స్వప్నం సాకారమయ్యేవేళ


Fri,June 16, 2017 01:26 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ బిడ్డలు అధికార యూపీఏ ప్రభుత్వాన్ని తమ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో అంతకాలం ఉద్యమాన్ని ఏదో ఒకరకంగా తొక్కిపెడుతూ వచ్చిన కేంద్రం 2013 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదనే నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలో పరిణామాలు చకచకా మారిపోయాయి.
swapnam

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

-అఖిలపక్ష సమావేశం: 2011, ఫిబ్రవరి 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సందర్భంలో ఉద్యోగులందరూ సహాయ నిరాకరణకు శ్రీకారం చుట్టారు. 2011, మార్చి 10న మిలియన్ మార్చ్ జరిగింది. సెప్టెంబర్ 11 నుంచి సకల జనుల సమ్మె ప్రారంభమైంది. ఈ సమయంలో చిదంబరం స్థానంలో సుశీల్‌కుమార్ షిండే కేంద్ర హోంమంత్రి అయ్యారు.
-ఈయన 2012, డిసెంబర్ 28న హోంమంత్రి హోదాలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ కొత్త హోంమంత్రి అవగాహన కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నాడు.

అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు

-టీఆర్‌ఎస్: కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి
-కాంగ్రెస్ పార్టీ: సురేష్‌రెడ్డి (తెలంగాణ), గాదె వెంకటరెడ్డి (ఆంధ్ర)
-టీడీపీ: కడియం శ్రీహరి (తెలంగాణ), యనమల రామకృష్ణుడు (ఆంధ్ర)
-బీజీపీ: జీ కిషన్‌రెడ్డి (తెలంగాణ), హరిబాబు (ఆంధ్ర)
-ఏఐఎంఐఎం: అసదుద్దీన్ ఓవైసీ (తెలంగాణ), జీవీజీ నాయుడు (ఆంధ్ర)
-వైఎస్సార్‌సీపీ: కేకే మహేందర్‌రెడ్డి (తెలంగాణ), మైసూరారెడ్డి (ఆంధ్ర)
-సీపీఐ: గుండా మల్లేష్ (తెలంగాణ), కే నారాయణ (ఆంధ్ర)
-సీపీఎం: జూలకంటి రంగారెడ్డి (తెలంగాణ), రాఘవులు (ఆంధ్ర)
-ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యాడు. ఈ అఖిలపక్ష సమావేశంలో చెప్పుకోదగ్గ చర్చ జరగలేదు. గతంలో చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలనే వెల్లడించారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం

-కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావుతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరడం, 2013, జూన్ 3న హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు రాజ్‌నాథ్ సింగ్ హాజరు కావడంతో రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయన్న వార్తలు రావడంతో మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ 2013, జూలై 11న జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ప్రధాన అజెండాగా తెలంగాణ అంశాన్ని చేర్చింది.

-ఈ సమావేశానికి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, గులాంనబీ ఆజాద్, సుశీల్‌కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో త్వరలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రకటించింది. దీనిలో భాగంగా 2013, జూలై 25న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.

-ఊహించినట్లుగానే కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణలు తెలంగాణ వ్యతిరేకతను, దామోదర రాజనర్సింహ తెలంగాణ అనుకూలతను వ్యక్తపర్చారు. 2013, జూలై 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి తెలంగాణ అంశంపై సంప్రదింపులు ముగిశాయని ప్రకటించారు. జూలై 30న సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

-ఆంటోని కమిటీ: హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. 2013, ఆగస్టు 5న పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి చిదంబరం మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు 2013, ఆగస్టు 6న ఏకే ఆంటోని అధ్యక్షతన విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని సభ్యులు 1) అహ్మద్ పటేల్ 2) వీరప్ప మొయిలీ 3) దిగ్విజయ్ సింగ్.

-ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారనేదానికి సమాధానంగా 2013, ఆగస్టు 7న దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ విభజన అమలుకు ఈ కమిటీ ఏర్పాటైందని పేర్కొనడం గమనార్హం. 2013, నవంబర్ 8న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్.. ఆంటోని కమిటీ సిఫారసుల శీర్షికతోగల పేపర్లను కిరణ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, బొత్స సత్యనారాయణ, చిరంజీవిలకు అందజేశారు.

అందులో పరిష్కరించాల్సిన సమస్యల జాబితాలో 6 అంశాలున్నాయి. అవి..

ఎ. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతం.
బి. జలాలు, ఖనిజ సంపద.
సి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారులు, నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల పంపిణీ.
డి. ఆదాయం, ఆస్తులు, అప్పుల పంపిణీ.
ఈ. మౌలిక వసతుల (వైద్య సౌకర్యాలు, విద్య, రవాణా వ్యవస్థ) విభజన.
ఎఫ్. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సీమాంధ్రుల జీవనోపాధి, భూములు, ఆస్తులు, పెట్టుబడులకు భద్రత.

-రాజధాని ప్రాంతం కోసం ఆంటోని కమిటీ మూడు పరిధులను పరిగణనలోకి తీసుకున్నది.
1. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా
2. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (626 చ.కి.మీ.)
3. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (7,073 చ.కి.మీ.)
-అయితే, హెచ్‌ఎండీఏను ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే ఐదు జిల్లాలు అందులోకి వెళ్తాయి. కాబట్టి తెలంగాణ నాయకులు ఈ ప్రతిపాదనకు అంగీకరించరు. దీంతో ఉమ్మడి రాజధానిగా జీహెచ్‌ఎంసీని ఆంటోని కమిటీ సిఫారసు చేసింది.
-సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్న కారణంగా సీమాంధ్ర ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు సంబంధిత నియమ నిబంధనలను డ్రాఫ్టు బిల్లులో చేర్చాలని, వచ్చే పదేండ్లలో హైదరాబాద్‌లోని అన్ని విద్యాసంస్థల్లో సీమాంధ్ర విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలని కూడా ఆంటోని కమిటీ సిఫారసు చేసింది. ఆతర్వాత ఈ కమిటీ తన నివేదికను మంత్రుల బృందానికి అందజేసింది.

-మంత్రుల బృందం: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినట్లుగానే హైదరాబాద్‌తో సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం 2013, అక్టోబర్ 3న ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని రెండుగా విభజించడం వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం 2013, అక్టోబర్ 8న అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోని చైర్మన్‌గా ఆరు వారాల గడువుతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థికశాఖ మంత్రి పీ చిదంబరం, పెట్రోలియంశాఖ మంత్రి వీరప్పమొయిలీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేశ్‌లతోపాటు ప్రత్యేక ఆహ్వానితుడిగా వీ నారాయణ స్వామి( సిబ్బంది వ్యవహారాలు -ప్రధాన మంత్రి కార్యాలయం) ఉన్నారు.

మంత్రుల బృందం విధివిధానాలు

-నియోజకవర్గాలు, న్యాయసంస్థలు, ఇతర చట్ట సంస్థలు, పరిపాలన విభాగాలపరంగా కొత్త రాష్ట్రం, మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులను నిర్ధారించడం.
-పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన న్యాయ, పరిపాలనాపరమైన చర్యలపై దృష్టి సారించడం.

-మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమయ్యే న్యాయ, ఆర్థిక, పరిపాలన చర్యలను పరిగణనలోకి తీసుకోవడం.
-రెండు రాష్ర్టాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవసరాలపై దృష్టి పెట్టడం, తగిన చర్యలను సిఫారసు చేయడం.
-శాంతిభద్రతలు, ప్రజలందరి భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టడం, కొత్త తెలంగాణ రాష్ట్రం, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు, జిల్లాల్లో శాంతి, సామరస్యాలు నెలకొనేలా చూడటం. రెండు రాష్ర్టాల ఏర్పాటు ఫలితంగా తలెత్తే దీర్ఘకాలిక అంతర్గత భద్రత సమస్యలపై దృష్టి పెట్టి తగిన సిఫారసులు చేయడం.
-పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో సహా రెండు రాష్ర్టాల మధ్య, ఇతర రాష్ర్టాలతోను, నదీ జలాలు, సాగునీటి వనరులు, ఇతర సహజ వనరుల (ప్రత్యేకించి బొగ్గు, నీళ్లు, చమురు, సహజ వాయువు)కు సంబంధించిన పంపకాలపై దృష్టి పెట్టడం.

-విద్యుత్తు ఉత్పత్తి సరఫరా, పంపిణీకి సంబంధించిన అంశాలపై తగిన సిఫారసులు చేయడం.
-ఆస్తులు, అప్పులు, నిధులు, ప్రభుత్వ కార్పొరేషన్ల పంపకానికి సంబంధించి తలెత్తే సమస్యలపై దృష్టి సారించడం.
-రెండు రాష్ర్టాల మధ్య అఖిల భారత సర్వీసు, రాష్ట్ర ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన అంశాలపై తగిన మార్గదర్శకాలను సూచించడం.
-రాజ్యాంగంలోని 371డీ ప్రకరణ కింద జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్నందున విభజన అనంతరం ఈ అంశానికి సంబంధించి తలెత్తే సమస్యలపై దృష్టి సారించడం.

-విభజన కారణంగా తలెత్తే ఇతరత్రా సమస్యలను పరిశీలించి తగిన సిఫారసులు చేయడం
-రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే సమస్యల గురించి పరిశీలించడానికి ఏర్పాటైన మంత్రుల బృందం తన విధివిధానాల్లో భాగంగా వివిధ పార్టీలను, మంత్రులను, మంత్రిత్వశాఖ కార్యదర్శులను, వివిధ వ్యక్తులను, సంఘాలను కలిసి వారితో సుదీర్ఘంగా చర్చించింది. అదేవిధంగా నవంబరు 12, 13వ తేదీల్లో అన్ని పార్టీలు తమను కలిసి వాటి అభిప్రాయాలను చెప్పాలని కోరింది.

-సీడబ్ల్యూసీ ప్రకటన: తెలంగాణ రాష్ట్ర డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల (2004) మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రాం (2004)లో కూడా తెలంగాణ అంశాన్ని చేర్చింది. 2004, జూన్ 7న రాష్ట్రపతి కూడా తన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు.
mallikarjun
-2009, ఫిబ్రవరి 12న సీఎం రాజశేఖరెడ్డి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని శాసనసభలో ప్రకటించారు. 2009, డిసెంబర్ 7న అప్పటి సీఎం రోశయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనూ అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతిచ్చాయి. డిసెంబర్ 9, 23న కేంద్రం హోంమంత్రి తెలంగాణ ఏర్పాటు గురించి ప్రకటించారు. 2010, జనవరి 5, 2012, డిసెంబర్ 28లలో 8 పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లోనూ వాటి అభిప్రాయాలను తీసుకుంది. అదేవిధంగా ప్రజల మనోభావాలను కూడా అర్థం చేసుకున్నాం. శ్రీకృష్ణ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగబద్దమైన చర్యలు తీసుకొమ్మని కోరుతున్నాం.

-ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు వనరుల పంపకం, రక్షణ చర్యలు సక్రమంగా జరగాలి. హైదరాబాద్ రెండు రాష్ర్టాలకు 10 ఏండ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ పదేండ్లలోపు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాల్సి ఉంది.

569
Tags

More News

VIRAL NEWS