భూస్వామ్యం-యాజమాన్యం


Wed,January 23, 2019 01:03 AM

దివానీ భూములు


-ప్రభుత్వ యంత్రాంగమే శిస్తు వసూలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనకింద ఉండే భూములను దివానీ లేదా ఖల్సా భూములు అంటారు. హైదరాబాద్ సంస్థానంలోని మొత్తం సేద్యపు భూమిలో 60 శాతం భూములు ఈ వ్యవస్థ కింద ఉండేవి. 1875లో దివానీ పద్ధతిని క్రమబద్ధమైన సర్వే సెటిల్‌మెంట్ విధానం-1317 ఫసలీ ద్వారా సాలార్‌జంగ్ ప్రవేశపెట్టాడు. శిస్తును క్రమబద్ధంగా ప్రభుత్వానికి చెల్లించే ప్రాంతమే దివానీ ప్రాంతం. దివానీ ప్రాంతంలో భూమిశిస్తు విధానం, రైత్వారీ పద్ధతి ఉండేది. భూమిశిస్తును మూడు రకాలుగా చెల్లించేవారు అవి..
1. పాన్‌మక్తా, 2. సర్బస్తా, 3. పేష్కస్.

-పాన్‌మక్తా: దివానీ ప్రాంతంలోని భూములను కౌలుకు తీసుకుని ప్రభుత్వానికి క్రమబద్ధంగా స్థిరమైన శిస్తును చెల్లించే విధానాన్ని పాన్‌మక్తా అంటారు. ఈ విధానంలో శిస్తు స్థిరంగా ఉండి పెరుగుదల ఉండేది కాదు. పాన్‌మక్తా వ్యవస్థ ద్వారా ఏర్పడ్డ భూస్వామ్య వర్గమే మక్తేదార్లు. ఈ విధానం సాలార్‌జంగ్ దివాన్ అయ్యాక రద్దయ్యింది.
-సర్బస్తా: సర్బస్తా విధానం అంటే శిస్తు వసూలుచేసే హక్కు ను వేలంపాట ద్వారా పొందడం. ఈ విధానం ద్వారా నిజాం సంస్థానంలో ఏర్పడిన భూస్వామ్య వర్గం జమీందార్లు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంపై వేలంపాట ద్వారా ఒడంబడిక కుదిరిన తర్వాత ఆయా వ్యక్తులకు గ్రామాల్లో పన్నులు వసూలు చేసుకునే హక్కు లభిస్తుం ది. వీరు ప్రతి ఏడాది గ్రామాల్లో శిస్తు వసూలు చేసేవారు. అందులో నుంచి ఒప్పందం మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం చెల్లించి మిగిలినది తమ ఆదాయంగా జమచేసుకునేవారు.
-జమీందార్లేగాక ఇజారాదార్లు అనే మరోరకం భూస్వామ్య వర్గం ఉండేది. వీరు నిర్మానుష్యమైన ప్రాంతాల్లో పునరావాసం ఏర్పాటుచేసుకుని, అక్కడి భూమిని సాగులోకి తెచ్చి, ప్రభుత్వానికి నామమాత్రపు శిస్తు చెల్లిం చి ఆ భూములను అనుభవించేవారు.
Wanaparthy_palace

భూస్వాముల యాజమాన్యం


-ఇందులో భూమి భూస్వామి సొంత ఆస్తి. భూమిని సాగుచేసేది కౌలు రైతులు. 1875లో ఏర్పాటు చేసిన సర్వే సెటిల్‌మెంట్ ఫలితంగా కొన్ని కులాల వారికి, చేతివృత్తుల వారికి ఇనాం భూములు ఇచ్చారు. 1907లో మాల్‌గుజారి ల్యాండ్ రెవెన్యూ చట్టాన్ని కౌలుదారుల భద్రత కోసం తెచ్చారు. దీని ప్రకారం వరుసగా పన్నెండేండ్లు కౌలు చేసినవారిని శాశ్వత కౌలుదార్లుగా గుర్తించారు. 1939లో ఎంఎస్ భారువా కమిటీ సిఫారసులకు అనుగుణంగా వరుసగా ఆరేండ్లు కౌలు చేసిన ఆసామిషక్మీదారులను తొలగించకుండా 1944లో ఆసామిషక్మీ చట్టం చేసి, వారిని శాశ్వత కౌలుదార్లుగా ప్రకటించారు. అయితే భూస్వాముల ఒత్తిడివల్ల ఈ చట్టం అమలుకాలేదు.
-హైదరాబాద్ రాజ్యంలో 14 హిందూ సంస్థానాలు ఉండే వి. ఇవి నిజాం నుంచి దివానీ హక్కులు పొంది స్వయంపాలనా అధికారాలు కలిగి ఉండేవి. ఈ సంస్థానాధీశులు ప్రతి ఏడాది తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని కప్పం రూపంలో చెల్లించేవారు. దీన్నే పేష్కస్ అని కూడా అనేవారు. వీరి ఆధీనంలో 497 గ్రామాల్లో 5,030 చదరపు మైళ్ల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉండేది.
-హైదరాబాద్ రాజ్యంలో అనేక సంస్థానాలు ఉన్నప్పటికీ వాటిలో 14 మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో కొన్ని కాకతీయుల కాలంలో, కొన్ని కుతుబ్‌షాహీ లు, మరికొన్ని అసఫ్‌జాహీల కాలంలో ఆవిర్భవించాయి. ఈ సంస్థానాల హోదా జాగీర్లకంటే పెద్దది. జాగీర్లు నిజాం నవాబు ఇచ్చినవి. కానీ సంస్థానాలు అసఫ్‌జాహీలు రాజ్యాధికారానికి రాకముందు నుంచే ఉన్నాయి. అసఫ్‌జాహీలు వాటి స్వతంత్ర ప్రతిపత్తిని ఒప్పుకుని తమ రాజ్యంలో భాగంగా ఉంచుకున్నారు. ఆ మేరకు అసఫ్‌జాహీలతో ఒడంబడిక కుదిరింది. సంస్థానాల్లోని గ్రామాలు.. జాగీర్లలోని గ్రామాలవలె తాలూకాలు, జిల్లాల్లో విడివిడిగా కాకుండా ఒకే ప్రదేశంలో సముదాయంగా ఉండేవి.
-మొత్తం 14 సంస్థానాల్లో గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత, పాల్వంచ సంస్థానాలు మాత్రమే దివానీ అధికార పరిధి నుంచి మినహాయింపు పొందాయి.
-వీటిలో మూడు సంస్థానాలు (గద్వాల, వనపర్తి, జటప్రోలు) సొంత పోలీస్, న్యాయ వ్యవస్థలు కలిగి ఉన్నాయి. వీటికి పన్ను వసూలు చేసుకునే హక్కు ఉండటంవల్ల వీరు నిజాం ప్రభుత్వానికి కట్టే పేష్కస్ కంటే పెద్దమొత్తంలో పన్నులు వసూలు చేసి అనుభవించేవారు. గద్వాల సంస్థాన ఆదాయం ఏడాదికి రూ.10 లక్షలు ఉంటే, ఖర్చు రూ.7,31,308 ఉండేది. ఈ సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్ వ్యాజ్యాలను విచారించి తీర్పునిచ్చే అధికారం ఉండేది. ఈ ఐదుగురు సంస్థానాధీశులు నిజాం నవాబుకు ఏటా చెల్లించే పేష్కస్ వివరాలు..
1. గద్వాల- రూ.86,540
2. వనపర్తి- రూ.83,862
3. గోపాల్‌పేట- రూ. 22,663
4. జటప్రోలు- రూ. 71,944
5. పాల్వంచ- రూ. 45,875

-నిజాం సంస్థానంలో హిందూ, ముస్లింల పూజాస్థలాల నిర్వహణకు కొన్ని భూకమతాలు ఇచ్చేవారు. దాంతో అగ్రహార్ భూయాజమాన్య విధానం ఉనికిలోకి వచ్చింది. అయితే అగ్రహార్‌దార్లు తాము నిర్వర్తించాల్సిన పవిత్ర మత బాధ్యతలపట్ల శ్రద్ధ్దాసక్తులు, నియమనిష్టలు కనబర్చలేదు. వీరు భూములను స్వయంగా సాగుచేయకపోవడమేగాక భూమిశిస్తు వసూలు, ఇంకా ఇతర పనులను తమ తరఫున నిర్వర్తించడానికి ఏజెంట్లను నియమించేవారు. వీరు రైతులపై అధిక పన్నులు విధించి, చెల్లించడానికి నిరాకరించిన వారిని భూముల నుంచి వెళ్లగొట్టే వారు. దివానీ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు తలఫ్‌మాల్ ను ప్రకటిస్తే అగ్రహారాల్లో వీరు పాటించేవారు కాదు. దీంతో రైతులు ఇబ్బందిపడేవారు. అగ్రహార్ భూయాజమాన్య పద్ధతిలో మక్తాలవలె ఎవరికైతే యాజమాన్య హక్కు దక్కుతుందో.. వారు నిర్ణీత క్విట్‌రెంట్‌ను లేదా రుసుమును శాశ్వతంగా చెల్లించాలి.
-అగ్రహార్ భూయాజమాన్య హక్కుదారులు మక్తేదార్లు, ఇజారాదార్లు, వతన్‌దార్ల మాదిరిగా రైతులను తమ స్వలాభం కోసం దోపిడీకి గురిచేశారు.
-ఇజారా బంజర్లు: సాగుభూమిని విస్తరించే ఉద్దేశంతో బంజరు భూములను సాగులోకి తీసుకురావడానికి నిజాం సర్కారు ప్రవేశపెట్టిన పద్ధతే ఇజారా (కాంట్రాక్ట్) పద్ధతి. ఈ పద్ధతి కింద భూములు పొందిన వారిని ఇజారాదార్లు అనేవారు.
-వివిధ రకాల భూస్వామ్య యాజమాన్య విధానాలు నిజాం సంస్థానంలో సాలార్‌జంగ్ సంస్కరణల వరకు కొనసాగాయి. సాలార్‌జంగ్ సంస్కరణల తర్వాత కొత్త భూస్వామ్యవర్గం ఉనికిలోకి వచ్చింది. అవి..

జాగీర్దార్లు


-నిజాం నవాబుకు, అతని ప్రభుత్వానికి సేవచేసే ఉన్నత ఉద్యోగులు వేతనాలకు బదులుగా నిజాం నుంచి పొందిన భూములను జాగీర్లు అని, ఈ జాగీర్లు పొందిన వారిని జాగీర్దార్లు అని పిలిచేవారు. అప్పట్లో తెలంగాణలో 2,500 జాగీరు గ్రామాలు ఉండేవి. జాగీర్దార్లలో అత్యధికులు ముస్లింలే. వీరిలో కొందరికి రెవెన్యూ, పోలీస్, న్యాయ అధికారాలు ఉండేవి. జాగీర్దార్లలో కొందరు ప్రభుత్వానికి కప్పం చెల్లించాల్సిన వారు, కొందరు చెల్లించాల్సిన అవసరం లేనివారు ఉండేవారు. జాగీర్దార్లు ప్రజల నుంచి అనేక రకాల పన్నులు వసూలు చేసి ప్రజలను హింసించేవారు. పేద ప్రజలు జాగీర్దార్లకు ఉచితంగా చాకిరీ చేసేవారు. ఇది వెట్టిచాకిరీలో ఒక భాగం. 1949లో జాగీర్దార్ల రద్దు చట్టం రావడంతో ఈ వ్యవస్థ రద్దయ్యింది.

జమీందార్లు


-నిజాం కొన్ని గ్రామాల సముదాయాన్ని వేలంవేసి, ఎక్కువ వేలంపాడిన వ్యక్తికి ఆ గ్రామాల్లో పన్నులు వసూలు చేసుకునే హక్కును కల్పించేవారు. వేలంపాట ద్వారా శిస్తు వసూలు హక్కును పొందిన మధ్య దళారీ వర్గమే జమీందారీ వర్గం. వీరు రైతులపై వివిధ రకాల పన్నులు విధించి వసూ లు చేసేవారు. పన్నులు చెల్లించలేని రైతుల భూములను స్వాధీనం చేసుకునేవారు.
-హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో భూకేంద్రీకరణ విపరీతంగా ఉండేది. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో సాగులో ఉన్న మొత్తం భూమిలో సుమారు 60-70 శాతం భూమి కొద్దిమంది ఆధీనంలోనే ఉండేదని 1950-51 నాటి ప్రభుత్వ పాలనా నివేదికలో ఉంది.
-నిజాం సంస్థానంలో పటేల్, పట్వారీ, మాలిపటేల్‌లు గ్రామాధికారులుగా పనిచేసేవారు. వీరు గ్రామ స్థాయిలో శిస్తు వసూలు, లెవీ ధాన్యం సేకరణ, శాంతిభద్రతలను కాపాడటం, దేశ్‌ముఖ్-దేశ్‌పాండేలకు పన్ను వసూలులో సహకరించడం వీరి విధులుగా ఉండేవి. గ్రామస్థాయిలో పరిపాలన అంతా వీరి ఆధీనంలోనే జరిగి వీళ్లు క్రమంగా చిన్నస్థాయి భూస్వాములుగా ఎదిగారు. వీరిలో కొందరు నాలుగైదు గ్రామాలకు అధికారులుగా వ్యవహరించేవారు. జాగీర్దార్, జమీందార్, దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, పటేల్, పట్వారీ ఇలా హోదా ఏదైనా అంతా భూస్వాములే. కాకపోతే హోదాను బట్టి చిన్నాపెద్ద భూస్వాములుగా ఉండేవారు. తెలంగాణ ప్రాంతంలో భూస్వాములను దొరలు అని పిలిచేవారు. దేశ్‌ముఖ్‌ల నివాస ప్రాంతాలు పెద్దగా ఉండేవి. వాటిని గడీలు అనేవారు. వీరు పాలేరుల పర్యవేక్షణలో వ్యవసాయ పనులు చేయించేవారు. పాలేర్లు గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని దేశ్‌ముఖ్‌కు అందించేవారు. గ్రామాల్లో జరిగే చిన్నచిన్న తగాదాలను దేశ్‌ముఖ్ ఏజెంట్లుగా వీళ్లు పరిష్కరించేవారు. దేశ్‌ముఖ్‌లకు అన్ని విధాలుగా సాయపడేవారు. దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, గ్రామాధికారుల వ్యవసాయ భూములను రైతులు కౌలుకు సాగు చేసేవారు. ఆ రోజుల్లో షక్మీదారులు, ఆసామి షక్మీదారులు అనే రెండు రకాల కౌలు రైతులు ఉండేవారు. షక్మీదారులు అంటే శాశ్వత కౌలుదారులు లేదా రక్షిత కౌలుదారులు. ఈ పద్ధతి కింద భూస్వాములు తమ ఇష్టం వచ్చినట్లు కౌలును మార్చడానికి వీలుండేది కాదు. ఏ హక్కులు లేని తాత్కాలిక కౌలుదారులను ఆసామి షక్మీదారులు అనేవారు. వీరు ఒకే భూమిని 12 ఏండ్లు కౌలుకు సేద్యం చేస్తే వారికి షక్మీదారు గుర్తింపు లభించేది. 1944లో ఆసామిషక్మీ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆరేండ్లు కౌలుకు సేద్యం చేసిన ఆసామిషక్మీదారులను తొలగించడానికి వీల్లేదు. అయితే బలవంతులైన భూస్వాముల ఒత్తిడివల్ల ఈ చట్టం అమలు కాలేదు.

దేశ్‌ముఖ్‌లు-దేశ్‌పాండేలు


-నిజాం ప్రభుత్వం 1875 సర్వే సెటిల్‌మెంట్ చట్టం తీసుకొచ్చింది. దీంతో ఆవిర్భవించిన కొత్త భూస్వామ్య వర్గమే దేశ్‌ముఖ్‌లు-దేశ్‌పాండేలు/వతన్‌దార్లు. తెలంగాణలో దేశ్‌ముఖ్‌లు-దేశ్‌పాండేలు అతి ముఖ్యమైన భూస్వామ్య వర్గం. సాలార్‌జంగ్‌కు పూర్వం వారు ప్రభుత్వానికి పన్నులు వసూ లు చేసి పెట్టేవారు. వసూలు చేసిన శిస్తులో ప్రభుత్వ భాగాన్ని చెల్లించి మిగిలిన మొత్తాన్ని వారే అనుభవించేవారు. వారు గ్రామాల్లో పన్నులు చెల్లించలేకపోయిన వారి భూములను తమ పేరిట రాయించుకోవడం ద్వారా పెద్ద భూస్వాములుగా ఎదిగారు. సాలార్‌జంగ్ సంస్కరణలతో దేశ్‌ముఖ్‌లు-దేశ్‌పాండేలకు వారు అప్పటివరకు వసూలు చేసిన పన్నుల మొత్తం ప్రాతిపదికపై వతన్లు లేదా మాష్ (ఉద్యోగ విరమణ అనంతరం భృతి) మంజూరు చేశారు. దీంతో వారికి 5-10 గ్రామాలపై వతన్లు, పన్నులు వసూలు చేసే అధికారం లభించింది. ఈ దేశ్‌ముఖ్-దేశ్‌పాండేలు తమకు లభించిన గ్రామాలపై తమ గుమస్తాల సహకారంతో అజమాయిషీ చేసేవారు.
-సర్వే సెటిల్‌మెంట్ సమయంలో నిజాం ప్రభుత్వం దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలతో రాజీపడి వారికి పెద్ద మొత్తంలో భూమిపై యాజమాన్యపు హక్కులు కల్పించింది. కొంతభూమిపై శిస్తును తగ్గించడంతోపాటు మరికొంత భూమిపై శిస్తు లేకుండానే పట్టాహక్కులు కట్టబెట్టారు. వాటినే సేరీ స్థావరాలు అంటారు. వీళ్లు క్రమంగా ఎదిగి తెలంగాణలో అతిపెద్ద భూస్వామ్య వర్గంగా ఆవిర్భవించారు.

భూస్వాములు, వారి భూముల వివరాలు


భూస్వామి పేరు - భూమి (ఎకరాల్లో)
1. జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి (ఎర్రబాడు దేశ్‌ముఖ్)- 1,50,000
2. కుందూరు లక్ష్మీకాంతరావు (సూర్యాపేట దేశ్‌ముఖ్)- 20,000
3. కల్లూరు దొరలు (మధిర ప్రాంతం)- 10,000
4. లక్సెట్టిపేట దొరలు- 50,000
5. రాంచంద్రారెడ్డి (విసునూరు దేశ్‌ముఖ్)- 40,000
6. బాబాసాహెబ్‌పేట దేశ్‌ముఖ్- 20,000
7. మల్లాపురం రంగారెడ్డి దేశ్‌ముఖ్- 10,000
8. చెరుకుపల్లి నర్సింహారెడ్డి దేశ్‌ముఖ్- 10,000
9. చందుపట్ల సుదర్శనరావు దేశ్‌ముఖ్- 10,000
10. పూసుకూరు రాఘవరావు దేశ్‌ముఖ్- 10,000
-పైవారేగాక 1,000-10,000 ఎకరాల లోపు భూములుగల భూస్వాములు సంస్థానంలో చాలామంది ఉండేవారు.

హిందూ సంస్థానాలు


1. గద్వాల 2. వనపర్తి
3. జటప్రోలు 4. అమరచింత
5. పాల్వంచ 6. దోమకొండ
7. గోపాల్‌పేట 8. పాపన్నపేట
9. నారాయణపేట 10. అనెగొంది
11. సిర్నాపల్లి 12. రాజాపేట
13. గురుగుంట 14. దుబ్బాక

G_Laxman

949
Tags

More News

VIRAL NEWS