ఎడారిలో ఒక్క పువ్వే.. తోటంత విలువ చేస్తుంది అన్న కవి


Wed,January 20, 2016 12:20 AM

- సుంకిరెడ్డి నారాయణరెడ్డి

Sunkireddy-Narayana

-ప్రముఖ కవిగా, రచయితగా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా ప్రసిద్ధిగాంచారు. ఆయన 1954, మార్చి 12న నల్లగొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు కోటమ్మ, మాధవరెడ్డి. అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవితచిత్రణ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1982లో ఎం.ఫిల్ పట్టా పొందారు. అదేవిధంగా అదే యూనివర్సిటీ నుంచి తెలుగు కవిత్వం-తాత్విక నేపథ్యం అనే అంశంపై పరిశోధన చేసి 1991లో పీహెచ్‌డీ పొందారు.

-నిర్వహించిన సాహితీ సంస్థలు : ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న రోజుల్లోనే ఉస్మానియా రైటర్స్ సర్కిల్ కన్వీనర్‌గా ఉంటూ పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సంపాదకత్వంలో 1971-80 దశాబ్దం ఈ తరం యుద్ధం కవిత వెలువడింది. శ్రీకాకుళం సాహితీ వ్యవస్థాపకులుగా శ్రీకాకుళంలో పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు.

నల్లగొండలో నీలగిరి సాహితిని స్థాపించి 1992 నుంచి 1998 వరకు ఎందరో యువకవులను, రచయితలను ప్రోత్సహించడమే కాకుండా బహుజన, దళిత, ముస్లింవాద కవిత్వం తెలుగు సాహిత్యంలో రావడానికి ప్రధాన కారకులయ్యారు. 1992 నుంచి నీలగిరి సాహితితో పాటు జలసాధన సమితి పక్షాన తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పలు వేదికల ద్వారా వివరించారు. 1998లో తెలంగాణ సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. వేల ఏండ్ల నుంచి తెలుగువారంతా కలిసే ఉన్నారన్న ఆంధ్రపాలకుల తప్పుడు వాదనల్ని తిప్పికొడుతూ తెలంగాణ ప్రాంత విశిష్టతను, అస్థిత్వాన్ని తన వ్యాసాల ద్వారా వెల్లడించారు.

ఇందులో భాగంగా ముంగిలి, తెలంగాణ చరిత్ర అనే రెండు గ్రంథాలను వెలువరించారు. గుంటూరు ఏసుపాదం, గుడిహాళం రఘునాథంలతో కలిసి సముద్రాలతో సంఘర్షణలతో అనే విపశ్యన కవితా సంపుటిని వెలువరించి అస్థిత్వ ఉద్యమాలకు తాత్విక నేపథ్యాన్ని అందించారు. 2012, మార్చి 31న చండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా ఉద్యోగ విరమణ చేశారు.
-రచనలు: తోవ ఎక్కడ, దాలి (తెలంగాణ దీర్ఘ కవిత), నల్లవలస (తెలంగాణ దీర్ఘ కవిత ఇతరులతో కలిసి), విపశ్యన కవిత్వం (ఇతరులతో కలిసి).

-సంపాదకత్వం: 1971-80 ఈ తరం యుద్ధం కవిత (ఇతరులతో కలిసి), జమకు సాహితీ బులెటిన్, యానగాలి శ్రీకాకుళ కవిత్వం (ఇతరులతో కలిసి), బహువచనం- దళిత బహువచన కవిత్వం, మత్తడి- తెలంగాణ ఆధునిక కవిత్వం (సురేంద్రరాజుతో కలిసి), మన తెలంగాణ- నల్లగొండ జిల్లా సాహిత్య సంచిక (బైరెడ్డి కృష్ణారెడ్డితో కలిసి), 1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం (సంగిశెట్టితో కలిసి), సురవరం దస్తూరి (సురవరం వ్యాసాలు) మొదలైనవి.

-పరిశోధన గ్రంథాలు: ముంగిలి- తెలంగాణ ప్రాచీన సాహిత్యం, అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవితచరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర, గనుమ (అస్థిత్వ సాహిత్య వ్యాసాలు) మొదలైనవి. సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును విశ్లేషిస్తూ ఛీకృష్ణ కమిటీ పుస్తకాన్ని వెలువరించారు.
-సుప్రసిద్ధ కవితా పంక్తులు: వలసకొచ్చిన కొంగ చెరువు నాదంటదా!, ఇసుంట రమ్మంటే ఇల్లు నాదంటివి, పాపమని నీడిస్తే చెట్టు నాదంటివి (దాలి), హుస్సేన్ సాగర్ తీరాన విగ్రహాలన్నీ మీవి.. శవాలన్నీ మావి (నల్లవలస).

నలిమెల భాస్కర్


nalimelabhaskar

-కవి, పరిశోధకుడు, బహుభాషావేత్త అయిన ఆయన 1956, ఫిబ్రవరి 12న కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ, రాంచంద్రం. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేశారు. తెలుగు, మళయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆయనకు 14 భాషల్లో పట్టుంది. తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి 2011 నవంబర్‌లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమేకాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు.

అద్దంలో గాంధారి, సుద్దముక్క వంటి పలు రచనలను వెలువరించారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ మళయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన స్మారకశిశిగల్ నవలను తెలుగులో స్మారకశిలలు పేరుతో రచించిన అనువాద రచనకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

-రచనలు: మానవుడా, ఈతరం పాట (గేయ సంపుటి), కిరణాలు (వచన కవితాసంపుటి), నూరేళ్ల 10 ఉత్తమ మళయాళ కథలు (అనువాదం), అద్దంలో గాంధారి మరి 11 కథలు, సాహితీ సుమాలు (భారతీయ రచయితల పరిచయం), తమిళట్టోట్టత్తిల్ తెలుంగు కుయిల్‌గల్ (తెలుగు కవితలు తమిళంలోకి అనువాదం), తెలంగాణ పదకోశం (నిఘంటువు), సుద్దముక్క (కవితా సంపుటి), భారతీయ సాహిత్య వ్యాసాలు, భారతీయ కథలు, దేశదేశాల కవిత్వం, భారతీయ సామెతలు, స్మారక శిలలు (అనువాదం నవల), మంద మరి 13 కథలు (భాష, సాహిత్య వ్యాసాలు), మట్టిముత్యాలు (నానీలు), గోపినానీగల్ (గోపినానీలను తమిళంలోకి అనువాదం) మొదలైనవి.

-పురస్కారాలు: మళయాళంలో అనువాద నవల స్మారకశిలలుకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, డా. బోయి భీమన్న స్మారక పురస్కారం రూ. లక్ష నగదు, అనువాదరంగంలో కృషికిగాను 2014లో, 1997లో అద్దంలో గాంధారి అనువాద రచనకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, 1998లో మద్రాస్ కళాసాగర్ సిరిసిల్ల శాఖ పురస్కారం, 1999లో కళాజ్యోతి కరీంనగర్‌వారి పురస్కారం, 2000లో కవిసమయం పురస్కారం, 2001లో ఏపీ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2001లో బీఎన్ శాస్త్రి పురస్కారం, 2003లో సిరివెలుగులు (సిరిసిల్ల) పురస్కారం, 2006లో అధికార భాషా సంఘం పురస్కారం, 2008లో ద్వానా శాస్త్రి పురస్కారం, 2010లో ఇండియన్ హైకూక్లబ్ అనకాపల్లివారి పురస్కారం, ఇంకా పలు స్వచ్ఛంద సాహితీ సేవాసంస్థలచే సన్మానాలు పొందారు.
-సుప్రసిద్ధ కవితా పంక్తులు: ఖానే వాలేకా నామ్ చోడో, ప్రతి గింజమీద రైతు సంతకం ఉంది. పీటమీద బతుకమ్మ, పీఠభూమి తెలంగాణ రెండూ ఒక్కటే.

కపిలవాయి లింగమూర్తి


-ఈయన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట సమీపంలోని జినుకుంటలో 1928, మార్చి 31న జన్మించారు. తల్లిదండ్రులు మాణిక్యమ్మ, వెంకటాచలం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు) చేశారు. ఉపాధ్యాయులుగా, ఉపన్యాసకులుగా పనిచేసి 1983లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన పలు గ్రంథాలు రచించి, పరిశోధనలు చేసి సాహితీవేత్తగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా ప్రసిద్ధిగాంచారు. 2014, ఆగస్టు 30న తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న మొదటి వ్యక్తి. అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ప్రాణం పోశారు. మొత్తం 70 రచనలు ముద్రితమయ్యాయి.

-రచనలు: ఆర్యా శతకం, ఉప్పునూతల కథ, చక్రతీర్థ మహాత్యం, తిరుమలేశ శతకం, దుర్గాభర్త శతకాలు, పండరినాథ విఠల శతకం, పరమహంస శతకం, పాలమూరు జిల్లా దేవాలయాలు, భాగవత కథ తత్వం, శ్రీ భైరవకోన క్షేత్ర మహాత్యం, ఛత్రపతి, గద్వాల హనుమద్వచనాలు, సౌరశిఖరం, పద్య కథా పరిమళం మొదలైనవి. ఆయనకుగల బిరుదులు కవితా కళానిధి, పరిశోధన పంచానన, కవి కేసరి, వేదాంత విశారద, గురు శిరోమణి, సాహిత్య స్వర్ణసౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి.

-పురస్కారాలు: తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు పురస్కారం, బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నర్సింహశాస్త్రి, కందుకూరి రుద్రకవి, పులికంటి, బీఎన్ శాస్త్రి స్మారక పురస్కారాలు, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్‌ఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల ద్వారా సన్మానాలు పొందారు. ఇలా నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానం పొందిన కవి, పరిశోధకుడు కపిలవాయి.

రవ్వా శ్రీహరి


-ఈయన 1943, సెప్టెంబర్ 12న నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో యాదగిరి లక్ష్మీనరసింహ సంస్కృత విద్యాపీఠంలో చేరి విద్యనభ్యసించారు. ఎంఏ తెలుగు, సంస్కృతం చేసి ఆంధ్రసారస్వత పరిషత్తులో అధ్యాపకులుగా పనిచేశారు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశారు. భాస్కర రామాయణంపై పీహెచ్‌డీ చేశారు. ద్రావిడ యూనివర్సిటీకి 2002లో ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్ ఇన్‌చార్జిగా పనిచేశారు. సుమారు 50 వరకు గ్రంథాలను సంస్కృతాంధ్ర భాషల్లో రాసి, పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటివాటిల్లో తనదైన ముద్ర వేశారు.

-నిఘంటువులు: శ్రీహరి నిఘంటువు, అన్నమయ్య పదకోశం, సంకేత పదకోశం, వ్యాకరణ పదకోశం (బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి), నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం.
-విమర్శా గ్రంథాలు: ఉభయ భారతి, అన్నమయ్య సూక్తి వైభవం, అన్నమయ్య భాషా వైభవం, తెలుగులో అలబ్ద వాజ్మయం, సాహితీ నీరాజనం, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, వాడుకలో అప్రయోగాలు, తెలంగాణ మాండలికాలు-కావ్యప్రయోగాలు, నల్లగొండ జిల్లా ప్రజల భాష మొదలైనవి.
-ఇతర రచనలు: సిద్ధాంత కౌముది (వ్యాకరణ గ్రంథం), సంస్కృత న్యాయదీపిక, అలబ్ద కావ్య పద్యముక్తావళి, శ్రీవిష్ణు సహస్రనామ స్ర్తోత్రం, నామావళి.
-పురస్కారాలు: తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారిచే మహా మహోపాధ్యాయ బిరుదు, 2013లో సీపీ బ్రౌన్ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం విశిష్ట పురస్కారం, 2014లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)వారి గిడుగు రామ్మూర్తి పురస్కారం.

అమ్మంగి వేణుగోపాల్


amangi

ప్రముఖ కవి, విమర్శకులుగా ప్రసిద్ధిచెందిన ఈయన 1948, జనవరి 20న రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం ఆలంపల్లి గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రుక్మిణమ్మ, మదనయ్య. నవలా రచయితగా గోపీచంద్ అనే అంశంఐ పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1984లో పీహెచ్‌డీ పొందారు. 1967లో ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడు అంధుల మీద రాసిన చీకటిలో బతుకునీడ అనే కవితకు సృజన పత్రిక నిర్వహించే రాష్ట్రస్థాయి కవితల పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. అధ్యాపకులుగా, ప్రధానాచార్యులుగా పనిచేసి 2004లో ఉద్యోగ విరమణ చేశారు.

-రచనలు: 1) కవితా సంపుటాలు : మిణుగురు, పచ్చబొట్టు-పటంచెరువు, భరోసా, గంధంచెట్టు, తోటంతపువ్వు. 2) నాటికలు : అమ్మంగి వేణుగోపాల్ నాటికలు. 3) సాహిత్య విమర్శ : అవినాభావం (వ్యాససంపుటి), సాహిత్య సందర్భం, సమకాలీన స్పందన (89 వ్యాసాల సంపుటి), వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు-ఒక పరిశీలన. 4) కథానికలు : వివిధ పత్రిల్లో ప్రచురితమైన 10 కథలు. 5) పరిశోధన : నవలా రచయితగా గోపీచంద్‌పై పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం. గోపీచంద్ జీవిత సాహిత్యాలు. 6) అనువాదం : తెలుగు లిపి-ఆవిర్భావం వికాసాలు. 7) సంపాదకత్వం : వ్యాసమంజరి, మరో కొత్తవంతెన/ఏక్ ఔర్ నయాపూల్ (హైదరాబాద్‌కు 400 ఏండ్లు నిండిన సందర్భంగా తెలుగు-ఉర్దూ, ఉర్దూ-తెలుగు కవుల ద్విభాషా కవితా సంపుటి), మజహర్ మెహదీ- మరో ప్రపంచం (ఉర్దూ కవితల తెలుగా అనువాదం), తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజల పక్షాన ప్రతిజ్ఞ (శ్రీశ్రీ శతజయంతి సంచి) మొదలైనవి.

-పురస్కారాలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే కాళోజీ జయంతి సందర్భంగా 2015, సెప్టెంబర్ 9న తొలి కాళోజీ సాహిత్య పురస్కారం, భరోసా కవితా సంపుటికి 2010లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవితా పురస్కారం, రంగారెడ్డి జిల్లా ఉత్తమ రచయిత పురస్కారం, 1994లో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు కవిగా ప్రాతినిథ్యం.

thanukrishna

-ఇతర భాషల్లోకి అనువాదాలు: ఈయన రచించిన 50 కవితలను ఎలనాగ అంగ్లంలోకి, ఎం రంగయ్య హిందీలోకి అనువదించారు. భరోసా కవితాసంపుటిని నారాయణరావు హిందీలోకి అనువదించారు. ఈయన సాహిత్యంపై పరిశోధన చేసి ఆర్ సూర్యప్రకాశ్‌రావు పీహెచ్‌డీ పొందారు.

-సుప్రసిద్ధ కవితా పంక్తులు: ఎడారిలో ఒక్క పువ్వే.. తోటంత విలువ చేస్తుంది, జబ్బు పేరుతో రెక్కీ చేసి దాక్కున్న మృత్యువు.. ఒక ప్రమత్తా క్షణమై నిన్ను అమాంతం కబళిస్తుంది (తోటంత పువ్వు), తెలుగు అన్న మాట అనుమానాస్పదమైనప్పుడు.. చరిత్రలో మునిగి కోటి లింగాల్లో తేలినవాణ్ణి.. నేను తెలంగాణ వాణ్ణి (గంధంచెట్టు).

2176
Tags

More News

VIRAL NEWS