అంతులేని వేధింపులకు గురవుతున్నా!


Tue,April 16, 2019 02:08 AM

Whistleblower bureaucrat writes to PM for details of conversation with former Health minister

-ఆరోగ్యమంత్రితో ఏం మాట్లాడారో వెల్లడించండి
-ప్రధానికి ఎయిమ్స్ మాజీ అధికారి లేఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హర్షవర్ధన్‌తో 2014లో ఏం మాట్లాడారో వెల్లడించాలని, నాటి సంభాషణ అనంతరం తాను అంతులేని హింసకు గురవుతున్నానని ఓ మాజీ ఐఏఎస్ అధికారి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్)లో అవినీతి నిరోధక అధికారిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సంజీవ్ చతుర్వేదిని ప్రధాని మోదీ, మంత్రి హర్షవర్ధన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం ఆ పదవి నుంచి తొలిగించారు. ఆ సంభాషణ అనంతరం తాను అంతులేని హింసకు గురవుతున్నానని, హైకోర్టులు, ట్రిబ్యూనళ్లతోపాటు సుప్రీంకోర్టులో కూడా తనపై అనేక కేసులు నమోదయ్యాయని ప్రధానికి రాసిన లేఖలో చతుర్వాది ఆవేదన వ్యక్తం చేశారు. తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్రమంత్రులపై నమోదైన అవినీతి కేసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో వెల్లడించాలని ఆయన తన లేఖలో కోరారు. ఎయిమ్స్‌లో అవినీతి నిరోధక అధికారిగా ఉన్న తనను ఎందుకు తొలిగించారో తెలుపాలని చతుర్వేది సమాచార హక్కు చట్టం కింద కోరారు.

ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ ఆధారంగానే చతుర్వేదిని తొలిగించామని ఎయిమ్స్ తన సమాధానంలో తెలిపింది. 2014, ఆగస్టు 23న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ వర్మ ప్రధాన మంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాస్తూ, ఎయిమ్స్‌లో చీఫ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న సంజీవ్ చతుర్వేదిని ఆ పదవి నుంచి తొలిగించడానికి సంబంధించి ప్రధానమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి మధ్య సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను ప్రధాన మంత్రి పరిశీలన నిమిత్తం పంపుతున్నాం అని పేర్కొన్నారు. కానీ అదే ఏడాది మే నెలలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తన అద్భుత పనితీరును ప్రశంసిస్తూ ఒక నోట్ పంపారని చతుర్వేది ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు. ఎయిమ్స్‌లో భారీ స్థాయిలో పేరుకుపోయిన అవినీతి కేసుల విషయంలో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారంటూ పార్లమెంటరీ కమిటీ ఆరోగ్య శాఖను మందలించిందని తెలిపారు. హర్యానా ప్రభుత్వంలో పనిచేసినప్పుడు కూడా చతుర్వేది ఇదేవిధంగా వేధింపులను ఎదుర్కొన్నారు. ఆయన పనితీరు జీరో అంటూ ఇచ్చిన వార్షిక నివేదికపై మండిపడిన ఉత్తరాఖండ్ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం/ఎయిమ్స్ చతుర్వేదిపై ప్రతీకారానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ రూ.25వేల జరిమానా విధించింది. ఈ తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు కేంద్రానికి మరో రూ.25వేల జరిమానాను వడ్డించింది.

112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles