రాజసం ఎవరిది?


Thu,December 6, 2018 03:51 AM

Voting Date Results Polling Schedule Exit Polls All FAQs Rajasthan Election 2018

-రాజుల ఖిల్లా రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం పరిసమాప్తం
-199 స్థానాలకు 7న ఎన్నికలు
-బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ
-సోనియా, రాహుల్ ఐటీ కేసు పునర్‌దర్యాప్తుపై ప్రధాని మోదీ వ్యాఖ్య
-రాహుల్‌గాంధీకి కుంభ రామ్‌కు, కుంభకర్ణునికి తేడా తెలియదని ఎద్దేవా

జైపూర్: రాజుల ఖిల్లా రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. వందల సభలు, రోడ్‌షోలతో హోరెత్తిన ఎడారి రాష్ట్రంలో శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. ఐదేండ్లకోసారి అధికారం చేతులు మారే ఆనవాయితీ ఉన్న రాజస్థాన్‌లో తాజా ఎన్నికలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అధికార పీఠం కోసం సీఎం వసుంధరా రాజే, విపక్ష కాంగ్రెస్ తరఫున అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ హోరాహోరీగా తలపడుతున్నారు. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు 199 చోట్ల ఎన్నికలు జరుగనున్నాయి. ఆల్వార్ జిల్లా రామ్‌గఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తం 2,274 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో 189 మంది మహిళలు. మొత్తం 4.77 కోట్ల మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెబల్స్ బెడద అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ను భయాందోళనలకు గురిచేస్తున్నది. సుమారు 50 స్థానాల్లో ప్రధాన పార్టీలకు వారు సవాల్ విసురుతున్నారు.

రైతుల సమస్యలు, అవినీతి, నిరుద్యోగం తదితర అంశాల్ని ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రధాన అస్ర్తాలుగా ఎంచుకున్నది. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆలయాలను సందర్శిస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రోడ్‌షోలు, సభల్లో విస్తృతంగా పాల్గొన్నారు. సీఎం వసుంధర రోజుకు కనీసం ఐదు సభలు లేదంటే రోడ్‌షోలతో జనంలోకి దూసుకెళ్లారు.

ఎన్నికల బరి.. హోరాహోరీ

జల్రాపఠాన్ నుంచి బరిలో ఉన్న సీఎం వసుంధరపై కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌సింగ్ కుమారుడు మానవేంద్రసింగ్ పోటీపడుతున్నారు. టోంక్ స్థానం నుంచి సచిన్ పైలట్ పోటీచేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర రవాణామంత్రి, బీజేపీ ఏకైక ముస్లిం ఎమ్మెల్యే యూనస్‌ఖాన్‌తో పైలట్ తలపడుతున్నారు. బీఎస్పీ సైతం 190 స్థానాల్లో తన అభ్యర్థుల్ని బరిలో దింపింది. ప్రముఖ జాట్ నాయకుడు హనుమాన్ బేనివాల్ ఇరుపార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ పేరుతో పార్టీ స్థాపించిన హనుమాన్ 58 మంది అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపారు.

విమర్శల దూకుడు ఎక్కువే..

ఎన్నికల ప్రచారంలో విమర్శలూ శ్రుతిమించాయి. ప్రధాని కులంపై కాంగ్రెస్ సీనియర్ సీపీ జోషి వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. రాహుల్ లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ రాఫెల్ ఒప్పందంపై ఆరోపణలు గుప్పించగా, యూపీ సీఎం ఆదిత్యానాథ్ ఏకంగా హనుమంతుడిని తెరపైకి తెచ్చారు. దక్షిణ రాజస్థాన్‌లోని వాగడ్ రీజియన్‌లోని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ).. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లకు చుక్కలు చూపిస్తున్నది. గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో గిరిపుత్రుల ప్రాబల్యం ఎక్కువ. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తమను పట్టించుకునేవారు కరువయ్యారని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీటీపీ పేరుతో వారు బరిలోకి దిగి ప్రధాన పార్టీలకు వణుకు పుట్టిస్తున్నారు. దుంగార్పూర్, బన్స్‌వారా, సిరోహి, ప్రతాప్‌గఢ్, ఉదయ్‌పూర్ జిల్లాల్లో 10 స్థానాల్లో పోటీచేస్తున్నారు. అభివృద్ధి పేరుతో అడవుల్ని ధ్వంసం చేస్తున్నారని, తమ భూముల్ని కార్పొరేటు శక్తులకు ధారాదత్తం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కాంగ్రెస్‌దే అధికారం: సచిన్ పైలట్

రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనతో విసుగెత్తిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడతారని పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. బీజేపీకి 50 సీట్లు కూడా రావు అని అన్నారు.

బీమారు రాష్ర్టాన్ని అభివృద్ధి చేశాం: అమిత్ షా

రోగగ్రస్థ (బీమారు) రాష్ట్రంగా పేరొందిన రాజస్థాన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదేనని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని బుధవారం జైపూర్‌లో ధీమా వ్యక్తంచేశారు.

ఛాయ్‌వాలా ధైర్యసాహసాలకు ప్రభుత్వ కృతజ్ఞత


modi
సుమేర్‌పూర్/పాలీ/దౌసా: గాంధీలపై ఐటీ కేసు పునర్విచారణలో కేంద్రం ఘన విజయం సాధించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనను తాను ఛాయ్‌వాలా అని సంబోధించుకున్న మోదీ ఛాయ్‌వాలా ధైర్యసాహసాలకు కృతజ్ఞతగా ప్రభుత్వం విజయం సాధించింది అని అన్నారు. బుధవారం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు పలు సభల్లో ఆయన మాట్లాడుతూ అగస్టా వెస్ట్‌ల్యాండ్ ముడుపుల కేసు మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను దుబాయ్ అప్ప గించడంతో అతడు (మిషెల్) అసలు నిజాలు వెల్లడిస్తాడని గాంధీకుటుంబం వణికిపోతున్నదన్నారు. కుంభ రామ్‌కు కుంభకర్ణకు మధ్య ఉన్న తేడా కూడా రాహుల్‌కు తెలియదని మోదీ ధ్వజమెత్తారు. బుధవారం జైపూర్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ అగస్టావెస్ట్‌ల్యాండ్ కుంభకోణం మధ్యవర్తి మిషెల్‌పై కాంగ్రెస్ వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ప్రధాని మోదీ మధ్యవర్తి మిషెల్ అప్పగింత వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నదని కాంగ్రెస్ మండిపడింది.

గాంధీ, పటేల్ కంటే గొప్పవాడినని చెప్పుకునేయత్నం

-ప్రధాని మోదీపై రాహుల్ ధ్వజం
rahul
న్యూఢిల్లీ: భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్, జాతిపిత మహాత్మా గాంధీల కంటే గొప్పవాడినని రుజువు చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. దేశ విభజన సమయంలో నాటి జాతీయోద్యమ నేతలకు జ్ఞానం, ఎటువంటి విజన్, సిక్కుల మనోభావాలపై గౌరవం లేకే పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్ కలిసిందని ప్రధాని మోదీ ఆరోపించిన నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ ప్రధాని మోదీ తనను తాను గొప్పవాడినని రుజువు చేసుకోవాలని భావిస్తున్నారు అని పేర్కొన్నారు.

మూకదాడిలో సీఐ హత్య సిగ్గుచేటు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన మూకదాడిలో పోలీసు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ సింగ్ మృతి చెందడం విచారకరం, సిగ్గుచేటు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో పోలీసుల పట్ల అనుసరిస్తున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ, యోగి పాలనలో సామాన్యులను ఎలా భయభ్రాంతులకు గురి చేస్తారో అర్ధమవుతుందని ట్వీట్ చేశారు.

1847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles