కరెంట్ అఫైర్స్


Wed,April 24, 2019 02:59 AM

రాయల్ సొసైటీ ఫెలో

పోషక జీవ రసాయనశాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ-లండన్ ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సైంటిస్ట్ డా. జీ భానుప్రకాశ్‌రెడ్డి ఎంపికయ్యారు. నూతన ఫెలోగా ఎంపికైన వారి వివరాలను ది టైమ్స్ (లండన్) పత్రిక ఏప్రిల్ 17న ప్రచురించింది.

వందేండ్ల హైకోర్టు

హైదరాబాద్‌లోని హైకోర్టు వందేండ్ల ఉత్సవాన్ని ఏప్రిల్ 20న నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920, ఏప్రిల్ 20న ప్రారంభించారు. 1915, ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ భవన నిర్మాణం 1919, మార్చి 31 నాటికి పూర్తయింది. 1920, ఏప్రిల్ 20న అధికారికంగా ప్రారంభమైంది. జైపూర్‌కు చెందిన ఇంజినీర్, ఆర్కిటెక్ట్ శంకర్‌లాల్ హైకోర్టు భవన నమూనాను రూపొందించారు. స్థానిక ఇంజినీర్ మెహర్ అలీ ఫజల్ నిర్మాణ పనుల నిర్వహణ చేపట్టగా, బ్రిటిష్ ఇంజినీర్ విన్సెంట్ జే ఎక్ భవనం నిర్మాణ ఆకృతి రూపొందించారు.
Hyd_Court

నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం

దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ ఏప్రిల్ 14న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఐటీఆర్ నుంచి భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఈ పరీక్షను చేపట్టింది. 42 నిమిషాల్లోనే నిర్దేశిత లక్ష్యాన్ని నిర్భయ్ ఛేదించింది. ఇది 0.7 మ్యాక్ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. శత్రువుల రాడార్లకు ఆచూకీ దొరకకుండా ఉండేందుకు నేల నుంచి కేవలం 100 మీటర్ల ఎత్తులో పయనిస్తుంది.
Sub-Sonic-Cruise

ఖైదీల మరణాల్లో ఉత్తరప్రదేశ్ టాప్

జైళ్లలో అసహజ మరణాలపై జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా-2016 పేరిట ఏప్రిల్ 16న నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ (56) మొదటిస్థానంలో ఉండగా మహారాష్ట్ర (47), పంజాబ్ (37), తమిళనాడు (11) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆసియా పసిఫిక్ సౌలభ్య నగరాల సదస్సు

ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన సౌలభ్య నగరాల సదస్సు ఏప్రిల్ 15 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్స్ (ఐఈఎల్‌ఈఐ) ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో స్థానిక ప్రభుత్వాల సహకారంతో వాతావరణ మార్పుల నివారణకు కావాల్సిన చర్యలపై చర్చించారు.

ప్లీట్ అవార్డు-2019

తూర్పు నావికాదళంలో 2018-19 ఏడాదికి ఉత్తమ ప్రతిభ చూపిన నౌకలకు అవార్డులను అందించడంతోపాటు, వివిధ విభాగాల పనితీరును తెలుసుకునేందుకు ఏప్రిల్ 17న విశాఖపట్నంలో ప్లీట్ అవార్డు-2019 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఎన్‌ఎస్ ఐరావత్ (అత్యుత్తమ వేగవంతమైన నౌక), ఐఎన్‌ఎస్ ఖంజర్ (ట్యాంకర్ విభాగం), ఐఎన్‌ఎస్ సాత్పురా (విధ్వంసకర నౌకల విభాగం) అవార్డులు అందుకున్నాయి.

పులిట్జర్ అవార్డు
ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లకు పులిట్జర్ అవార్డు-2019 లభించింది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న కొలంబియా యూనివర్సిటీలో ఏప్రిల్ 16న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అవార్డుల బోర్డు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తుల గురించి వెల్లడించిన న్యూయార్క్ టైమ్స్, నేషనల్ రిపోర్టింగ్‌లో ది వాల్ స్ట్రీట్ జర్నల్, పబ్లిక్ సర్వీస్‌లో సౌత్ ఫ్లోరిడా సన్ సెంటినెల్, బ్రేకింగ్ న్యూస్‌లో ది పిట్స్‌బర్గ్ పోస్ట్ గెజిట్‌లకు అవార్డులు దక్కాయి.
Pulitzer

నేపాలి శాట్-1 ఉపగ్రహం

వర్జీనియా ఎయిర్ అండ్ స్పేస్ సెంటర్ ఆఫ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేపాల్‌కు చెందిన తొలి ఉపగ్రహం నేపాలి శాట్-1ని అంతరిక్షంలోకి ఏప్రిల్ 18న పంపించారు. ఆ ఉపగ్రహం భూకక్ష్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. దీన్ని జపాన్‌లోని క్యూషూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ సహకారంతో నేపాల్‌కు చెందిన అబాస్ మాస్కే, హరిరామ్ శ్రేష్ట అనే శాస్త్రవేత్తలు రూపొందించారు. నేపాలి ట్రోపోగ్రఫీకి సంబంధించిన చిత్రాలను చిత్రీకరించేందుకు వీలుగా నేపాలిశాట్-1లో 5 కెమెరాలు, మ్యాగ్నటోమీటర్లను అమర్చారు. దీని జీవితకాలం ఏడాది. దీనికి తయారీ ఖర్చు రూ.2 కోట్లు.

పత్రికా స్వేచ్ఛ సూచీ

రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ అనే సంస్థ 2019కుగాను 180 దేశాల పత్రికా స్వేచ్ఛసూచీని ఏప్రిల్ 18న విడుదల చేసింది. ఈ సూచీలో నార్వే మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్‌లాండ్ రెండోస్థానంలో, స్వీడన్ మూడో స్థానంలో, నెదర్లాండ్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. భారతదేశం 140, భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్థాన్ 142, బంగ్లాదేశ్ 150, ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా 110, గాంబియా 92 స్థానాలు పొందాయి. వియత్నాం 176, చైనా 177, ఉత్తర కొరియా 179, తుర్క్‌మెనిస్థాన్ 180 స్థానాల్లో నిలిచాయి.

అతిపెద్ద విమానం

ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేరుగాంచిన స్ట్రాటో లాంచ్ ఏప్రిల్ 14న కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలోని మొజావే విమానాశ్రయం నుంచి పరీక్షించారు. దీన్ని ఉపగ్రహాలకు ఫ్లయింగ్ లాంచ్ ప్యాడ్‌లా పనిచేయడానికి రూపొందించారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని రెక్కల విస్తీర్ణం 117 మీటర్లు. ఇది 10 కి.మీ. ఎత్తుకు చేరుకున్న తర్వాత రాకెట్‌ను జారవిడుస్తుంది. అనంతరం అది మండి అంతరిక్షంలోకి చేరుతుంది. ఇది 35 వేల అడుగుల ఎత్తులో ఎగరడం దీని ప్రత్యేకత. 2,26,800 కేజీల బరువు ఉంటుంది. 385 అడుగుల పొడవు, 238 అడుగుల వెడల్పు ఉంటుంది. గంటకు 302 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

ప్రపంచ సంక్షోభంగా తట్టు వ్యాధి

ప్రాణాంతక వ్యాధి అయిన తట్టు (మీజిల్స్)ను ప్రపంచ సంక్షోభంగా ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 19న ప్రకటించింది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు అమెరికాలోనూ ఈ వ్యాధి దాఖలాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇథియోపియా, కిజకిస్థాన్, మడగాస్కర్, కిర్గిస్థాన్, మయన్మార్, ఫిలిప్పీన్స్, సూడాన్, జార్జియా, కాంగోలలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది.

మాస్టర్స్ గోల్ఫ్ విజేత టైగర్ ఉడ్స్

అమెరికాకు చెందిన ఎల్‌డ్రిక్ టోంట్ ఉడ్స్ (టైగర్ ఉడ్స్) 83వ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. అమెరికాలోని అగస్టాలో ఏప్రిల్ 14న జరిగిన ఈ టోర్నీలో ఉడ్స్ విజయం సాధించాడు. ఉడ్స్‌కు ఇది 15వ టైటిల్ కాగా, ఈ టోర్నీలో ఐదోది. అలాగే 11 ఏండ్లలో తొలి మేజర్ టైటిల్ హామిల్టన్‌కు చైనా గ్రాండ్‌ప్రిమెర్సిడెజ్ జట్టు డ్రైవర్ లూయీస్ హామిల్టన్ చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 15న జరిగిన ఈ రేసులో 56 ల్యాప్‌ల దూరాన్ని హామిల్టన్ గంటా 32 నిమిషాల 6.350 సెకన్లలో ముగించి టైటిల్ దక్కించుకున్నాడు. ఫార్ములావన్‌లో 1000వ రేసుగా జరిగిన చైనా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ ఆరోసారి విజేతగా నిలిచాడు.
Tiger-Woods

సింగపూర్ ఓపెన్ బ్మాడ్మింటన్

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సహకారంతో ఏప్రిల్ 15న జరిగిన సింగపూర్ ఓపెన్ బ్మాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో జపాన్ షట్లర్ కెంటో మొమొటా ఆంటోని గిన్‌టుంగ్ (ఇండోనేషియా)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో తైజుయింగ్ (చైనా) నజోమి ఒకుహర (జపాన్)ను ఓడించి విజేతగా నిలిచింది.

రెజ్లింగ్ ర్యాంకిగ్స్‌లో నంబర్ వన్ బజరంగ్

ఏప్రిల్ 17న విడుదలైన ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. 65 కిలోల విభాగంలో మొదటిస్థానంలో ఉన్నాడు. గతేడాది ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. రష్యాకు చెందిన చకేవ్ రెండో స్థానంలో ఉన్నాడు.

అత్యంత ప్రభావ వ్యక్తులు

టైమ్ మ్యాగజీన్ 2019కుగాను 100 మంది అత్యంత ప్రభావితమైన వ్యక్తుల జాబితాను ఏప్రిల్ 17న ప్రకటించింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిస్థానంలో, పోప్ ఫ్రాన్సిస్ రెండో స్థానంలో, చైనా అధ్యక్షుడు మూడో స్థానంలో, టైగర్ ఉడ్స్ 5వ స్థానంలో, ఇమ్రాన్‌ఖాన్ 14వ స్థానంలో నిలిచారు. ఇందులో భారత్ నుంచి ముకేష్ అంబానీ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదులు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు చోటు లభించింది.
Pulitzer

యూసఫ్‌కు రాయల్ అవార్డు

ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఔషధరంగ సంస్థ సిప్లా చైర్మన్ యూసఫ్ హమీద్ బ్రిటన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఏప్రిల్ 18న ఎంపికయ్యారు. ఇతనితోపాటు మొత్తం 51 మందికి ఈ పురస్కారం లభించింది. భారత సంతతి శాస్త్రవేత్తలు గురుదయాళ్ చెస్రా మంజుల్ భార్గవ్, అనంత్ పరేఖ్ అక్షయ వెంకటేష్‌లు ఎంపికయ్యారు. రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారత మహిళ శాస్త్రవేత్తగా గగన్‌దీప్ కాంగ్ రికార్డు సృష్టించారు. కాంగ్ ఫరీదాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సౌతాఫ్రికాలో భారత హైకమిషనర్

దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్‌గా సీనియర్ దౌత్యవేత్త జైదీప్ సర్కార్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 18న ఉత్తర్వులు జారీచేసింది. ఈయన 1987 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ అధికారి. భూటాన్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు లెబనాన్‌లో భారత రాయబారిగా సుహేల్ అజాజ్‌ఖాన్‌ను ప్రభుత్వం నియమించింది.

మాలి ప్రధాని మైగా రాజీనామా

మాలి దేశ ప్రధానమంత్రి సౌమేలో బౌబేయో మైగా క్యాబినెట్ సహచరులతో కలిసి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను ఆమోదించినట్లు ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా కార్యాలయం ఏప్రిల్ 19న ప్రకటించింది.

337
Tags

More News

VIRAL NEWS