మన దిక్సూచి నావిక్


Sun,January 20, 2019 11:13 PM

గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీపీఎస్)ను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు వినియోగిస్తున్నాయి. ఇందులో భారత్ కూడా ఒకటి. జీపీఎస్ నియంత్రణ అమెరికా చేతిలో ఉన్నది. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే ఆ దేశం సాయం అందిస్తుందన్న నమ్మకం లేని పరిస్థితి. కార్గిల్ యుద్ధ సమయంలో అదే జరిగింది. పాకిస్థాన్ సైనిక దళాలు కచ్చితంగా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి భారత సైన్యానికి నావిగేషన్ వ్యవస్థ అవసరమైంది. ఇందుకోసం అమెరికా సాయాన్ని కోరింది. కానీ, సాయం అందించడానికి ఆ దేశం నిరాకరించింది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సొంత నావిగేషన్ వ్యవస్థను రూపొందించడానికి 2006, మేలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
NAVIC-IRNSS
-2011 చివరి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహం చొప్పున నాలుగు ఉపగ్రహాలను ప్రయోగిస్తామని, 2015లో సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని 2010, ఏప్రిల్‌లో ఇస్రో ప్రకటించింది. కానీ, అదనంగా మరో మూడు ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించడంతో కార్యక్రమం ఆలస్యమైంది. మొత్తం ఏడు ఉపగ్రహాల్లో భాగంగా తొలి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్- ఏను 2013, జూలై 1న విజయవంతంగా ప్రయోగించగా, చివరి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్- 1జీని 2016, ఏప్రిల్ 28న ప్రయోగించారు. కానీ, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏలోని అణు గడియారాలు విఫలమయ్యాయి. దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌ను ప్రయోగించారు. కానీ, అది ప్రయోగ దశలోనే విఫలమైంది. 2018, ఏప్రిల్ 12న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐను విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ముందుగా అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఇందులో మూడు ఉపగ్రహాలను సుమారుగా 36,000 కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టగా, మిగిలిన నాలుగు ఉపగ్రహాలను భూ అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. దశాబ్దంన్నర కృషి ఫలితంగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సాధ్యమైంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ నావిక్ అని పేరు పెట్టారు. తొలుత 2018 ఏప్రిల్ నుంచి నావిక్ సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కానీ, తొలి ఉపగ్రహంలోని అణు గడియారాలు విఫలం కావడం, దాన్ని మార్చాల్సి రావడంతో నావిక్ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయో ఇస్రో ప్రకటించలేదు.

వ్యయం

-మొదట మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 1420 కోట్లుగా అంచనా వేశారు (గ్రౌండ్ సెగ్మెంట్ కోసం రూ. 300 కోట్లు, ఒక్కో ఉపగ్రహానికి రూ. 150 కోట్లు, పీఎస్‌ఎల్వీ-ఎక్స్‌ఎల్ రాకెట్ నిర్మాణం కోసం రూ. 130 కోట్లు). అయితే, ఒక ఉపగ్రహం విఫలం కావడంతోపాటు దానిస్థానంలో చేసిన ప్రయోగం కూడా నిష్ప్రయోజనమవడంతో మరో ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ. 2246 కోట్లకు చేరింది.
-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల నిర్వహణ, కార్యకలాపాల కోసం పలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ స్పేస్‌క్రాఫ్ట్ కంట్రోల్ ఫెసిలిటీ (ఐఆర్‌ఎస్‌సీఎఫ్)
ఇస్రో నావిగేషన్ సెంటర్ (ఐఎన్‌సీ)
-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ రేంజ్ అండ్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ స్టేషన్స్ (ఐఆర్‌ఐఎంఎస్)
-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ నెట్‌వర్క్ టైమింగ్ స్టేషన్స్ (ఐఆర్‌సీడీఆర్)
లేజర్ రేంజింగ్ స్టేషన్స్
-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ డేటా కమ్యూనికేషన్ నెట్‌వర్క్ (ఐఆర్‌డీసీఎన్)
-2013, మే 28న కర్ణాటక రాష్ట్రం బ్యాలలులోని ఇస్రో క్యాంపస్ పరిధిలో కొత్త శాటిలైట్ నావిగేషన్ సెంటర్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డీఎస్‌ఎన్)ను ఏర్పాటు చేశారు.
-ప్రపంచంలో సొంత నావిగేషన్ వ్యవస్థలు ఉన్న ఐదు దేశాల సరసన భారత్ నిలిచింది.

నావిగేషన్ వ్యవస్థ గల దేశాలు

1. అమెరికా- జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) 24 ఉపగ్రహాలు. ఈ వ్యవస్థ 20 ఏండ్ల క్రితమే అమలులోకి వచ్చింది. ప్రపంచంలో అత్యధిక మంది దీన్ని వినియోగిస్తున్నారు.
2. రష్యా- గ్లోనాస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) 24 ఉపగ్రహాలు
3. యూరప్- గెలీలియో (నావిగేషన్ వ్యవస్థ నిర్మాణ దశలో ఉన్నది)
4. చైనా- బీడీఎస్ (బీడోయ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) 10 ఉపగ్రహాలు. 2011 నుంచి సేవలను అందిస్తున్నది.
5. జపాన్- క్యూజెడ్‌ఎస్‌ఎస్ (క్వాసీ జెనిథ్ శాటిలైట్ సిస్టం) అభివృద్ధి దశలో ఉన్నది. ఇప్పటివరకు మూడు ఉపగ్రహాలను ప్రయోగించారు.

ఉపయోగాలు

-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండు రకాల సేవలను అందించనున్నది. అందులో ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ (ఎస్‌పీఎస్). ఇది అందిరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్ట్టెడ్ సర్వీస్ (ఆర్‌ఎస్). దీన్ని అధీకృత వ్యక్తులు మాత్రమే వినియోగించుకోవడానికి వీలున్నది. నావిక్ ద్వారా ప్రజలకు అందించే సేవల్లో 20 మీటర్లకు అటుఇటుగా కచ్చితత్వం ఉంటే.. నియంత్రిత సేవల పేరిట సైనికులకు కేవలం 10 మీటర్ల కచ్చితత్వంతో సేవలు అందించేలా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు.
-రవాణారంగంలో సాధారణ వ్యక్తులు కూడా తమ గమనాన్ని, చేరాల్సిన చోటు తెలుసుకోవడం, లక్ష్యం ఎంత దూరంలో ఉందో నిర్ధారించుకోవడంలో ఉపయోగపడుతుంది.
-సెల్‌ఫోన్లు ఇతర పరికరాల ద్వారా నావిక్ నావిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వైమానిక, నౌకాయాన రంగాలకు, రక్షణ, పౌర సేవలకూ ఉపయోగపడుతుంది.
-సెల్‌ఫోన్లు, ప్రత్యేక పరికరాల సాయంతో మిలిటరీ, సాధారణ పౌర అవసరార్థం నావిగేషన్ సమాచారాన్ని ప్రతికూల పరిస్థితుల్లోనైనా నిరంతరాయంగా కచ్చితత్వంతో పొందవచ్చు.
-ఇప్పటివరకు కచ్చితమైన నావిగేషన్ వ్యవస్థ లేకపోవడంతో రాడార్ల పరిధుల్లో దూరం, సమయం ఎక్కువైనా ప్రయాణించక తప్పని పరిస్థితి. నావిక్ వ్యవస్థ ద్వారా విమానాలు, నౌకల రాకపోకల్లో దూరం, సమయం, ఖర్చు గణనీయంగా ఆదా అవుతుంది.
-నౌకల గుంపును గమనాన్ని పర్యవేక్షించడానికి నేవీకి ఎంతో ఉపయుక్తకరం
-అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో అవసరమైన ప్రాంతాలకు, వ్యక్తులకు వివిధ వ్యవస్థలు త్వరగా చేరుకునేలా దారిచూపి బాధితులకు సత్వర సహాయం అందేలా చేస్తుంది.
-క్షిపణుల ప్రయోగ సమయంలో కచ్చితమైన నావిగేషన్‌ను అందిస్తుంది.
-దేశ, విదేశీ పర్యాటకులకు గమన నిర్దేశ సౌకర్యాలను అందిస్తూ వారి సమయాన్ని ఆదా చేయడమేగాక మరిన్ని ప్రదేశాలను తక్కువ సమయంలో పర్యటించేలా చేయవచ్చు.
-సహజ వనరులను వెలికితీసేందుకు ఉద్దేశించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సమాచారాన్ని నావిక్ వ్యవస్థతో విశ్లేషించి, ఆ వనరులున్న ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు సహాయపడుతుంది.
-అత్యధికంగా చేపలు ఉండే ప్రాంతాలను సూచించడంతో మత్య్సకారులకు సమయం, ఖర్చు తగ్గుతుంది.

పేలోడ్‌లు

-ప్రతి ఉపగ్రహంలోనూ రెండు రకాల పేలోడ్‌లు ఉంటాయి.
-నావిగేషన్ పేలోడ్ : ప్రామాణిక నావిగేషన్ సేవలు అందించడానికి ఎల్5 బ్యాండ్ (1176.5 ఎంహెచ్‌జీ), ఎస్ బ్యాండ్ (2492.028 ఎంహెచ్‌జీ)లలో పనిచేసే నావిగేషన్ సాధనాలను అమర్చారు.
-రేంజింగ్ పేలోడ్: సీ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్‌ను అమర్చారు. లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్‌రెట్రో రిఫ్లెక్టర్‌ను అమర్చారు. వీటి వల్ల దేశం లోపలే కాకుండా సరిహద్దుల నుంచి 1500 కి.మీ. విస్తీర్ణం మేరకు విస్తరించిన ప్రాంతంలో 10-20 మీటర్ల కచితత్వంతో స్టాండర్డ్ పొజిషనింగ్ సేవలు అందించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఏడు ఉపగ్రహాల కూటమిని 11కు పెంచాలని ఇస్రో నిర్ణయించింది.
NAVIC-IRNSS2
-సాయికిరణ్ వేముల

697
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles