అమెరికా విద్యాబోధన


Thu,April 20, 2017 12:06 AM

america
విద్యాబోధనలో నేడు శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోదేశంలో ఒక్కోవిధానంలో విద్యాబోధన ఉన్నా వాటన్నింటిలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. వివిధ దేశాల విద్యాబోధన పద్ధతులను ఒకే వేదికపై చర్చించేందుకు అమెరికా ప్రభుత్వం కొంతకాలంగా TEA (Teaching Excellence Achievement) Programmeను నిర్వహిస్తున్నది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బత్తి అశోక్‌రెడ్డి ఎంపికయ్యారు. 2017 జనవరి 24 నుంచి మార్చి 15 వరకు అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో బౌలింగ్ గ్రీన్ విశ్వవిద్యాలయంలో విద్యా బోధనపై వృత్తి వికాస శిక్షణా కార్యక్రమంలో శిక్షణ పొందారు. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న బోధన విధానాలను పరిశీలించడానికి ఐదు అమెరికా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఆయన అనుభవాలు నిపుణ పాఠకులకోసం..

అమెరికా ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, ఇంటర్నేషనల్ ఎక్చ్సేంజ్ బోర్డు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 దేశాలకు చెందిన 80 మంది సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఆరు వారాల పాటు అమెరికాలోని నాలుగు విశ్వవిద్యాలయాల్లో వృత్తి వికాసంపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం కూడా ఆయా ఉపాధ్యాయులకు నిరంతరం వృత్తి వికాసానికి అవసరమైన తోడ్పాటును అందిస్తారు. ఉపాధ్యాయుల నాయకత్వ లక్షణాలు, బోధనా సామర్థ్యాన్ని, రాత సామర్థ్యం ఆధారంగా మొదటి దశలో కొంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. రెండు, మూడు దశల్లో మౌఖిక పరీక్ష టోఫెల్ నిర్వహిస్తారు. ఈ మూడింటిలో సదరు ఉపాధ్యాయుడి ప్రతిభను ఆధారంగా ఈ కార్యక్రమానికి తుది ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన ఉపాధ్యాయులకు నూతన బోధనా పద్ధతులు, కరికులమ్ అభివృద్ధి, పాఠ్య ప్రణాళిక, బోధనా వ్యూహాలు, బోధనలో సాంకేతిక వినియోగం వంటి విషయాల్లో శిక్షణ ఇస్తారు. అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్షేత్ర పర్యటనల ద్వారా ప్రత్యక్ష స్వీయ అనుభవాన్ని కలిగిస్తారు. అమెరికా సమాజం సాంస్కృతిక విషయాల పట్ల అవగాహన కల్పిస్తారు.

బౌలింగ్ గ్రీన్ విశ్వవిద్యాలయం ఓహియో విధాన విభాగంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 20 దేశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్యారంగంలో నిష్ణాతులైన ప్రొఫెసర్ల మార్గదర్శకత్వంలో బాలికావిద్య, లింగ సమానత్వంలో సమాజం పాత్ర, విద్యా విధానాలు-పాలసీలు, నూతన బోధనా విధానాలు, కరికులమ్ రూపకల్పన, సామాజిక-సాంస్కృతిక సమస్యలు-విద్యా పాత్ర, తరగతి బోధనలో సాంకేతికత వినియోగం వంటి విషయాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ మొత్తం వర్క్‌షాపులు, క్షేత్ర పర్యటనలు, స్వీయ అనుభవాలు, కార్య శోధనల రూపంలో జరిగింది. అమెరికా సమాజంలో సామాజిక సేవ విధానాలపై అక్కడి యువతతో కలిసి ప్రత్యక్ష అనుభవాన్ని పొందాం. ఇందుకోసం అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్ర పర్యటన చేశాం. సుమారు 110 గంటల పాటు విద్యాపరమైన శిక్షణ ఇచ్చారు. 45 గంటల పాటు ఓహియో రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాం. భారతదేశ సంస్కృతి, వారసత్వ సంపద వంటి విషయాల మీద అక్కడి పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాం.

గమనించిన ముఖ్యాంశాలు


-అభ్యసన విషయంలో విద్యార్థులకు ఎక్కువ స్వేచ్ఛ ఉంది. ఉపాధ్యాయులను ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. విద్యార్థుల మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు.
-తరగతి గదుల్లో సాంకేతిక వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విద్యార్థి ల్యాప్‌టాప్, క్రోమ్‌బుక్, ఐపాడ్ వంటి వాటిని కలిగిఉంటారు. అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు అన్ని ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల ఫీడ్‌బ్యాక్ కూడా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అక్కడ చేతిరాత చాలా అరుదు. విద్యార్థి హాజరు మొదలు, మార్కులు, గ్రేడ్‌లు, వ్యక్తిగత సమాచారం, కృత్యాలు, సందేహాల నివృత్తి ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ప్రతి తరగతిగదిలో ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్, విజువలైజర్ అధునాతన సాంకేతిక పరికరాలు ఉంటాయి. తరగతి గదులన్నీ ఇంటర్నెట్‌తో అనుసంధానించి ఉంటాయి. కానీ సామాజిక మాధ్యమాలు బ్లాక్ చేయబడతాయి.

-విషయాలవారీగా తరగతిగదులు ఉంటాయి. ఉపాధ్యాయులు తమ సబ్జెక్ట్ గదుల్లో ఉంటారు. విద్యార్థులు ఒక పీరియడ్ కాగానే సబ్జెక్టువారీ గదుల్లోకి మారుతారు. ఆసక్తికర విషయం ఏమిటంటే విద్యార్థులను తరగతులవారీగా కాకుండా వివిధ సబ్జెక్టుల్లో వారిస్థాయిని బట్టి గ్రేడ్‌లుగా విభజిస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థి ఇంగ్లిష్‌లో 8వ గ్రేడ్, గణితంలో 6వ గ్రేడ్, జీవశాస్త్రంలో 9వ గ్రేడ్‌లో ఉండవచ్చు. విద్యార్థి బాగా రాణించే సబ్జెక్టులో ఉన్నత గ్రేడ్, వెనుకబడి సబ్జెక్టులో తక్కువ గ్రేడ్‌లో ఉండవచ్చు. విద్యార్థి అభ్యవసర స్థాయిని బట్టి తరగతి గ్రేడ్‌లు ఉంటాయి. ఇలాంటి విధానం మన విద్యార్థులకు కూడా అమలుచేయాల్సిన అవసరం ఉంది.

-విద్యార్థి గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్, ఒక విదేశీ భాషను తప్పనిసరిగా అభ్యసించాలి. కళలు, సాంస్కృతిక విద్య, క్రీడా విద్య, క్రాఫ్ట్‌లు, సంగీతం, రోబోటిక్స్ లాంటి సాంకేతిక విద్యలు, వ్యవసాయ సాంకేతిక రంగాలు మొదలైన సబ్జెక్టులు ఐచ్ఛికాంశాలుగా ఉంటాయి.
-దాదాపు అమెరికాలో పాఠశాలల సమయం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉంటుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బలమైన పోషక పదార్థాలతో కూడిన మధ్యాహ్న భోజనం ఉచితంగా ఇస్తారు. విద్యార్థులకు పాఠశాల బస్సులు రవాణా సదుపాయాన్ని కల్పిస్తాయి.
-అన్ని పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానాలు, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియం, జిమ్‌ల వంటి క్రీడా సదుపాయాలు ఉంటాయి.

ప్రతిభకు పరీక్ష

1. ఏప్రిల్ 7న జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-2017 ప్రధాన ఇతివృత్తం ఏది?


1) డిప్రెషన్: లెట్స్ టాక్
2) హెచ్‌ఐవీ ఎయిడ్స్: యూనిట్ టు ఎండ్
3) టీబీ: లెట్స్ ఎండ్
4) క్యాన్సర్: ఫైట్ ఎగెనెస్ట్ ఇట్

2. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజమ్ కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) నివేదిక ప్రకారం జీడీపీలో పర్యాటక రంగం వాటాలో భారత్ ఏ స్థానంలో ఉంది?


1) తొమ్మిది 2) పదకొండు
3) ఏడు 4) పదమూడు

3. కింది వారిలో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్‌లో ఇప్పటివరకు స్థానం పొందని భారత క్రికెటర్?


1) వీరేంద్ర సెహ్వాగ్ 2) అనిల్ కుంబ్లే 3) సచిన్ టెండూల్కర్ 4) విరాట్ కోహ్లీ

4. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఝార్‌గ్రామ్ అనే జిల్లాను ఏప్రిల్ 5న ఏర్పాటు చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఎంతకు చేరింది?


1) 18 2) 32 3) 21 4) 22

5. కింది ఏ పథకంలో తక్కువమంది చేరడంతో కేంద్ర మంత్రివర్గం దాన్ని ఉపసంహరించుకుంది?


1) మహాత్మా గాంధీ ప్రవాసీ సురక్షా యోజన
2) మహాత్మాగాంధీ బుంకార్ బీమా యోజన
3) దీన్‌దయాళ్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్
4) ద ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన

6. బిట్‌కాయిన్స్‌ను కరెన్సీగా గుర్తించిన దేశం?


1) మలేషియా 2) ఇండోనేషియా
3) చైనా 4) జపాన్

7. ద సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ స్పేస్ కమాండ్ ఏ దేశానికి చెందింది?


1) రష్యా 2) జర్మనీ 3) చైనా 4) ఫ్రాన్స్

-సమాధానాలు శుక్రవారం నిపుణలో...
-18వ తేదీ.. ప్రతిభకు పరీక్ష జవాబులు
-1-3, 2-1, 3-3, 4-4, 5-3, 6-4

818
Tags

More News

VIRAL NEWS