33 శాతం మహిళలకే


Fri,March 15, 2019 11:25 AM

Will give 33pr quota to women in government jobs if voted to power says Rahul Gandhi

-మహిళా రిజర్వేషన్ బిల్లునూ ఆమోదిస్తాం
-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారికే ఉద్యోగాలు
-నరేంద్రమోదీ ముమ్మాటికీ అవినీతిపరుడే
-వాద్రాతోపాటు ఆయనపైనా దర్యాప్తు జరుపాలి
-మోదీ విధానాల వల్లే అగ్నిగుండంగా కశ్మీర్
-తమిళనాడు పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్

చెన్నై/నాగర్‌కోయిల్, మార్చి 13: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను సవరిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తమిళనాడులో బుధవారం యూపీఏ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ రాహుల్ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం నాయకత్వ పదవుల్లో మహిళలు పెద్దగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో మహిళలకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అంతేకాకుండా పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కూడా నిర్ణయించామన్నారు. అంతకుముందు రాహుల్ చెన్నైలోని సెల్టా మేరీస్ కళాశాల విద్యార్థినులతో మాట్లాడుతూ.. చట్టాన్ని కేవలం కొంత మందికే కాకుండా ప్రతి ఒక్కరికీ వర్తింపజేయాలన్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో తన బావ రాబర్ట్ వాద్రాపై దర్యాప్తు జరుపుతున్నట్టుగానే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై కూడా దర్యాప్తు జరుపాలన్నారు.

ఇలా చెప్తున్న మొదటి వ్యక్తిని తానేనని రాహుల్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి నేరుగా ప్రజల మానసిక స్థితితో ముడిపడి ఉంటుందని, ప్రతికూల, భయానకమైన వాతావరణంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఎవరూ ఆశించలేరని అన్నారు. ప్రజలను తమ పార్టీ సాధికారతతో సంతోషపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని చెప్పారు. తనను సర్ అని సంబోధించవద్దని, రాహుల్ అని పిలవాలని విద్యార్థినులకు సూచించారు. రాఫెల్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఒప్పందాన్ని మోదీ సర్కారు నీరుగార్చిందని, విమానాల ధరను పెంచిదని గతంలో చేసిన ఆరోపణలను పునరుద్ఘాటించారు. మోదీ ముమ్మాటికీ అవినీతిపరుడేనని, రాఫెల్ ఒప్పందంపై అధికారికంగా జరుగాల్సిన చర్చలను ఆయన పక్కదారి పట్టించి సమాంతర చర్చలు జరిపారని ఓ ప్రశ్నకు సమాధానంగా రాహుల్ తెలిపారు. ప్రధాని పదవిలో ఉన్నవారికి మీడియాను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉండాలంటూ.. మోదీ ఎందుకు దాక్కుంటున్నారని ప్రశ్నించారు.

దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని వాటిని నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ప్రధాన కార్యాలయం నుంచి నడపాలని బీజేపీ భావిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తుందన్నారు. పెద్దనోట్ల రద్దును మీరు స్వాగతిస్తున్నారా? అన్న ప్రశ్నకు విద్యార్థినులు లేదు అని సమాధానమివ్వడంతో.. నోట్ల రద్దుతో దేశానికి ఎంతో నష్టం జరిగిందని, ఈ విషయంలో ప్రధాన మంత్రి అందరి అభిప్రాయాలను తీసుకుని ఉంటే బాగుండేదని రాహుల్ అన్నారు. మోదీని అడుగడుగునా వ్యతిరేకించాలని విద్యార్థులకు సూచిస్తూ.. ప్రధాని ఎప్పుడైనా ప్రజల ముందు నిలబడి వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారా? అని ప్రశ్నించారు. జమ్ము-కశ్మీర్ విషయంలో మోదీ అనుసరించిన విధానాలు ఆ రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మార్చాయని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని విమర్శించారు.
rahul

బ్లాక్‌మెయిలింగ్‌తో ఏమైనా చేయవచ్చని భావిస్తున్నారు..

తమిళనాడులో అన్నా డీఎంకే-బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) అదుపాజ్ఞల్లో ఉన్నదని, గతంలో ఎన్నడూ ఇలా జరుగలేదని అన్నారు. నాగర్‌కోయిల్‌లో బుధవారం ఆయన యూపీఏ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌మెయిలింగ్‌తో దేశంలో ఏ సంస్థనైనా హస్తగతం చేసుకోవచ్చని, ఏ రాష్ర్టాన్నయినా తన అదుపాజ్ఞల్లో పెట్టుకోవచ్చని నరేంద్రమోదీ భావిస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. కొద్ది వారాల్లో రాహుల్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠిస్తారని చెప్పారు. తమిళనాడులోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను యూపీఏ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నరేంద్రమోదీ.. కాదు కాదు నీరవ్‌మోదీ..

దేశంలో విశృంఖలంగా కొనసాగుతున్న అవినీతి గురించి విద్యార్థినులతో రాహుల్ మాట్లాడుతూ.. ప్రముఖ ఆర్థిక నేరగాడు నీరవ్‌మోదీకి బదులుగా నరేంద్రమోదీ అని నాలుక కరుచుకున్నారు. నరేంద్ర.. కాదు కాదు.. నీరవ్‌మోదీ లాంటి ఆర్థిక నేరగాళ్లు దోచుకెళ్లిన ప్రజాధనాన్ని తీసుకొచ్చి మీలాంటి ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు బ్యాంకింగ్ రంగాన్ని అందుబాటులో ఉంచాలని మేము కోరుతున్నాం అని రాహుల్ పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల పట్ల తనకు ఎటువంటి ద్వేషం లేదని, వారిని జైలు నుంచి విడుదల చేయడంపై న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సంతోషమేనని చెప్పారు.

517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles