క్లాట్‌-2019


Sun,January 20, 2019 11:14 PM

భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా న్యాయవాద వృత్తి ఎవర్‌గ్రీన్. న్యాయశాస్త్రం పై మంచి పట్టు సాధిస్తే జీవితంలో డబ్బుతోపాటు గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. అయితే, సబ్జెక్టుపై మంచి పట్టు రావాలంటే మంచి విద్యాసంస్థలో చదవాలి. అందుకే న్యాయశాస్త్రం అభ్యసించాలనే ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి క్లాట్‌వైపే చూస్తాడు. ఈ ఏడాది క్లాట్ మే 12న జరుగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం నిపుణ పాఠకుల కోసం..
clat
-దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. దీనిని సంక్షిప్తంగా క్లాట్ అని పిలుస్తున్నారు. క్లాట్ ద్వారా దేశంలోని 21 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఈ పరీక్షను జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం నిర్వహిస్తుంది. దేశంలో మొదటిసారి క్లాట్ పరీక్ష 2008లో జరిగింది. ఈ ఏడాది క్లాట్ పరీక్ష మే 12వ తేదీ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు జరుగనుంది. క్లాట్‌లో ఈ ఏడాది ప్రధానమైన మార్పు ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించనుండటం. గతంలో ఈ పరీక్ష కేవలం ఆన్‌లైన్ విధానంలోనే ఉండేది.

ఇంగ్లిష్

-ఇంగ్లిష్ విభాగంలో ప్రశ్నలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒకాబులరీ, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఫారిన్ టర్మ్స్, అనాలజీ, కాంప్రహెన్షన్, గ్రామర్ నుంచి అడుగుతారు. ముఖ్యంగా ఇంగ్లిష్ గ్రామర్‌లో ఖాళీలను పూరించడం, తప్పులను గుర్తించడం, వాక్యాలను సరిచేయడం తదితర పద్ధతుల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే అభ్యర్థి ఉన్నత పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్ సూత్రాలను మరోసారి పునశ్చరణ చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, సబ్జెక్ట్- వెర్బ్- అగ్రిమెంట్, కామన్ ఎర్రర్స్‌ను బాగా చదవాలి. ప్రస్తుతం పరీక్షకు తక్కువ సమయమే ఉన్నందువల్ల అభ్యర్థులు ఒకాబులరీపై ఎక్కువ సమయం వెచ్చించడం మంచిదికాదు. అయితే తరుచుగా ఉపయోగించే ఇడియమ్స్, ఫ్రేజెస్‌లను ఒక లిస్టు తయారుచేసుకొని రివిజన్ చేసుకోవాలి. సాధారణంగా స్పెల్లింగ్ తప్పులు దొర్లే పదాలను కూడా ఒక లిస్టు తయారుచేసుకుని చదవడం మంచిది. ఈ విభాగంలో కాస్త దృష్టిపెడితే మంచి మార్కులు సాధించగలిగేది కాంప్రహెన్షన్ ప్యాసేజీలో. పరీక్షలో ఇచ్చిన పేరాను సావధానంగా చదివి అర్థం చేసుకుంటే పూర్తి మార్కులు సాధించవచ్చు.

జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్

-ఈ విభాగం చాలా విస్తృతమైది. పరీక్షలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌ను కలిపి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఎక్కువగా మన చుట్టూ జరిగే సంఘటనలపైనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే 2018 మార్చి నుంచి 2019 మార్చి మధ్యలో జరిగిన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, మార్పుల గురించి తెలుసుకుని ఉండాలి. మార్కెట్లో దొరికే ప్రామాణికమైన జీకే పుస్తకాన్ని ఎంచుకుని క్షుణ్ణంగా చదవాలి. మనోరమ ఇయర్ బుక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. భారత రాజ్యాంగం, చరిత్ర, భూగోళ శాస్త్రం, నిత్యజీవితంలో సైన్స్ పాత్ర, పుస్తకాలు-రచయితలు, పరిశోధనలు, ఆవిష్కరణలకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే జీకేలో మంచి మార్కులు సాధించవచ్చు.

గణితం

-ఈ విభాగంలో ప్రశ్నలు ఉన్నత పాఠశాల స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా కసాగు, గసాభా, నిష్పత్తి, శాతాలు, లాభనష్టాలు, వడ్డీ, సగటు, కాలం-పని, కాలం-దూరం, క్షేత్రమితి, ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత తదితర భాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో గణితానికి 20 మార్కులే కేటాయించినప్పటికీ లెక్కలు రోజూ సాధనచేస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు.

లీగల్ ఆప్టిట్యూడ్

-అభ్యర్థికి న్యాయశాస్త్ర అధ్యయనం పట్ల ఉన్న అభిరుచిని, సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని అంచనావేసేందుకు పరీక్షలో ఈ విభాగాన్ని చేర్చారు. లీగల్ రీజనింగ్, లీగల్ ఆప్టిట్యూడ్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అగుడుతారు. పరీక్షలో ఒక న్యాయ సూత్రాన్ని, ఒక సన్నివేశాన్ని ఇచ్చి వాటిపై ప్రశ్న అగుడుతారు. అభ్యర్థి ఆ రెండింటిని అర్థం చేసుకుని సన్నివేశానికి సూత్రాన్ని అప్లయ్ చేయాల్సి ఉంటుంది. న్యాయ సూత్రాలు ఎక్కువగా నేరాలు, ఒప్పందాలు, క్రిమినల్ లాకు సంబంధించినవై ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే న్యాయ సూత్రాల ప్రాథమికాంశాలపై పట్టు సాధించడంతోపాటు గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా అధ్యయనం చేయాలి. లీగల్ ఆప్టిట్యూడ్ విభాగంలో ఎక్కువగా భారత రాజ్యాంగంతోపాటు న్యాయ పదకోశంపై ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల భారత రాజ్యాంగం మౌలిక సూత్రాలు, ప్రాథమికాంశాలతోపాటు సాధారణంగా వాడుకలో ఉన్న న్యాయశాస్త్ర పదకోశంపై పట్టు సాధించాలి.

లాజికల్ రీజనింగ్

-క్లాట్‌లో ఈ విభాగాన్ని చేర్చటానికి ప్రధాన కారణం అభ్యర్థి తార్కిక ఆలోచనా శక్తిని అంచనా వేయటమే. ఇందులో ప్రశ్నలు రక్తసంబంధాలు, కోడింగ్-డికోడింగ్, డైరెక్షన్ టెస్ట్, పజిల్స్, అనాలజీ, గడియారాలు, క్యాలెండర్లు, సిలాజిసమ్స్, సిరీస్, స్టేట్‌మెంట్స్-అజెంప్షన్స్ తదితర అంశాల నుంచి అడుగుతారు. ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే సిలబస్ చదివిన తర్వాత గత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. ఎలాంటి మోడల్ ప్రశ్నలు అగుడుతున్నారో గమనించాలి. ఏదిపడితే అది చదవకుండా మార్కెట్లో ఉన్న ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకం ఎంపిక చేసుకుని చదవాలి.

మంచి స్కోర్ కోసం ఇలా చేయండి..!

-గత క్లాట్ ఫలితాలను పరిశీలిస్తే కనీసం 140 మార్కులు సాధించినవారికి మంచి న్యాయ విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తున్నది. అందువల్ల ఏ విభాగాన్నీ చాయిస్ కింద వదిలేయకుండా క్షుణ్ణంగా చదవాలి. కింది టిప్స్ పాటిస్తే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది.

గత ప్రశ్నపత్రాల సాధన

-గతంలో నిర్వహించిన క్లాట్‌తోపాటు నల్సార్, ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ, ఎన్‌యూజేఎస్ తదితర ప్రశ్నపత్రాలను సాధన చేయటం ద్వారా క్లాట్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు. ఈ రకమైన సాధనవల్ల అన్ని కోణాల్లో ప్రశ్నలను అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయవచ్చు.

సమయం ముఖ్యం

-క్లాట్‌లో సమయం చాలా కీలకమైనది. 120 నిమిషాల్లోనే 200 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవలసి ఉంటుంది. అయితే అభ్యర్థి ముందుగా చక్కటి ప్రణాళిక వేసుకుంటే ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం కష్టమేమీ కాదు. అందుకోసం ఏ విభాగంలోని ప్రశ్నలకు ఎంత సమయంలో సమాధానాలు గుర్తించాలనే అంశాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. జీకే, ఇడియమ్స్-ఫ్రేజెస్, న్యాయశాస్త్ర పదకోశంపై అడిగే ఒక్కో ప్రశ్నకు 15 సెకండ్లలోపు సమాధానం గుర్తించాలి. తద్వారా లీగల్, లాజికల్ రీజనింగ్ ప్రశ్నలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు గుర్తించవచ్చు.

పక్కా వ్యూహంతో

-అభ్యర్థి పరీక్షకు పక్కా వ్యూహాన్ని రూపొందించుకోవాలి. అందుకోసం స్వీయ బలాబలాలను తెలుసుకుని పరీక్ష పేపర్‌లో ఏ విభాగానికి ముందుగా సమాధానాలు గుర్తించాలో నిర్ణయించుకోవాలి. రెండుగంటల సమయాన్ని విభజించి ప్రతి విభాగానికి కచ్చితంగా నిర్ణయించాలి.

మాక్ టెస్టులు

-ఫైనల్ పరీక్షను ఎలాంటి ఒత్తిడి లేకుండా సునాయాసంగా రాయాలంటే అభ్యర్థి ప్రిపరేషన్ చివరలో 5 నుంచి 8 వరకు మాక్ టెస్టులు రాయడం తప్పనిసరి. మాక్ టెస్టులు రాయడంవల్ల అభ్యర్థి ఫైనల్ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా రాసేందుకు మానసికంగా సిద్ధం కావచ్చు.

నెగెటివ్ మార్కింగ్

-క్లాట్‌లో 1/4 నెగెటివ్ మార్కులు ఉన్నందువల్ల పూర్తిగా తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు గుర్తించాలి. గెస్సింగ్ అస్సలు పనికిరాదు. లేదంటే స్కోర్ తగ్గే ప్రమాదం ఉంది.

ఆఫ్‌లైన్‌లో పరీక్ష

-గతానికి భిన్నంగా క్లాట్ పరీక్ష ఈసారి ఆఫ్‌లైన్‌లో జరుగనుంది. అందువల్ల కంప్యూటర్ ఆధారిత పరీక్ష సాధన ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌లో సమాధానాలు దిద్దేటప్పుడు అభ్యర్థి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్న నంబర్‌ను ఓఎంఆర్ షీట్‌లో నంబర్‌ను సరిచూసుకొని సమాధానాలు దిద్దాలి.
clat2
y-srinivas

785
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles