డెయిరీ ఫెయిరీ


Sun,January 20, 2019 11:13 PM

మన దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది పాడిపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్నది. దీనికి అనుగుణంగానే విద్యారంగంలో కూడా డెయిరీ టెక్నాలజీ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగంలోని కోర్సులు ఏంటి? ఉపాధి ఎలా ఉంటుందనే విషయాలు నిపుణ పాఠకుల కోసం..
dairy

డెయిరీ టెక్నాలజీ అంటే?

-ఆహార సాంకేతిక పరిజ్ఞానం, ప్రాసెసింగ్‌లో భాగంగా పాలు, పాల ఉత్పత్తులను ప్రాసెస్ చేయడంలో వ్యవహరించే సాంకేతిక విధానాన్నే డెయిరీ టెక్నాలజీ అంటారు. నాణ్యమైన పద్ధతుల్లో పాలను ఎలా ప్రాసెస్ చేయాలి, దాని ఉప ఉత్పత్తుల తయారీ ఎలా ఉండాలి వంటి వాటి గురించి నేర్చుకుంటారు. దీనిలో ప్యాకేజింగ్, స్టోరేజీ, పంపిణీ, ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటాయి. కాబట్టి బ్యాక్టీరియాలజీ, పోషణ, జీవరసాయన శాస్ర్తాలపై అవగాహన ఉండాలి.
-పోషక విలువలను ప్రభావితం చేయకుండా హానికరమైన టాక్సిన్లను తొలగించడానికి పాలు, దాని ఉత్పత్తులను ప్రాసెస్ చేసేవారిని డెయిరీ టెక్నాలజిస్టులు అంటారు. వీరు వివిధ పద్ధతులను ఉపయోగించి పాల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తారు.
-పాడిపరిశ్రమలో టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటి. డెయిరీ టెక్నాలజీ పాడిపరిశ్రమలో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి పాడి విజ్ఞానశాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు, ఈ రంగంలో ఉపాధి కోరుకునేవారు డెయిరీ టెక్నాలజీని ఎంచుకోవచ్చు. దీనిలో డిప్లొమా నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ వరకు కోర్సులు ఉన్నాయి.

కోర్సులు

-పాడి విజ్ఞానశాస్త్రంలో ఆసక్తి కలిగి ఉండి, ఈ రంగంలో రాణించాలని కోరిక ఉన్నవారు డెయిరీ టెక్నాలజీ కోర్సులను చేయవచ్చు. విద్యార్థులు వారి వీలును బట్టి రెగ్యులర్‌గా లేదా దూరవిద్య ద్వారా ఈ కోర్సులను చేయవచ్చు. డెయిరీ టెక్నాలజీ అనేది మంచి భవిష్యత్తు ఉన్న కోర్సు. ఆ కోర్సులేంటో చూద్దాం.

డిప్లొమా ప్రోగ్రామ్‌లు

-డిప్లొమా ఇన్ డెయిరీ టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ డెయిరీ టెక్నాలజీ
-అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ డెయిరీ సైన్స్ అండ్ టెక్నాలజీ

పీజీ ప్రోగ్రామ్‌లు

-ఎంటెక్ ఇన్ డెయిరీ మైక్రోబయాలజీ
-ఎంటెక్ ఇన్ డెయిరీ ఇంజినీరింగ్
-ఎంటెక్ ఇన్ యానిమల్ బయోకెమిస్ట్రీ
-ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ
-ఎంటెక్ ఇన్ యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్
-ఎంటెక్ ఇన్ డెయిరీ కెమిస్ట్రీ
-ఎంటెక్ ఇన్ డెయిరీ టెక్నాలజీ
-తెలుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్‌లో డెయిరీపై వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత వీరు బీ వొకేషనల్ కోర్సులు కూడా చేయవచ్చు.

అర్హతలు

యూజీ కోర్సులు

-మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో, 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పీజీ కోర్సులు
-బీఈ, బీటెక్‌లో తీసుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా పీజీలో డెయిరీ టెక్నాలజీ చేయవచ్చు. ఇవి రెండేండ్ల కాలవ్యవధిగల కోర్సులు.
ప్రవేశాలు
-దేశస్థాయిలో ICAR, న్యూఢిల్లీ నిర్వహించే ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్ (AIEEA) ఎంట్రెన్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
-రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్ వంటి ఎంట్రెన్స్‌ల ద్వారా రాష్ర్టాల్లోని ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

సంస్థలు

-రాష్ట్రంలో పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్, కామారెడ్డి కాలేజీల్లో డెయిరీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
-నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బెంగళూరు
-కాలేజ్ ఆఫ్ డెయిరీ అండ్ సైన్స్ టెక్నాలజీ, ఉదయ్‌పూర్
-గురు ఆనంద్‌దేవ్ కాలేజ్ ఆఫ్ డెయిరీ అండ్ సైన్స్ టెక్నాలజీ, లూథియానా
-ఇగ్నో, న్యూఢిల్లీ
-కాలేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ డెయిరీ టెక్నాలజీ, అలహాబాద్
-దేశ్ భగత్ యూనివర్సిటీ, పంజాబ్
-నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, కర్నాల్
-కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, త్రిస్సూర్
-ఇందిరాగాంధీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, రాయ్‌పూర్
-ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఆనంద్
-ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
-శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి.

డిగ్రీ ప్రోగ్రామ్‌లు

-బీటెక్ ఇన్ డెయిరీ టెక్నాలజీ
-బీఈ ఇన్ డెయిరీ టెక్నాలజీ
-బీఎస్సీ ఇన్ డెయిరీ టెక్నాలజీ

dairy2

ఉపాధి

-డెయిరీ కోర్సులు పూర్తిచేసినవారికి డెయిరీ టెక్నాలజిస్ట్, మైక్రో బయాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, థియాలజియన్స్, డెయిరీ సైంటిస్ట్, డెయిరీ మెడికల్ ఆఫీసర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్, మార్కెట్ డెవలప్‌మెంట్ మేనేజర్, కమోడిటీ ట్రేడింగ్ మేనేజర్, డెయిరీ ప్లాంట్ సూపర్‌వైజర్, ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, పర్చేజ్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డెయిరీ టెక్నాలజిస్ట్, సైంటిస్ట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్లుగా ఉద్యోగాలు లభిస్తాయి.
-ప్రారంభంలో టెక్నికల్ అసిస్టెంట్ స్థాయిలో ఏడాదికి సుమారు రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు వేతనం లభిస్తుంది. అనుభవం పెరిగేకొద్దీ ప్లాంట్ మేనేజర్, సూపర్‌వైజర్ స్థాయికి చేరుకోవచ్చు. ఈ స్థాయిలో ఏడాదికి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు జీతం లభిస్తుంది.
-అంతేకాకుండా సొంతంగా డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

రిక్రూటర్లు

-మదర్ డెయిరీ, అమూల్, గ్లాక్సోస్మిత్‌ైక్లెమ్, హిందుస్థాన్ యునీ లీవర్, నెస్లే, రిలయన్స్, వొకార్డ్, వడిలాల్, మెట్రో టెయిరీ, ITC, Heinz, COMPFED (Sudha), GCMMF వంటి ప్రముఖ సంస్థలు డెయిరీ కోర్సులు చేసినవారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి.
-ప్రభుత్వ రంగంలో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో డెయిరీ టెక్నాలజిస్టులుగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డెయిరీ ఫామ్స్‌లో క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో, పాల ఉత్పత్తుల తయారీ కంపెనీల్లో ఉపాధి లభిస్తుంది.
-పీహెచ్‌డీ చేసినవారికి యూనివర్సిటీలు, రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లలో అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో కూడా వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి.
-సత్యం చాపల

910
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles