నియోజకవర్గాలు-విశేషాలు


Tue,July 25, 2017 01:20 AM

ఇల్లందు: 1952లో ఏర్పడింది. తొలుత ద్విసభ్య నియోజకవర్గం. తొలి ఎన్నికల్లో ద్విసభ్యులు వూకె నాగయ్య, కేఎల్ నర్సింహారావు విజయం సాధించారు. గుమ్మడి నరసయ్య ఐదుసార్లు (1983, 1985, 1989, 1999, 2004) ఎమ్మెల్యేగా గెలిచారు.

సుజాతనగర్: 1978లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో పువ్వాడ నాగేశ్వర్‌రావు తన సమీప అభ్యర్థి బొగ్గారపు సీతారామయ్యపై విజయం సాధించారు. రజబ్‌అలీ నాలుగుసార్లు (1983, 1985, 1989, 1994) ఎమ్మెల్యేగా గెలిచారు.

ఖమ్మం: 1952లో ఏర్పడింది. తొలుత ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి 10 సార్లు కమ్యునిస్టులు విజయం సాధించారు. నల్లమల గిరిప్రసాద్ (1962), పువ్వాడ నాగేశ్వరరావు (1989, 1994), మంచికంటి రాంకిషన్‌రావు(1985, 1989) తమ్మినేని వీరభద్రం (2004) గెలిచారు.

పాలేరు: 1962లో ఏర్పడింది. కత్తుల శాంతయ్య మూడుసార్లు (1962, 1967, 1972), సంభాని చంద్రశేఖర్ నాలుగుసార్లు (1981, 1989,1999, 2004) ఎమ్మెల్యేగా గెలిచారు. కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

మధిర: 1952లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కే వెంకయ్య, 1957 ఎన్నికల్లో ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు బొమ్మకంటి సత్యనారాయణ విజయం సాధించారు. ఉగ్గినేని వెంకయ్య రెండుసార్లు (1962, 1967) బొడేపూడి వెంకటేశ్వరరావు మూడుసార్లు (1985, 1989, 1994), కే వెంకటనర్సయ్య రెండుసార్లు (1998, 2004) ఎమ్మెల్యేగా పనిచేశారు. 1983లో శీలం సిద్ధారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహారావు మంత్రివర్గాల్లో పనిచేశారు.


సత్తుపల్లి: 1978లో ఏర్పడింది. అంతకుముందు వేంసూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 1978 ఎన్నికల్లో జలగం వెంగళరావు ప్రముఖ కవి కాళోజీ నారాయణరావుపై విజయం సాధించారు. జలగం వెంగళరావు వేంసూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు (1957, 1962, 1967, 1972), సత్తుపల్లి నుంచి ఒకసారి (1978) గెలుపొందారు. 1985లో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో జలగం వెంకట్రావ్ తన సమీప అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు.

కొత్తగూడెం: 1978లో ఏర్పడింది. అంతకుముందు పాల్వంచలో భాగంగా ఉండేది. తొలి ఎన్నికల్లో చేకూరి కాశయ్య విజయం సాధించారు. కొనేరు నాగేశ్వరరావు మూడుసార్లు (1983, 1985, 1994), వనమా వెంకటేశ్వర్లు రెండుసార్లు (1999, 2000) ఎమ్మెల్యేగా గెలిచారు.

పాల్వంచ: 1952 నుంచి 1972 వరకు నియోజకవర్గం ఉంది. 1957 ఎన్నికల్లో కే సుదర్శన్‌రావు తన సమీప ప్రత్యర్థి పీ సత్యనారాయణపై గెలుపొందారు.

బుర్గంపాడు: 1962లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కే బుచ్చయ్య విజయం సాధించారు. కొమరం రాజయ్య రెండుసార్లు(1967, 1968) ఎమ్మెల్యేగా గెలిచారు. 1967 ఎన్నికల్లో కొమరం రాజయ్య ఎన్నిక చెల్లదన్న కోర్టు తీర్పుతో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసిన రాజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Telangana-Assembly

భద్రాచలం: 1957 వరకు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండేంది. ఈ నియోజకవర్గం తొలుత ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. తొలి ఎన్నికల్లో ద్విసభ్యులు వైవీ కృష్ణారావు, కేబీ దొర విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి కుంజా బొజ్జి మూడు సార్లు (1985, 1989, 1994), మర్ల ఎర్రయరెడ్డి రెండుసార్లు (1978, 1983) సున్నం రాజయ్య రెండుసార్లు (1999, 2004) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ములుగు: 1952లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో హన్మంతరావు గెలుపొందారు. సంతోష్ చక్రవర్తి రెండు సార్లు ( 1967, 1972) పీ జగన్నాయక్ రెండు సార్లు (1978, 1983), అజ్మీర చందూలాల్ (1985, 1994), పొదెం వీరయ్య రెండుసార్లు (1999, 2004) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 ఎన్నికల్లో ఎస్ రాజేశ్వరరావు తన సమీప అభ్యర్థిపై కేవలం 231 ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషం.

పరకాల: ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952 నుంచి 1972 వరకు ఎవరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. 1978లో ఎస్సీ రిజర్వ్‌డ్ అయింది. బీ సమ్మయ్య (1978, 83) రెండుసార్లు, జయపాల్ ఒంటేరు (1985, 89) రెండుసార్లు గెలుపొందారు. బీ సమ్మయ్య భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. 1952లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపాల్‌రావు.. జేకే రావుపై గెలుపొందారు.

హన్మకొండ: 1952లో నియజకవర్గంగా ఉండేది. ఆ తర్వాత 1978 వరకు లేదు. మళ్లీ 1978 నుంచి నియోజకవర్గంగా కొనసాగుతుంది. 1952లో పెండ్యాల రాఘవరావు హన్మకొండ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా గెలిచారు. ఎంపీగా పరిమితమై ఎమ్మెల్యే స్థానాలకు రాజీనామా చేశారు. 1978లో హయగ్రీవాచారి, 1994లో పీవీ నరసింహారావు కుమారుడు పీవీ రంగారావు ఇక్కడి నుంచి గెలిచారు. పీవీ రంగారావు నేదురమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.

హసన్‌పర్తి: 1952లో ఏర్పడింది. 1972 వరకు నియోజకవర్గంగా ఉంది. 1952 ప్రథమ ఎన్నికల్లో వీకే ధాగేపై మీర్జా బేగ్ గెలిచారు.

ధర్మసాగర్: 1957, 1962లలో రెండుసార్లు టీ హయగ్రీవాచారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ రెండు ఎన్నికల్లో ఆయన పీవీ రెడ్డిని ఓడించారు.

వరంగల్: 1952లో ఏర్పడింది. ఎంఎస్ రాజలింగం (ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు) ప్రథమ ఎమ్మెల్యేగా ఏ సత్యనారాయణపై గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచే బసవరాజు సారయ్య (1999, 2000) రెండుసార్లు గెలిచారు. బీ నాగభూషణరావు (1962, 83, 85) మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తక్కళ్లపల్లి పురుషోత్తం 1993లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.

శాయంపేట: 1978లో ఏర్పడింది. మాదాడి నరసింహారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పీ ధర్మారెడ్డిపై గెలిచారు. 1991లో నేదురమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి క్యాబినెట్‌లలో నరసింహారెడ్డి మంత్రిగా పనిచేశారు.

ఘన్‌పూర్: 1957 నుంచి జనరల్‌కు రిజర్వ్‌డ్ కాగా 1978లో ఎస్సీ రిజర్వ్‌డ్ అయ్యింది. టీ హయగ్రీవాచారి 1972లో ఒకసారి గెలుపొందారు. ఈయన 1972లో పీవీ, 1978లో మర్రి చెన్నారెడ్డి, 1981లో అంజయ్య, 1982లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. గో రామస్వామి ఇక్కడి నుంచే 1978, 83లలో రెండుసార్లు గెలిచి 1978లో చెన్నారెడ్డి, 1981లో టీ అంజయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి (ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి) 1994లో ఎన్టీఆర్, 1995, 2004 చంద్రబాబు మంత్రివర్గాల్లో సభ్యుడిగా ఉన్నారు.

వర్ధన్నపేట: 1952లో ఏర్పడింది. ఇక్కడి నుంచి ప్రథమ ఎమ్మెల్యేగా గెలిచిన పెండ్యాల రాఘవరావు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక జరిగింది. ఈ ఉపఎన్నికలో జీకే రావును ఏఎల్‌ఎన్‌రెడ్డి ఓడించారు. తక్కెళ్లపల్లి పురుషోత్తం (1967, 72) రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

నర్సంపేట: 1957లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం నుంచి మద్దికాయల ఓంకార్ 1972, 78, 83, 85, 89లలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఏ వెంకటేశ్వరరాపై కే కనకరత్నమ్మ గెలుపొంది తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓంకార్ 1983లో ఎంసీపీఐ పేరుతో కొత్త పార్టీని పెట్టారు.

మహబూబాబాద్: 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం నుంచి జన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి (1972, 78, 83, 85, 89) ఐదుసార్లు గెలిచారు. 1957, 62లలో చిల్లంచర్ల నియోజకవర్గంగా ఉండేది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఎంఎస్ రాజలింగం చిల్లంచర్ల నుంచే 1957లో గెలుపొందారు. 1952లో బీఎం చందర్‌రావు ఏ రాజయ్యను ఓడించారు.

డోర్నకల్: 1957లో ఏర్పడింది. ఇద్దరు ప్రముఖులు ఇక్కడి నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1972లో నూకల రామచంద్రారెడ్డి ఎన్నిక కాగా, ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో రామసహాయం సురేందర్‌రెడ్డి 1974లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నూకల రామచంద్రారెడ్డి (1957, 62, 67, 72) నాలుగుసార్లు, రామసహాయం సురేందర్‌రెడ్డి (1974, 78, 83, 85) నాలుగుసార్లు గెలిచారు. డీఎస్ రెడ్యానాయక్ 1989, 94, 99, 2004లలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

చెన్నూరు: 1957లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం ఎన్ యతిరాజారావుతో ఎక్కువ ముడిపడి ఉంది. 1962, 75, 78, 83, 85, 89, 94లలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1967లో ఈయన భార్య విమలాదేవి, 1999లో ఈయన పెద్ద కుమారుడు డాక్టర్ సుధాకర్‌రావు గెలుపొందారు. 2004లో ఈయన ఓడిపోయారు. ఈ నియోజకవర్గ ప్రథమ ఎమ్మెల్యే ఎస్ వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్ యతిరాజారావును ఓడించారు.

జనగామ: 1957లో ఏర్పడింది. మొదట ఇది ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. గోకా రామలింగం (1957, 62) రెండుసార్లు, పొన్నాల లక్ష్మయ్య (1989, 99, 2004) మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పొన్నాల 1991లో నేదుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.

చేర్యాల: 1962లో నిమ్మ రాజిరెడ్డి (1983, 85, 89, 94) నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కమాలుద్దీన్ అహ్మద్ జీ గోపాల్‌రెడ్డిపై గెలిచారు.

నుస్తులాపూర్: గతంలో నుస్తులాపూర్, సుల్తానాబాద్, పరకాల, ఎలిగండ్ల నియోజకవర్గాలు ఉండేవి. నుస్తులాపూర్‌లో 1967లో గెలిచిన బుట్టి రాజారాం, 1957లో సుల్తానాబాద్, 1952లో జగిత్యాల, 1962లో పెద్దపల్లిలో గెలుపొందారు.

నేరెళ్ల:1962లో ఏర్పడింది. పాటి రాజం (1978, 83, 89) మూడుసార్లు గెలిచారు. గొర్రె భూపతి (1967, 72) రెండుసార్లు, సుద్దాల దేవయ్య (1994, 99) రెండుసార్లు గెలిచారు. 1962లో మొదటి ఎమ్మెల్యేగా బీ జానకీరాం.. కే నర్సయ్యను ఓడించి ఎన్నికయ్యారు. పాటి రాజం 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రవర్గంలో పనిచేశారు. సుద్దాల దేవయ్య 1995లో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
సిరిసిల్ల: 1952లో ఏర్పడింది. చెన్నమనేని రాజేశ్వర్‌రావు (1967, 78, 85, 94, 2004) 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నది. 1952లో జేఎం రాజమణిదేవి ఎస్‌ఆర్ బాబయ్యపై, జే ఆనందరావు ఆర్‌ఎంకే రావుపై గెలుపొందారు.
మెట్‌పల్లి: 1952లో ఏర్పడింది. చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1985, 89, 94లలో గెలిచారు. వర్ధినేని వెంకటేశ్వరరావు (1978, 83) రెండుసార్లు, చెన్నమనేని సత్యనారాయణ (1967, 72) రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1952లో ప్రథమ ఎమ్మెల్యే జీ భూమయ్య.. జీఎస్ రావుపై గెలిచారు.
బుగ్గారం: 1957లో ఏర్పడింది. జువ్వాడి రత్నాకర్‌రావు (1989, 99, 2004) మూడుసార్లు, శికారి విశ్వనాథం (1985, 94) రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1957లో మొదటి ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి.. ఎల్‌ఎన్ రావుపై గెలిచారు.

జగిత్యాల: 1952లో ఏర్పడింది. మొదట ద్విసభ్య నియోజకవర్గం. తాటిపర్తి జీవన్‌రెడ్డి (1983, 89, 96, 99, 2004) 5 సార్లు గెలుపొందారు. 1983లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 1984లో నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో నెలరోజులు పనిచేశారు. కే లక్ష్మీనరసింహారావు 1963, 67లలో రెండుసార్లు గెలిచారు. 1952లో ప్రథమ ఎమ్మెల్యేగా బీ రాజారామ్ ఎన్నికయ్యారు.

చొప్పదండి: 1957లో ఏర్పడింది. 1967, 72లలో ఈ నియోజకవర్గం లేదు. మూడుసార్లు గెలిచిన కన్యాలకొండ రామకిషన్‌రావు (1978, 85, 89) 1995లో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 1957లో చెన్నమనేని రాజేశ్వరరావు.. బీ రాములుపై గెలిచి ప్రథమ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇందుర్తి: 1957లో ఏర్పడింది. దేశిని చినమల్లయ్య (1978, 85, 89, 94) నాలుగుసార్లు గెలిచారు. చొప్పరాజు లక్ష్మీకాంతరావు (1962, 67, 83) మూడుసార్లు గెలిచారు. ఈయన పీవీ నర్సింహారావు బంధువు. చొక్కారావు.. బీ లక్ష్మీకాంతరావుపై గెలిచి ప్రథమ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కరీంనగర్: 1952లో ఏర్పడింది. 1978 నుంచి ఇక్కడ ఏ అభ్యర్థి కూడా రెండోసారి గెలువలేదు. కానీ అంతకుముందు జువ్వాడి చొక్కారావు (1957, 67, 72) మూడుసార్లు గెలిచారు. ప్రథమ ఎమ్మెల్యేగా సీహెచ్ వెంకటరామారావు.. జే చొక్కారావుపై గెలిచారు.

కమలాపూర్: 1962లో ఏర్పడింది. ముద్దసాని దామోదర్‌రెడ్డి (1985, 89, 94, 99) నాలుగుసార్లు గెలిచారు. 1995లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. 1962లో ప్రథమ ఎమ్మెల్యేగా కేవీ నారాయణరెడ్డి.. పీ నర్సింగరావుపై గెలిచారు.

హుజూరాబాద్: 1952లో ఏర్పడింది. 1952, 67లలో ద్విసభ్య నియోజకవర్గం. కెప్టెన్ లక్ష్మీకాంతారావు 2004లో గెలిచారు. 1952లో ప్రథమ ఎన్నికల్లో ద్విసభ్యులుగా పీజీ రెడ్డిపై పీ నారాయణరావు, జగన్నాథంపై జే వెంకటేశం గెలిచారు.

మేడారం: 1957లో ఏర్పడింది. మాతంగి నర్సయ్య (1983, 89, 99) ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారు. గుడిపల్లి రాములు 1967లో మేడారంలో, 1957, 62లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

దేవరకొండ: 1952లో ఏర్పడింది. 1962లో ఎస్సీకి రిజర్వ్ అయింది. రొటేషన్‌లో భాగంగా 1978లో ఎస్టీకి రిజర్వ్ చేశారు. 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అనంతరామారావు తన సమీప అభ్యర్థి ఎంకే రావుపై 18,818 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదు బద్దూ చౌహన్ మూడు సార్లు (1985, 1989, 1994), డీ రవీంద్రనాయక్ రెండు సార్లు (1978, 1983) ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మునుగోడు: 1967లో ఏర్పడింది. అప్పటి నుంచి 2004 వరకు ముగ్గురు అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా పనిచేయడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఐదు సార్లు (1967, 1972, 1978, 1983, 1999), నారాయణరావు మూడుసార్లు (1985, 1989, 1994), పల్లా వెంకట్‌రెడ్డి 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 1952 నుంచి 1966 వరకు చిన్నకొండూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది.

భువనగిరి: 1952లో ఏర్పాటైంది. రావి నారాయణరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆరుట్ల రామచంద్రారెడ్డి వంటి ప్రముఖులు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన నల్లగొండ ఎంపీ స్థానం నుంచి కూడా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో జీ రామలింగం ఎమ్మెల్యేగా గెలుపొందారు. రావి నారాయణరెడ్డి రెండు సార్లు (1952, 1957), కొండా లక్ష్మణ్‌బాపూజీ రెండుసార్లు (1967, 1972) ఆరుట్ల రామచంద్రారెడ్డి ఒకసారి (1962) విజయం సాధించారు. దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రిగా పనిచేశారు.

ఆలేరు: 1952లో ఏర్పడింది. భూస్వామ్య వ్యతిరేక పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవి ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో ఎస్సీకి రిజర్వ్ అయింది. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి, భువనగిరి నుంచి ఆరుట్ల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. భార్యభర్తలు ఒకేసారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించడం విశేషం.

రామన్నపేట: 1952లో ఏర్పడింది. కే రామచంద్రారెడ్డి మూడుసార్లు (1952, 1957, 1962), గుర్రం యాదగిరిరెడ్డి మూడుసార్లు (1985, 1989, 1994), కొమ్ము పాపయ్య రెండుసార్లు (1978, 1983), వడ్డేపల్లి కాశీరాం రెండుసార్లు (1962, 1972) ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఎక్కువకాలం మంత్రిగా పనిచేసినా ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు (1999, 2004) విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. టీ అంజయ్య మంత్రివర్గంలో కొమ్ము పాపయ్య మంత్రిగా పనిచేశారు.

నల్లగొండ: 1952లో ఏర్పడింది. తొలుత ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. 1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ద్విసభ్యులు కే రామారెడ్డి, లక్ష్మయ్యలు విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో నందమూరి తారకరామారావు సమీప అభ్యర్థి ఎం రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. చకిలం శ్రీనివాసరావు రెండుసార్లు (1967, 1972) ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నకిరేకల్: 1957లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం నుంచి నర్రా రాఘవరెడ్డి రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1967, 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో విజయం సాధించారు. నోముల నర్సింహయ్య రెండుసార్లు (1999, 2004) గెలిచారు.

చలకుర్తి: 1967లో ఏర్పడింది. కే జానారెడ్డి ఐదుసార్లు విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా గెలుస్తానని శపథం చేసి ఓటమిని చవిచూశారు. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు.

మిర్యాలగూడ: 1957లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో సీ వెంకటరెడ్డి విజయం సాధించారు. టీ చిన్నకృష్ణారెడ్డి మూడుసార్లు (1962, 1967, 1972) ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రీకొడుకులు టీ చిన్న కృష్ణారెడ్డి, టీ విజయసింహారెడ్డి తలపడ్డారు.

పెదమునగాల: 1952లో ఏర్పడింది. అదే సంవత్సరం ఉప ఎన్నిక జరిగింది.

కోదాడ: తొలుత హుజూర్‌నగర్ నియోజకవర్గంలో భాగంగా ఉండి 1978లో ప్రత్యేక నియోజకవర్గంగా కోదాడ ఏర్పడింది. తొలి ఎన్నికల్లో అక్కిరాజు వాసుదేవరావు విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. వేనేపల్లి చంద్రారావు మూడుసార్లు (1985, 1989, 1994) ఎమ్మెల్యేగా గెలిచారు. నాదేండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వారేపల్లి లక్ష్మీనారాయణ చింతా రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు.

హుజుర్‌నగర్: 1952లో ఏర్పడింది. తొలుత ద్విసభ్య నియోజకవర్గం. తొలి ఎన్నికల్లో ద్విసభ్యులు టీ నర్సింహులు, సరోజినీనాయుడు కొడుకు జయసూర్య విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి అక్కిరాజు వాసుదేవరావు రెండుసార్లు(1963, 1967) ఎమ్మెల్యేగా గెలిచారు.

సూర్యాపేట: 1952లో ఏర్పడింది. తొలుత ద్విసభ్య నియోజకవర్గం. తొలి ఎన్నికల్లో ద్విసభ్యులు ఉప్పల మల్సూరు, బొమ్మగాని ధర్మభిక్షం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
సామాన్య వ్యక్తిగా జీవితం గడిపిన ఉప్పల మల్సూరు నాలుగుసార్లు(1952, 1957, 1962, 1967) ఎమ్మెల్యేగా గెలిచారు. ఆకారపు సుదర్శన్ రెండుసార్లు (1989, 1994) ఎమ్మెల్యేగా గెలిచారు.

తుంగతుర్తి: 1967లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సింహారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం 1983 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆర్ దామోదర్‌రెడ్డి మూడుసార్లు( 1985, 1989, 1994) ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

నాగారం: 1962లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో ఏ రంగారెడ్డి విజయం సాధించారు.
Lingamurthy

2060
Tags

More News

VIRAL NEWS