షౌకత్‌ ఆజ్మీ కన్నుమూత

Sat,November 23, 2019 03:15 AM

-పాత తరం నటీమణి, షబానా ఆజ్మీ తల్లి
- ఐపీటీఏ ఏర్పాటు, అభివృద్ధిలో కీలకపాత్ర


ముంబై, నవంబర్‌ 22: పాత తరం నటీమణి, ప్రముఖ నటి షబానా ఆజ్మీ తల్లి షౌకత్‌ ఆజ్మీ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయసు 93 ఏండ్లు. వయసురీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్టు షబానా ఆజ్మీ భర్త ప్రముఖ రచయిత జావెద్‌ అక్తర్‌ తెలిపారు. ‘ఆమె వయసు 93 సంవత్సరాలు. వయసురీత్యా ఆమెను ఒకదాని తర్వాత మరొక సమస్య వెంటాడింది. అనారోగ్య సమస్యలతో కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ దవాఖానలో కొన్ని రోజులపాటు ఐసీయూలో ఉండి ఆమె చికిత్స తీసుకున్నారు’ అని ఆయన తెలిపారు. షౌకత్‌ ఆజ్మీ అంత్యక్రియలను శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. షౌకత్‌ ఆజ్మీ భర్త ప్రముఖ ఉర్దూ కవి, సినీ గీత రచయిత కైఫీ ఆజ్మీ. హైదరాబాద్‌ వాస్తవ్యురాలైన షౌకత్‌ వివాహానంతరం ముంబైలో స్థిరపడ్డారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ)కు సాంస్కృతిక వేదికలుగా నిలిచిన ఇండియన్‌ పీపుల్‌ థియేటర్‌ అసోసియేషన్‌

(ఐపీటీఏ), ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌

(ఐడబ్ల్యూఏ)కు వ్యవస్థాపకులుగా ఆ సంస్థల అభివృద్ధిలో భర్త కైఫీ ఆజ్మీతో కలిసి షౌకత్‌ ఎనలేని కృషి చేశారు. ఆస్కార్‌ నామినేటెడ్‌ చిత్రం ‘సలాం బాంబే’తో పాటు బజార్‌, ఉమ్రావో జాన్‌, మీరా నాయర్‌ వంటి చిత్రాల్లో నటనతో తనదైన ముద్రవేసి ప్రశం సలు అందుకున్నారు. 2002లో విడుదలైన సాథియా చిత్రంలో షౌకత్‌ ఆజ్మీ ఆఖరిసారి కనిపించారు. ‘కైఫీ అండ్‌ ఐ’ పేరుతో ఆమె ఆత్మ కథను వెలువరించారు. షౌకత్‌ మృతికి బాలీవుడ్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది.

641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles