డైనమిక్ కోర్సు డైటీషియన్


Sun,January 20, 2019 11:13 PM

ప్రజల జీవనశైలి వేగంగా మారుతున్నది. అందుకు అనుగుణంగానే ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది నోటికి రుచిగా ఉండటంతోపాటు తక్కువ సమయంలో తినడానికి సిద్ధమయ్యే ఫాస్ట్‌ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థూలకాయం, హై కొలెస్టరాల్, బీపీ, షుగర్ తదితర రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా, ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలను అదుపులో పెట్టుకోవాలన్నా సరైన పరిష్కారం ఆరోగ్యకరమైన డైట్. ఈ డైట్‌ను సూచించే వ్యక్తే డైటీషియన్. ఈ రోజుల్లో డైటీషియన్లకు డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో డైటీషియన్ కావడానికి ఉండాల్సిన అర్హతలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం...
dietitian

డైటీషియన్లు ఏం చేస్తారు?

-వైద్యుల లాగానే డైటీషియన్లది కూడా ఎంతో గౌరవప్రదమైన వృత్తి. పని ఒత్తిడి తక్కువగా ఉండటం, సౌకర్యవంతమైన పనివేళలు, అధిక రాబడి అదనపు అకర్షణలు. వ్యక్తుల పూర్తి వివరాలను మెడికల్ రికార్డ్స్ ద్వారా తెలుసుకుని, వారి స్వభావసిద్ధ అలవాట్లను గమనించి, శాస్త్రీయ పద్ధతిలో ఎలాంటి ఆహారం, ఎంత మొత్తంలో, ఏయే సమయాల్లో తీసుకోవాలో సూచించడం డైటీషియన్ల పని. సమస్యను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కో రకమైన డైట్‌ను వీరు సూచిస్తుంటారు.

చదవాల్సిన కోర్సులు

-డైటీషియన్ కావడానికి వివిధ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కోర్సులతోపాటు కొన్ని పీజీ డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని కోర్సుల వివరాలు పరిశీలిద్దాం..

బీఎస్సీ/బీఏ న్యూట్రిషన్

-ఇవి మూడేండ్ల కాలవ్యవధిగల కోర్సులు.
-ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులలో చేరడానికి అర్హులు. సైన్స్ సబ్జెక్టులతో (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఇంటర్ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
-ఇందులో భాగంగా హ్యూమన్ సైకాలజీ, బేసిక్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఫుడ్ బయోటెక్నాలజీ మొదలైన అంశాలు బోధిస్తారు. కోర్సు చివరలో డైట్ చార్ట్స్ తయారు చేయడం, బరువు తగ్గడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇస్తారు.

బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ

-ఇది కూడా మూడేండ్ల కాలవ్యవధిగల కోర్సు.
-ఇంటర్ ఉత్తీర్ణతతో ఈ కోర్సులో చేరవచ్చు.
-ఇందులో బేసిక్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇంజినీరింగ్, ఫుడ్ ప్రిపరేషన్ మొదలైన అంశాలు ఉంటాయి.

ఎమ్మెస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్

-ఇది రెండేండ్ల కాలవ్యవధిగల కోర్సు.
-బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు.
-ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌లో ఉండే క్లినికల్ హెల్త్ (డీలింగ్ విత్ క్లినికల్ పేషెంట్స్), చైల్డ్/అడోల్‌సెంట్స్, పబ్లిక్ హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన విభాగాల నుంచి ఒకదాన్ని స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు.
-ఈ కోర్సులో భాగంగా తప్పనిసరిగా 6-8 నెలల ఇంటర్న్‌షిప్ చేయాలి.

పీజీ డిప్లొమా కోర్సులు

-ఇవి ఏడాది కాలవ్యవధిగల కోర్సులు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తయిన తర్వాత ఈ కోర్సులలో చేరవచ్చు.
-ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌కు సంబంధించిన వివిధ స్పెషలైజేషన్లతో పీజీ డిప్లొమా కోర్సులు చేయవచ్చు.
-కోర్సులో భాగంగా ఏదైనా హెల్త్‌కేర్ సెంటర్‌లో తప్పనిసరిగా ఏడు లేదా ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలి.
-డైటీషియన్‌గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పీజీ డిప్లొమా సరిపోతుంది. కానీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌కు సంబంధించిన అంశాలను లోతుగా అవగాహన చేసుకోవాలంటే మాత్రం మాస్టర్ డిగ్రీ చేయాల్సిందే.

విద్యాసంస్థలు

-దేశంలోని పలు విద్యాసంస్థలు డైటీషియన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అవి..
-యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ - ఢిల్లీ
-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ - హైదరాబాద్
-పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ - లూథియానా
-యూనివర్సిటీ ఆఫ్ పుణె - పుణె
-యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ - అలహాబాద్
-జాదవ్‌పూర్ యూనివర్సిటీ - కోల్‌కతా
-యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ - చెన్నై
-యూనివర్సిటీ ఆఫ్ ముంబై - ముంబై

అవకాశాలు

-మనదేశంలో గత కొంతకాలంగా డైటీషియన్లకు డిమాండ్ పెరుగుతున్నది. వీరికి కార్పొరేట్ ఆస్పత్రులు, స్టార్ హోటళ్లు, నర్సింగ్‌హోమ్‌లు, ప్రభుత్వ ఆరోగ్యశాఖ, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు, హెల్త్ క్లబ్‌లు, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లు, ఆహార సంబంధిత పరిశ్రమలు, రిసెర్చ్ ల్యాబ్‌లు, వివిధ ఎంఎన్‌సీ కంపెనీలు మొదలైన వాటిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

వేతనాలు

-అప్పుడే డిగ్రీ పూర్తిచేసిన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు, మాస్టర్ డిగ్రీ చదివిన వారికి రూ.20 వేల నుంచి రూ.25 వేలు ప్రారంభ వేతనం లభిస్తుంది. ఆ తర్వాత అనుభవం ఆధారంగా రెట్టింపు ఆదాయం పొందవచ్చు.

dietitian2

డైటీషియన్‌గా రిజిస్ట్రేషన్ ఎలా?

-ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌కు సంబంధించిన సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్‌గానీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌గానీ, పీజీ డిప్లొమాగానీ పూర్తిచేసిన వారిని న్యూట్రిషనిస్టు అంటారు. కానీ డైటీషియన్ అనరు. డైటీషియన్ కావాలంటే ముందుగా ఇండియన్ డైటిటిక్ అసోషియేషన్ (ఐడీఏ)లో పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఐడీఏ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే రిజిస్టర్డ్ డైటీషియన్‌గా గుర్తింపు లభిస్తుంది.
-ఐడీఏలో పేరు నమోదు చేసుకుని, ప్రవేశపరీక్ష రాయాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌తో పీజీ డిప్లొమా లేదా మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు. పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్-1లో హ్యూమన్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజిక్ అండ్ మెటబాలిక్ చేంజెస్ ఇన్ డిసీజ్, ఫుడ్ మైక్రో బయాలజీ, శానిటేషన్, హైజీన్ మొదలైన అంశాలు ఉంటాయి. పేపర్-2లో హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ & మీల్ మేనేజ్‌మెంట్, కమ్యూనిటీ న్యూట్రిషన్, డైట్ థెరపీ, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ & డైటిటిక్ కౌన్సెలింగ్, ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ అంశాలు ఉంటాయి.

843
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles