ఉద్యమంలో సబ్బండ వర్ణాలు


Thu,June 1, 2017 01:22 AM

grup1
భారతదేశ ఉద్యమాల చరిత్రలో ఒకే లక్ష్యం కోసం ఒక ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, ఉప్పెనలా ఉద్యమించిన ఏకైక సందర్భం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. రైతులు, సామాన్యులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, మహిళలు ఇలా అన్ని వర్గాలవారు ఒకటిగా ఉద్యమంలో మమేకమయ్యారు. ఈ సబ్బండ వర్ణాలను ముందుండి నడిపిన రాజకీయ శక్తి కేసీఆర్.

ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర


-ఉద్యమ సంస్థలకు ముఖ్యంగా విద్యార్థులకు న్యాయవాదులు రక్షణ కవచమయ్యారు. వందలాది కేసులు ఉచితంగా వాదించారు. 1952లో ముల్కీ ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంతో పాటు వివిధ సందర్భాల్లో న్యాయవాదులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పోరాటం చేశారు.
-మలిదశ పోరాటంలో ప్రధానంగా 2009 తర్వాత న్యాయవాదులు బలంగా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారని చెప్పవచ్చు. న్యాయవ్యవస్థలో సీమాంధ్రులు ఆధిపత్యం చెలాయించడం, న్యాయమూర్తుల నియామకంలోనూ వివక్ష, పక్షపాత వైఖరి వల్ల న్యాయవాదులు తమ సమస్యలపై పోరాటం చేస్తూనే మొత్తం తెలంగాణ సమాజం చేస్తున్న ఉద్యమాల్లో భాగమయ్యారు.

-2009 డిసెంబర్ 8న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లాయర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. ఈ జేఏసీకి కన్వీనర్‌గా రాజేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
-2010 జనవరి 3న విద్యార్థుల మహాగర్జనకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే విద్యార్థుల తరఫున హైకోర్టులో వాదించి మహాగర్జనకు అనుమతి ఇప్పించారు. ఆ తర్వాత 2010 ఫిబ్రవరి 14న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఈ సందర్భంలో విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇచ్చి విద్యార్థుల పక్షాన మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసి యూనివర్సిటీ నుంచి పోలీసులను వెనక్కి పంపించడంలో న్యాయవాదులు క్రియాశీల పాత్ర పోషించారు.

-2010 ఫిబ్రవరి 22న ఢిల్లీలో న్యాయవాదులు ధర్నా చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ సుమారు రెండు వేలమంది న్యాయవాదులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అనూహ్యంగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని ఘెరావ్ చేశారు.
-రాజకీయ జేఏసీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, రైల్‌రోకో, సంసద్ యాత్ర, వంటావార్పులో న్యాయవాదులు పాల్గొని తమ వంతు పాత్ర నిర్వహించారు.

ఉద్యోగుల ఉద్యమం


-తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు ఉద్యోగుల జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చూపారు.
-మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2001 జూలై 25న సీ విఠల్ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పడింది. ప్రధాన కార్యదర్శిగా గోపాల్‌రెడ్డి, ముఖ్య సభ్యులుగా పద్మాచారి, శ్రీధర్ దేశ్‌పాండే, వేణు సంకోజు, లోకేశ్వర్, దుర్గ ఉన్నారు.

-610 జీవో అమలు కోసం అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, చీఫ్ సెక్రటరీలకు విఠల్ ఆధ్వర్యంలో ఉద్యోగులు అనేక వినతిపత్రాలు ఇచ్చారు. వీరు కేసీఆర్‌ను కలిసి ఈ జీవో గురించి వివరించారు. దీని అమలు కోసం టీఆర్‌ఎస్ అధినేత కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో అప్పటి ప్రభుత్వం దీని అమలు కోసం గిర్‌గ్లానీ కమిషన్‌ను నియమించింది.
-తెలంగాణ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ: 2004 జనవరి మొదటి ఆదివారం హైదరాబాద్‌లోని అశోక హోటల్‌లో ప్రొ. జయశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించింది. ఈ డైరీల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమగ్ర సమాచారం ఉంది. ఉద్యమ నిర్మాణంలో ముఖ్య భాగమైన భావజాల వ్యాప్తికి ఈ డైరీలు ఎంతగానో తోడ్పడ్డాయి. అయితే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌పై క్రమశిక్షణ చర్యల కోసం మెమోలు జారీ చేసి, తెలంగాణ గురించి డైరీల్లో ఉన్నది తప్పుడు సమాచారమంటూ డైరీలోని అంశాలపై కూడా మెమోలు ఇచ్చింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆ మెమోలకు సమాధానాలిచ్చింది.

610 జీవో.. టీఎన్జీవోల ర్యాలీ


-2006, డిసెంబర్ 20న నాంపల్లిలోని టీఎన్జీవోల కేంద్ర కార్యాలయం నుంచి 600 వాహనాల్లో బయలుదేరిన ఈ ర్యాలీని ప్రొ. హరగోపాల్ ప్రారంభించారు. పబ్లిక్ గార్డెన్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో దాని ముగింపు సభ జరిగింది. ఈ సభలో ఉద్యోగులనుద్దేశించి ప్రొ. జయశంకర్, ఎంటీ ఖాన్ (పౌరహక్కుల సంఘం నాయకుడు), టీఆర్‌ఎస్ నుంచి హరీష్‌రావు ప్రసంగించారు.
-తెలంగాణవ్యాప్తంగా జరిగిన బహిరంగసభల్లో గిర్‌గ్లానీ కమిషన్ సిఫారసులను, 610 జీవోను అమలు చేయాలని టీఎన్జీవోలు, ఇతర వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సభల్లో ప్రొ. జయశంకర్, నందిని సిధారెడ్డి, ప్రొ. లక్ష్మణ్, దేశపతి శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, ప్రొ. హరగోపాల్ పాల్గొన్నారు. ఆ తర్వాత టీఎన్జీవో యూనియన్ టీజేఏసీలో చేరి ఉద్యమ కార్యక్రమాలను కొనసాగించింది.

మహిళల పాత్ర


-మహిళలు, కవయిత్రులు, రచయితలు, మేధావులు, కళాకారులు, వ్యిదార్థినులు ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 ఉద్యమంలో సదాలక్ష్మి, ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి లాంటివారు చురుకైన పాత్ర పోషించారు. నాటి పోలీసుల కాల్పుల్లో అమరులైన విద్యార్థిని రేణుక వారి త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. అలాగే మలిదశ ఉద్యమంలో కూడా మహిళలు తమ పోరాట స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించారు. బెల్లి లలిత, విమలక్క, సంధ్య, జాగృతి కవిత, నంది నిర్మల, సూరేపల్లి సుజాత, అల్లం పద్మ, జ్యోతి కిరణ్, విజయశాంతి, పద్మా దేవేందర్‌రెడ్డి, వనం ఝాన్సీ, రత్నమాల లాంటివారు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

-2009లో ఏర్పడిన తెలంగాణ మహిళా జాయింట్ యాక్షన్ కమిటీ (TWJAC) మహిళలను సమీకరిస్తూ, సమన్వయపరుస్తూ సంఘటితం చేయడంలో కీలకపాత్ర పోషించింది. 2010, జనవరి 31న రాష్ట్రస్థాయి మహిళా సదస్సు జరిగింది. దానికి వేలాదిమంది మహిళలు తరలిరావడంలో మహిళా జేఏసీ ప్రముఖపాత్ర వహించింది. ఈ సదస్సులోనే తెలంగాణ కోసం ఇతర జేఏసీలతో కలిసి పోరాటం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది.
-శ్రీకృష్ణ కమిటీ పర్యటనను వ్యతిరేకిస్తూ శ్రీకృష్ణ గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమాన్ని TWJAC నిర్వహించింది. అంతేగాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, సాగరహారం, వంటావార్పుల్లో మహిళలు క్రియాశీల పాత్ర పోషించారు. 2011, ఫిబ్రవరి 21న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పోలీసుల కండ్లుగప్పి వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థినులు పాల్గొని విజయవంతం చేశారు.

-2013 మార్చి 3న హైదరాబాద్‌లో ధర్నాచౌక్ (చిందు ఎల్లమ్మ వేదిక) వద్ద తెలంగాణ మహిళా జేఏసీ ధూం ధాం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, పీవోడబ్ల్యూ, స్త్రీ విముక్తి, TWJACలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ విధంగా మహిళలు తమ పోరాట పటిమను ప్రదర్శించి, వివిధ స్థాయిల ఉద్యమాల్లో భాగస్వాములై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో గణనీయ పాత్ర వహించారు.

ఉద్యోగుల జేఏసీ


-జూలై 2006లో గ్లిర్‌గ్లానీ కమిషన్ తుది నివేదికలోని సిఫారసుల అమలు కోసం ఉద్యోగ సంఘాలతో సీ విఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పడింది. దీనిలో సుమారు 26 సంఘాలు చేరాయి.
-2009 అక్టోబర్ 10న హైదరాబాద్ ఫ్రీజోన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా ఉద్యోగ సంఘ నాయకులు శాసనసభకు వెళ్లి టీఆర్‌ఎస్ నాయకులను కలిసి సుప్రీంకోర్టు తీర్పు వల్ల తెలంగాణకు జరిగే అన్యాయం గురించి వివరించారు.

-2009 అక్టోబర్ 12న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాంపల్లిలోని టీఎన్‌జీవో భవన్ నుంచి గన్‌పార్క్ వరకు పదివేల మంది తెలంగాణ ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించారు.
-14Fను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత రెండురోజుల పాటు వరుసగా కేసీఆర్‌తో ఫ్రీజోన్ విషయంపై చర్చించి కేసీఆర్ అధ్యక్షతన అక్టోబర్ 21న సిద్దిపేట ఉద్యోగ గర్జన నిర్వహించారు. ఈ సభకు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు హాజరయ్యారు. సభలో కేసీఆర్‌తో పాటు ప్రొ.జయశంకర్, స్వామిగౌడ్, విఠల్, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగించారు.

-రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 14Fను తొలగించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ వెంటనే తీర్మానం చేయాలని, కేంద్రం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 14Fను తొలగించాలని అప్పటిదాకా హైదరాబాద్‌లో పోలీస్‌శాఖలో నియామకాలు జరుపరాదని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ 14Fను తొలగించకపోతే తాను ఆమరణదీక్షకైనా సిద్ధమేనన్నారు.

-అంతేగాకుండా తమ డిమాండ్లను నవంబర్ 29లోపు నెరవేర్చాలని లేకుంటే సిద్దిపేటలో తాను నవంబర్ 29 నుంచి ఆమరణదీక్షకు దిగుతానని, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ హెచ్చరికలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో 2009, నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించగా నవంబర్ 30న తెలంగాణ ఉద్యోగులు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
-2011, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 3 వరకు తెలంగాణవ్యాప్తంగా ఉద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. అన్ని స్థాయిలకు చెందిన సుమారు 3 లక్షల మంది తెలంగాణ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ విధులను బహిష్కరించడం, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించడం, ర్యాలీలు, జాతీయ రహదారులను దిగ్బంధించడం లాంటి కార్యక్రమాలను చేపట్టారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
-అదేవిధంగా 2011, జూన్ 19న నిర్వహించిన హైదరాబాద్ రోడ్లపై వంటా-వార్పు కార్యక్రమాన్ని ఉద్యోగ జేఏసీ విజయవంతం చేసింది.
mallikarjun
-2011, సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు సుమారు 42 రోజులు నిర్వహించిన సకలజనుల సమ్మెలో అన్నిరకాల ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేశారు.
-అక్టోబర్ 11న జరిగిన ఉద్యోగుల మహాధర్నాలో తెలంగాణ ఉద్యోగులు లక్షలాదిగా హైదరాబాద్‌కు తరలివచ్చి తమ పోరు సత్తాను చాటారు. అక్టోబర్14న కరీంనగర్‌లో జరిగిన ఉపాధ్యాయ మహాగర్జనకు లక్షలాది మంది ఉపాధ్యాయులు తరలివచ్చి తమ ఆకాంక్షను తెలిపారు. ఇదేవిధంగా మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయడంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు.

846
Tags

More News

VIRAL NEWS