పూలవ్యాపారి అరుపులే కారణమటThu,October 12, 2017 11:45 AM

- వర్షం, జనసమ్మర్దం, భయాందోళనలతో తొక్కిసలాట
- ఎల్ఫిన్‌స్టన్ ఘటనపై దర్యాప్తు బృందం నివేదిక
- రైల్వే విభాగం తప్పులేదని సమర్థన
Mumbai_Stampede
ముంబై, అక్టోబర్ 11: ముంబైలోని ఎల్ఫిన్‌స్టన్ సబర్బన్ రైల్వేస్టేషన్‌లో 23 మంది మృతికి దారితీసిన దుర్ఘటనకు భారీవానలు, ప్రయాణికుల భయాందోళన కారణమని పశ్చిమరైల్వే అధికారులు తేల్చారు. పువ్వులమ్ముకునే ఓ వ్యాపారి వేసిన కేకలు అక్కడున్న జనాలను ఆందోళనకు గురిచేశాయని దర్యాప్తు నివేదికలో తెలిపారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం.. ఒకేసారి రెండు రైళ్లు రావడంతో పెరిగిన జనసమ్మర్దం.. ఇంతలో ఓ పూల వ్యాపారి ఫూల్ పడ్‌లా అని అరిచే సరికి తొక్కిసలాట మొదలైంది. పువ్వులు (ఫూల్) పడిపోయాయి అని ఆయన అంటే వంతెన (పూల్) పడిపోయిందని జనం అర్థం చేసుకుని పరుగులు తీశారు అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ముఖ్య భద్రతాధికారి ఎస్‌కే సింగ్లా నేతృత్వంలోని దర్యాప్తు బృందం తన దర్యాప్తును, సిఫార్సులను గురువారం పశ్చిమరైల్వే జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్‌కు సమర్పించింది. వంతెనపై షార్ట్ సర్క్యూట్ కారణంగా జనం భయకంపితులయ్యారన్న వాదనను ప్రత్యక్ష సాక్షులెవరూ సమర్థించలేదని నివేదికలో స్పష్టం చేశారు.

పశ్చిమరైల్వే ప్రజాసంబంధాల ముఖ్యఅధికారి రవీందర్ భాకర్ దర్యాప్తు నివేదికలోని ముఖ్యాంశాలను మీడియాకు వెల్లడించారు. సుమారు 30 మంది ప్రయాణికులు, స్థానికులు, భద్రతాసిబ్బందిని దర్యాప్తు బృందం ప్రశ్నించిందని ఆయన వివరించారు. పూలవ్యాపారి చేతుల్లో నుంచి పూలబస్తా జారిపడిపోవడమే తొక్కిసలాటకు దారితీసినట్టు దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందని చెప్పారు. గాయపడ్డ 10 మంది ప్రయణికుల ఇండ్లకు వెళ్లి దర్యాప్తు బృందం సాక్ష్యాలను సేకరించిందని, ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించిందని భాకర్ తెలిపారు. రైల్వే విభాగం తప్పిదం ఏమీ లేదా? అని అడిగితే ఏ ఒక్కరినో తప్పుబట్టలేమని అన్నారు. ప్రస్తుత రైల్వేవ్యవస్థలోని సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు. దర్యాప్తు బృందం కొన్ని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక సిఫార్సులను సమర్పించిందని భాకర్ చెప్పారు.

2297

More News

VIRAL NEWS