అటు శాంతి యత్నం..ఇటు రణన్నినాదం


Fri,August 17, 2018 07:38 AM

When Atal Bihari Vajpayee made Dilip Kumar speak to Nawaz Sharif during Kargil War

-పాకిస్థాన్ పర్యటన సందర్భంగా
-ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో వాజపేయి

న్యూఢిల్లీ, ఆగస్టు 16: పాకిస్థాన్‌తో పూర్తిస్థాయి శాంతి చర్చలు నెరిపేందుకు వాజపేయి ప్రయత్నించారు. ఆయన హయాంలోనే 1999 ఫిబ్రవరిలో అమృత్‌సర్ లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభం కావడంతో కశ్మీర్ సమస్య పరిష్కారంపై ఆశలు చిగురించాయి. పార్టీ శ్రేణులు వారిస్తున్నా, వినకుండా బాలీవుడ్ నటుడు దేవానంద్, రచయిత జావెద్ అక్తర్, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్‌లతో కలిసి ప్రధాని వాజపేయి స్వయంగా లాహోర్‌కు బస్సులో వెళ్లారు. వాజపేయికి నవాజ్‌షరీఫ్ ఘన స్వాగతం పలికారు. షరీఫ్‌నూ వాజపేయి గట్టిగా హృదయానికి హత్తుకున్నారు. వాజపేయి చొరవను రెండు దేశాల ద్వైపాక్షిక అంశాల్లో నూతన శకం అని అంతా భావించారు. ఈ సందర్భంగా వాజపేయి మాట్లాడుతూ భారతీయులంతా పాకిస్థాన్‌తో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నారు. ఇది దక్షిణాసియా చరిత్రలో నిర్ణయాత్మక సందర్భం. ఈ సవాల్‌ను ఎదుర్కొనే స్థాయికి మనం ఎదుగుతామని నేను ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.

నాటి భారత్ హై కమిషనర్ గోపాలస్వామి పార్ధసారథి స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య వివాదాన్ని తాను అనుమతించబోనని పేర్కొంటూ వాజపేయి లాహోర్‌లో చేసిన ప్రసంగం హృదయాలను హత్తుకున్నది. ఇది చాలా ప్రభావం చూపింది అని అన్నారు. వాజపేయి లాహోర్ బస్సు యాత్ర శాంతి సాధనకు ఒక అవకాశం కల్పించిందని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి సల్మాన్ హైదర్ వ్యాఖ్యానించారు. ఇరువురు ప్రధానుల మధ్య చర్చల తర్వాత లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. కానీ అప్పటి పాక్ సైనాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మాత్రం వాఘా సరిహద్దు వద్ద కనీసం స్వాగతం పలికేందుకు కూడా రాలేదు. అందుకు కారణాలు కొద్దిరోజుల్లోనే తెలిసి వచ్చాయి. 1999 జూన్‌లో కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సేనలు కార్గిల్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చాయి. దీనికి ప్రతిగా భారత్ సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టడంతో ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది. 500 మందికి పైగా భారత జవాన్లు ఈ యుద్ధంలో అమరులవగా, దాదాపు 4000 మంది పాక్ మిలిటెంట్లు, సైనికులు హతమయ్యారు. అమెరికా జోక్యంతో ఈ యుద్ధం ముగిసింది. ఎల్లవేళలా చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన నాటి ప్రధాని వాజపేయి 2001లో వివాదాస్పద అంశాలపై చర్చలకు నాటి పాక్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌ను భారత్‌కు ఆహ్వానించారు. కశ్మీర్ అంశంపైనే ప్రతిష్ఠంభన నెలకొనడంతో ఆగ్రా వేదికగా జరిగిన రెండు రోజుల చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. ముషారఫ్ దురుసు ప్రవర్తన కూడా చర్చలు అర్ధంతరంగా ముగిసిపోవడానికి కారణమని పాక్‌లో నాటి భారత హైకమిషనర్ గోపాలస్వామి పార్ధసారధి పేర్కొన్నారు. 1999లో శాంతి చర్చల తర్వాత కార్గిల్ యుద్ధం.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో మిలిటరీ బలగాల మోహరింపునకు ప్రాధాన్యం ఇచ్చారని పార్ధసారధి గుర్తు చేసుకున్నారు.

అటల్‌జీ ప్రసంగానికి షరీఫ్ ఫిదా

-లాహోర్ డిక్లరేషన్ చరిత్రాత్మకం
-వాజ్‌పేయి మాజీ మీడియా సలహాదారు అశోక్‌కుమార్ టాండన్

Lahore-Buskargil
లాహోర్ పర్యటన సందర్భంగా వాజ్‌పేయి చేసిన ప్రసంగానికి అప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఉన్న నవాజ్ షరీఫ్ ఫిదా అయిపోయారు. ఆయన వాగ్ధాటికి, సమయస్ఫూర్తితో శాంతిస్థాపనకు చేసిన విజ్ఞప్తికి పాకిస్థాన్ ప్రజలు ముగ్దులైపోయారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ప్రశాంతంగా ఆయన మాటలు వింటూ మధ్యమధ్యలో చప్పట్లతో హోరెత్తించారు. ఇదంతా గమనించిన నవాజ్ షరీఫ్.. అటల్‌జీ మీరు పాకిస్థాన్‌లో కూడా ఎన్నికల్లో విజయం సాధించగలరు అని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ విషయాలను అటల్ బిహారీ వాజ్‌పేయికి మీడియా సలహాదారుగా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్, పీటీఐ మాజీ స్పెషల్ కరస్పాండెంట్ అయిన అశోక్ కుమార్ టాండన్ గుర్తుచేసుకున్నాడు. టాండన్ ప్రస్తుతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మీడియా సలహాదారుగా ఉన్నారు.

1999లో ఇండియా-పాకిస్థాన్ మధ్య అమృత్‌సర్ నుంచి లాహోర్‌కు డైరెక్ట్ బస్సు ప్రారంభించిన సందర్భంలో వాజ్‌పేయి చరిత్రాత్మక పర్యటన జ్ఞాపకాలను అశోక్ కుమార్ టాండన్ నెమరేసుకున్నారు. నవాజ్ షరీఫ్‌తో కలిసి లాహోర్ డిక్లరేషన్‌పై వాజ్‌పేయి సంతకం చేసిన శుభసందర్భంలో నేనూ భాగం కావడం మర్చిపోలేని అనుభూతి అని ఆయన చెప్పారు. 1998లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు నెరపడం, శాంతియుతంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించడం తన ప్రాథమ్యాలని అటల్‌జీ చెప్పారని పేర్కొన్నారు. లాహోర్ బస్సు దౌత్యం విఫలం కావడంతో కార్గిల్ సమస్య ముందుకొచ్చిందని.. ఈ సమస్యను తన నాయకత్వపటిమతో ఎదుర్కొని సైనికులకు మద్దతుగా నిలిచి ప్రోత్సహించారని వాజ్‌పేయి మృతి సందర్భంగా అశోక్‌కుమార్ టాండన్‌గుర్తుచేసుకున్నారు.

1442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles