కరెంట్ అఫైర్స్


Wed,June 14, 2017 01:34 AM

తెలంగాణకు కేంద్ర అవార్డు


గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంలో ముందు ఉండటంతో తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి తోమర్ ప్రత్యేక అవార్డును అందజేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ శిక్షణ ఇచ్చిన వారిలో 70 శాతం మందికి ఉపాధి లభించగా, మరో 17 శాతం మంది స్వయం ఉపాధి పొందారు.
BPO

వైద్యపరికరాల తయారీ పార్కు


దేశంలోనే తొలి వైద్యపరికరాల తయారీ పార్కును తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.

సి.నా.రె మృతి


ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి (సి.నా.రె.) జూన్ 12న మృతిచెందారు. సినారె 1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేటలో జన్మించారు. ఆయన తొలి రచన నవ్వని పువ్వు (1953). 1977లో పద్మశ్రీ పురస్కారం వరించింది. 1988లో ఆయన కావ్యం విశ్వంభరకు జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1981లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు.
C-narayanareddy

నేపాల్ ప్రధానిగా దేవ్‌బా


నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్‌బా ఎన్నికయ్యారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధానిగా ఎన్నిక కావడం ఇది నాలుగోసారి. నేపాలీ కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా మావోయిస్ట్ పార్టీ నేత ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. పార్లమెంట్‌లో మొత్తం 601 మంది ఎంపీలకుగాను 558 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారిలో 388 మంది దేవ్‌బాకు అనుకూలంగా, 170 మంది వ్యతిరేకంగా ఓటేశారు.

వైమానిక దళంలో ముగ్గురు మహిళా పైలట్లు


భారత వైమానికదళంలో చేరిన మొదటి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లు భావనాకాంత్, మోహనాసింగ్, అమిని చతుర్వేది. వీరు సుఖోయ్-30 విమానాలను నడుపనున్నారు.

ఎవరెస్ట్‌ను అధిరోహించిన క్యాన్సర్ బాధితురాలు


బ్రిటన్‌కు చెందిన క్యాన్సర్ వ్యాధిగ్రస్థురాలు ఇయన్ థిల్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు.

ఆయుధ వ్యాపారి అద్నాన్ మృతి


అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి, అత్యంత ధనవంతుల్లో ఒకరైన అద్నాన్ ఖషోగ్గి మరణించారు.


ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ విజేత బోపన్న, డబ్రోస్కీ


భారత టెన్నిస్ డబుల్స్ నిపుణుడు రోహన్ బోపన్న, కెనడా క్రీడాకారిణి గాబ్రియెలా డబ్రోస్కీ జతగా మొదటిసారి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.
Vimbuldon

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత జెలెనా


ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ట్రోఫీని లాత్వియా దేశ క్రీడాకారిణి జెలెనా వొస్టాపెంకో కైవసం చేసుకుంది.

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత నాదల్


ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ట్రోఫీని స్పెయిన్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ కైవసం చేసుకున్నారు. నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గెలువడం ఇది పదోసారి.


హెచ్‌సీయూకు 601వ ర్యాంకు


బ్రిటన్‌కు చెందిన సంస్థ క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో ఉన్న 900 విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 601వ స్థానంలో ఉంది.
UoH-Maingate

బుజ్జి గ్రహానికి బాల మేధావి సాహితి పేరు


నదులపై తెల్లటి కాలుష్య పొంగుల ప్రక్షాలనే లక్ష్యంగా ఓ స్మార్ట్ యాప్‌ను బెంగళూరుకు చెందిన బాల మేధావి 16 ఏండ్ల పింగళి సాహితి అభివృద్ధి చేశారు. ఈ యాప్ సాయంతో ప్రజలే నేరుగా కాలుష్య సమాచారాన్ని సేకరించే వీలుంది. ఈ ఆవిష్కరణ మసాచుసెట్స్ సాంకేతిక విద్యా సంస్థకు చెందిన లింకన్ లేబరేటరీ నిపుణులను ఎంతోగానో మెప్పించింది. బుజ్జి గ్రహాలకు పేరుపెట్టే అధికారం ఉన్న ఈ సంస్థ మన పాలపుంతలోని ఓ గ్రహానికి సాహితి పేరును పెట్టింది.

మన్మోహన్‌సింగ్ జీవిత కథతో సినిమా


మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ జీవిత కథ ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత హన్సల్ మెహతా దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. మన్మోహన్‌సింగ్‌కు మీడియా అడ్వైజర్‌గా పనిచేసిన సంజయ్‌బారు రచించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మన్మోహన్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించనున్నారు.

అత్యంత వెనుకబడిన జిల్లాలు @100


దేశంలోని 100 జిల్లాలను అత్యంత వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు. 2022 చివరి నాటికి మిషన్ ఇంద్రధనుష్, జన్‌ధన్ యోజన కార్యక్రమాల ద్వారా ఆయా జిల్లాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.

టెక్స్‌టైల్స్ ఇండియా-2017 సదస్సు


జూన్ 30 నుంచి జూలై 2 వరకు మూడు రోజులపాటు టెక్స్‌టైల్స్ ఇండియా-2017 పేరుతో అంతర్జాతీయ జౌళి సదస్సు నిర్వహించనున్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఈ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు 2500 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.

జలాలపై 287 ఒప్పందాలు


20వ శతాబ్దం ద్వితీయార్థంలో జలాలపై 287 అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరాయి. 2050 నాటికి 40శాతం నీటి అవసరాలు పెరుగనున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

బ్రిటన్‌లో హంగ్


2017 జూన్ 9న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. మొత్తం 650 స్థానాలకు ఎన్నికలు జరుగగా అధికార కన్జర్వేటివ్ పార్టీ 318, లేబర్ పార్టీ 261 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీకీ సాధారణ మెజార్టీకి అవసరమైన 326 సీట్లు రాలేదు. ఉత్తర ఐర్లాండ్‌లోని డెమోక్రాటిక్ యూనియనిస్టు పార్టీ (డీయూపీ)కి చెందిన 10 మంది ఎంపీల మద్దతుతో ప్రధాని థెరిసా మే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.

భారత అమెరికన్ రాజాచారికి అరుదైన అవకాశం


అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న భారత అమెరికన్ రాజాచారికి అరుదైన అవకాశం లభించింది. నాసా చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు మొత్తం 12 మంది వ్యోమగాములను ఎంపికచేయగా, వారిలో రాజాచారి కూడా ఉన్నారు. 1959 నుంచి ఇప్పటివరకు నాసా 350 మంది వ్యోమగాములను ఎంపికచేసింది.
rajachari

ఎస్‌సీవోలో భారత్, పాకిస్థాన్‌లకు శాశ్వత సభ్యత్వం


జూన్ 8, 9వ తేదీల్లో కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. 2001 తర్వాత ఎస్‌సీవోను విస్తరించడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి చైర్మన్‌గా కజకిస్థాన్ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ వ్యవహరించారు. 2001లో చైనా, రష్యా, కర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు ఎస్‌సీవోను స్థాపించాయి.

అత్యంత వేడి గ్రహం కెల్ట్-9బి


విశ్వంలోకెల్లా అత్యంత వేడి గ్రహాన్ని ఖగోళ పరిశోధకులు గుర్తించారు. భూమికి 650 కాంతి సంవత్సరాల దూరంలో మండే అగ్నిగోళంలా ప్రకాశిస్తూ కెల్ట్-9 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహానికి కెల్ట్-9బి అని పేరుపెట్టారు. దీన్ని గురు గ్రహంతో పోలిస్తే పరిమాణంలో 2.8 రెట్లు పెద్దదిగా ఉన్నప్పటికీ.. సాంద్రతలో అందులో సగమే ఉంటుంది. అత్యంత వేడి కారణంగా ఈ గ్రహం బెలూన్‌లా ఉబ్బి ఉండటమే పరిమాణంలో పెద్దదిగా కనబడటానికి కారణం. కెల్ట్-9బి గ్రహ ఉపరితలంపై పగటి ఉష్ణోగ్రత 4326 డిగ్రీలు ఉంటుంది.

ఫుకుషిమాలో 3వ అణు రియాక్టర్ ప్రారంభం


జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో 2011 మార్చి 11న జరిగిన ప్రమాదంతో దానిలోని అణు ప్లాంట్లు మూతపడ్డాయి. వాటిలో 3వ అణు రియాక్టర్‌ను 2017 జూన్ 6న తిరిగి ప్రారంభించారు.

ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్న అరబ్‌దేశాలు


ఉగ్రవాదులకు కొమ్ముకాస్తుందన్న ఆరోపణలతో ఖతార్‌తో ఇతర అరబ్‌దేశాలు సంబంధాలు తెంచుకున్నాయి. వాటిలో లిబియా, ఈజిప్టు, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఉన్నాయి. అయితే ఈ దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి కువైట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నది.
Saidulu

ఇండియా- ఐరాస అభివృద్ధి నిధి


భారత్‌లో సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలకు మద్దతిచ్చేందుకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) దక్షిణాది వ్యవహారాల సహకార కార్యాలయంతో కలిసి అభివృద్ధి భాగస్వామ్య నిధిని నెలకొల్పింది. జూన్ 9న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత కమిషన్ ఈ నిధిని ప్రారంభించింది. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి సాధించాలని ఏర్పాటుచేసిన ఎజెండా (ఎస్‌డీజీ)లోని 17 జాతీయస్థాయి ప్రాజెక్టులకోసం ఈ నిధిని వినియోగిస్తారు. ఈ నిధిని యునైటెడ్ నేషన్స్ సౌత్-సౌత్ కో ఆపరేషన్ (యూన్‌ఓఎస్‌ఎస్‌సీ) నిర్వహిస్తుంది.

887
Tags

More News

VIRAL NEWS