మీనాకుమారి ఎవరు?


Mon,February 11, 2019 01:22 AM

When Lal Bahadur Shastri asked 'who is Meena Kumari

-బాలీవుడ్ అందగత్తెను గుర్తించలేకపోయిన శాస్త్రీజీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానుల మనసు దోచుకున్న అలనాటి బాలీవుడ్ అందగత్తె మీనాకుమారి ఇప్పటికీ ఎంతో మందికి ఆరాధ్యనీయురాలే. అయితే ఆమెను నాటి కేంద్ర హోంశాఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి గుర్తుపట్టలేకపోయారు. ప్రముఖ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ పాకీజా చిత్రీకరణ సందర్భంగా ముంబై ఫిల్మ్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. ఆ స్టూడియోలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన లాల్‌బహదూర్ శాస్త్రిని పాకీజా కథానాయిక మీనా కుమారి పూలమాలతో సత్కరించారు. దీంతో మీనాకుమారిని గుర్తించలేకపోయిన లాల్‌బహదూర్ శాస్త్రి.. ఆమె ఎవరని తన పక్కనే కూర్చున్న ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్‌ను అడిగారు. ఈ ఘటన జరిగే నాటికే మీనాకుమారి ఎంతో విజయవంతమైన నటి గా ఉన్నత శిఖరానికి చేరుకున్నారు. పాకీజా చిత్రీకరణ సందర్భంగా శాస్త్రీజీకి మీనా కుమారి తారసపడినప్పుడు జరిగిన ఆసక్తికరమైన సంఘటనను కుల్దీప్ నయ్యర్ తన కొత్త పుస్తకం ఆన్ లీడర్స్ అండ్ ఐకాన్స్: ఫ్రం జిన్నా టూ మోదీలో ప్రస్తావించారు.

కుల్దీప్ నయ్యర్ గతేడాది ఆగస్టులో కన్నుమూయడానికి కేవలం కొద్ది వారాల ముందే ఈ పుస్తక రచన పూర్తిచేశారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన శాస్త్రీజీని మీనాకుమారి పూలమాలతో సత్కరించడంతో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఆ వెంటనే శాస్త్రీజీ నావైపు తిరిగి ఆ మహిళ ఎవరు అని చిన్నగా అడుగడంతో ఆశ్చర్యపోయాను. ఆమే మీనాకుమారి అని చెప్పాను. దీంతో శాస్త్రీజీ తన అజ్ఞానాన్ని మన్నించాలని కోరారు. ఆ తర్వాత మీనా కుమారికి క్షమాపణ చెప్తూ శాస్త్రీజీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మీనాకుమారి పేరును తొలిసారి ఇప్పుడే విన్నానని, అందుకు తనను క్షమించాలని వేడుకున్నారు. తద్వారా శాస్త్రీజీ తన సంస్కారాన్ని చాటుకున్నారు అని నయ్యర్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles