలో కూడా న్యాయ ప్రక్రియలు కొనసాగుతాయని అబుధబి తెలిపింది.

National
National

ఆసియా ఎల్పీజీ సదస్సు

న్యూఢిల్లీలో ఫిబ్రవరి 5న ఆసియా ఎల్పీజీ సదస్సు జరిగింది. 2.5 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగంతో భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ తెలిపారు.

జీశాట్-31 ప్రయోగం విజయవంతం

దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్-31 సమాచార ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఫిబ్రవరి 6న విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 ఉపగ్రహ వాహక నౌక (రాకెట్ వీఏ 247) ద్వారా జీశాట్-31 ప్రయోగం చేపట్టారు.

క్రిడా శాస్త్రవేత్తల ఐఎస్‌ఏఈ పురస్కారం

కేంద్రీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రిడా) శాస్త్రవేత్తల బృందానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీర్స్ (ఐఎస్‌ఏఈ) అత్యుత్తమ పురస్కారం-2018 లభించింది. వారణాసిలో ఫిబ్రవరి 6న జరిగిన ఐఎస్‌ఏఈ 53వ వార్షిక సదస్సులో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర చేతుల మీదుగా క్రిడా ప్రిన్సిపల్ సైంటిస్ట్ కే శ్రీనివాస్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

రెపో రేటు పావు శాతం తగ్గింపు

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పావు (25 బేసిస్ పాయింట్లు) శాతం తగ్గించింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి.

హెలీనా క్షిపణి పరీక్షలు విజయవంతం

యుద్ధ ట్యాంకులపై దాడిచేసే అత్యాధునిక క్షిపణి హెలీనాను హెలికాప్టర్ నుంచి ఫిబ్రవరి 8న విజయంతంగా పరీక్షించారు. భారత్‌కు ఉన్న క్షిపణుల్లో నాగ్ ఒకటి. దీన్ని హెలికాప్టర్ నుంచీ ప్రయోగించగలిగేలా స్వల్ప మార్పులు చేసి, కొత్త క్షిపణికి హెలీనా అని పేరు పెట్టారు.
Vemula-Saidulu

1848
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles