అంతరిక్షంలో ఇస్రో బాహుబలి


Thu,June 15, 2017 01:07 AM

దేశవ్యాప్తంగా పెరుగుతున్న హైస్పీడ్ ఇంటర్నెట్ డిమాండ్‌కు అనుగుణంగా, తగిన సేవలు అందించేందుకు అవసరమైన భారీ ఉపగ్రహాల ప్రయోగానికి సంబంధించిన మొదటి అడుగును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జూన్ 5, 2017న దిగ్విజయంగా వేసింది. దేశ జనాభాకు వేగవంతమైన అంతర్జాల సదుపాయాన్ని అందించే లక్ష్యంతో దేశీయంగా తయారైన భారీ ఉపగ్రహం జీశాట్-19 (3136 కిలోలు)ను.. జీఎస్‌ఎల్వీ మార్క్-3డీ1 తన మొదటి అభివృద్ధి ప్రయోగంలో భాగంగా 170 కి.మీ. పెరిజీ, 35,975 కి.మీ. అపోజీ కలిగిన జియో సింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (భూ అనువర్తిత బదిలీ కక్ష్య)లోకి చేర్చింది. ఈ ఉపగ్రహం ప్రయోగం ద్వారా దేశవ్యాప్తంగా 42 ట్రాన్స్‌పాండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు అధిక బరువుగల ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రో విదేశాలపై ఆధారపడగా, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 అందుబాటులోకి రావడంతో ఆ కొరత తీరింది. అంతేగాక విదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోగల సామర్థ్యం భారత్ సొంతమైంది. దీనికోసం దేశీయంగా క్రయోజనిక్ ఇంజిన్ (సీ25)ను అభివృద్ధి చేశారు.
rakate
-క్రయోజనిక్ పరిజ్ఞానం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా వద్ద మాత్రమే ఉండేది. అయితే 2014లో భారత శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషిచేసి క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
-జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల పరంపరలో నేటి ప్రయోగం పన్నెండోది కాగా, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 సిరీస్‌లో మొదటిది. పన్నెండు ప్రయోగాల్లో ప్రస్తుత ప్రయోగం విజయవంతమైన 7వ ప్రయోగం. విఫల ప్రయోగాలు: జీఎస్‌ఎల్‌వీ-డీ1, డీ3, ఎఫ్2, ఎఫ్4, ఎఫ్6.
-జీఎస్‌ఎల్‌వీకి గల సక్సెస్ రేటు దృష్ట్యా దీన్ని నాటీ బాయ్‌గా వ్యవహరిస్తారు. అయితే ప్రస్తుతం ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ని ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఒబీడియంట్ బాయ్‌గానూ ఇస్రో బాహుబలిగానూ వ్యవహరిస్తున్నారు.

జీశాట్-19


-ఇది భారత భూభాగం నుంచి నింగికి ఎగసిన మొదటి భారీ ఉపగ్రహం. దీని బరువు 3136 కిలోలు. జీవితకాలం 10 ఏండ్లు. ఈ ఉపగ్రహంలో ఆధునిక ఐ-3కే శాటిలైట్ బస్‌ను వినియోగించారు. ఫలితంగా భారీ ఉపగ్రహాలకు దానిలోని పేలోడ్‌లకు అవసరమైన విద్యుత్తు నిరంతరాయంగా అందుతుంది. (ఐ-3కే శాటిలైట్ బస్‌ను భారతీయ భారీ ఉపగ్రహాల కోసం ఇస్రో రూపొందించింది.)
-ఉపగ్రహంలో, అల్ట్రా ట్రిపుల్ జంక్షన్ సోలార్ సెల్స్ కలిగిన రెండు సోలార్ అర్రేస్‌ను అమర్చారు. ఫలితంగా 4500 వాట్స్ విద్యుత్ జనిస్తుంది. కక్ష్యలో ఉపగ్రహం పొజిషన్‌ను స్థిరంగా ఉంచడానికి దానిలో మూడు రకాల సెన్సార్లను (సూర్య, భూ, నక్షత్ర సెన్సార్లు), ఆధునిక గైరోస్కోప్‌ను అమర్చారు.
-ఉపగ్రహాన్ని భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లో విడుదల చేశాక, హసన్‌లోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ తదుపరి కక్ష్య పెంపు చర్యలను చేపడుతుంది. ఇందుకోసం ఉపగ్రహంలో లిక్విడ్ అపోజీ మోటార్ (లామ్)ను అమర్చారు. దీని ఆధారంగా ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి (జీటీఓ) చేర్చవచ్చు.

ఉపగ్రహంలోని పేలోడ్స్


-దీనిలో కమ్యూనికేషన్ వ్యవస్థల్లో కే-యూ బ్యాండ్, కే-ఏ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. సూక్ష్మ తరంగాల పౌనఃపున్యాల (12-18 గిగాహెర్ట్) పరిధిలోని విద్యుత్ అయస్కాంత వర్ణపటంలోని భాగం కే-యూ బ్యాండ్ కాగా.. 26.5-40 గిగాహెర్ట్ పరిధిలోని భాగాన్ని కే-ఏ బ్యాండ్ అంటారు.
-విశ్వం నుంచి భూమివైపుగా నిరంతరం దూసుకొచ్చే విద్యుదీకృత కణాల స్వభావాన్ని పరిశీలించడానికి, వాటి ప్రభావం ఉపగ్రహాలు, వాటిలోని ఎలక్ట్రానిక్ పరికరాలపై ఏ విధంగా ఉంటుందో కనుక్కోవడానికిగానూ దీనిలో జియోస్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ అనే పేలోడ్‌ను అమర్చారు.
-జీశాట్-19 ఉపగ్రహంతో ఆధునిక టెక్నాలజీలైన మినియేచర్డ్ హీట్‌పైప్, ఫైబర్ ఆప్టిక్ గైరో, మైక్రోఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ ఆక్సెలరోమీటర్, కేయూ బ్యాండ్ టీటీసీ ట్రాన్స్‌పాండర్, స్వదేశీ తయారీయైన లిథియం-అయాన్ బ్యాటరీలను వినియోగించారు.
-జీశాట్-19 ఉపగ్రహంతోపాటు భవిష్యత్తులో ప్రయోగించబోయే జీశాట్-11, జీశాట్-20 ఉపగ్రహాల ద్వారా భారత్‌లో ఉపగ్రహ ఆధారిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు సాధ్యమవుతాయి.

జీఎస్‌ఎల్‌వీ మార్క్-3డీ1


-ఇది మూడంచెలు కలిగిన ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక. దీన్నే జీఎస్‌ఎల్-3 లేదా ఎల్‌వీఎమ్-3 లేదా జీఎస్‌ఎల్‌వీ ఎమ్‌కే-3గా వ్యవహరిస్తారు.
-ఈ వాహకనౌకలో అధిక థ్రస్ట్‌ను వెలువరించే మోటార్స్‌ను వినియోగించారు. ఘన ఇంధనాన్ని వినియోగించుకునే రెండు స్ట్రాపాన్ మోటార్లు (ఎస్200), ద్రవ ఇంధనాన్ని వినియోగించుకునే ప్రధాన మోటారు (ఎల్-110)కి ఇరువైపులా అమర్చబడ్డాయి. రెండో దశలో పనిచేసే ప్రధానమోటారు వ్యవస్థలో భాగంగా రెండు వికాస్ ఇంజిన్‌లను వినియోగించారు. ఈ ఇంజిన్లు ఒక్కొక్కటే 700 కిలో న్యూటన్ల థ్రస్ట్‌ను వెలువరిస్తాయి. మొదటి దశలో వినియోగించే ఎస్-200 మోటార్లు ఒక్కొక్కటే 5,150 కిలో న్యూటన్ల థ్రస్ట్‌ను కలిగిస్తాయి.
-114 సెకన్లపాటు మొదటి దశలోని మోటార్లు పనిచేసిన తర్వాత, రెండో దశలోని కోర్ ఇంజిన్ (ఎల్-110) పనిచేయడం ప్రారంభించింది. (ప్రయోగం మొదలైన తర్వాత 140 సెకన్లలో మొదటి దశ పూర్తయింది.)
-322 సెకన్ల తర్వాత జీఎస్‌ఎల్‌వీలోని అతి ముఖ్యమైన క్రయోజనిక్ ఇంజిన్ (సీ25) పనిచేయడం ప్రారంభించింది. ఇది 643 సెకన్లపాటు పనిచేసి.. ఉపగ్రహాన్ని దాని నిర్ధారిత బదిలీ కక్ష్యలోకి చేర్చింది. ఆ తర్వాత మాస్టర్ కంట్రోల్ అండ్ ఫెసిలిటీ సెంటర్ చేపట్టే కక్ష్య పెంపు చర్యల ద్వారా ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి చేరుస్తారు.
sathyanarayana
-ప్రస్తుతం నిర్వహించిన ఎల్‌వీఎమ్-3 తరహా ప్రయోగాన్ని గతంలో (డిసెంబర్ 18, 2014) క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీ-ఎంట్రీ ఎక్స్‌పరిమెంట్ (సీఏఆర్‌ఈ) ప్రయోగం సందర్భంగా వినియోగించారు.
-ఎల్‌వీఎమ్-3 వాహకనౌక ద్వారా 4000 కి.గ్రా. బరువుగల ఉపగ్రహాలను భూ అనువర్తిత బదిలీకక్ష్య (జీటీడీ)లోకి, 10 వేల కిలోల బరువైన ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ) లోకి ప్రయోగించే సామర్థ్యం భారత్ సొంతం కానుంది.
-ఇలాంటి భారీ ఉపగ్రహాలను వాతావరణ పొరలు, కణాలవల్ల ఏర్పడే ఘర్షణను నివారించి రక్షించడానికి 5 కి.మీ. వ్యాసంగల ఓజివ్ పేలోడ్ ఫెయిరింగ్ (ఓపీ ఎల్‌ఎఫ్)ను వినియోగించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 నౌకలో అత్యాధునిక మోటార్లను (ఎస్-200, ఎల్-110), క్రయోజనిక్ ఇంజిన్‌ను (సీ25), వాటితోపాటు దిక్సూచీ, మార్గనిర్దేశనం, నియంత్రణ వ్యవస్థలను, వివిధ దశలు ముగిసిన తర్వాత వాటిని వేరుపర్చే ప్రక్రియలను వినియోగించారు. వాహకనౌక గగన విహారాన్ని ఎస్-బ్యాండ్ టెలిమెట్రీ, సీ-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్ల సాయంతో పర్యవేక్షించారు. ప్రయోగం పూర్తికావడానికి 16 నిమిషాల 20 సెకన్ల సమయం పట్టింది.
-హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలందించే క్రమంలో జీశాట్-11ను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి, జీశాట్-20ని షార్ కేంద్రం నుంచి 2018లో ప్రయోగించడానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది.
-ఎల్‌వీఎమ్-3కి సంబంధించిన వివిధ దశల పనితీరు విధానం, నౌక లిఫ్ట్ ఆఫ్ నూ, ఉపగ్రహాన్ని వేరుపర్చే కక్ష్యలో నిలిపే వీడియోను ఇస్రో తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వివరాలకు www.isro.gov.in/gslv-mk-iii-d1-gsat-19-mission/gslv-mk-iii-d1-gsat-19-tracking-and-onboard-camera-vid

516
Tags

More News

VIRAL NEWS