2022 నాటికి పేదలందరికీ ఇండ్లుSun,September 24, 2017 02:10 AM

- ఓట్లకు కాదు అభివృద్ధికే ప్రాధాన్యం
- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే పూజ చేయటం లాంటిదే
- వారణాసిలో పశు ఆరోగ్య మేళాను ప్రారంభించిన ప్రధాని మోదీ
Modi-Toilet
షెహెన్‌షాపూర్ (యూపీ), సెప్టెంబర్ 23: బీజేపీ రాజకీయాలు ఓట్ల కోసం కాదని, దేశ అభివృద్ధి కోసమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు ఓట్లు వస్తాయంటేనే పనులు చేస్తారని, తాము భిన్నమైన సంస్కృతిలో పెరిగామని చెప్పారు. తమకు అన్నింటికన్నా దేశమే మిన్న అని తెలిపారు. తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని రెండో రోజైన శనివారం షెహెన్‌షాపూర్‌లో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య మేళాను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా అభివృద్ధి అని ఆయన పునరుద్ఘాటించారు. పరిపాలన అంటే రాజకీయాలు చేయడం లేదా ఎన్నికల్లో గెలువడం కాదు. దేశ శ్రేయస్సు ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. మా (బీజేపీ) రాజకీయాలు ఓట్ల కోసం కాదు అని మోదీ వ్యాఖ్యానించారు. 1800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన పశు ప్రదర్శనను గూర్చి ఆయన మాట్లాడుతూ ఈ పశువులు ఓట్లు వేయడానికి వెళ్లవు. అవి ఏ పార్టీకీ ఓటర్లు కావు అని అన్నారు.

2022 నాటికి అందరికీ ఇండ్లు

దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొనే 2022 నాటికి పట్టణాల్లోనైనా, గ్రామీణ ప్రాంతాల్లోనైనా ప్రతి పేదవారికి ఒక ఇల్లు లభిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశమంతటా కోట్ల సంఖ్యలో ఇండ్లు నిర్మిస్తున్నప్పుడు వాటికి ఇటుకలు, సిమెంటు, ఉక్కు, కలప అవసరమవుతుంది. వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆదాయం, ఉపాధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అని చెప్పారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. పశుధన్ ఆరోగ్య మేళా వంటి కార్యక్రమాల వల్ల రైతులు లబ్ధిపొందుతారని చెప్పారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ ద్వారా పాల ఉత్పత్తిని పెంచవచ్చని అన్నారు. రైతులు పాడి పరిశ్రమ, పశు గణాభివృద్ధిని ఆదాయ పెంపుదలకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ఎంచుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం నల్లధనం, అవినీతిపై యుద్ధం ప్రకటించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సామాన్యులు అవినీతిపరుల దోపిడీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒక ఉత్సవంలా ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.

167

More News

VIRAL NEWS