జలమే జీవం


Sun,August 12, 2018 11:15 PM

చుట్టూ నీరు ఉన్నా చుక్క కూడా తాగలేని పరిస్థితి. నేడు మన కండ్ల ముందు కదలాడుతున్న ఈ దుస్థితిని శామ్యూల్ టైలర్ ఏనాడో తన రచనలో వర్ణించాడు. భవిష్యత్ దర్శనం చేసిన ఎవరికైనా ఈ విషయం బోధపడుతుంది. ఇంకా రానున్నది అత్యంత గడ్డుకాలం అనేది నిష్ఠూర సత్యం. స్వీయ తప్పిదాలతో నీటి కటకట ఎదుర్కొంటున్న ఈ తరుణంలో కష్టాలకు కారణాలు, పరిష్కారాల గురించి విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది.
civils
-ప్రాణి పుట్టుకే నీటి నుంచి మొదలైంది అంటారు శాస్త్రవేత్తలు. ఈ విషయంలో కొంచెం భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ, జీవి మనుగడకు జలమే ప్రధానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ప్రాణి మనుగడకు ప్రాథమిక అవసరమైన నీటి కోసం నేడు ఓవైపు యుద్ధాలు మరోవైపు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. పొరుగు గ్రహాలపైన నీటి జాడలు ఏమైనా ఉన్నాయోమే అని పట్టు వదలకుండా శోధిస్తున్నారు. ఈ భూ గ్రహం మీద వనరులన్నీ నాశనమైతే ఏనాటికైనా ఇతర గ్రహాల మీదికి వెళ్లిపోదామనే దురాశ కూడా ఈ పరిశోధనల వెనుక లేకపోలేదంటే నీటి విషయంలో మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి దిగజారినమో తెలుస్తున్నది.

నీటి లభ్యత - వినియోగం

-భూగ్రహంపై ఒక వంతు నేల ఉండగా, మూడు వంతుల నీటితోనే నిండి ఉంది. నీటి లభ్యత విషయానికి వస్తే 97 శాతం నీరు సముద్రాల్లో ఉప్పుతో కూడుకుని ఉండగా, కేవలం 2.5 శాతం భూమిపై వివిధ రూపాల్లో ఉన్నది. ఇందులోనూ అధిక భాగం ధ్రువాల వద్ద మంచు రూపంలోనే ఉండిపోయింది. కేవలం 0.3 శాతం మాత్రమే మానవాళి వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇందులో 70 శాతం వ్యవసాయానికి, 20 శాతం పరిశ్రమలకు, మరో 10 శాతం గృహావసరాలకు వినియోగిస్తున్నాం.
-రోజురోజుకూ జనాభాతోపాటు నీటి అవసరాలు పెరిగిపోతున్నాయి. 1990వ దశకం నుంచి మన నీటి వినియోగ స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. చాలా దేశాలు వారి పౌరులకు కనీసం తాగునీటిని అందించలేని స్థాయికి చేరుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే 80 దేశాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లోనే ఉన్నారు. 2025 నాటికి ఇది సుమారు 65 శాతానికి చేరుకోనున్నది. నేటితో పోల్చితే 2050 నాటికి నీటి డిమాండ్ 30 శాతం పెరగనుంది. అదే సమయంలో ప్రపంచంలో సగం జనాభా వారికి అవసరమైన నీటిలో కేవలం 10 శాతం మాత్రమే అందుబాటులో ఉండనున్నదని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
-మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం నాలుగింట మూడొంతుల గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందడంలేదు. సురక్షిత తాగునీరు లేకపోవడం అనేక అనర్థాలకు దారితీస్తున్నది. వ్యాధులు ప్రబలి లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2013 లాన్సెట్ అధ్యయనం ప్రకారం సురక్షిత తాగునీరు లేక ఏటా మరణిస్తున్న 2 లక్షల మంది చిన్నారులు నాలుగేండ్ల లోపు వారేనని గణాంకాలు చెబుతున్నాయి. తాగునీటి కొరతతో పరోక్షంగా మహిళలు, చిన్నారులే అధికంగా ప్రభావితం అవుతున్నారు. గుక్కెడు నీటి కోసం మహిళలు మైళ్ల దూరం పరుగులు తీస్తున్నారు. రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో అయితే నీరు తీసుకువచ్చేందుకే ఒక్కో పురుషుడు రెండు, మూడు వివాహాలు చేసుకుంటున్నాడు. వీరిని వాటర్ వైవ్స్ (నీటిని తీసుకొచ్చే భార్యలు) అని పిలుస్తున్నారు. వీరికి తోడుగా బాలికలను కూడా బడి మాన్పించి మరీ నీరు తీసుకురావడానికే ఉపయోగిస్తున్నారు. మిగితా ప్రాంతాలతో పోల్చితే తాగునీటి వసతి ఉన్నచోట పాఠశాలల్లో చేరే బాలికల నిష్పత్తి అధికంగా ఉన్నట్టు స్వచ్ఛంద సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. నీటి కొరత చివరకు సామాజిక, ఆర్థిక పరిస్థితులను దిగజారుస్తుందనేది కండ్లకు కడుతున్న వాస్తవం.
-నీటి కొరత ఇంకా తీవ్ర రూపం దాల్చితే మనిషి గతి ఏమవుతుందోననే ఆందోళన ఓ వైపు మొదలైనా.. మరోవైపు విచ్చలవిడిగా నీటి వృథా కొనసాగడం విచారకరమైన విషయం. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరంలో సైనిక పహారాలో తాగునీటి పంపిణీ మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్‌కి రైలు ట్యాంకర్లతో నీటి సరఫరా చేసిన ఇటీవలి దృశ్యాలు కేవలం ఉదాహరణలు మాత్రమే.

వ్యవసాయ రంగం - నీరు

-నీటి కొరత గృహావసరాలనే కాకుండా వ్యవసాయ రంగం పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. మన దేశంలో పంట సాగులో 55 శాతం బావులు, బోరుబావుల ద్వారా 32 శాతం కాలువల ద్వారా, మరో 6 శాతం చెరువుల ద్వారా జరుగుతున్నది. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక చెరువులు, వాగులు, వంకల్లో నీటి జాడ కరువవుతున్నది. వాతావరణ, వ్యవసాయ శాఖల గణాంకాల ప్రకారం సాగు విస్తీర్ణంలో 60 శాతం వర్షాభావ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నది.
-మనిషి అవసరాల కోసం ఓ వైపు అడవులను నరకడం, మరోవైపు కాలుష్యాన్ని వెదజల్లడంతో గ్లోబల్ వార్మింగ్ రూపంలో దుష్ఫలితాలను అనుభవిస్తున్నాం. పంటలు పండించడానికి భారీగా నీటిని వినియోగిస్తున్నాం. వరి, చెరుకు వంటి పంటలకు నీరు అధికంగా అవసరం. ప్రతి కిలో ఉత్పత్తికి వినియోగిస్తున్న నీటిని లెక్కగట్టి, ఎంత మొత్తంలో మనం వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామో అంత మొత్తం నీటిని కూడా ఎగుమతి చేస్తున్నట్లే అని లెక్కిస్తున్నారు. దీన్ని పర్యావరణవేత్తలు వర్చువల్ వాటర్ ఎక్స్‌పోర్ట్‌గా పిలుస్తున్నారు. నీటి వినియోగం ఇలాగే ఉంటే మరో వెయ్యేండ్ల లోపే భారతదేశం తన నీటి నిల్వలను పూర్తిగా కోల్పోతుందని ఓ అంచనా.
-ప్రస్తుతం ఒక కిలో బియ్యం ఉత్పత్తి కోసం సుమారు 2,700 లీటర్ల నీటిని వినియోగిస్తున్నాం. మన దేశం నుంచి ఏటా 38 లక్షల టన్నులకు పైగా బాసుమతి బియ్యం ఎగుమతి చేస్తున్నాం. ఈ లెక్కన 10 ట్రిలియన్ లీటర్లకు పైగా నీటిని ఎగుమతి చేస్తున్నట్లు లెక్క.

జల వివాదాలు

-పెరుగుతున్న నీటి అవసరాలతో భూగర్భ జలాలు అడుగంటడమే కాదు.. నదీ జలాలు తగ్గిపోయి సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ ప్రకారం మన దేశంలో బ్రహ్మపుత్ర, మహానది రివర్ బేసిన్లు మినహాయిస్తే... మిగతా అన్ని రివర్ బేసిన్ల పరిధిలో నీటికొరత ఉంది. ఫలితంగా అంతర్‌రాష్ట్ర నదీజల వివాదాలు పెరిగిపోతున్నాయి. ఇవి చివరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల కావేరి నదీ జలవివాదం మూడు రాష్ర్టాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. కావేరి నదీ జలాలను కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మధ్య పంపిణీ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం రాజుకుంది. కృష్ణా, గోదావరి, వంశధార, మహానదితోపాటు ఇతర నదీజలాల విషయంలోనూ వివిధ రాష్ర్టాలు గొడవపడుతున్నాయి. మరోవైపు నీటి కొరత కారణంగా ఏటా దేశ జీడీపీలో 6 శాతం నష్టపోతున్నాం.

పరిష్కార మార్గాలు

-నీటి సంరక్షణ బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు ప్రతి ఒక్కరిపైనా ఉందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
-వ్యవసాయం, పరిశ్రమలు మొదలు గృహావసరాల వరకు ప్రతిచోటా వృథాను నియంత్రించాల్సిన అవసరం ఉంది. పట్టణాలు, నగరాల్లో కుళాయిలకు నీటి మీటర్లు బిగించాలి. పరిమితికి మించి నీటిని వినియోగించే వారి నుంచి భారీగా రుసుములు వసూలు చేయడం లేదా జరిమానాలు విధించడం వంటి చర్యలు చేపట్టాలి.
-నీటి సంరక్షణలో నదులు, కాలువలను కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవడం కూడా భాగమే. కాబట్టి పట్టణాలు, నగరాల్లో 100 శాతం మురుగునీటి సీవేజ్ ట్రీట్‌మెంట్ తర్వాతే కాలువల్లోకి వదలాలి. నదులు, చెరువులను కాలుష్యం బారిన పడకుండా కఠిన చర్యలు చేపట్టాలి.
-కాంక్రీట్ జంగిళ్లుగా మారిపోయిన పట్టణాలు, నగరాల్లో ఇండ్లు, కార్యాలయాల ఆవరణల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీటితో నీరు భూమి లోపలి పొరల్లోకి ఇంకుతుంది.
-రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ని పట్టణాలు, నగరాల్లో ప్రోత్సహించాలి. విస్తృతంగా ప్రచారం కల్పించాలి.
-కొండ ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహానికి అడ్డుగా కాంటూరు ట్రెంచ్‌లు ఏర్పాటు చేయాలి. అలాగే వాగులు, సెలయేళ్లలో చెక్‌డ్యామ్‌లు, మట్టితో అడ్డుకట్టలు నిర్మించాలి.
-గొట్టపు బావుల మాదిరిగా భూ ఉపరితలం నుంచి కొద్ది లోతు వరకు ఇంజక్షన్ వెల్స్ తవ్వి.. వర్షం నీరు అందులోకి వెళ్లేలా చేయడం ద్వారా కూడా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీన్నే ట్యూబ్ రీచార్జ్ అంటారు.
-రైతులు నేరుగా ఎక్కడైతే పంటకు నీరు అందించాలో అక్కడి వరకు పైపుల ద్వారా నీటిని చేరవేస్తే మేలు. లేదంటే చాలా వరకు నీరు కాలువల్లో పారడంవల్ల వృథా అవుతున్నది.
-సంప్రదాయ పద్ధతులతో పోల్చితే సూక్ష్మ, తుంపర సేద్యం ద్వారా దాదాపు 80 శాతం నీటిని పొదుపు చేయవచ్చు.
-ప్రతి నీటి బోట్టూ విలువైందే. కాబట్టి సాగునీటి కాలువలపై సోలార్ పలుకలను అమర్చే కార్యక్రమాన్ని అమలు చేసే చర్యలు చేపట్టాలి. అటు సౌరశక్తిని ఒడిసి పట్టవచ్చు. కొంత వరకు నీటి ఆవిరి నష్టాలను నివారించవచ్చు.
-కాలువల్లో సిమెంట్ లైనింగ్ లేనిచోట వెంటనే లైనింగ్ పూర్తిచేయాలి. నీటిపారుదలలో వృథాను పూర్తిగా అరికట్టాలి.
-సమర్థవంతంగా నీటి యాజమాన్య పద్ధతులను అమలుచేస్తున్న గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించాలి. నీటి వినియోగంపై సమగ్ర అవగాహన కలిగిన వారిని లోకల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి వారితో గ్రామాల్లో ప్రచార సదస్సులు నిర్వహించాలి.
-నీటి సంరక్షణ గురించి పాఠ్యాంశాలు రూపొందించి వదిలేస్తే లాభం లేదు. గతంలో నీటివనరులు ఎలా ఉండేవి, ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి కారణాలను వివరిస్తూ విద్యార్థులను ఆలోచింపజేసేలా ప్రాజెక్టువర్క్ ఇవ్వాలి. నీటి సంరక్షణ గురించి తల్లిదండ్రులు, స్నేహితులతో చర్చించడాన్ని ప్రోత్సహించాలి.

ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు

-తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం ఉద్దేశం చాలా బాగుంది. వాటర్‌షెడ్ కార్యక్రమాల కోసం కూడా ప్రభుత్వాలు ఖర్చుచేస్తున్నాయి. కానీ వాటి అమలుపై ప్రత్యేక శ్రద్ధ వాహించాల్సిన అవసరం ఉంది.
-హరితహారం లాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూనే అడవుల నరికివేత, అక్రమ కలప రవాణాను అడ్డుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలి. లేదంటే వాతావరణ మార్పులు మరింత తీవ్రతరమై ఎడారులుగా మారే ప్రమాదం ఉంది.
-ప్రతి నీటిబొట్టుకు మరింత అధిక దిగుబడి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నది. హర్ కేథ్ కో పానీ, కృషి సించాయి యోజన వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది.
-నదుల అనుసంధానానికి కూడా కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నది. ఇప్పటికే పలు నదీ అనుసంధాన కార్యక్రమాలకు పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధమయ్యాయి. కెన్-బెట్వా అనుసంధానానికి పచ్చజెండా ఊపింది. ఈ అనుసంధానం పూర్తయితే కరవు ప్రాంతాలకు పండగొచ్చినట్టేనని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తుండగా, పర్యావరణ ముప్పు పేరుతో వ్యతిరేకిస్తున్నవారు కూడా ఉన్నారు.
-నీటి యాజమాన్య పద్ధతులను మెరుగుపర్చుకునేందుకు భారత ప్రభుత్వం వివిధ దేశాలతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నది. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే టెక్నాలజీ కోసం ఇజ్రాయెల్‌తో, నీటి నిర్వహణ కోసం ఐరోపా సమాఖ్యతో ఒప్పందాలు కుదుర్చుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాయి.
-నీటి యాజమాన్య పద్ధతులను మెరుగుపర్చడానికి నీతి ఆయోగ్ కూడా తనవంతు కృషి చేస్తున్నది. రాష్ర్టాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించే విధంగా ఇటీవలే సమగ్ర నీటి యాజమాన్య సూచికను విడుదల చేసింది.
మిహిర్ షా కమిటీ నివేదిక
-ప్రస్తుతం ఉన్న కేంద్ర జలవనరుల కమిషన్, కేంద్ర భూగర్భజల బోర్డును కలిపి జాతీయ జలవనరుల కమిషన్ (నేషనల్ వాటర్ కమిషన్) ఏర్పాటు చేయాలని మిహిర్ షా కమిటీ సూచించింది. నీటి నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను రెండు విభాగాలకు అప్పగించడంతో సమన్వయం లోపించి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని షా కమిటీ అభిప్రాయపడింది. నీటి ప్రాజెక్టులకు సంబంధించి కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా క్రియాశీలంగా వ్యవహరించేలా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, జల విధానాన్ని రూపొందించడం, అమలు చేయడంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు.
కమిటీ సూచనలు
-జాతీయ జలవనరుల కమిషన్‌కు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ నీటి నిర్వహణలో జబాబుదారీగా చేయాలి.
-సీనియర్ అధికారిని చీఫ్ కమిషనర్‌గా నియమించడంతోపాటు నిర్ణీత కాలంపాటు పదవిలో కొనసాగేలా భద్రత కల్పించాలి. జల నిర్వహణలో అపార అనుభవం కలిగినవారిని పూర్తికాలపు కమిషనర్లుగా నియమించాలి.
-జల నిర్వహణకు సంబంధించి అన్ని విజ్ఞాన కేంద్రాలు, సంస్థలతో జాతీయ జలవనరుల కమిషన్ భాగస్వామ్యం కలిగి ఉండాలి.

నీతి ఆయోగ్- సమగ్ర నీటి యాజమాన్య సూచిక

-నీతి ఆయోగ్ వివిధ రాష్ర్టాల్లో నీటి సంరక్షణ, వినియోగం ఆధారంగా సూచికను విడుదల చేసింది. ఇందుకోసం భౌగోళిక, వాతావరణ పరిస్థితులను అనుసరించి యావత్ దేశాన్ని రెండు భాగాలుగా గుర్తించింది. హిమాలయ, ఈశాన్య ప్రాంత రాష్ర్టాలు, ఇతర రాష్ర్టాలు అని రెండు విభాగాలుగా గుర్తించింది. భూగర్భ జలాలు, జలవనరుల పునరుద్ధరణ, సాగునీరు సాగు విధానాలు, తాగునీరు, ప్రభుత్వ విధానాలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ర్టాలకు ర్యాంకులు ప్రకటించింది. గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా... మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రెండో విభాగంలో హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, అసోం వరుసగా ముందు నిలిచాయి. ఇకపై ఏటా ఈ నివేదికను రూపొందించనుంది. రాష్ర్టాలు మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించడానికి ఈ నివేదికలు తోడ్పడుతాయని భావిస్తున్నారు.
-నీటి నిర్వహణకు సంబంధించి అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిహిర్‌షా కమిటీ 2016లో తన నివేదికను అందించింది.

జాతీయ జలవనరుల కమిషన్-బాధ్యతలు

-సాగు సంస్కరణలు: ప్రతి పొలానికి నీరందించే లక్ష్యంతో రాష్ర్టాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా, నీటిని సమర్థంగా వినియోగించేలా చూడటం కమిషన్ విధి.
-నదుల పరిరక్షణ: కాలుష్యం బారిన పడుతున్న నదులను రక్షించడం ప్రధాన విధి. తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి.
-నీటి వినియోగ సమాచారంతో కూడిన చిత్రపటాలను రూపొందించాలి.
-నీటి భద్రత: ముంపు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో వరదలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. వాతావరణ మార్పులపై అధ్యయనాలను పరిశీలిస్తూ నీటి భద్రతకు తగిన చర్యలు చేపట్టాలి.
-పట్టణ, పారిశ్రామిక నీటి నిర్వహణ: పట్టణాలు, నగరాల్లో భూగర్భ జాలల వినియోగంపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలి. నగరాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థజలాలను శుద్ధిచేసి పునర్వినియోగించే చర్యలను ప్రొత్సహించాలి.
-నీటి నాణ్యత: నీటి వనరులు కాలుష్యంబారిన పడకుండా చర్యలు చేపట్టాలి. కాలుష్య నియంత్రణ మండలితోపాటు మిగతా విభాగాలతోనూ సమన్వయంతో ఈ లక్ష్యాన్ని సాధించాలి. చిత్తడి నేలల పరిరక్షణపై శ్రద్ధవహించాలి.
-నీటి వనరులకు సంబంధించి సమగ్ర సమాచారం, విజ్ఞానం కలిగి ఉండటంతోపాటు తగిన సామర్ధ్యాలను పెంపొందించుకోవాలి.
-నీటి కష్టాలను ఎదుర్కొని, భవిష్యత్ ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఇప్పటికే పలు కమిటీలు, శాస్త్రవేత్తలు అనేక సూచనలు చేశారు. వాటిని అమలు చేయడమే మిగిలింది.
m-bala-latha

760
Tags

More News

VIRAL NEWS