ఉద్యమ ఆట పాట చైతన్య పూదోట


Fri,May 19, 2017 01:27 AM

arts
-గ్రూప్-1 ప్రత్యేకం
-ధూం-ధాం: మలిదశ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన సాంస్కృతిక వేదికే తెలంగాణ ధూం-ధాం. ఆట-పాట-మాట మూలస్తంభాలుగా వచ్చిన ధూంధాంకు తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రజలు, కళలు, కళాకారులకు మధ్య వారధిని నిర్మించింది ధూంధాం. రసమయి బాలకిషన్, అంతడుపుల నాగరాజు సారథ్యంలో తెలంగాణ ధూంధాం తొలి ప్రదర్శన 2002, సెప్టెంబర్ 30న కామారెడ్డిలో జరిగింది. తెలంగాణ ధూం-ధాం కళాకారుల సమష్టి కృషిగా కొనసాగింది.

-రసమయి బాలకిషన్, అంతడుపుల నాగరాజు, ప్రజాయుద్ధ నౌక గద్దర్, గోరెటి వెంకన్న, గూడ అంజన్న, అందెశ్రీ, విమలక్క, వరంగల్ శంకర్, వరంగల్ శ్రీను, జయరాజు, మా భూమి సంధ్య, రచ్చ భారతి, అశ్విని, నిర్నాల కిషోర్, రమాదేవి, ఆకునూరి దేవన్న, భిక్షపతి, జంగిరెడ్డి, స్వర్ణరెడ్డి, సంతోష్ మొదలైన వందలాది కళాకారులతో ఊరూరు తిరిగింది ధూం-ధాం.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా ధూం-ధాం జరుగని గ్రామమే లేదు. సీమాంధ్ర వలస ఆధిపత్యానికి తోడు, గ్లోబలైజేషన్‌వల్ల తెలంగాణ సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏవిధంగా వివక్షకు గురవుతుందో ప్రతిపల్లెకు అర్థమయ్యేలా చేసింది ధూం-ధాం. అర్థంకాని దోపిడీని, కనిపించని శత్రువును మట్టిబిడ్డలకు అర్థమయ్యేలా చేసింది ధూం-ధాం. అప్పటివరకు మధ్య తరగతి, మేధావులకు, ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను, అవసరాన్ని గ్రామీణ ప్రాంతాలకు, నిరక్షరాస్యులకు, సకల జనులకు అర్థమయ్యే విధంగా చేసింది ధూం-ధాం.

-ధూం-ధాంకు ముందు తెలంగాణలో అనేక సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. కానీ ధూం-ధాం వాటికి విభిన్నమైన రీతిలో ప్రజలకు చేరువైంది. పాటతో పాటు తెలంగాణ సంప్రదాయ కళలను కూడా ఉద్యమంలో భాగం చేసింది. తెలంగాణ కళారూపాలను తెలంగాణ ఉద్యమానికి అనుసంధానం చేస్తూనే మారుమూల గ్రామాల్లో ఉన్న వేలాది కళాకారులను వెలుగులోకి తెచ్చింది.

తెలంగాణ జాగృతి


-ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు 2008లో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారా మాత్రమే ప్రజలు తమ ఔన్నత్యాన్ని, భాషా మాండలికాన్ని కాపాడుకోగలరని తెలంగాణ జాగృతి విశ్వసించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంది.

-ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ ప్రాంత అస్థిత్వ చిహ్నమైన బతుకమ్మ పండుగను ఎన్నుకొని ప్రతి ఏడాది ఉత్సవాలను నిర్వహిస్తున్నది తెలంగాణ జాగృతి. బతుకమ్మ పండుగకు పట్టణాల్లో, నగరాల్లో పూర్వవైభవం తీసుకురావాలని, తెలంగాణ సోయిని ఈ ప్రాంత మహిళల్లో కలిగించాలని, ఉద్యమ వ్యాప్తికి బతుకమ్మ ప్రేరణ కావాలని, తెలంగాణ జాగృతి భావించింది.

-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు జిల్లాల్లో పర్యటిస్తూ, బతుకమ్మలు పేరుస్తూ, స్త్రీలతో కలిసి ఆటపాటల్లో పాల్గొని, వారిని ఉత్సాహపరుస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు, మహిళలకు సంబంధించిన విభాగాలు పనిచేస్తున్నాయి. దీని ఆధ్వర్యంలో ఆరోగ్య విభాగం, సాంస్కృతిక విభాగం, బుక్ క్లబ్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించారు. అంతేగాకుండా తెలంగాణ జాగృతి విభాగాలను అమెరికాలోని వివిధ రాష్ర్టాల్లో, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ప్రేరణతో 2008-09 నుంచి వివిధ దేశాల్లోని తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఈ విధంగా తెలంగాణ అస్థిత్వ చిహ్నమైన బతుకమ్మను దేశ, విదేశాల్లో సమున్నతంగా నిలుపడంలో తెలంగాణ జాగృతి విజయవంతమైంది. మహిళలను తెలంగాణవాదం వైపు కదిలించడంలో కవితమ్మ కృషి ఫలించింది.

ఉద్యమంలో కవులు, రచయితలు, గాయకులు, కళాకారుల పాత్ర


-తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి, నిన్నటి మలిదశ తెలంగాణ పోరాటం వరకు తెలంగాణ కవులు, గాయకులు, రచయితలు, కళాకారుల కృషి వెలకట్టలేనిది. సాహిత్య, సాంస్కృతికరంగమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిందని చెప్పవచ్చు. సీమాంధ్ర ఆధిపత్య భావజాలం తెలంగాణ సమాజాన్ని అడుగడుగున అవమానానికి గురిచేసింది. వారు మన భాషను, యాసను అవమానించారు. మనం సాంస్కృతికంగా తక్కువవారమని కించపరిచారు. మర్యాద తెలియదు, నాగరికత తెలియదు అంటూ ఈసడించుకున్నారు. ఇలాంటి అవమానాలను తెలంగాణ కవులు, రచయితలు, గాయకులు, కళాకారులు తమ రచనలు, ఆటలు, పాటలతో ఎదిరిస్తూ.. ఆత్మగౌరవ పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్ర అవసరంపై తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచారు. ఏ భాష, యాస, సంస్కృతి పేరిట నవ్వుల పాలైనారో, చిన్నచూపు చూడబడ్డారో.. అదే భాషలో, యాసలో మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. గత వైభవ స్మృతులను వివరించారు.

మరోవైపు తమ బతుకు వెతలను, తెలంగాణ సామాజిక బతుకుచిత్రాన్ని, అందుకు కారకులైన వారిగురించి వివిధ సాంస్కృతిక రూపాల్లో వెల్లడించారు. ఉద్యమ సాహిత్యాన్ని అందించడంలో మంజీర రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, సింగిడి రచయితల సంఘం వంటి సాహిత్య సంఘాలేగాక.. ప్రసిద్ధ కవులు, రచయితలతోపాటు అనేక కొత్త గొంతుకలు బహుజన, దళిత, మైనారిటీ స్పృహతో విస్తృతమైన సాహిత్య సృజన చేసి ఉద్యమంపై బలమైన ముద్ర వేయగలిగారు.

-పాట: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు, గుండెగుండెకు తీసుకొనిపోయి ఉద్యమ భావజాలాన్ని విస్తరించిన ప్రధాన ప్రక్రియ పాట. పాటలు సామాన్య జనాన్ని ప్రభావితం చేసి, ఉద్యమానికి బలాన్ని చేకూర్చాయి. కొన్ని వందల, వేల పాటలు ఉద్యమ చైతన్యంలో భాగంగా పుట్టుకువచ్చి తెలంగాణ సమాజాన్ని ఉద్యమంవైపు మరల్చాయి. అందులో కొన్ని....

-మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాడిన అమ్మా తెలంగాణమా ఆకలికేకల రాజ్యమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలు తెలంగాణవాదుల్లో ఉత్తేజాన్ని నింపాయి.
-అయ్యోనివా నువ్వు అవ్వోనివా, రాజిగ ఓరి రాజిగా.. - గూడ అంజయ్య
-జయ జయహే తెలంగాణ, జై బోలో తెలంగాణ - అందెశ్రీ
-నాగేటి సాల్లళ్ల నా తెలంగాణ - నందిని సిధారెడ్డి
-రేలా దూలా తాలెల్లాడే నేల నా తెలంగాణ, పల్లే కన్నీరు పెడుతుందో, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా... - గోరటి వెంకన్న
-వీరులారా వందనం - దరువు ఎల్లన్న
-రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా - మట్టుపల్లి సురేందర్
-చినుకు చినుకు కురుసిన నేల చిత్రమైన వాసన, ఆడుదాం డప్పుల్లా దరువు, ఎందుకు రాలిపోతావురా నువ్వు ఎందుకు కాలిపోతావు - మిత్ర
-జై కొట్టు తెలంగాణ - డా. పసునూరి రవీందర్
-ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా - అభినయ శ్రీనివాస్
-తెలంగాణ వచ్చేదాకా - సుద్దాల రాజయ్య
-ఊరు తెలంగాణ, తెలంగాణ వచ్చేదాక, తెలంగాణ గళం మొదలైన ఆల్బమ్స్ - రసమయి బాలకిషన్

-ఇలా కొన్ని వందల పాటలు ఒకవైపు, వలస పాలనలోని తెంగాణ దీనత్వాన్ని పాలకుల నిర్లక్ష్యం వల్ల దిగజారిపోయిన బతుకులను చిత్రించాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గల్ఫ్ దేశాలకు, ముంబై వలసలు, బొగ్గుబాయిలో దుర్భరమైన జీవితాలు, దక్షిణ తెలంగాణలో నల్లగొండలోని ఫ్లోరైడ్ నీటి వెతలు, పాలమూరు వలస కూలీల దైన్యం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పారిశ్రామిక వాడల దుర్భర జీవితాలు, ఇరు ప్రాంతాల్లో నీళ్లు, నిధులు, వనరులు మొదలైన వాటి దోపిడీని, వ్యవసాయరంగ సంక్షోభాన్ని చిత్రించిన పాటలున్నాయి.

కవితా సంకలనాలు


-సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో దిమ్మిన అనే కవితా సంకలనం వెలువరించారు. ఇది మిలియన్ మార్చ్‌లో విగ్రహాల విధ్వంసం నేపథ్యంగా వచ్చింది.
-2006 నుంచి 2016 వరకు సుంకర రమేష్ ఐదు తెలంగాణ కవితా సంకలనాలను తీసుకొచ్చారు.
-జయ శిఖరం పేరుతో వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో తెలంగాణ జాతిపిత ప్రొ. జయశంకర్ స్మృతి కవితా సంకలనం వెలువడింది.

-మత్తడి సంకలనాన్ని అంబటి సురేందర్ రాజు, డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తీసుకొచ్చారు.
-2002లో పొక్కిలి పేరుతో జూలూరి గౌరీశంకర్ ఒక కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు.
-1969-1973 తెలంగాణ ఉద్యమ కవిత్వం సంకలనాన్ని సంగిశెట్టి శ్రీనివాస్, డా. సీ నారాయణరెడ్డి వెలువరించారు.
-ముండ్ల గర్ర - జూలూరి గౌరీశంకర్
-నదిపుట్టు వడి, ఇక్కడి చెట్ల గాలి - నందిని సిధారెడ్డి
-చెట్టును దాటుకుంటూ నూ- జూకంటి జగన్నాథం
-పొద్దు పొడుపు, పొక్కిలి వాళ్ల పులకింత- అన్నవరం దేవేందర్
-జఖ్మే ఆవాజ్- స్కై బాబు
-కావడి కుండలు- కోటేశ్వర్‌రావు
-లడాయి- పసునూరి రవీందర్

arts1
-ఇవేకాకుండా భూమిక అనే మహిళల పత్రిక తెలంగాణ సమస్యలు, చరిత్రపై 200ల పేజీలతో విశిష్ట సంకలనాన్ని వెలువరించారు. దీనికి ఉమామహేశ్వరి ప్రధాన సంపాదకత్వం వహించారు.
-మంజీరా రచయితల సంఘం ఎండమావులు పేరుతో ఆనాటి తెలంగాణ దుస్థితిని తెలుపుతూ నందిని సిధారెడ్డి సంపాదకత్వంలో కవితా సంకలనాన్ని వెలువరించింది.
-ఇవేకాకుండా కవితా సంపుటాలుగా రాని కొన్ని వేల కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఈ విధంగా కవులందరూ తమ కవితల ద్వారా చైతన్యపరిచారు.

వ్యాస సంకలనాలు


-తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసిన వ్యాస సంకలనాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా పేర్కొనదగినవి.. అల్లం నారాయణ ప్రాణహిత, సుంకిరెడ్డి నారాయణరెడ్డి గనుమ, కే శ్రీనివాస్ సంభాషణ, ముదిగంటి సుజాతారెడ్డి ముద్దెర, నందిని సిధారెడ్డి ఆవర్తనం.

874
Tags

More News

VIRAL NEWS