ఆరుషి హత్య కేసులో తల్వార్ దంపతులకు ఊరట



Fri,October 13, 2017 02:58 AM

-నిర్దోషులుగా తేల్చిన అలహాబాద్ హైకోర్టు
-దోషులుగా ప్రకటించేందుకు తగిన ఆధారాలు లేవన్న ధర్మాసనం
-అనుమానాల ప్రాతిపదికన శిక్ష విధించలేమని వ్యాఖ్య

aarushitalwar
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 14 ఏండ్ల ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు గురువారం రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌లను నిర్దోషులుగా తేల్చింది. ఆరుషిని తల్లిదండ్రులే చంపారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. వారే చంపినట్లు ఆధారాలు సమర్పించడంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విఫలమైందని కోర్టు పేర్కొన్నది. అనుమానాల ఆధారంగా శిక్షలు విధించలేమని అభిప్రాయపడిన కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ (సంశయలాభం) కింద తల్వార్ దంపతులను నిర్దోషులుగా ప్రకటించింది. ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్యకేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నుపుర్ తల్వార్ దంపతులను 2013లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. స్పష్టమైన ఆధారాలేవీ లేకపోయినప్పటికీ, హత్యలు జరిగినప్పుడు తల్వార్ దంపతులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నందున, బయటివారు వచ్చే అవకాశమేదీ లేనందున వారే హత్యచేసి ఉంటారని సీబీఐ కోర్టు భావించింది.

ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందనే వాస్తవం తెలిసిన తల్వార్ దంపతులే తమను తాము నిర్దోషులుగా నిరూపించుకోవాలని వ్యాఖ్యానించింది. 2013 నవంబర్ 26న సీబీఐ కోర్టు వారికి జీవితఖైదు విధించింది. ప్రస్తుతం ఆరుషి తల్లిదండ్రులు ఘజియాబాద్ లోని దాస్నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ తల్వార్ దంపతులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గత సెప్టెంబర్‌లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం సాయంత్రం ధర్మాసనం వారిని నిర్దోషులుగా తీర్పును ప్రకటించింది. కేవలం అలా జరిగి ఉండవచ్చునేమో... అనే సంభావ్యతల ఆధారంగానో, సమంజసమైన అనుమానం (రీజనబుల్ డౌట్) ఆధారంగానో నిందితులకు శిక్ష విధించలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. సెక్షన్ 106 ఆధారంగా నేరనిరూపణ భారం నుంచి ప్రాసిక్యూషన్ తప్పించుకోలేదని మనుసింగ్ వర్సెస్ ధర్మేంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం గుర్తుచేసింది. నిందితుడే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనడం సరికాదని 1956లో శంభునాథ్ వర్సెస్ అజ్మీర్ స్టేట్ కేసు సందర్భంగా సర్వోన్నతన్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్ని కూడా కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక తదుపరి చర్యలపై చర్చిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.

వారికళ్లలో ఆనందభాష్పాలు చూశాను..

కోర్టు తీర్పు తర్వాత నుపుర్ తల్వార్ కండ్లలో ఆనందాశ్రువులు చూశానని దాస్నా జైలు సూపరింటెండెంట్ దధీరాం మౌర్య తెలిపారు. ఎప్పటిలాగానే ఈరోజూ వారి దినచర్య ఉంది. ఉదయం అల్ఫాహారం తర్వాత మాత్రం కొద్దిసేపు వారిద్దరూ ప్రార్థనచేశారు. మధ్యాహ్నం తీర్పు వెలువడగానే మేం రాజేశ్ ఉండే సెల్‌కు వెళ్లి విషయాన్ని చెప్పాము. ఆయన ఒక్కసారిగా మమ్మల్ని కౌగిలించుకుని గట్టిగా ఏడ్చేశాడు. తమకు న్యాయం దక్కిందని చెప్పాడు. అప్పటివరకు ఆధ్యాత్మిక గ్రంథం చదువుతున్న నుపుర్ మౌనంగానే ఉన్నా, ఆమె కండ్లలోనుంచి ఆనందభాష్పాలు రాలాయి అని మౌర్య చెప్పారు. దంతవైద్యులైన నుపుర్, రాజేశ్ తల్వార్ దంపతులు నాలుగేండ్లుగా జైలులోని ఖైదీలకు వైద్యమందిస్తున్నారని, ఖైదీల పిల్లలకు పాఠాలు చెప్తున్నారని మౌర్య తెలిపారు.

Rajesh-Nupur

లోపభూయిష్టంగా సీబీఐ దర్యాప్తు

ఆరుషి హత్యకేసుతో సీబీఐ దర్యాప్తు సామర్థ్యం మరింత పలుచనైంది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేని చందంగా, తొమ్మిదేండ్లపాటు.. రెండు దర్యాప్తు బృందాలు కష్టపడి.. కనీస ఆధారాలు కూడా సేకరించలేకపోయాయి. ఐపీఎస్ అధికారి అరుణ్‌కుమార్ నేతృత్వంలోని సీబీఐ బృందం 2008 మే 31న కేసు దర్యాప్తు చేపట్టింది. తగిన సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థ విఫలమైందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. నిందితులను దోషులుగా నిరూపించడంలో ఇటీవల సీబీఐ విఫలమవుతూ వస్తున్నది. శిక్షారేటు క్రమంగా తగ్గుతున్న తీరే ఇందుకు ఉదాహరణ. 2014లో 69.02శాతం శిక్షారేటు సాధించిన సీబీఐ 2016లో 66.8కి పడిపోయింది. అంటే ప్రతీ వంద కేసుల్లో కేవలం 66.8 కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరించగలుగుతున్నది.

చివరకు సత్యమే గెలిచింది..

ఆరుషి హత్యకేసులో చివరకు సత్యమే గెలిచిందని, రాజేశ్, నుపుర్ తల్వార్‌లు నిర్దోషులుగా బయటపడ్డారని బాలీవుడ్ దర్శకనిర్మాతలు మేఘనాగుల్జార్, విశాల్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. సంచలనాత్మక ఆరుషి హత్యకేసు నేపథ్యంలో వారు తల్వార్ పేరుతో ఓ సినిమాను రూపొందించారు.
CBI-AArushi
-మే16 (2008) : తన బెడ్‌రూంలోనే హత్యకు గురైన ఆరుషి తల్వార్. గొంతుకోసి హతమార్చినట్లు నిర్ధారణ.
-మే 17 : తల్వార్ నివాస భవనంపైన శవమైన పనిమనిషి హేమరాజ్
-మే23 : ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్ అరెస్టు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు
-జూన్1 : దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ
-జూన్ 26 : రాజేశ్ తల్వార్‌కు ఘజియాబాద్ కోర్టు బెయిల్ నిరాకరణ
-జూలై12 : రాజేశ్ తల్వార్‌కు బెయిల్
-డిసెంబర్ 29 : పనిమనుషుల ప్రమేయం లేదని, తల్లిదండ్రులే నిందితులని సీబీఐ నివేదిక
-ఫిబ్రవరి 9 (2011) : తల్వార్ దంపతులపై హత్య, సాక్ష్యాలను రూపుమాపిన అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-ఫిబ్రవరి 21 : అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన తల్వార్ దంపతులు
-మార్చి 18 : వారి పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు
-నవంబర్ 2013 : జంట హత్యల కేసులో తల్వార్ దంపతులకు జీవితఖైదు విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన తల్వార్ దంపతులు
-సెప్టెంబర్ 7, 2017 : తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు
-అక్టోబర్ 12 : ఆరుషి తల్లిదండ్రులకు ఊరట.. అభియోగాలను కొట్టివేసిన హైకోర్టు.

Hemraj

ఈ ప్రశ్నలకు సమాధానాల్లేవు..

1.హత్యకు గురైన పనిమనిషి హేమరాజ్ స్నేహితులు కృష్ణ, రాజ్, విజయ్‌లను సీబీఐ మొదట అనుమానించింది. వారిని అరెస్టు చేసి బెంగళూరులో నార్కోఅనాలిసిస్ పరీక్షలు నిర్వహించగా, ముగ్గురు పరస్పరం విరుద్ధమైన వివరణలు ఇచ్చారు. హేమరాజ్‌తో కలిసి అపార్ట్‌మెంట్‌పైన తాము మద్యం సేవించిన విషయాన్ని మాత్రం ముగ్గురూ చెప్పారు. వారి సమాచారాన్ని బట్టి డీఎన్‌ఏ, వేలిముద్రలు, ఇతర ఆధారాలు సీబీఐ సంపాదించలేకపోయింది. ఆ ముగ్గుర్ని విడిచిపెట్టిన సీబీఐ, వారు చెప్పిన వివరాలను కేసు తదుపరి దర్యాప్తులో ఉపయోగించుకోలేదు.

2.ఆరుషి హత్య వెలుగులోకి వచ్చిన రోజు (మే16,2008న) ఉదయం తాను వచ్చేసరికి వారి ఇంటి గేటు తాళం వేసి ఉందని మరో పనిమనిషి భారతి మండల్ తెలిపింది. హేమరాజ్ పాలకోసం వెళ్తూ బయటి నుంచి తాళం వేశాడేమోనని నుపుర్ వచ్చి చెప్పిందని, తాను కిందకు వెళ్లి హేమరాజ్ కోసం చూసి వచ్చేసరికి గేటు తెరుచుకుందని భారతి సీబీఐకి వెల్లడించింది. అప్పటికే అరుషి మృతదేహం చూసి నుపుర్ రోదిస్తూ ఉందని చెప్పింది. అయితే గేటును లోపలి నుంచే తప్ప, బయటినుంచి లాక్ చేయడం సాధ్యం కాదని పేర్కొన్న సీబీఐ దానికీ సరైన ఆధారాలు సంపాదించలేదు.

3.చురకత్తిని మొదట హత్యాయుధంగా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో హత్యాయుధం గోల్ఫ్‌క్లబ్ లాంటిదని తేలింది. రాజేశ్ ఇంట్లో రెండు ట్రయాంగిల్ గోల్ఫ్‌క్లబ్‌లు ఉండాల్సి ఉండగా, వాటిలో ఒకటి దర్యాప్తు అధికారులకు దొరుకలేదు. కానీ ఏడాది తర్వాత స్టోర్‌రూమ్‌లో ఆ గోల్ఫ్ క్లబ్‌ను నుపుర్ తల్వార్ సంబంధీకులు గుర్తించారు. దీంతో సీబీఐ కోర్టుకు తెలిపిన వివరాలు అర్థవంతంగా లేవని డిఫెన్స్ వాదించగలిగింది.

4.ఆరుషి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ సునీల్ కుమార్ మర్మాయవం బాగా చీలినట్లు కనిపించిందని పేర్కొన్నారు. కానీ ఎయిమ్స్ బృందం ఇచ్చిన రిపోర్టులో ఆ అంశం ప్రస్తావనే లేదు.

5.హేమ్‌రాజ్ గదినుంచి తలదిండు ఒకటి స్వాధీనం చేసుకున్నామని మొదట చెప్పిన సీబీఐ నెలరోజుల తర్వాత ఇచ్చిన నివేదికలో ఆరుషి గదిలో అది దొరికిందని పేర్కొన్నది. తీరా ఫోరెన్సిక్ నివేదిక మాత్రం హేమరాజ్ వేలిముద్రలు ఉన్నాయని తేల్చింది. అయితే అదంతా పొరపాటున పేర్కొన్న విషయంగా సీబీఐ కొట్టేయడంతో తల దిండు అంశం మరుగునపడిపోయింది.
aarushi_talwar

1084

More News

VIRAL NEWS