మూడో విడుతలో 65.61%


Wed,April 24, 2019 02:51 AM

Violence in Bengal Polls Man Hacked To Death BJP Workers Injured

-బెంగాల్‌లో హింస.. ఒకరి మృతి
-కొనసాగిన ఈవీఎంల మొరాయింపు
-దక్షిణాదిలో పూర్తయిన పోలింగ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23:లోక్‌సభ ఎన్నికల మూడో విడుతలో 116 నియోజకవర్గాలకు మంగళవారం జరిగిన పోలింగ్ బెంగాల్ మినహా అంతటా ప్రశాంతంగా ముగిసింది. సగటున 65.61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన హింసలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. యథారీతిగా అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మరోసారి మొరాయించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అనంత్‌నాగ్ నియోజకవర్గంలో అత్యల్పంగా 13.61 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు మూడో విడుతలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని మోదీ ఓటు వేసిన అనంతరం రోడ్‌షో నిర్వహించడం వివాదాస్పదమైంది. మూడో విడుత ముగింపుతో ఇప్పటివరకు 17 రాష్ర్టాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ సంపూర్ణంగా ముగిసింది. మొత్తంగా మూడు విడుతల్లో 302 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది.

లోక్‌సభ ఎన్నికల మూడో విడుతలో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 13 రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 116 నియోజకవర్గాలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో అత్యధికంగా 80.73 శాతం, జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో అత్యల్పంగా 13.61 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హింస ప్రజ్వరిల్లగా, పలు రాష్ర్టాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)ల మొరాయింపు కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 64.66 శాతం నమోదైందని, అయితే ఇంకా పలు ప్రాంతాలలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లలో ఉన్నందున పోలింగ్ శాతం మరింత పెరుగవచ్చని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తెలిపారు.
Modi
మంగళవారం జరిగిన పోలింగ్‌తో దేశంలోని మొత్తం 302 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మూడో విడుతతో దక్షిణ భారతంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. గుజరాత్, కేరళలోని మొత్తం లోక్‌సభ స్థానాలు, కర్ణాటకలోని సగం (14) సీట్లకు పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 14, ఛత్తీస్‌గఢ్‌లో 7, ఒడిశాలో ఆరు, అసోంలో 4, బీహార్, పశ్చిమబెంగాల్‌లో ఐదేసి సీట్లు, గోవాలో 2, జమ్ముకశ్మీర్, దాద్రానగర్ హవేలీ, దామన్ డియు, త్రిపురలోని ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు. లోక్‌సభతోపాటే ఒడిశా అసెంబ్లీలోని 45 సీట్లకు కూడా పోలింగ్ నిర్వహించారు. కేరళ, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు నియోజకవర్గాల పరిధిలో ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో ఆయా ప్రాంతాలలో పోలింగ్ రెండు నుంచి మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.

త్రిపురలో పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించిన అధికార బీజేపీకి చెందిన ఇద్దరు పోలింగ్ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తన భార్య గుర్‌శరణ్ కౌర్‌తో కలిసి అసోంలోని డిస్‌పూర్‌లో ఓటు వేశారు. కేరళలో 71.67 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ ఎంపీ శశిథరూర్, కేంద్ర మంత్రి కే ఆల్ఫోన్స్ కన్నంథనం తదితరులు కేరళ నుంచి పోటీ చేస్తున్నారు. కన్నూర్ నియోజకవర్గం పరిధిలో వీవీప్యాట్ లోకి పాము దూరింది. దీంతో ఓటర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యా రు. కర్ణాటకలోని మిగిలిన 14 నియోజకవర్గాలలో 67.56 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Forbesganj-in-bihar

మొరాయించిన ఈవీఎంలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని 10 సీట్లకు జరిగిన పోలింగ్‌లో 61.35 శాతం నమోదైనట్టు అంచనా వేశారు. ఈ రాష్ట్రంలో అనేకచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. యూపీ నుంచి మూడో విడుత బరిలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత ములాయంసింగ్ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్, మేనల్లుళ్లు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, బీజేపీ అభ్యర్థి, సినీ నటి జయప్రద ఉన్నారు. ఈవీఎంల లోపాలపై ఈసీకి ఎస్పీ ఫిర్యాదు చేసింది. ఎటావాలో ఓ పోలింగ్ అధికారి ఓటర్లను ఎస్పీకి ఓటేయాలని బలవంతపెడుతున్నట్టు ఫిర్యాదులందడంతో ఆయనను విధుల నుంచి తొలిగించారు. శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణపై ఎస్పీ నేత అహ్మద్ నఫీస్‌ను కొద్దిసేపు కస్టడీలో ఉంచారు. రాష్ట్ర మంత్రి స్వామీ ప్రసాద్ మౌర్య తన కుమార్తె బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్యకు మద్దతుగా పోలింగ్ రోజున ప్రచారం చేశారని ఎస్పీ ఎంపీ ధర్మేంద్రయాదవ్ ఫిర్యాదు చేశారు. నేటి డిజిటల్ యుగంలో.. ఇన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఆ ఈవీఎంలను ఏర్పాటు చేసిందెవరో ఎన్నికల కమిషన్ గుర్తించి విచారణ జరుపాలని కోరుతున్నాను అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ కార్యకర్త మృతి

పశ్చిమ బెంగాల్‌లోని ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగగా 79.67 శాతం పోలింగ్ నమోదైంది. ముర్షిదాబాద్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బాలుర్‌ఘాట్ నియోజకవర్గంలో గుర్తు తెలియని దుండగులు ఓ పోలింగ్ కేంద్రం వద్ద బాంబులు విసిరారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
in-Guwahati

పోలింగ్ వేళ ప్రధాని రోడ్‌షో!

గుజరాత్‌లోని 26 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 63.67 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితర ప్రముఖులు గుజరాత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని మోదీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన కొద్దిసేపు రోడ్‌షో కూడా నిర్వహించి, స్థానికులకు కలుసుకున్నారు. ఉగ్రవాదానికి ఆయుధం ఐఈడీ. ప్రజాస్వామ్యానికి బలం ఓటరు ఐడీ. ఐఈడీకన్నా శక్తిమంతమైనది ఓటరు ఐడీ అని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని 14 సీట్లలో 58.98 శాతం, గోవాలోని రెండు స్థానాలలో 73.23 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో 64.68 శాతం పోలింగ్ నమోదైంది. ఒడిశాలో 60.44, బీహార్‌లో 59.97, త్రిపురలో 79.57 శాతం నమోదైంది.

65 బూత్‌లలో 0 ఓట్లు

మూడు విడుతల్లో పోలింగ్ నిర్వహిస్తున్న అనంత్‌నాగ్ నియోజకవర్గంలో దాదాపు 65 పోలింగ్ కేంద్రాలలో ఒక్క ఓటు కూడా పడలేదు. వీటిలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రాతినిధ్యం వహిస్తున్న బిజ్‌బెహరా అసెంబ్లీ సగ్మెంట్ పరిధిలోనే 40 పోలింగ్ బూత్‌లున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని కోకర్‌నాగ్ ప్రాంతంలో ఎన్నికల విధులు ముగించుకొని వాహనంలో తిరిగి వస్తున్న ఐటీబీపీ సిబ్బందిపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనలో డ్రైవర్ మరణించగా, ఐటీబీపీ సిబ్బంది గాయపడ్డారు.

654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles