ప్రపంచ పరిణామాలు


Sun,August 12, 2018 11:10 PM

kim-north-korea
-2017, డిసెంబర్ 26న బీజింగ్‌లో చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్‌యి అధ్యక్షతన చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రుల తొలి త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఇందులో చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ను ఆప్ఘనిస్థాన్ వరకు విస్తరిస్తామని చైనా ప్రతిపాదించింది. మూడు దేశాల విదేశాంగ మంత్రుల తదుపరి సమావేశం వచ్చే ఏడాది కాబూల్‌లో జరుగనుంది.
-పాకిస్థాన్‌కు భద్రతాసహకారం కింద అందిస్తున్న 900 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్టు జనవరి 1న, సైనిక సాయం కింద అందిస్తున్న 255 మిలియన్ డాలర్లను నిలిపేస్తున్నట్టు జనవరి 5న అమెరికా ప్రకటించింది.
-ఫిబ్రవరి 16న దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రమఫోసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ)కు చెందినవారు. అవినీతి ఆరోపణలతో అధ్యక్షుడు జాకబ్ జుమా ఫిబ్రవరి 15న పదవికి రాజీనామా చేశారు.
-ఫిబ్రవరి 11న దుబాయ్‌లో ఆరో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 140 దేశాల నుంచి 4000 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
-ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ప్రజాస్వామ్య సూచీలో 2017కుగాను భారత్ 42వ స్థానంలో నిలిచింది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కింది. ఈ జాబితాలో నార్వే అగ్రస్థానంలో ఉంది.
-అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్‌లో భాగమైన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ విడుదలచేసిన అంతర్జాతీయ మేధోహక్కుల సూచీ-2018లో భారత్‌కు 44వ స్థానం దక్కింది. ఈ సూచీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, బ్రిటన్, స్వీడన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-10 ముస్లిం దేశాల శరణార్థులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు జనవరి 30న అమెరికా ప్రకటించింది. ఇరాక్, ఇరాన్, లిబియా, ఈజిప్టు, మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్, సుడాన్, సిరియా, యెమెన్, ఉత్తరకొరియా దేశాలపై గతంలో నిషేధం విధించారు.
-అవినీతి కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు ఐదేండ్ల కఠిన కారాగార శిక్షను ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానం విధించింది. బంగ్లాదేశ్ ప్రధానిగా ఖలీదా జియా మూడుసార్లు ఎన్నికయ్యారు.
-ఫిబ్రవరి 16న నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ. గత ప్రధాని షేర్‌బహదూర్.
-స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) వెల్లడించిన నివేదిక ప్రకారం దేశరక్షణ కోసం ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచ దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. 2008-12, 2013-17 మధ్యకాలంలో భారత్ ఆయుధాల దిగుమతి 24 శాతం పెరిగింది. రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, దక్షిణకొరియా దేశాల నుంచి ఎక్కువ ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది.
-2018కిగాను ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్(ఎస్‌డీఎస్‌ఎన్) విడుదల చేసిన ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్‌కు 133వ స్థానం దక్కింది. 156 దేశాలతో కూడిన ఈ జాబితాలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది. నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ ఉన్నాయి. అట్టడుగున ఉన్న దేశాలు వరుసగా మలావి, హైతీ, లైబీరియా, సిరియా, రువాండా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచ అవినీతి సూచీ - 2017 పేరుతో నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా మొత్తం 180 దేశాలకు ర్యాంకులను కేటాయించగా, భారత్ 81వ స్థానంలో నిలిచింది. అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్, డెన్మార్క్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-పాకిస్థాన్‌లో తొలిసారి ఓ హిందూ మహిళ సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణకుమారి కొహ్లీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధిగా పాక్ సెనేట్‌కు ఎన్నికయ్యారు.
-మార్చి 14న ప్రముఖ భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతిచెందారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ, ఏకతత్వ సిద్ధాంతాలపై ఆయన అధ్యయనాలు చేశారు.
-మార్చి 13న నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి భండారీ రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీరాయ్‌పై విజయం సాధించారు.
-మార్చి 14న జర్మన్ చాన్స్‌లర్‌గా ఏంజెలా మెర్కెల్ ప్రమాణం చేశారు. ఆమె ఈ పదవికి ఎన్నికకావడం ఇది నాలుగోసారి.
-జనవరి 22న లైబీరియా అధ్యక్షుడిగా జార్జివీహ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఎన్నికల్లో 61.5 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి జోసెఫ్ బోకైకు 38.5 శాతం ఓట్లు వచ్చాయి. వీహ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు. 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2006 నుంచి ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు.
-అంతర్జాతీయ వలస నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఎక్కువగా ఉంటున్న వారిలో భారతీయులు (1.7 కోట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో (1.3 కోట్లు), రష్యా (1.1 కోట్లు), చైనా (కోటి), బంగ్లాదేశ్ (70 లక్షలు), పాకిస్థాన్, ఉక్రెయిన్ (60 లక్షలు) ఉన్నాయి. భారతీయులు ఎక్కువగా యూఏఈ (30 లక్షలు), అమెరికా (20 లక్షలు), సౌదీ అరేబియా (20 లక్షలు) దేశాల్లో ఉంటున్నారు.
-అమెరికాకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ జొనాథన్ పేస్ అతిపెద్ద ప్రధాన సంఖ్యను కనుగొన్నారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, అందులో నుంచి 1ని తీసివేశారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఉన్నాయి. దీనిని ఎం 77232917గా పిలుస్తున్నారు.
-ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలతోపాటు భూభాగాలపై ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్రూయిజ్ క్షిపణి హర్బాను జనవరి 3న పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని పీఎన్‌ఎస్ హిమ్మత్ నుంచి ప్రయోగించారు.
-జనవరి 9న ఉత్తరకొరియా, దక్షిణకొరియా దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. ఉభయ దేశాల సరిహద్దులకు సమీపంలోని పాస్‌ముంజోమ్‌లో ఈ చర్చలు జరిగాయి. దక్షిణకొరియాలోకి వచ్చే ఈ గ్రామాన్ని శాంతి గ్రామంగా వ్యవహరిస్తారు.
-న్యాయ వ్యవస్థను దూషించినందుకు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి మూడేండ్ల జైలు శిక్షతోపాటు 20 లక్షల పౌండ్ల జరిమానాను ఆ దేశ న్యాయస్థానం విధించింది.
-జనవరి 1 నుంచి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాట్‌ను అమల్లోకి తీసుకువచ్చాయి. ఇప్పటి వరకు ఆయా దేశాలకు పన్ను రహిత దేశాలుగా పేరుంది. పెట్రోల్ ధరలను 127 శాతం పెంచడంతోపాటు వస్తువులు, సేవలపై 5 శాతం అమ్మకం పన్ను విధించింది.
-జనవరి 23న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు.
-అమెరికా వాయుసేన అధిపతి జనరల్ డేవిడ్ ఎల్‌గోల్డ్‌ఫీన్ భారత్‌లో పర్యటించారు. జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి తేజస్ యుద్ధ విమానంలో విహరించారు.
-చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ జీవితకాలం కొనసాగనున్నారు. చైనా అధ్యక్షుడిగా కేవలం రెండుసార్లు మాత్రమే వ్యవహరించేలా ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు మార్చి 11న ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్ తర్వాత జీవితకాలంపాటు అధికారంలో కొనసాగిన రెండో నేతగా జిన్‌పింగ్ గుర్తింపు పొందనున్నారు. మావో తర్వాత మరో జీవితకాల నియంతృత్వం తలెత్తకుండా ఉండేందుకు 1982లో చైనా నాయకుడు డెంగ్ జియావోపింగ్ ఈ పరిమితిని తెచ్చారు. తాజా సవరణతో ఉపాధ్యక్షుడి పదవీకాలంపై కూడా పరిమితి తొలిగిపోవడంతో వాంగ్ కిష్వాన్ కూడా జీవితకాలం కొనసాగనున్నారు.
-ఫిబ్రవరి 26న సౌదీ అరేబియా ప్రభుత్వం మహిళలు సైన్యంలో చేరడానికి అనుమతించింది. రియాద్, మక్కా, అల్-ఖాసిం, మదీనా తదితర ప్రాంతాల్లో సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.
-సాయికిరణ్ వేముల

456
Tags

More News

VIRAL NEWS