ప్రణాళికా ప్రతిపాదనలు

Tue,March 21, 2017 01:38 AM

ఇప్పటివరకు మనం ఎకానమీ మౌలిక విషయాలు, ఎకానమీ, ఎకనామిక్, మైక్రో, మ్యాక్రో, ఎకానమీ నాలుగు కేంద్రక సమస్యలు, నాలుగు పరిష్కారాలు, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, వాటి మధ్య భేదాలు, ఆర్థిక వృద్ధిని కొలిచే మార్గాలు, జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం కొలిచే పద్ధతులను చర్చించాం. చివరి వ్యాసంలో ప్రణాళిక అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు, ప్రణాళిక హేతుబద్ధత ఏంటి? తెలుసుకున్నాం. అదే క్రమంలో ఒక దేశానికి ప్రణాళిక ఎందుకు ఉండాలి? అసలు ప్రణాళికా సంఘం అంటే ఏమిటి? దాని విధులు ఏమిటి? మొదలైన విషయాలను కూడా చర్చించాం. ఆ క్రమంలోనే దానికి కొనసాగింపుగా ఈరోజు స్వాతంత్య్రానికి పూర్వం ప్రణాళికల గురించి జరిగిన కృషిని, ఆ తర్వాత వాటికి కొనసాగింపుగా సాగిన వివిధ పంచవర్ష ప్రణాళికలను కూడా చర్చిద్దాం.
Agriculture

స్వాతంత్య్రానికి పూర్వం ప్రణాళికల చరిత్ర


-ప్రపంచవ్యాప్తంగా ప్రణాళిక అనే భావన ప్రచారంలోకి రావడానికి దారితీసిన సంఘటన 1929 ఆర్థిక మాంద్యం
-ఆర్థిక మాంద్యానికి లోనుకాని ఏకైక దేశం రష్యా
-రష్యాలో స్టాలిన్ 1928-33 మధ్య విజయవంతంగా మొదటి ప్రణాళికను అమలుచేశాడు. (1929లో రష్యాను యూఎస్‌ఎస్‌ఆర్ అనేవారు)
-ఎందుకంటే 1917లో యూఎస్‌ఎస్‌ఆర్ ప్రణాళికాయుత ఆర్థిక వ్యవస్థ అనే విధానం ప్రవేశపెట్టి కేవలం 20 ఏండ్ల కాలంలోనే అమెరికాకు సమానస్థాయి ప్రగతిని సాధించింది. అందువల్ల అధిక ఆర్థిక మాంద్యానికి గురికాకపోవడంవల్ల అందరి దృష్టి సోవియట్ రష్యాపై పడింది.
-భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండటంవల్ల ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికాయుతమైన కృషి జరగలేదు. అంతేకాకుండా స్వాతంత్య్రానికి ముందు స్థాపించిన దాదాపు అన్ని వ్యవస్థలు ప్రజా అవసరాలకనుగుణంగా వ్యవహరించలేదు. అయినా కూడా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే ప్రణాళికబద్దమైన కృషి జరగాల్సిందే అని భావించి కొందరు తమ తమ పరిధిలో ప్రణాళికలను రూపొందించారు. అందులో భాగంగా మొదటిసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ప్రణాళికను రూపొందించారు.

1938లో జేఎల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీ


-1938లో జాతీయ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులు 15 మంది. దీనికి కార్యదర్శి కేటీషా. అయితే రెండో ప్రపంచయుద్ధం, రాజకీయ ఒత్తిడి అనివార్య కారణాలతో అవాంతరాలు ఏర్పడటంతో ఈ కమిటీ తన నివేదికను రూపొందించటంలో తీవ్ర జాప్యం జరిగింది.
-ఈ కమిటీ 1948లో తన నివేదికను సమర్పించింది.
-ఇదే కాలంలో ప్రణాళికల గురించి మరికొన్ని ప్రతిపాదనలు చేశారు.
-పీఎస్ లోక్‌నాథ్ - ప్రిన్సిపుల్స్ ఆఫ్ ప్లానింగ్ (1936)
-కె.ఎన్ సేన్ - ఎకనామిక్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా
-ఇంకా మనదేశానికి ప్రణాళికలు అవసరమని ప్రతిపాదించిన మొదటి నాయకుడు సుభాష్ చంద్రబోస్

గ్రామీణ స్వయం సమృద్ధి, వికేంద్రీకరణ-ముఖ్య లక్షణాలు


-1944లో బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి ఎ.డి దలాల్ అధ్యక్షతన ప్రణాళిక, అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసింది.
-ఇది రెండో ప్రపంచయుద్ధం అనంతరం చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి స్వల్పకాలిక ప్రణాళికతో పాటు, దీర్ఘకాలిక ప్రణాళికను సైతం రూపొందించింది.


ప్రజా ప్రణాళిక (1945)


-భారత కార్మిక సమాఖ్యకు చెందిన ఎం.ఎన్.రాయ్ ఈ ప్రజా ప్రణాళికను రూపొందించారు. (అతను రాడికల్ డెమోక్రటిక్ అనే పార్టీని స్థాపించారు)
-ప్రజా ప్రణాళిక పెట్టుబడి వ్యయం : 15000 కోట్లు
-కాల వ్యవధి : పదేండ్లు
-ప్రాధాన్యం : వినియోగవస్తు పరిశ్రమలు, వ్యవసాయం
-పైన పేర్కొన్న బొంబాయి ప్రణాళిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగి ఉండగా, ఈ ప్రజా ప్రణాళికకు సామ్యవాద ఆర్థిక లక్షణాలు ఉన్నాయి.
-1946లో కేసీ నియోగ్ అధ్యక్షతన ప్రణాళిక సలహా సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘం ప్రణాళికను రూపొందించడానికి రాష్ర్టాల ప్రతినిధులుగా ఉన్న శాశ్వాత సంఘాన్ని ఏర్పాటుచేయమని ప్రభుత్వానికి సూచించింది.

విశ్వేశ్వరయ్య ప్లాన్


-మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో తాను రచించిన భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనే గ్రంథంలో పదేండ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు.
-ఈ ప్రణాళికలో పదేండ్ల కాలంలో రూ. 2900 కోట్లతో దేశ రాబడిని రెండింతలు చేయడమెలాగా అని ప్రణాళికను రూపొందించారు. అలాగే దీన్ని గడువు లోపల రూ. 5000 కోట్లుగా పెంచారు.
-బ్రిటిష్ ఇండియా సంఘటిత పరిశ్రమలో స్వదేశీ మూలధన పెట్టుబడిని రూ. 300 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకూ పెంచాలని, వార్షిక ఉత్పత్తిని అన్ని తరగతుల పరిశ్రమల నుంచి రూ. 400 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు పెంచాలని ప్రతిపాదించారు. అన్ని కొత్త పరిశ్రమలకు పదేండ్ల కాల నిడివి గల ప్రతిపాదనలో సుమారు రూ. 700 కోట్లుగా వ్యయాన్ని లెక్కించారు.

బాంబే ప్రణాళిక


-రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారత ఆర్థికాభివృద్ధికి తీసుకున్న ప్రతిపాదనల సమాహారాన్నే బాంబేప్లాన్ అంటారు. ఈ ప్లాన్ బొంబాయి నగారానికి చెందిన ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు కలిసి భారతదేశ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళిక అనే పేరుతో రూపొందించారు.

ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు


1. టాటా 2. బిర్లా 3. దలాల్ 4. జాన్‌మథాయ్
5. పురుషోత్తం దాస్ 6. కస్తూరీబాయి
7. శ్రీరామ్‌లాల్ 8. షరీఫ్
-చైర్మన్: దలాల్ (బాంబేలో బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ ఉన్న ప్రాంతాన్ని దలాల్ స్ట్రీట్ అంటారు).
-ఈ ప్రణాళికను టాటా బిర్లా ప్రణాళిక లేదా పారిశ్రామిక ప్రణాళిక అంటారు.
-దీని పెట్టుబడి వ్యయం : 1000 కోట్లు
-కాల వ్యవధి : 15 ఏండ్లు
-ప్రాధాన్యం : మౌళిక, భారీ పరిశ్రమల ఏర్పాటు
-లక్ష్యం : తలసరి ఆదాయం రెట్టింపు చేయడం
-తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కావాల్సిన మార్గాలు
1. వ్యవసాయ రంగాన్ని 130 శాతం పెంచాలి.
2. పారిశ్రామిక రంగాన్ని 500 శాతం పెంచాలి
3. సేవారంగాన్ని 200 శాతం పెంచాలి.

గాంధీ ప్రణాళిక (1944-45)
-గాంధీ సిద్ధాంతాల ఆధారంగా శ్రీ ఎం.ఎన్ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూపొందించారు.
-గాంధీ ప్రణాళిక పెట్టుబడి వ్యయం : 3500 కోట్లు
-కాల వ్యవధి : పదేండ్లు
-ప్రాధాన్యం : వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర, చేనేత పరిశ్రమలు

కాగితపు ప్రణాళికలు (పేపర్ ప్లాన్స్)


-స్వాతంత్య్రానికి పూర్వం వివిధ వ్యక్తులు రూపొందించిన ప్రణాళికలను కాగితపు ప్రణాళికలు అని అంటారు. ఎందుకంటే ప్రణాళికలను ప్రభుత్వాలు అమలుచేయనందున ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి.

సర్వోదయ ప్రణాళిక (1950)


-1950 జనవరి 1న ఆచార్య వినోభాబావే ఆశయాలకు అనుగుణంగా జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక గ్రామీణ వికేంద్రీకరణ, పేదవారికి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-ఈ పరిణామాల తర్వాత, స్వాతంత్య్రానంతరం 1950 మార్చి 15లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
-ఇది భారతదేశానికి ప్రణాళికలను రూపొందిస్తుంది.
-ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను అమోదించడానికి, వాటిపై చర్చించి తగు సూచనలు చేయడానికి జాతీయ అభివృద్ధి మండలిని సైతం ఏర్పాటు చేశారు.

జాతీయ అభివృద్ధి మండలి


-దీన్ని 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేశారు.
-దీన్ని కూడా ప్రణాళిక సంఘం లాగా క్యాబినెట్ తీర్మానంలో ఏర్పాటుచేశారు.
-ఇది కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు.
-చట్టబద్ధమైనది కూడా కాదు. ఇది కేవలం సలహా సంఘం మాత్రమే.
-దీనికి ప్రధానమంత్రి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. దీనిలోని సభ్యులు
1. అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు
2. ప్రణాళిక సంఘంలోని సభ్యులు
3. 1967లో పరిపాలనా సంఘం సిఫార్సుల మేరకు
కింది వారిని కూడా సభ్యులుగా తీసుకున్నారు.
1. కేంద్ర క్యాబినెట్ మంత్రులు
2. కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు
-ముఖ్య ఉద్దేశం : ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళిక ముసాయిదాను అంతిమంగా ఆమోదిస్తుంది.
-ఇది ప్రతి రెండేండ్లకోసారి రూపొందించి ఆమోదించిన ప్రణాళికను సమీక్షిస్తుంది.
-ఇటీవల వచ్చిన నీతి ఆయోగ్‌వల్ల ప్రణాళిక సంఘంతో పాటు ఈ ఎన్‌డీసీ కూడా దాదాపు రద్దయింది.
-ఈ ఎన్‌డీసీ రద్దయినంక ప్రణాళిక సంఘం, ఎన్‌డీసీ స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థ 2015 జనవరి 1న ఆవిర్భవించింది.
-ఇక నుంచి ప్రణాళికలకు సంబంధించి విధి విధానాలను ఈ సంస్థ చూసుకుంటుంది.
-ఇంతకుముందు ప్రణాళిక సంస్థ నిర్వహించిన విధులన్నింటిని నీతి ఆయోగ్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన తర్వాత.. ఇప్పటివరకు 12 పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటుచేసింది. అందులో 12వది కూడా 2017తో ముగియబోతుంది.
-ఈ పన్నెండు ప్రణాళికలను అమలుచేయడానికి వనరుల లభ్యత మూడు మార్గాల్లో చేశారు. అవి
-దేశీయ వనరులు
-విదేశీ సహాయం
-లోటు ద్రవ్యం
-దేశీయ వనరులు : ప్రణాళికలకు దేశీయ వనరులు ముఖ్యంగా నాలుగు మార్గాల్లో సమకూరుతాయి. దీన్నే డొమెస్టిక్ బడ్జెట్ రిసోర్స్ అని అంటారు.
-మార్కెట్ రుణాలు, చిన్న మొత్తాల పొదుపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ ద్వారా అంతర్గత ప్రైవేట్ పెట్టుబడుల సేకరణ
-ప్రభుత్వ రంగ సంస్థల లాభాల ద్వారా సమకూర్చుకొనుట
-ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తుల ధరలను పెంచడం ద్వారా
-ప్రస్తుత రెవన్యూ శేషం నుంచి నిధులు సమకూర్చుకొనుట ద్వారా
-పై మార్గాల ద్వారా ప్రణాళికలకు కావాల్సిన వనరులు సరిపోనట్లయితే విదేశీ సహాయం అనే మరో మార్గం ద్వారా వనరుల సమీకరణ జరుగుతుంది.

విదేశీ సహాయం


-ఇది ఎక్కువగా గ్రాంట్లు, రుణాల రూపంలో ఉంటుంది. విదేశీ సహాయం ఎక్కువ కావడం వల్ల అసలు, వడ్డీలు చెల్లించాల్సి రావడంతో వడ్డీ భారం కూడా పెరిగే అవకాశం ఉంది. (మన దేశానికి జపాన్, బ్రిటన్‌ల నుంచి అధిక గ్రాంట్లు వస్తున్నాయి)

లోటు ద్రవ్యం


-పైన వివరించిన దేశీయ వనరులు, విదేశీ సహాయం ద్వారా వనరులు సమకూర్చుకోలేని ఎడల రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు ద్వారా లోటు ద్రవ్యాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
-సుఖమయ చక్రవర్తి కమిటీ సూచన ప్రకారం 1997-98 నుంచి (6 ప్రణాళిక నుంచి) ప్రణాళిక నిధుల సమీకరణకు లోటు ద్రవ్య నిధానాన్ని ఉపయోగించడం లేదు. అత్యధికంగా మనకు దేశీయ వనరుల నుంచే నిధులు సమీకరిస్తారు.
Prabakar

444
Tags

More News

మరిన్ని వార్తలు...