భూగోళమంత అవకాశాలు


Sun,June 17, 2018 11:36 PM

అంతర్జాతీయ సంబంధాల కోర్సులు
మీరు హ్యుమానిటీ విద్యార్థా! సోషల్ సైన్స్ చదివితే కెరీర్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా! ఇక ఏ ఆలోచనలు పెట్టుకోకండి. సోషల్ సైన్స్ చదివినవారికి ఈ ప్రపంచీకరణ యుగంలో చాలా భవిష్యత్తు ఉంది. సోషల్ సైన్స్ చదివి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నవారు అంతర్జాతీయ సంబంధాల (ఇంటర్నేషనల్ రిలేషన్స్)పై డిగ్రీ, పీజీ చదివితే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. అంతర్జాతీయ సంబంధాలు అనేవి దేశాల మధ్య సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలు మెరుగుపడటానికి ఉపయోగపడుతాయి. కాబట్టి అంతర్జాతీయ సంబంధాలు ప్రముఖ రంగాల్లో ఒకటిగా వెలుగొందుతుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంబంధాలపై కోర్సులు, అవి అందిస్తున్న సంస్థల గురించి నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం.
63

అంతర్జాతీయ సంబంధాలు అంటే ఏమిటి?

-ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది గౌరవప్రదమైన పోటీ ప్రపంచానికి సంబంధించి దేశ విధానాలపై అధ్యయనం చేయడం. ప్రపంచ శాంతిని పరిరక్షిస్తూ అధికారం ఎలా చేపట్టాలో, ఎలా కొనసాగించాలో వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులను విశ్లేషించి క్రమబద్ధమైన విధానాన్ని, సామర్థ్యాన్ని సాధిచండానికి తోడ్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో వేలమంది అణ్వాయుధాల తయారీపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ఈ అణ్వాయుధాలను కొని, లక్షలమందిని పొట్టనబెట్టుకుంటున్నారు తీవ్రవాదులు. వీటిని నివారించేందుకు అంతర్జాతీయ సంబంధాలపై విద్యనభ్యసించిన విద్యార్థులు కృషిచేయాలి.
-అంతర్జాతీయ సంబంధాల్లో డిగ్రీ పొందడమనేది ప్రపంచాన్ని ఉత్తమ స్థలంగా చేయగల కీలక మార్గాల్లో ఒకటి. దేశాల మధ్య సానుకూలత దౌత్య సంబంధాలను కొనసాగించడానికి, అంతర్జాతీయ వైరుధ్యాలను నివారించడానికి, అంతర్గత ప్రపంచంలోని ప్రభుత్వాల మధ్య సజావుగా వ్యవహరించేలా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ సంబంధాల నిపుణుడిగా ఆర్థిక, సామాజిక వ్యవస్థలు, కమ్యూనిటీల సాంస్కృతిక జీవనం వంటి రంగాల్లో, రాజకీయాల్లో అదనంగా కెరీర్ ఎంపికలను కలిగి ఉంటారు.

ఎవరు అర్హులు

-ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై ఉన్నత చదవులు చదవాలనుకునేవారు హైస్కూల్ స్థాయిలోనే పొలిటికల్ సైన్స్‌తోపాటు హ్యుమానిటీని ఎంచుకుంటే చాలాబాగుంటుంది. అలా అని హ్యుమానిటీ చదవనివారు అర్హులుకారని అనుకోకండి. ఇంటర్‌లో ఏ కోర్సు చేసినవారైనా డిగ్రీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకోవచ్చు. అలాగే డిగ్రీలో కూడా ఏ సబ్జెక్టులు చదివినవారైనా మాస్టర్ డిగ్రీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవవచ్చు.

బ్యాచిలర్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్

-ఈ కోర్సు 3 నుంచి 4 ఏండ్లు ఉంటుంది. వివిధ దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకునే విద్యార్థికి ఈ కోర్సు చాలా ఉత్తమమైనది. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇండియన్, వరల్డ్ హిస్టరీ, యూరోపియన్ సొసైటీస్ సోషియాలజీ, గ్లోబల్, కంపారిటివ్ పాలిటిక్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అధ్యయనం చేసే ఒక ప్రధాన కోర్సు ఇది. రాష్ర్టాలు, అంతర్జాతీయ సంస్థలను ప్రభావితం చేసే రాజకీయ డైనమిక్స్‌లను విశ్లేషించడానికి ఈ సబ్జెక్టులు సహాయం చేస్తాయి. ప్రతి దేశం అంతర్జాతీయ శాంతిలో ఏ పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

కోర్సును అందిస్తున్న సంస్థలు

అశోక యూనివర్సిటీ, హర్యానా
-ఈ యూనివర్సిటీ బీఏ ఇన్ హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సును అందిస్తుంది.
-10+2 అకడమిక్ స్కోర్, అశోక ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ స్టడీస్ అండ్ అప్లయిడ్ సోషల్ సైన్సెస్, గుజరాత్
-బీఏ ఇన్ (అడ్వాన్స్‌డ్) పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సును అందిస్తుంది.
-10+2 లేదా తత్సమాన పరీక్షలో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, హర్యానా

-బీఏ (ఆనర్స్) ఇన్ గ్లోబల్ అఫైర్స్
-10+2 అకడమిక్ స్కోర్, జిందాల్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
నోట్: కోర్సు కాలపరిమితి వేర్వేరు యూనివర్సిటీల్లో వేర్వేరుగా ఉంటుంది.

పీజీ ప్రోగ్రామ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్

-మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఇంటర్నేషనల్ స్టడీస్ వివిధ రంగాల్లో విద్యనభ్యసించడానికి అవకాశం ఉంది. అవి.. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ప్రపంచ చరిత్ర, స్ట్రాటజిక్ స్టడీస్, గ్లోబలైజేషన్. ఈ విభిన్న అంశాల్లో అధ్యయనం తర్వాత యూనివర్సిటీల పాఠ్యప్రణాళికల ప్రకారం ఇంటర్న్‌షిప్ చేయాలి.

పీజీని అందిస్తున్న సంస్థలు

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ
-ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ (ఎక్కువ భాగం ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై ఉంటుంది) కోర్సును అందిస్తుంది.
-ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
-యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

జాదవ్‌పూర్ యూనివర్సిటీ, కోల్‌కతా

-ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సును అందిస్తుంది.
-మూడేండ్ల బ్యాచిలర్ డిగ్రీ (ఆనర్స్) లేదా పొలిటికల్ సైన్స్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
-యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

సౌత్ ఏషియన్ యూనిర్సిటీ, న్యూఢిల్లీ

-ఎంఏ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సును అందిస్తుంది.
-ఏదైనా మూడేండ్ల డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
-యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

ఢిల్లీ యూనివర్సిటీ, న్యూఢిల్లీ

-ఎంఏ ఇన్ పాలిటిక్స్ (ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై ఉంటుంది) కోర్సును అందిస్తుంది.
-బీఏ (ఆనర్స్) లేదా ఇతర బీఏ ప్రోగ్రామ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
-యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

క్రిస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు

-ఎంఏ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సును అందిస్తుంది.
-ఏదైనా మూడేండ్ల బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
-యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
-మన రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఈ కోర్సును అందిస్తుంది.
-నోటిఫికేషన్ తదితర వివరాల కోసం ఆయా కాలేజీల వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

library_students

పీజీ తర్వాత ఉపాధి అవకాశాలు

-నాన్‌ప్రాఫిట్ ప్రోగ్రామ్ మేనేజర్లుగా, రిసెర్చ్ అనలిస్ట్‌లుగా, పొలిటికల్ సైంటిస్టులుగా, ట్రాన్స్‌లేటర్లు/ఇంటర్‌ప్రిటర్లుగా, ఇంటెలిజెన్స్ అనలిస్టులుగా, ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా, రిసెర్చ్ అసోసియేట్లుగా ఉద్యోగాలు పొందవచ్చు.
-యూఎస్ రాయబార కార్యాలయాలు, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, వాషింగ్టన్ డీసీలోని యూఎస్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇతర ప్రభుత్వ సంస్థలైన సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీలో ఇంటెలిజెన్స్‌లుగా, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, డొమెస్టిక్ క్యాబినెట్ డిపార్ట్‌మెంట్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ట్రెజరీ, ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ది ఫెడరల్ రిజర్వ్‌లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇవి ప్రభుత్వపరమైనవి.
-ఇంకా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అయిన ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థలు, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు, బహుళజాతి సంస్థల్లో కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇతర దేశాల్లోని కమ్యూనిటీ కాలేజీలు, మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయవచ్చు.

గ్రాడ్యుయేషన్ తర్వాత అవకాశాలు

-విస్తృతమైన కెరీర్ అవకాశాలకు సంబంధించిన విశ్లేషణ, ఆచరణాత్మక నైపుణ్యాల పరిధిని గ్రాడ్యుయేషన్ అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా మాస్టర్ డిగ్రీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో లోతుగా తెలుసుకోవడానికి, పని అనుభవాన్ని పొందడానికి కొన్ని వృత్తిమార్గాలు ఉన్నాయి. అవి..
1) ప్రభుత్వేతర సంస్థలు
2) ఎన్జీవోలు
3) బ్యాంకింగ్, అకౌంటింగ్ సర్వీసులు
4) స్థానిక, జాతీయ ప్రభుత్వాలు
5) మీడియా, పబ్లిషింగ్ కంపెనీలు తదితర సంస్థల్లో కన్సల్టెంట్లుగా, మార్కెటింగ్, క్లయింట్ రిలేషన్స్ ఆఫీసర్లుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
-చాపల సత్యం

450
Tags

More News

VIRAL NEWS