ద్రవ్యోల్బణం పరిణామాలు


Fri,April 21, 2017 12:17 AM

ద్రవ్యోల్బణం, ద్రవ్యం.. దానికి సంబంధించిన వివిధ రకాల పదకోషాలు మొదలైన విషయాలను తెలుసుకున్నాం. ద్రవ్యోల్బణం అధ్యాయంలో ద్రవ్యోల్బణ మౌలిక భావనలు, వాటి మంచి, చెడు పరిణామాలు, వివిధ వర్గాల మధ్య ఎలాంటి ప్రభావం చూపబోతుంది? మొదలైన విషయాలను చర్చించాం. అదే క్రమంలో ద్రవ్యోల్బణ విషయాలకు సంబంధించి ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణం తగ్గింపు చర్యలు, విత్త చర్యలు, ద్రవ్య పరపతి చర్యలు, ద్రవ్యోల్బణాన్ని కొలిచే విధానాలు మొదలైన విషయాలను గురించి చూద్దాం..
nipuna

ద్రవ్యోల్బణం


-ఒక నిర్ణీత కాలంలో వస్తువుల ధరల్లో వచ్చే క్రమానుగత పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటారు. అంటే ద్రవ్యం విలువ (వస్తువులను కొనే సామర్థ్యం) తగ్గి వస్తువులకు డిమాండ్ పెరగడం. కేవలం కొన్ని వస్తువులకు అత్యధిక ద్రవ్యం వెంబడించడాన్ని ద్రవ్యోల్బణంగా పేర్కొనవచ్చు. అంటే మార్కెట్‌లో ద్రవ్య సరఫరా పెరిగినప్పుడు వస్తువులకు డిమాండ్ పెరిగి, తద్వారా ఆ వస్తువుల ధరలు క్రమానుగతంగా పెరుగుతాయి. ఈ పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు.

ద్రవ్యోల్బణ రకాలు


-ద్రవ్యోల్బణం ఆవిర్భవించే మూలాన్ని బట్టి దీన్ని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. అంటే ద్రవ్యోల్బణం దేని ద్వారా సంభవిస్తుందో, దాన్నిబట్టి ఈ విభజన చేశారు. ఈ మూడు రకాలను ట్రయాంగిల్ మోడల్ అని కూడా అంటారు.
1. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
2. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం
3. బిల్ట్ ఇన్ ద్రవ్యోల్బణం

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం


-ఇలాంటి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల సరఫరాను మించి డిమాండ్ ఏర్పడినప్పుడు వాటి ధరలు పెరుగుతాయి. దీన్నే గిరాకీ ప్రేరిత ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, వారివద్ద ద్రవ్యసరఫరా కూడా పెరిగినప్పుడు, అదే స్థాయిలో వస్తువుల సరఫరా అప్పుడు అత్యధిక ద్రవ్యం అత్యల్ప వస్తువుల స్థాయిని వెంటాడే స్థితిని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాలు పెరిగినప్పుడు, పెట్టుబడి వ్యయం కూడా అధికమైనప్పుడు ఈ రకమైన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
-ఇలాంటి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైంది. ఎందుకంటే ద్రవ్య సరఫరా పెరిగినప్పుడు వస్తువులకు గిరాకీ పెరిగి.. తద్వారా అధిక పెట్టుబడులకు దారితీసి అది పారిశ్రామిక వృద్ధికి ఊతమిస్తుంది.

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం


-దీన్నే సప్లయ్ షాక్ ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. ఇది సాధారణ వస్తు సరఫరా కంటే తక్కువ సరఫరా ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఇది సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాధారణ ధరల సరఫరా కంటే మరింత సరఫరా తగ్గి, వస్తువుల సరఫరా తగ్గినప్పుడు వాటికి గిరాకీ ఏర్పడి ధరలు పెరుగుతాయి. అదేవిధంగా మధ్యంతర వస్తువుల (అంతిమ వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడేవి) ధరలు పెరిగినప్పుడు కూడా ఆయా అంతిమ వస్తువుల ధరలు పెరుగుతాయి.
ఉదా: చమురు ధరలు పెరిగినప్పుడు వాహన రవాణా చార్జీలు పెరిగి, వస్తువుల ధరల పెరుగుతాయి.

బిల్ట్ ఇన్ ద్రవ్యోల్బణం


-ఇది కొన్ని వస్తుత్పత్తి కంపెనీలు స్వతహాగా తీసుకున్న నిర్ణయాల వల్ల వస్తుంది. అంటే మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆయా కార్మికుల జీతాలు కూడా పెంచుతాయి. వారి జీతాలు పెరిగినప్పుడు ఆయా ప్రజల వద్ద ద్రవ్య సరఫరా పెరిగి మళ్లీ మార్కెట్‌లో వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. అంటే అది మళ్లీ ద్రవ్యోల్బణం ఏర్పడటానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు కార్పొరేట్ కంపెనీలు మళ్లీ జీతాలు పెంచుతాయి. అది ఒక వృత్తంలా కొనసాగుతూ ద్రవ్యోల్బణం మరింత పెరిగేలా చేస్తుంది. ఈ విధంగా మూడు రకాల కారణాల వల్ల ద్రవ్యోల్బణం సంభవిస్తుంది.

ప్రతిద్రవ్యోల్బణం (Deflation)


-ఇది ద్రవ్యోల్బణ భావనకు వ్యతిరేకమైనది.
-వస్తువుల ధరల్లో ఒక నిర్ణీత కాలంలో క్రమానుగత తగ్గుదల ఉంటే దాన్ని ప్రతిద్రవ్యోల్బణం అంటారు.
-ఇక్కడ ధరల సూచీ మైనస్ (-)లో ఉంటుంది. దీంతో వచ్చే పరిణామాలు, దీనివెనుకున్న కారణాలు మొదలైనవన్నీ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉంటాయి.
-ప్రతిద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కంటే ప్రమాదకరమైనది. ఎందుకంటే ప్రతిద్రవ్యోల్బణం ఉన్నప్పుడు కింది పరిణామాలు చోటుచేసుకుంటాయి.
1. వస్తువులకు గిరాకీ ఉండదు
2. వస్తుత్పత్తి తగ్గించాలి
3. అదనపు ఉద్యోగులను తొలగించాలి, దీంతో నిరుద్యోగం పెరుగుతుంది
4. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది
5. ప్రజల మధ్య ద్రవ్యసరఫరా తగ్గి అది మళ్లీ మార్కెట్‌లో వస్తువుల గిరాకీ తగ్గిస్తుంది.
-ఈ విధంగా క్రమంగా మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది.
-2008లో అమెరికాలో వచ్చిన సబ్‌ప్రైమ్ సంక్షోభం వల్ల ప్రతిద్రవ్యోల్బణం సంభవించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.

పునర్బలణం (Reflection)


-ఆర్థిక వ్యవస్థలో ప్రతిద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ప్రభుత్వం తన విధానాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని పెంచడాన్ని పునర్బలణం అంటారు.
-అంటే ఆర్థికవ్యవస్థకు వేగం చేకూర్చి తద్వారా వస్తువులకు గిరాకీ పెంచి ఆర్థిక వ్యవస్థను పునర్‌నిర్మిస్తుంది.

డిసిన్లేషన్


-ద్రవ్యోల్బణ పెరుగుదలరేటు తక్కువగా ఉంటే దాన్ని డిసిన్లేషన్ అంటారు. ఉత్పత్తి పరిమాణంలో, ఉపాధిలో ఎలాంటి క్షీణత లేకుండా ధరల స్థాయిని తగ్గిచండమే డిసిన్లేషన్. ఇది సాధారణంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు అనుగుణంగా తగ్గుతుంది.

స్టాగ్‌ఫ్లెషన్


-సాధారణంగా అయితే ద్రవ్యోల్బణ సమయంలో వస్తువులకు గిరాకీ పెరిగి, తద్వార వస్తువుల సప్లయ్ కూడా పెంచాల్సి వచ్చినప్పుడు నిరుద్యోగిత రేటు తగ్గి... ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక వృద్ధిపెరిగి అది ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుంది.
-కానీ పై పరిస్థితికాకుండా దానికి వ్యతిరేకంగా... ఆర్థిక వ్యవస్థలో ఒకే సమయంలో ద్రవ్యోల్బణం పెరిగి... నిరుద్యోగిత తగ్గకపోగా అధికమవుతూ ఆర్థిక వృద్ధి పెరగకుండా అదే స్థితిలో ఉండటాన్ని స్టాగ్‌ఫ్లెషన్ అంటారు.
-స్టాగ్‌ఫ్లెషన్ సమయంలో అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగిత, వృద్ధిరేటులో మందగమనం ఉంటాయి.

ద్రవ్యోల్బణ భావనలు


ద్రవ్యోల్బణంతోపాటు మరికొన్ని భావనలు, మౌలిక సూత్రాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అవి..
1. ప్రతి ద్రవ్యోల్బణం
2. పునర్బలణం
3. డిసిన్లేషన్
4. స్టాగ్‌ఫ్లెషన్
పై నాలుగు భావనలను కింది గ్రాఫ్ ద్వారా విశదీకరించవచ్చు.

ఫిలిప్స్ కర్వ్


-ద్రవ్యోల్బణం భావనలో అత్యంత ముఖ్యమైన భావన ఈ ఫిలిప్స్ కర్వ్. దీనిప్రకారం మార్కెట్‌లో అధిక ద్రవ్యోల్బణ రేటు ఉన్నప్పుడు... నిరుద్యోగిత రేటు చాలా తక్కువగా ఉంటుంది. అంటే నిరుద్యోగిత రేటుకు, ద్రవ్యోల్బణ రేటుకు మధ్య సంబంధం తెలిపేదే ఫిలిప్స్ కర్వ్.
prabhakar

ఫిలిప్స్ కర్వ్‌కి స్టాగ్‌ఫ్లెషన్‌కి సంబంధం


-ఇవి రెండూ పరస్పరం విరుద్ధమైనవి. ఎందుకంటే ఫిలిప్స్‌కర్వ్ ప్రకారం ద్రవ్యోల్బణరేటు పెరిగినప్పుడు నిరుద్యోగితరేటు తగ్గాలి. కానీ స్టాగ్‌ఫ్లెషన్‌లో ద్రవ్యోల్బణరేటు పెరిగినప్పటికీ నిరుద్యోగిత రేటు అలాగే స్థిరంగా ఉంటుంది.

ద్రవ్యోల్బణాన్ని కొలిచే పద్ధతులు


-ద్రవ్యోల్బణాన్ని ముఖ్యంగా మూడు పద్ధతుల్లో కొలుస్తారు. అవి..
1. వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ (Consumer Price Index)-CPI
2. టోకుధరల సూచీ (Wholesale Price Index)-WPI
3. జీడీపీ డిఫ్లేటర్ (GDP deflatar)
-ఇందులో సీపీఐ, డబ్ల్యూపీఐనే ప్రామాణికంగా తీసుకుని జీడీపీ డిఫ్లేటర్‌ను ప్రామాణికతగా వాడరు. ఎందుకంటే జీడీపీ డిఫ్లేటర్ మూడు నెలలకొకసారి ప్రచుస్తారు. కాబట్టి అది విధానాల రూపకల్పనకు పనికిరాదు.

774
Tags

More News

VIRAL NEWS