కరెంట్ అఫైర్స్


Wed,April 19, 2017 02:00 AM

రిజర్వేషన్ పెంపు బిల్లుకు ఆమోదం


తెలంగాణ వెనుకబడిన తరగతులు, దళిత, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు-2017కు శాసనసభ, శాసనమండలి ఏప్రిల్ 16న ఆమోదం తెలిపాయి. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 62కు చేరనుంది. ఈ బిల్లులతో పాటు జీఎస్టీ, రాష్ట్ర వాసరసత్వ కట్టడాల పరిరక్షణ చట్టానికి సంబంధించిన బిల్లులు కూడా ఆమోదం పొందాయి. బీసీ-ఇ గ్రూపు ద్వారా ముస్లింలకు అదనంగా 8 శాతం, గిరిజనులకు అదనంగా 4 శాతం రిజర్వేషన్ల పెంపుదలకు సీఎం కేసీఆర్ శాసనసభలో, సాయంత్రం శాసనమండలిలో వేర్వేరుగా బిల్లులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 62 శాతం చేస్తున్నట్లు సీఎం ప్రతిపాదించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం పార్టీలు ఈ బిల్లులకు మద్దతు తెలిపాయి. ఈశాన్య రాష్ర్టాల్లో 80 శాతం, తమిళనాడులో 69 శాతం, జార్ఖండ్‌లో 60 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
KCRCM

ఎన్‌ఐటీలో జాతీయ చలనచిత్రోత్సవాలు


జాతీయ సమగ్రతను పెంపొందించేందుకుగాను వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎన్‌ఐటీలో జాతీయ చలనచిత్రోత్సవాలు ఏప్రిల్ 10న ప్రారంభమయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసారశాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది.

ఏఎస్‌ఆర్‌టీయూ కమిటీ చైర్మన్‌గా ఆర్టీసీ ఎండీ


అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) స్థాయి సంఘం చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీ రమాణారావు నియమితులయ్యారు. ఇది రోడ్డు రవాణా సంస్థలు ఉమ్మడిగా అమలు చేయాల్సిన నిబంధనలు రూపొందించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.

ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువకులు


ఆసియాకు చెందిన అత్యంత ప్రభావశీలురైన 30 మంది 30 ఏండ్లలోపు యువకులతో ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన జాబితాలో ఇద్దరు తెలంగాణ యువకులకు చోటు దక్కింది. జాబితాలో హైదరాబాద్‌కు చెందిన రోహిత్ పోతుకూచి, మంథనిలో పుట్టిపెరిగి కరీంనగర్‌లో స్థిరపడిన చిలప్పగారి సుధీంద్ర ఉన్నారు.


భీమ్-ఆధార్ యాప్ ప్రారంభం


వేలి ముద్రల ద్వారా చెల్లింపులకు వీలయ్యే బయోమెట్రిక్ వ్యవస్థ భీమ్-ఆధార్ యాప్‌ను ఏప్రిల్ 14న ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) అభివృద్ధిపర్చిన ఈ యాప్ యూపీఐ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో వ్యాపారుల దగ్గర ఉండే బయోమెట్రిక్ మెషిన్‌లో వేలిముద్ర ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. బయోమెట్రిక్ రీడర్ ఉండే స్మార్ట్ ఫోన్లతోనూ డిజిటల్ లావాదేవీలు జరుపుకోవచ్చు.
BHIM-Aadhar

ఎస్‌జీఐకి 250 ఏండ్లు


దేశంలో పౌర, సైనిక అవసరాలకు మ్యాపులను రూపొందించే సర్వే జనరల్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఐ) ఏప్రిల్ 9 నాటికి 250 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఎస్‌జీఐని 1767లో ఏర్పాటు చేశారు. ఇది తొలిసారిగా 1783లో మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ పేరుతో అవిభక్త భారతదేశ పటాన్ని విడుదల చేసింది. ఇందులో భారత్‌తోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్‌లోని కొన్ని భూభాగాలు ఉన్నాయి.

మలయాళం తప్పనిసరి


కేరళలోని అన్ని పాఠశాలల్లో పదోతరగతి వరకు మలయాళం బోధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష చూపితే...


హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష చూపితే సివిల్, క్రిమినల్ విచారణ ఎదుర్కొనేలా రూపొందించిన బిల్లును ఏప్రిల్ 11న లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లుకు మార్చి 21న రాజ్యసభలో ఆమోదం లభించింది.

బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ కన్నుమూత


భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అఖిలేష్ దాస్‌గుప్తా ఏప్రిల్ 12న మరణించారు. 2014లో బాయ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మరణించే నాటికి భారత ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడిగా, యూపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.

ఈసీఐఎల్‌కు స్కోప్ అవార్డు


కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)కు ప్రతిష్ఠాత్మకమైన స్కోప్ అవార్డు లభించింది. సంస్థ చైర్మన్, ఎండీ దేబాశిష్ దాస్ ఏప్రిల్ 11న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేష కృషి చేసినందుకుగాను ఈ పురస్కారం లభించింది.

స్పీకర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని


లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ రాసిన మాతోశ్రీ పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 11న ఆవిష్కరించారు. 1767-1795 మధ్య మాల్వా ప్రాంతంలో హోల్కర్ సామ్రాజ్యాన్ని పాలించిన దేవీ అహల్యాబాయి హోల్కర్ జీవితాన్ని, నాటి పరిస్థితులను స్పీకర్ ఈ పుస్తకంలో వివరించారు.

మే 5న జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం


సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్9 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. పరిస్థితులు అనుకూలిస్తే మే 5న సాయంత్రం 4:57కు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నింగిలోకి పంపాలని ఇస్రో ఉన్నతాధికారులు నిర్ణయించారు.

గూడ్సు రైలు.. బ్రిటన్ టు చైనా


బ్రిటన్ నుంచి చైనాకు తొలి సరకు రావాణా రైలు లండన్‌లోని గేట్‌వే నుంచి ఏప్రిల్ 10న బయల్దేరింది. చానల్ టన్నెల్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, పోలండ్, బెలారస్, రష్యా, కజికిస్థాన్ మీదుగా 7500 కి.మీ. ప్రయాణించి 18 రోజుల్లో (ఏప్రిల్ 27 నాటికి) బీజింగ్ చేరుకోనుంది.
train

భారత మాజీ అధికారికి ఉరిశిక్ష విధించిన పాక్


గూఢచర్యం ఆరోపణలతో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. బలూచిస్థాన్, కరాచీల్లో గూఢచర్యం, విద్రోహచర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ జాదవ్‌కు ఈ శిక్షను ఖరారు చేసింది.

అతిపెద్ద బాంబు ప్రయోగించిన అమెరికా


ప్రపంచంలోనే అతిపెద్ద బాంబు జీబీయూ-43బీని ఏప్రిల్ 13న అమెరికా ప్రయోగించింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (ఎంఓఏబీ)గా పిలుచుకునే ఈ బాంబును ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హర్ రాష్ట్రంలోని అచిన్ ప్రాంతంలో ఖొరాసన్ సొరంగంపై జారవిడిచారు. 9525 కిలోల ఈ బాంబును అమెరికా యుద్ధవిమానం (ఎంసీ-130) ద్వారా యుద్ధ క్షేత్రంలో మొదటిసారిగా ప్రయోగించారు.

ప్రపంచ దేశాల్లో 1032 మందికి ఉరిశిక్ష


2016లో ప్రపంచ దేశాల్లో అత్యధిక మరణశిక్షలు చైనాలో అమలయ్యాయని మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మరణశిక్షలపై రూపొందించిన నివేదిక ప్రకారం గతేడాది ప్రపంచంలోని అన్ని దేశాల్లో 1032 మందికి మరణశిక్షలు అమలవ్వగా, చైనాలో అంతకంటే ఎక్కువగా మరణశిక్షలు అమలయ్యాయి. వీటిలో 87 శాతం ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, పాకిస్థాన్‌లలో ఉన్నాయి. 2016లో భారత్‌లో మొత్తం 136 మందికి మరణశిక్ష విధించినప్పటికీ ఒక్కరికి కూడా ఆ శిక్ష అమలుకాలేదు.

ఐరాస శాంతిదూతగా మలాలా


ఐక్యరాజ్యసమితి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ ఏప్రిల్ 10న బాధ్యతలు తీసుకున్నది. దీంతో ఐరాస అత్యున్నత బిరుదు శాంతి దూతను అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది.

ఎవరెస్ట్ ఎక్కిన 85 ఏండ్ల వృద్ధుడు


నేపాల్‌కు చెందిన మీన్ బహదూర్ షేర్‌చాన్ 85 ఏండ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. దీంతో అతిపెద్ద వయస్సులో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు.

ఏషియన్ బిజినెస్ విమెన్‌గా ఆశా ఖేమ్కా


2017కుగాను ఏషియన్ బిజినెస్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును భారత్‌కు చెందిన ఆశా ఖేమ్కా ఏప్రిల్ 7న అందుకున్నారు. విద్యా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది. బ్రిటన్‌లోని మ్యాన్‌ఫీల్డ్స్‌లోని వెస్ట్ నాటింగ్‌హామ్‌షైర్ కళాశాలలో అధ్యాపకురాలిగా, సీఈవోగా ఆమె నియమితులయ్యారు.

సరికొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా


ఏప్రిల్ 12న సరికొత్త సమాచార ఉపగ్రహం షిజియాన్-13 ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. దీనివల్ల ప్రకృతి విపత్తుల సమయంలో సులువుగా సాయం అందించడానికి వీలు కలుగుతుంది. అత్యధిక వేగంతో నడిచే రైళ్లలో ప్రయాణించేవారు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలను చూడగలుగుతారు.

అమెరికా తొలి ముస్లిం మహిళా జడ్జి మృతి


అమెరికాలో తొలి ముస్లిం మహిళా జడ్జిగా చరిత్రకెక్కిన షీలా అబ్దుస్ సలాం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఏప్రిల్ 12న న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో ఆమె శవం కనిపించింది. వాషింగ్టన్ డీసీకి చెందిన అబ్దుస్ సలాం.. అప్పీళ్ల న్యాయస్థానంలో (న్యూయార్క్) జడ్జిగా నియమితురాలైన తొలి ఆఫ్రికా-అమెరికా మహిళగా కూడా ఆమె గర్తింపు పొందారు.

మహిళల హాకీ వరల్డ్ లీగ్ విజేత భారత్


మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెనడాలోని వెస్ట్ వాంకోవర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చిలీ జట్టును షూటౌట్‌లో 3-1 గోల్స్ తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. టోర్నీ బెస్ట్ గోల్ కీపర్ పురస్కారాన్ని భారత గోల్‌కీపర్ సవిత దక్కించుకుంది.
Hockey

Saidulu

సింగపూర్ ఓపెన్ విజేత సాయి ప్రణీత్


హైదరాబాద్ స్టార్ షట్లర్ సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఘన విజయం సాధించాడు. 16న జరిగిన ఫైనల్లో మరో తెలుగు షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌పై 17-21, 21-17, 21-12 తేడాతో గెలిచి.. తన కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

1213
Tags

More News

VIRAL NEWS