దీక్షతో దిగివచ్చిన కేంద్రం


Wed,February 13, 2019 01:13 AM

TRS

జనవరి 30 తరువాయి

దీక్ష విరమణ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందుకు మేడం సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నేతలైన అద్వానీ, సుష్మా స్వరాజ్‌లకు, లోక్‌సభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన అందరికీ నా ధన్యవాదాలు. ఆరోగ్యం బాగయ్యాక వారందరినీ వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెబుతాను. ఈ పోరాటంలో అసువులు బాసిన వారి కుటుంబాలను ఆదుకుంటాం. ఎందరో విద్యార్థులు, న్యాయవాదులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు, వివిధ కుల సంఘాలు తెలంగాణ పోరాటంలో భాగస్వాములై ఉద్యమాన్ని ముందుకు నడించారు. వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను అన్నారు.
- ఈ విధంగా ఎన్నో ఏండ్లుగా సాగిన పోరాటం కేసీఆర్ దీక్ష, పట్టుదలతో విజయవంతమయ్యింది. కేంద్రం నుంచి రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటాయి.

హోం మంత్రి రెండో ప్రకటన

- డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావడంతో తెలంగాణలో విజయోత్సవాలు, సంబురాలు జరుగుతుండగానే సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను నిరసిస్తూ ఆందోళనలు మొదలయ్యాయి. సీమాంధ్ర ప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిన పద్ధతిలో కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించే దిశగా ప్రయత్నాలు కొనసాగించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు, 30 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
- అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసే అవకాశం లేదని ఒక్క టీఆర్‌ఎస్ తప్ప అన్ని పార్టీలు భావించాయి. కాబట్టి ప్రత్యర్ధి పార్టీలను ఇరకాటంలో పెట్టడానికి తాము లబ్ధి పొందడానికి పోటీపడి మరీ తెలంగాణకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. అయితే కేసీఆర్ దీక్ష, పోరాట పటిమ, తెలంగాణ ప్రజల ఆందోళనల వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పలు పార్టీలు రాజకీయ నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు తెలంగాణ ప్రాంతంలో తమ ప్రాభవాన్ని కోల్పోయి సీమాంధ్రకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వీరు శాసనసభ సభ్యత్వం వదులుకోవడానికి కారణం రాష్ట్ర ఏర్పాటు ద్వారా దెబ్బతినే ప్రయోజనాలు ఎమ్మెల్యే పదవి కంటే ఎన్నోరెట్లు విలువైనవి. వారితోపాటు వారి బంధుమిత్రులు, మద్దతుదార్లకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వారిని రక్షించుకోవడానికి ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాల్సి వచ్చింది.
- ఇలా తెలంగాణ ప్రకటన వచ్చిన మరుక్షణంలో సీమాంధ్రలో సిద్ధాంతాలు, జెండాలు, పార్టీలు, ఎన్నికల మేనిఫెస్టోలు, పాలక, ప్రతిపక్షం అనే విషయాలు మరచి అందరూ ఏకమయ్యారు. ఆ ప్రాంతంలో వరుసగా బంద్‌లు జరిగాయి. విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, మూతపడ్డాయి.

తెలంగాణ ప్రకటనపై సీమాంధ్ర నేతల స్పందన

- ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెడితే సహకరిస్తామన్నాం. అయితే దానికి విధివిధానాలు, అన్ని ప్రాంతాల ప్రజలతో సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధన జరగాలి. కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి అర్ధరాత్రి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ర్టాన్ని అగ్నిగుండం చేసింది అంటూ సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల రాజీనామాల కార్యక్రమానికి తెరలేపారు.
- అదేవిధంగా సామాజిక తెలంగాణ మా నినాదం, విధానం అనే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హోంమంత్రి ప్రకటన తర్వాత మాటమార్చి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. అంతేగాక సమైక్యాంధ్ర ఉద్యమ బలోపేతం కోసం చిరంజీవి తిరుపతి నుంచి బస్సుయాత్ర కొనసాగించారు. మోహన్‌బాబు లాంటి సినీ ఆర్టిస్టులు సమైక్య ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు.
- ఇలా సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సాగుతుండగా, తెలంగాణ వాదులు సంయమనం పాటించారు. ఈ సమయంలో ఏ మాత్రం ఉద్యమాలు చేసినా, రెచ్చగొట్టే కార్యక్రమాలు జరిపినా తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య తీవ్రమైన హింసకు దారితీస్తుందని తెలంగాణ సమాజం శాంతియుతంగా ఉండిపోయింది. తెలంగాణ ఉద్యమం హింసాయుతంగా మారితే కేంద్ర ప్రభుత్వం దాన్ని సాకుగా చూపి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ఆపుతుందని కేసీఆర్ శాంతిసందేశం అందించారు.
- అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సీమాంధ్రలో బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు, ఆందోళనలు తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం వారికి తలొగ్గక తప్పలేదు. దీంతో హోం మంత్రి చిదంబరంతో 2009, డిసెంబర్ 23న రెండో ప్రకటన చేయించింది.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తలెత్తిన ప్రశ్న విషయంలో డిసెంబర్ 7న ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీని ప్రకారం డిసెంబర్ 9న ప్రకటన విడుల చేశాం. అయితే దాని తర్వాత సీమాంధ్రలో పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రంలో అన్ని పార్టీలు, గ్రూపులతో విస్తృత స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాల్సి ఉంది అని పేర్కొనడంతో సీమాంధ్ర వాదులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ 10 జిల్లాలు చిదంబరం ప్రకటనను నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిపోయాయి.
- రెండో ప్రకటన వెలువడిన కొన్ని క్షణాల్లోనే తెలంగాణలో 144, 30 సెక్షన్లు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సీమాంధ్రలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ వారిని అరెస్టు చేయలేదు. అయితే తెలంగాణలో మాత్రం అడుగడుగునా పోలీసు బలగాలను నిలిపి రోశయ్య ప్రభుత్వం తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించింది.
- ఈ పరిణామాల నేపథ్యంలో రెండో ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ప్రొ. జయశంకర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఇంటికి వెళ్లి తెలంగాణపై మారిన యూపీఏ వైఖరి గురించి చర్చించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకుని ఉద్యమించాలని నిర్ణయించారు. దీనికి సారథ్య బాధ్యతలను స్వీకరించాలని ప్రొ. జయశంకర్‌ను అభ్యర్థించగా ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు ప్రొ. కోదండరామ్‌ను సూచించారు. దీంతో ఆయనతో చర్చించి జేఏసీ చైర్మన్‌గా కోదండరామ్ పేరుని కేసీఆర్ ప్రకటించారు.

TRS1

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ

(టీజేఏసీ)

- 2009, డిసెంబర్ 24న ఉదయం 11 గంటలకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ), ఎన్‌జీవో సంఘాలు, ఉపాధ్యాయ, కార్మిక, రచయితలు, కళాకారులు, విద్యావంతులు, ప్రజాసంఘాల నాయకులు కలిసి బంజారాహిల్స్‌లోని కళింగ ఫంక్షన్ హాల్‌లో సమావేశమై ప్రొ. కోదండరామ్ చైర్మన్‌గా వివిధ సంఘాల, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగస్వామ్య సంస్థలు...
- టీఆర్‌ఎస్- నాయిని నర్సింహారెడ్డి
- బీజేపీ- సీహెచ్ విద్యాసాగర్ రావు
- సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)- గోవర్ధన్
- సీపీఐఎంఎల్ ఎన్‌డీ- పీ సూర్యం
- తెలంగాణ విద్యావంతుల వేదిక- మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్
- తెలంగాణ లెక్చరర్స్ ఫోరం- కే వెంకటస్వామి
- తెలంగాణ టీచర్స్ ఫోరం- మల్లికార్జున్ రెడ్డి
- తెలంగాణ ఉద్యోగుల సంఘం- సీ విఠల్, పద్మాచారి
- ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్- అబ్దుల్ సత్తార్
- ఆర్‌టీసీ జేఏసీ- డీ ఆనందం
- టీఎన్‌జీవో అసోసియేషన్- దేవీప్రసాద్
- తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం- డీపీ రెడ్డి
- మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్- హమీద్ మహ్మద్ ఖాన్
- తెలంగాణ సినిమా జేఏసీ- రోషం బాలు

- ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ - ప్రొ. లక్ష్మణ్
- ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ- లతీఫ్ ఖాన్
- తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్- మణిపాల్ రెడ్డి
- సింగరేణి జేఏసీ- ఎండీ మునీర్
- డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్- నారాయణరెడ్డి
- డాక్టర్స్ జేఏసీ- బూర నర్సయ్యగౌడ్
- అడ్వకేట్ జేఏసీ- ఎం రాజేందర్ రెడ్డి/ప్రహ్లాద్
- ఫోరం ఫర్ హైదరాబాద్- రమా మెల్కొటే
- పొలిటికల్ అనలిస్ట్- వీ ప్రకాశ్
- తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ - శ్రీనివాస్ గౌడ్
- తెలంగాణ ధూంధాం కమిటీ- రసమయి బాలకిషన్
- లంబాడి హక్కుల పోరాట సమితి- శేషురాం నాయక్
- టీఎన్‌జీవో యూనియన్- కే స్వామిగౌడ్

- తెలంగాణ రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్- వెంకట్‌రెడ్డి
- గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం- రవిచందర్
- సామాజిక కార్యకర్తల వేదిక- వెంకట్‌రెడ్డి
- తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ- బాల నర్సయ్య/వెంకటేశం
- తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్- విజయేందర్‌రెడ్డి
- గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ- శ్రీధర్ ఆయాచితం
- ఉన్నత విద్యా జేఏసీ- పాపిరెడ్డి
- ఇంటర్మీడియట్ విద్యా జేఏసీ- మధుసూదన్ రెడ్డి, రవీందర్‌రెడ్డి
- సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్- బైరి నరేశ్
- పీఓడబ్ల్యూ- పీ సంధ్య
- తెలంగాణ ఇండస్ట్రీస్ ఫోరం- పీ సుధీర్ రెడ్డి
- తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ - శ్రీధర్ స్వామి, చందారాములు
- తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ- రఘు
- జమాతే ఇస్లామీ హింద్- మొహత్తసీన్ ఖాన్
- తెలంగాణ యూనివర్సిటీస్ అసోసియేషన్- ప్రొ. రమేష్ రెడ్డి
- ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఐఎఫ్‌టీయూ)- ప్రదీప్
Mallikarjun

1899
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles