హైదరాబాద్ స్టేట్‌లో సాహిత్య ఉద్యమం


Tue,August 2, 2016 01:34 AM

తెలంగాణలో పోరాట సాహిత్యానికి తమవంతుగా కృషి చేసిన అనేక సంస్థలున్నాయి. అటువంటి వాటిలో కొన్ని గ్రంథాలయాలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం నుంచి మొదలు చిన్న, పెద్ద గ్రంథాలయాలు చాలా ఉన్నాయి.
శ్రీలక్ష్మీనరసింహ మనోహర బాలభారతీ గ్రంథాలయం: చెంచురామయ్య కోదాటి నారాయణరావు సలహాలతో 1918లో రేపాల (నల్లగొండ జిల్లా)లో స్థాపించారు.

ఆంధ్ర సారస్వత నిలయం: 1917లో నల్లగొండలో షబ్నవీసు వెంకటరామ నర్సింహరావు స్థాపించారు.

ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయం : 1919-20లలో సూర్యాపేటలో స్థాపన. ప్రభుత్వ అనుమతి లేకుండా స్థాపించడంవల్ల (1920) మాడపాటి హన్మంతరావు కృషితో పున:ప్రారంభమై మళ్లీ మూతపడింది. కోదాటి నారాయణ 1921 సెప్టెంబర్ 8న ప్రారంభించారు. గ్రంథాలయ సభలు నడిపించింది ఈ సంస్థ. మాడపాటి, కోదాటి రామకృష్ణారావు, పువ్వాడ వెంకటప్పయ్య, అర్వయ్య, లాభిశెట్టి గుప్త, గవ్వా అమృతరెడ్డి, వెదిరె గోపాల్‌రెడ్డి, పులిజాల రంగారావు, షబ్నవీసు వెంకటరామనర్సింహ 1929 దాకా, సూర్యాపేట, తిప్పర్తి, మిర్యాలగూడెం, హుజూర్‌నగర్‌లలో గ్రంథాలయ సభలు, ఆంధ్రజన సంఘం సభలు నిర్వహించారు.

బెతిరెడ్డి గ్రంథాలయం: 1920లో పిల్లలమర్రిలో గవ్వా అమృతరెడ్డి, ఆయన సోదరులు కృష్ణారెడ్డి, రామరెడ్డి, జానకిరామరెడ్డి స్థాపించారు. వీరు తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించారు. చాపకింద నీరులా నిజాం వ్యతిరేక భావాలను ప్రచారం చేయడంవల్ల రజాకార్ల (1940) దుశ్చర్యలకు ఈ గ్రంథాలయం బలైంది.

సరస్వతి గ్రంథ నిలయం: 1920లో నల్లగొండ జోగిని ఆదినారాయణగుప్త, పులిజాల రంగారావు స్థాపించారు. వీరు హుజూర్‌నగర్, మిర్యాలగూడెంలో గ్రంథాలయాలు స్థాపించారు.

సీతారామ గ్రంథాలయం: కందిబండ (నల్లగొండ)లో 1925లో నారపరాజు రాఘవరావు స్థాపించారు. వట్టికోట ఆళ్వారుస్వామి ఉద్యమసారథి. సాహితీవేత్తగా తీర్చబడిన ఈ గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం వల్లే దేశద్దారక గ్రంథాలయ స్థాపనకు వట్టికోట 1938లో ప్రేరణపొందారు.

బాల సరస్వతీ ఆంధ్ర భాషానిలయం : కొమరబండ గ్రామస్తుడు కోదాటి రామకృష్ణారావు 1925లో స్థాపించారు. ఈ సంస్థ కవితా సంకలనాలను ఇనుగుర్తి (వరంగల్) రాజు సోదరులు ప్రచురించారు.

వైదిక ధర్మగ్రంథమండలి: ఈ సంస్థను హుజూర్‌నగర్‌లో మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు స్థాపించారు.

వీరేశలింగ కంఠాభరణ గ్రంథమాల: 1920లో షబ్నవీసు వెంకటరామ నర్సింహరావు నల్లగొండలో స్థాపించారు. 1921లో సంస్కారిణీ గ్రంథాలయాలను ఏర్పాటుచేశారు.

వివేకావికాసినీ గ్రంథాలయం: పిల్లలమర్రి గ్రామంలో 1924లో ఉమ్మెత్తల అప్పారావు, సోదరుడు గోవిందరావులు స్థాపించారు. రజాకార్ల హడావిడిలో పాడైపోయింది.

కృషి ప్రచారిణి గ్రంథమాల: పువ్వాడ వెంకటయ్యగారు దీన్ని స్థాపించారు.
పై గ్రంథాలయాలు మారుమూల గ్రామాలకు కూడా సాహిత్యాన్ని వ్యాపింపజేసి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారు.

సాహితీమేఖల: 1934లో చండూరులో అంబడిపుడి వెంకటరత్నం స్థాపించారు. వీరే కస్తాల గ్రామంలో విద్యానాధ గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ సంస్థ ద్వారానే దేవులపల్లి రామానుజరావుగారి నెహ్రూ, దాశరథి అగ్నిధార, పులిజాల గోపాలరావు ఖడ్గతిక్కన వంటి రచనలు ఈ సంస్థ ద్వారానే ప్రథమంగా వెలుగులోకి వచ్చాయి. 1946లో ఈ సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంలో యువకులైన కాళోజీ, దాశరథి, సినారే, బిరుదురాజు రామరాజు వంటి కవుల ప్రతిభనే కాకుండా, మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటివారి ఉపన్యాసాలు, కవితావాహినీ వెలువడ్డాయి. అంబడిపుడి 18-5-1983న మరణించడంతో ప్రస్తుతం అంజయ్య ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

గ్రామవెలుగు : 1924లో కోదాటి లక్ష్మీనరసింహరావు స్థాపించారు. రేపాల, నల్లగొండ జిల్లాలో ఈ సంస్థ నాటక ప్రదర్శనలతో పాటు సాహిత్య కార్యక్రమాలను కూడా నిర్వహించింది. కొంత కాలానికి ఈ సంస్థను సూర్యాపేటకు మార్చారు.

జనతా కళామండలి : కోదాటి నారాయణరావు దీన్ని రేపాల గ్రామంలో స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ప్రగతి అనే పత్రిక నడిచింది. ఈ సంస్థ గెలుపు నీదే నాటకాన్ని ప్రప్రథమంగా ప్రదర్శించినప్పుడు (హైదరాబాద్) ఆల్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామనంద తీర్ధ వంటివారు తిలకించారు. దీన్ని సూర్యాపేటకు మార్చకముందే తేరాల సూర్యనారాయణ, వారణాసి వెంకట నారాయణశాస్త్రి, వేముల నర్సింహం, కేఎల్ నరసింహరావు, వేదం రామకృష్ణమూర్తి మొదలైనవారు కళాకారులుగా పేరొందారు.

నీలగిరి సారస్వత సమితి: 1945లో దవళా శ్రీనివాసరావు నల్లగొండలో స్థాపించారు. తొలిసంజ, ఉషస్సు కవితా సంకలనాలు ప్రచురితమయ్యాయి. ధవళ శ్రీనివాసరావు అన్నంలోకి ముద్రితమైంది.
library

జమీందారుల సాహితీసేవ


అక్కినేపల్లి జానకిరామారావు: కొండగడప-మోతుకూరు (మం) జమీందారు. అడవి బాపిరాజు రాసిన గోన గన్నారెడ్డి నవలను వీరు అంకితం గైకొన్నారు. వీరు హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఇంట్లో వేమనభాషా నిలయాన్ని స్థాపించారు. వీరు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆర్థికసాయం అందించారు. ఆదిరాజు వీరభద్రరావు షష్టిపూర్తి కార్యక్రమంలో వచ్చిన కవులందరికీ ఈ జమీందారు భోజనాలు ఏర్పాటుచేశారు. 1938-1950 వరకు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వరంగల్ జిల్లా ఒద్దిరాజు సోదరులను ప్రోత్సహించి విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల స్థాపించినవారిలో వీరు ప్రముఖులు. 1922 ఆగస్టు 27న వెలువడిన తెలుగుపత్రిక మొదటి సంపుటి వెలువడటంలో అక్కినేపల్లి సహాయ సహకారాలు కూడా ఎంతో ఉన్నాయి. పరిశోధన రంగంలో గొప్పవారైన శేషాద్రి రమణ కవుల్లో ఒకరైన ధూపాటి వెంకటరమణాచార్యులకు సన్మానం చేశా రు. వారిని ప్రోత్సహించినవారిలో ప్రథముడు అక్కినేపల్లి.
తడకమళ్ల సీతరామచంద్రరావు: బేతవోలు రాజా అని పేరు. కవి, సంగీతజ్ఞులు, పంచాంగకర్త. వీరు గోవర్దనం వెంకట నరసింహాచార్యులును (ఇబ్రహీంపేట) ఆదరించారు. బేతవోల్ నివాసి లక్ష్మణాచార్యులు రాసిన లక్ష్మణకల్యాణం వెలువరింపచేశారు. 1949లో మిర్యాలగూడెంలో స్థాపించిన ఆంధ్రసారస్వత పరిషత్తు శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. వీరి పూర్వికుల్లో బహుభాషా పండితులు. వివిధ గ్రంథ నిర్మాతల్లో తడకమళ్ల కృష్ణారావు ఒకరు.
రావిచెట్టు రంగారావు : 1877లో నల్లగొండ జిల్లా దండేపల్లి గ్రామంలో నరసింహరావు, వెంకటమ్మలకు జన్మించారు. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసిన వారిలో రావిచెట్టు రంగారావు ప్రథముడు. ఆయన మున్సబ్‌దారు గ్రంథాలయాన్ని స్థాపించి రూ. 2 వేలతో ఏర్పాటుచేసిన దాని నుంచి వచ్చే వడ్డీతో గ్రంథాలను కొన్నారు. సాంఘిక సేవకు మున్సబ్‌దారీ పదవి అడ్డంకిగా మారడంతో దాన్ని త్యజించి హైదరాబాద్‌కు చేరి 1901లో శ్రీకృష్ణ దేవరాయంధ్ర భాషానిలయం స్థాపనకు ప్రధాన కారకుల్లో ఈయన ఒకరు. అప్పుడే మాడపాటి హన్మంతరావు, నాయిని వెంకటరంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావుతో కలిసి సాహితీ కార్యక్రమాలు చేపట్టారు.
తెలంగాణ తెలుగుకు, తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ముందుకువచ్చిన వ్యక్తి రంగారావు. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయాన్ని మొదట 1901 సెప్టెంబర్ 1న కోఠిలోని రంగారావు ఇంటిలో ఏర్పాటు చేశారు. ఈయన 1910లో మరణించడంతో ఈ సంస్థ కార్యకలాపాలు వెనుకపడినాయి. ఈయన భార్య లక్ష్మీనరసమ్మ కొత్త భవనం ఏర్పాటుకు రూ. 3 వేలు విరాళంగా ఇచ్చారు. 1921 సెప్టెంబర్ 30న నూతన భవనాన్ని కట్టమంచి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రావిచెట్టు రంగారావు కృషి వల్ల వరంగల్‌లోని రాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయం కూడా ఏర్పాటయ్యింది. విజ్ఞాన చంద్రికా మండలి హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్లినా ఈయన చాలాకాలం కార్యదర్శిగా పనిచేశారు. ఈయన 1910 జూలై 3న మరణించారు.
బోయ జంగయ్య: 1942 అక్టోబర్ 1న పంతంగి గ్రామంలో జన్మించారు. ఈయన రచనలు కష్టసుఖాలు, లోకం, గొర్రెలు, నడుస్తున్న చరిత్ర, వెలుతురు, జాతర (నవల), దొంగలు, మల్లెపూలు, పావురాలు, దున్న. చండూరు సాహితీ మేఖలకు అధ్యక్షునిగా పనిచేశారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈయన రచించిన గొర్రెలు పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎస్ జగన్నాథం: నల్లగొండ జిల్లాలో 1922లో జన్మించారు. ఈయన వైద్యుడు. మూఢవిశ్వాసాలు పత్రికను స్థాపించి ఐదేండ్లు నడిపారు. ఈయన రచనలు దేవుణ్ణి ఎవరు సృష్టించారు, పరలోకాలున్నాయా, నాస్తిక జీవిత విధానం, మూఢవిశ్వాసాలు.
గవ్వా జానకిరాంరెడ్డి: 1904లో పిల్లలమర్రిలో జన్మించిన ఈయన 1951లో మరణించారు. ఈయన అమృతరెడ్డి సోదరుడు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ భాషాపండితు డు. గ్రంథాలయోద్యమంలో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించారు. ఈయన రచనలు దేశబంధు, దాసకల్పద్రుమమం, సత్పదం, సుధాకరుడు, దైవచింతన. దేశబంధు నాటకం 1926లో ముద్రితమైంది.
దొడ్డా నర్సయ్య: చిలుకూరు గ్రామంలో జన్మించారు. దొరల వద్ద జీతగానిగా పనిచేశాడు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిల ఉపన్యాసాలకు ప్రేరితుడై ఆంధ్రమహాసభల్లో పాల్గొని 1941లో ఆంధ్రమహాసభను (8వ) చిలుకూరు లో ఏర్పాటుచేయించాడు. కమ్యూనిస్టు ఉద్యమంలో పా ల్గొని 1940-51ల మధ్య ఎన్నోసార్లు జైలుకెళ్లారు. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తిరునగరి ఆంజనేయులు, వెదిరె రాజిరెడ్డి మొదలైనవారితో కలిసి తెలంగాణ ప్రజల విముక్తి పోరాటం చేశారు. తన అనుభవాలను తెలంగాణ సాయుధ పోరాటం-అనుభవాలు-జ్ఞాపకాలుగా రాశారు. వెట్టిచాకిరి అనే నాటికలో నటించాడు. ఈయన ఉద్యమం, గ్రంథాల్లోని అంశాలు మిర్యాలగూడెం, కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకే పరిమితమయ్యాయి.
నర్సయ్యగుప్తా (1898-1971): చందుపట్ల గ్రామంలో జన్మించారు. ఈయన రచనలు అస్పృశ్యతానివారణం, గాంధీజయంతి, బుద్ధజయంతి, వాసవీజయంతి, పంచవర్ష ప్రణాళికలు, గ్రామ రాజ్యానికి నాంది, నవభారతం. ఈయన నిజాం రాజు మంత్రి కిషన్‌ప్రసాద్ చే ఉత్తమ అధ్యాపక సర్టిఫికెట్ పొందారు. విద్యను బోధించడమేగాక చిత్రకళ, కవిత్వం, వాగ్దాటిగల వ్యక్తి.
బోయపల్లి నర్సయ్య: 1948, ఆగస్టు 21న సూర్యాపేటలో జన్మించారు. ఈయన రచనలు సగటు బ్రతుకులు, ఇదీ మనకథ, ఈ చరిత్ర చెరిపేద్దాం (డాక్యుమెంటరీ), మామూలు మనిషి, సమాధులపై పునాదులు, ఈ ప్రశ్నకు బదులేది, ఈ నేరం మాదికాదు వ్యవస్థది, జీవితసత్యాలు. ఈయన కవి, నటుడు, బుర్రకథకుడు. 1965లో వరంగల్‌లో జననీజన్మభూమి నాటికను ప్రదర్శించి అక్కినేని ద్వారా బహుతి పొందారు. 1968లో సూర్యాపేటలో విజయభాను కళాసమితిని స్థాపించారు. 1969లో నల్లగొండలో యంగ్‌స్టార్ సిండికేట్‌ను స్థాపించి కొడిగట్టిన దీపాలు నాటికను ప్రదర్శించారు. రాష్ర్టాస్థాయి ఏకపాత్రాభినయం పోటీ (1983-84)ల్లో పాల్గొని ఎన్టీఆర్ ద్వారా బహుమతి పొందారు. ఈయన కలంపేరు నిర్మల్.


కరీంనగర్ జిల్లా
1) భారతయ సాహిత్య సమితి (1971)
2) సాహితీమిత్ర బృందం (1972)-ధర్మపురి
3) వికాస సమితి (1979)-కమాన్‌పూర్
4) సృజనచైతన్య సాహితీసమితి (1979)-బోయినపల్లి
5) జనసాహితీ సాహిత్య సమితి (1980)- కాశ్మీర్ గడ్డ
6) త్రివేణి సాహితి (1982)- కరీంనగర్
7) ఉదయ సాహితీ (1987)- గోదావరిఖని
8) సమతా సాహితి (1989)- కరీంనగర్
9) శేషప్ప సాహితి (1990)- ధర్మపురి
10) సాహితీ గౌతమి (1990)- కరీంనగర్

ఖమ్మం జిల్లా
1) ఖమ్మం జిల్లా రచయిత సంఘం (1942)- ఖమ్మం
2) ఆంధ్రప్రజాపరిషత్ (1960)- ఖమ్మం
3) రమ్యసాహితి (1978)- ఖమ్మం
4) గౌతమి నవ్యసాహితి (1980)- సత్యనారాయణపురం
5) రవళి సాహిత్య సమాఖ్య (1985)- ఖమ్మం
6) శృతి సాహితీసంస్థ (1991)- సత్తుపల్లి
7) నవ్యకళాసమితి- కొత్తగూడెం
దాశరథి చెప్పినట్లు ఖమ్మం కవులకు గుమ్మం అని చెప్పవచ్చు.

నిజామాబాద్
ఎక్కువగా జమీందార్ల పోషణలో సంస్థలు ఉన్నాయి.
1) నిజామాబాద్ జిల్లా తెలుగు రచయితల సంఘం
(1968)
2) ఇందూరు భారతి (1969)
3) ఆదర్శ కళాసమితి (1972)-కామారెడ్డి
4) చేతన సాహితీభారతి (1972)-నిజామాబాద్
5) హిత సాహితీసంస్థ (1974)-కామారెడ్డి
6) ప్రజాసాహితి (1975)-నిజామాబాద్
7) చైతన్య యువసాహితీసాంస్కృతిక సమాఖ్య (1977)-

నిజామాబాద్
8) జనసంస్కృతి (1979)-నిజామాబాద్
9) సాహితీమిత్ర (1956)-కామారెడ్డి
10) సాహిత్య తరంగిణి (1987)-ఎల్లారెడ్డిపల్లి
lingamurthy

1026
Tags

More News

VIRAL NEWS